Pages

Monday, 30 December 2013

తప్పటడుగులు

      


     తప్పటడుగులు 

       ఆకాశాన్ని అందుకోవాలనుకొనే  
       నిర్మాణ సౌధాలు అస్థి పంజరాల్లా,
       అగుపిస్తున్నాయి.

       సిమెంట్  తట్టతో   నిచ్చెనెక్కే  
       అమ్మని అందుకొవాలనే 
       బుడి,బుడి అడుగుల ఆరాటం.

       ఎగుడు,దిగుడు  నేలపై  నడిచే
       లేత పాదాలలో కసుక్కున దిగిన ఇనుపమేకూ.. 
       విలవిల లాడే  పేద గుండెలూ,

       బోసి నవ్వుల  పసికూన  నిదురలోనే,
       ఒక్కసారిగా కూలిన  కర్ర్ర్లల వంతననే 
       తన శవపేటిక చేసుకొంటే,

       ఆకలి  గొన్న చిన్నారి అమ్మపాలకై పాకుతూ,
       నోరు తెరుచుకున్న బోరు గుంటలో జారి,
       మృత్యువుతో  కరచాలనం చేస్తుంటే,

       దయనీయ జీవితాలతో 
       దాగుడు మూతలాడుతూ 
       "విధి"  వీధి వాకిట్లోకి  విసిరేస్తుంటే,

       భవిత శూన్యమై,బ్రతుకు  భారమై,
       కడుపు చేతబట్టుకొచ్చిన  కూలి జనాలకు,
       కూలిపోతున్న భవనాలే ఆవాసాలైతే... ,

       మనవంతుగా 
       మానవీయ  హస్తాలను  ముందుకు చాపి,
       సజీవ చైతన్యాన్ని  నింపి,
       కడుపుకోతలను అరికడదాం.

,

 

Friday, 27 December 2013

కళ్ళు తెరువ్

     

     కళ్ళు తెరువ్ 

      విశ్లేషణా  నేత్రాలతో  వీక్షిస్తే ,
      కధం తొక్కే అంతరంగాన్ని కదిలిస్తే,

      ఆలోచనలో పాత్రలన్నీ,
      మన  ప్రమేయం లేకుండానే  బైటికొస్తాయి. 

      శవాల్లా,చరించే శరీరాలతో,
      పనికిరాని కబుర్లతో ,పనిలేని నత్త నడకలతో,

     నిత్యావసరాలను సైతం  పెడచెవిన పెట్టి,
     నమ్ముకున్నోళ్ళను  నట్టేట ముంచి,

     రాజకీయాన్ని  అవపోసన పట్టినట్లూ,
     రాష్ట్రాన్ని  తానే రక్షిస్తున్నట్లూ ,

     అతి సామాన్య పౌరుడివే అయినా,
     అత్యంత  గొప్ప ఆయుధం ఓటున్నా,

     ఎన్నుకున్నోళ్ళు  ధనాన్ని దాచుకుంటున్నా, 
     తన్నుకొన్నోళ్ళు  జనాన్ని దోచుకుంటున్నా,

     నాకెందుకులే  అనుకుంటే, దృతరాష్ట్రునిలా కూర్చుంటే,
     కలియుగ కురుక్షేత్రాన్ని  కళ్ళారా చూస్తావు. 
Tuesday, 24 December 2013

అనురాగ శ్వాస
     అనురాగ శ్వాస 


       ప్రకృతి  అందాలన్నీ 
       మౌనంగా  పలకరించే వేళ,

       సన్నజాజిపూలు  రాలుతున్నట్లు
       మదిలో ఆమె  తలపులు,

       చీకటి  తెరలను చీల్చుకొని,
       తెలి వెన్నెలలా  ఆమె రూపం,

       యోజనాల  దూరాన ఉన్నా,సమీపానే 
       అనిపించే  ఆమె విలాసం. 

       అనురాగపు గాడతకు  నిలయంగా,
       ఆమె తలచే  నా మదీ నివాసం

       కమ్మని కావ్య పరిమళాల  సుగందమై,
       రేరాణిలా,వెన్నెల కిరణమై..... 

       నిత్యం  నాకై   అన్వేషించే రాదికలా,
       అలిగిన అబిసారికలా... 

       సమీరంలా,నా చరణాలను   స్పృశించీ.... 
       అంతలో ,ఎదలోతుల్లో అంతర్బాగమైన నా చెలీ..... 

       నీ  మనో పాఠాలను   చదివిన  నేను,
       అక్షర ,అక్షరానా  అనురాగాన్నద్దుతాను. Monday, 23 December 2013

రెప్పలు (రెక్కలు) విప్పని కల.

     రెప్పలు  (రెక్కలు)  విప్పని  కల. 

            బతుకంతా  నిద్రిస్తూ...   
      కేవలం  కలలో మాత్రమే  జీవిస్తూ,

      విషాద  క్రీనీడలో తచ్చాడుతూ,
      వెలుగు  కిరణాలను ఏరుకుంటూ. 

      అంతర్మదన  పోరులో,
      మనస్సు శకలాలను  అతుక్కుంటూ ,

      అక్షరాలను  కూర్చుకుంటూ,
      అలసిపోయి మూర్చపోతే,.

      పదాలన్నీ  ఒక్కసారే  పెదాలు విప్పి,
      చన్నీళ్ళు  చిలకరించి  పలకరిస్తున్నాయి. 

      రెప్పలు విప్పి  చూసేసరికే, 
      రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నాయి.  
     
Friday, 20 December 2013

సైకత బంధాలు

     

    సైకత బంధాలు. 

     ఎడారి  ప్రస్తానంలో ,
     తెలీని తీరాలను వెతుకుతూ,
     ఎంతకాలమో  ఈ  పరుగు. 

     తెగిన రెక్కల పచ్చి నెత్తుటి 
     వాసనింకా ఆరకముందే,
     ఎదురుదెబ్బల  బెదురు. 

     ఎంతదూరమేగినా  శూన్యమే,
     ఎప్పటికీ... ఒంటరి యానమే,
     ఎప్పుడో తెగిన గమ్యం. 

     గుండెను బండకేసి  కొడుతున్నట్లూ,
     కాల్చిన  త్రిశూలాన్ని  కళ్ళలో, 
     గుచ్చినట్లూ భావన.   

     కసుక్కున గొంతుతెగి నేలరాలిన మల్లెను,
     బరువైన  పాదంతో అదిమిపట్టిన,
     రాక్షసానందం. 

     శూన్యంలో నుండి,శూన్యంలోకి 
     జారిపోతున్న ఆలోచనా తరంగాలూ,
     చీకటిని అలుముకున్న క్షణాలు. 

     రంగుమార్చుకుంటున్న  రక్త బంధాలూ, 
     పెద్దరికానికి  విలువివ్వలేదన్న,
     సామాజిక గురివిందలు. 

     ముసుగేసుకున్న  అంతరాత్మలను, 
     నిలదీసి అడిగితే  ఎదిరించారన్న,
     ఆరోపణలు.  

     మరణాన్ని మట్టిలో కలిపేందుకు,
     పెగుబంధాలూ, ప్రియ బంధాలూ,
     దాటివచ్చిన మైలు రాళ్ళు.  

     వీడ్కోలు  సమయాన  నేస్తమా.... 
     కఫన్ చాటున నా చిరునవ్వులు 
     నీకే చెందాలి.    
  

Thursday, 19 December 2013

అమ్మ

     


    అమ్మ

      నక్కిన నరాలను రిక్కించి వింటుంది,
      నీ మాటల్లో అమ్మ అనే పదం కోసం..

      నవరంద్రాలను  శ్రవణాలుగా  చేసుకొని వింటుంది,
      నీవు పిలిచే 
" అమ్మా" అనే పిలుపు కోసం.

      మసకబారిన    చూపులను సారిస్తుంది,
      ఎదురుగా  రావటానికి  కూడా ఇష్టపడని నీ కోసం.

      శుష్కించిన   దేహంతో   ఎదురుచూస్తుంది.
      పట్టెడన్నం పెడతావని.

      సమాదుల పక్కనే చతికిల బడి ఉంది. 
      సాగనంపటానికి 
నీకు  కష్టం లేకుండా, 

      రక్త సంబంధాలు రంగు మార్చుకుంటున్నాయి.
      జోల పాటలు జాలిపాటలుగా మారుతున్నాయి.

      నెత్తుటి సాక్ష్యాలు కుత్తుకని కోస్తున్నాయి.
      పండుటాకులను ఎండుటాకులుగా చేస్తున్నాయి.

      కళ్ళు తెరిచి చూడు నువ్వు ఎక్కికూర్చున్న నెత్తే,
      కళ్ళ ముందు నువ్వు పెట్టె కొరివి కోసం చూస్తుంది.

      కళ్ళు తెరిచి చూడు ఆ జుట్టు నీవు ఆడుతూ లాగినదే.
      తైల సంస్కారం  లేక పీచులా వేలాడుతుంది.  
      
      కళ్ళు తెరిచి చూడు ఆ గుండె, 
      నీవు ఆకలితో పారాడినదే.

      కళ్ళు తెరిచి చూడు ఆ చీరకుచ్చిళ్ళు ,
      బూచిని చూసి దడుచుకొని నువ్వు దాగినవే.

      వెతుకు,వెతుకు, నీ దేహమంతా వెతుకు
      ప్రతి కణమూ, ప్రతినరమూ నీ తల్లి పెట్టిన బిక్షే.

      అమ్మని తలిస్తే వ్యర్దమనుకొనే క్షణకాలాన్ని
      నీకే బిక్ష వేసి వెళ్ళింది, బ్రతుకు,నీ ఆకరి బ్రతుకు,

      మళ్ళీ పుట్టుక లేకుండా బ్రతుకు.
      అమ్మ అవసరం లేని, జన్మ ఉందేమో..చూసి మరీ బ్రతుకు.Wednesday, 18 December 2013

గాయాల గేయాలు

     


    గాయాల గేయాలు 

     అనా(నానా) రోగ్యాల పాలైన నిరుపేదలు,
     గుండె దిటవు  చేసుకుని  వెళ్ళే  మృత్యుద్వారాలు. 

     చావుబతుకుల మద్య  కొట్టుమిట్టాడుతున్నా, 
     కనికరించని  ధన్వంతరి వారసులూ,

     ఆర్ధిక స్థితిగతులను  అంచనావేసి,
     లోనికి  అనుమతించే ఆసుపత్రి  ఉద్యోగులూ,

     అయినవాళ్ళ భుజాల ఆసరాతో నడిచే రోగులూ,
     సూదిమందులను వీల్ చైర్లో తీసుకెళ్ళే
నర్సమ్మలూ,

     ఎండలో క్యూలో  నిల్చుని  సోలిపోతున్న రోగులూ,
     సెల్లులో సోల్లుతూ  దారినడ్డుకొనే  వార్డుబాయ్ లూ,

     కొంపా,గోడూ ,గొడ్డూ,గోదా,  అమ్ముకొచ్చినా ,
     దారి ఖర్చులకే దాసోహమైన దాఖలాలూ,

     ఆరుబైటే ప్రసవించే గామీణ  ఆడపడచులూ,
     అసహ్య  పదజాలంతో  గాండ్రించే  ఆయాలూ,

     ఆధార్ కార్డులూ,ఆరోగ్య కార్డులూ  లేని అభాగ్యులూ,
     ఆసుపత్రి ఆవరణలోనే విగతజీవులైన  నిర్భాగ్యులూ,
     
     కేవలం  కాగితాలకే  పరిమితమైన  "ఆరోగ్య కేంద్రాలు"
     ప్రభుత్వాలు  అనుమతించిన  నాటక కంపెనీలు.   

     నిరుపేదల  చావులను నిర్దాక్షిణ్యంగా  తిలకించే,
     ఈ ఆసుపత్రులు   మానవ మాంసాలతో.. 
     వ్యాపారం  చేసే  మానవ కభేళాలు. 

(మానవతతో  వైద్యం చేసే  వైద్యులకు  పై కవిత  వర్తించదు, ప్రాణం పోసే వైద్య వృత్తికి  అంకితమైన మీకు  నా సలాం )
Monday, 16 December 2013

ఆ "శ్రమ" జీవి

     


     ఆ "శ్రమ" జీవి 

     ఆయన   ఓ  శ్రమజీవి.
     రవి కంటే ముందే లేచి  ఉరకలేస్తాడు 

     మట్టినేలపై  విత్తునాటి  ఆశల వలవేస్తాడు,  
     చీకటి కరువుకు  ఉరివేసి  ఆకలి తీరుస్తాడు. 

     అంతంలేని  ఆదిపత్య  పొరుల్లో,
     ఎటుకొడితే  అటుపడే బంతయ్యాడు. 

     నెత్తుటి  సంతకాల  సంతాపాలల్లో,
     కత్తులుదూసిన నేలలో విత్తులు కొనలేకపోయాడు.

     సన్నకారు  రైతులంతా సబ్సిడీలకై  చేయిచాపారు.
     అభయమిచ్చే ఫ్యాక్షన్  గోళ్ళకు గుచ్చుకుపోయారు  

     అప్పుల  జప్తులో  కట్టువిప్పుకొన్న కాడెద్దులూ,
     ఆలిబిడ్డల ఆకలితీర్చలేని అసమర్దుడయ్యాడు.

     భూమిని తాకని చినుకుల కోతా ,విధ్యుత్ కోతా 
     వడ్డీల మోతా ,ఆకలివాతా,....... వెరసి,

     ఎండిపోయిన  ఎముకలగూడైనాడు,
     అన్నం  పెట్టిన  చేత్తో దణ్ణం పెడుతున్నాడు. 

    అన్నదాత  నేడు  అన్నదానానికై  చేయిచాస్తున్నాడు 
     అవును ఆతనిప్పుడు, ఆశ్రమ జీవి.    

Saturday, 14 December 2013

దగ్ధ గీతం

        దగ్ధ గీతం 

     జనారణ్యములో  మానవ మృగాలు ,
     ఉన్మాదాలై  ఊరేగుతున్నాయి. 

     పసికూనల లేత మాంసాలతో,
     పండగ  చేసుకుంటున్నాయి. 

     అన్యం,పుణ్యం ఎరుగని ఆడపిల్లలపై,  
     దాడిచేసి  దాహం తీర్చుకుంటున్నాయి.

     రెక్కలురాని   లేతగువ్వలను  సైతం ,
     రాక్షస గోళ్ళతో  రక్కుతున్నాయి. 

     చదువుల బడుల్లో, హాస్టళ్ళ గదుల్లో,
     లైంగిక వేదింపుల ఉపాహారాలు చేస్తున్నాయి. 

     ఆరేళ్ళ శరీరాలు నూరేళ్ళు నింపుకొని ,మార్చురీ గదుల్లో  
     శవాలై  సవాళ్ళు విసురుతున్నాయి. 

     భూబోగాతాలల్లో  నిండిన నేతలు చట్టాలకు  చుట్టాలై,
     నోట్ల కట్టల నీడల్లో  సేదతీరుతున్నారు. 

     చేవ చచ్చిన,వెన్నెముక లేని వెర్రి గొర్రెలు,
     కసాయిలను నమ్మి  కబేళాలకు తరలివెళ్తున్నాయి. 
                               
                               *****
     ఇప్పుడు మనం  చేయాల్సింది  మొండిగోడలకు,  
     సున్నాలెయ్యటం  కాదు,

     కర్కశ  ఆబోతుల  పాదాల క్రింద  నలిగే,
     ప్రకృతిని పరిరక్షిద్దాం. 

     నిస్సహాయ,నిర్భాగ్య  చెళ్ళెళ్ళ సాక్షిగా,
     అసురుల  అరాచకాలను  అరికడదాం. Thursday, 12 December 2013

నా... చెలి

     

    నా... చెలి, 

     ఓనాటి   అందమైన జీవన  మలుపులో,
     తను నాకు  తారసపడింది.

     నా  మట్టి  హృదయాన   ప్రేమను విత్తి,
     చిరుమొలకై  అంకురించింది.

     నిత్య  జ్ఞాపకమై నన్ను   వెన్నాడుతూ,
     కాలాన్ని కట్టిపడేసింది.

     అర్ధంకాని  ప్రపంచాన,నిద్దురలేని లోకాన,
     నన్ను నిర్దాక్షిణ్యంగా  నెట్టివేసింది. 

     అంతదూరం  ఎందుకెళ్ళావని అలుకలుపోయి,
     బుంగమూతితో  బులిపిస్తుంది.

     అంతలోనే నా మనో..గాయానికి  మందువేసే,
     ధన్వంతరి  నీవేనని  దైర్యపడుతుంది.

     మురిపించి,మరపించి వలపుల వలవేస్తే,
     ఎక్కడైనా చెలినేగానీ  వలపుతోటలో కాదంటుంది.

     పిలుపుగాలం వేసి... సమూహం నుండి వేరుచేసి 
     పక్కున  నవ్వి  వెక్కిరిస్తుంది.

     ఊగిసలాడే  ఊహలమద్య  ఊపిరిపోసుకుంటూ,
     నా  ఎదపై వాలి   సేదతీరుతానంటుంది.

     అక్షర,అక్షరాన  నన్ను  నింపుకున్న
     నా  చెలి  ఓ  నడిచే పుస్తకం.

     నన్ను చంద్రునిగా భావించిన  
     నా చెలి  ఓ  వెన్నెల  సంతకం. 

  


Tuesday, 10 December 2013

అమ్మా... మరోమారు కనవా..


   అమ్మా... మరోమారు  కనవా..


     నా చిట్టి  చేతులపై   తనచేతులుంచి   సుతారంగా,
     అక్షరాలు దిద్దించిన  తొలిగురువు.

     బడినుండి  వచ్చే  నాకొసం  వీధి  చివర  నిల్చుని,
     అలసిన నా ముఖాన్ని కొంగుతో తుడిచే పాలవెల్లి,

     ఉన్నతంగా  ఎదగాలని  నాకై నిత్యం  పాటుపడే,
     పవిత్రమైన  ప్రాణ వాయువు.

     ఉన్నత  శిఖరాలనెక్కించేందుకు  అరచేతులనే,
     సోపానాలు చేసిన  ప్రేమ ఆయువు.

     గోరుముద్దలు  తినిపించిన   అమ్మతనమూ,
     వెన్నను  మరపించిన కమ్మదనమూ,

     అమ్మంటే జన్మకే శ్రీకారం ,అమ్మంటే  మమకారం,
     నిలువెత్తు నిర్మలాకారం.మమతల ప్రాకారం,

     వేల,వేల విన్నపాల అనంతరం,
     నేనో  నేలకు  దిగిన శశావతారం. 

     కానీ.... జరిగిపోయిందో.. ఘోరం. 

     ఆదరణకు నోచుకోని  ఆ ముసలి ప్రాణం,
     కోడళ్ళాడిన  బంతులాటలో విసిరేయబడీ, విసిగీ, వేసారీ,

     పనికిరాని పాతవస్తువులా, వెలికి తీయని నిక్షిప్తంలా, 
     అడుగంటిన  అక్షయపాత్రలా,మాసిన దేవతా చిత్రంలా,

     ఆరిపోతున్న దివ్వెలా, ఒదిగిపో్యిన గువ్వలా,
     ఒడలిపోయిన పూదండలా,ఒంగిపోయిన హరివిల్లులా, 
     అనాథలా, అభాగినిలా,ఆకరి క్షణాలలో ఆశ్రమవాసియై. 
     శూన్యంలోకి   ధైన్యంగా  చూస్తుంటే.. 

     నన్ను గుర్తించమనీ, ఒక్కసారైనా వంక  చూడమనీ,
     తన ఒడిలో చోటివ్వమనీ,గుండెపగిలేలా ఏడవాలనీ,
     మన్నించమని వేడుకొవాలనీ,

     ( ఊహూ... అలా ఎన్నటికీ చేయలేను  ఎందుకంటే నేను ఎదిగిన  మనిషిని,
     ఒదిగిన తనయుణ్ణి  కాను, కాలేను, వేలమంది చరిత్ర హీనులలో నేనూ ఒకణ్ణే.) 

  Monday, 9 December 2013

మనస్సు

    మనస్సు 
   

       ఉండటానికి   గుండె  దొరకనప్పుడు,
     మైలు దూరాన  తచ్చాడుతుందీ మనస్సు.

     కనికరం  చూపించామంటే ,
     కల్లోలం  సృష్టిస్తుందీ  మనస్సు.

     చేరువు కాలేని దూరాలను కొలిచి,
     అలసిపోతుందీ  మనస్సు. 

     తేమ నిండిన  శ్వాసై,నీరు అందని చేపై,
     విలవిల్లాడుతుందీ  మనస్సు. 

     అగ్గయి  భగ్గున మండి పైకెగసి,
     నివురై నేలరాలుతుందీ  మనస్సు. 

     దేహంనుండి   తెగిన అంగమై,
     అవిటిదవుతుందీ  మనస్సు. 

     ఊపిరి సలపనీక  ఉక్కిరిబిక్కిరి చేస్తూ,
     ఉరితాడవుతుందీ  మనస్సు. 

     అలమటించే  గుండె గుడారంలో  మకాం వేసి,
     అరబ్బీషేకు  గుర్రమవుతుందీ   మనస్సు. 

     తలపులూ,తపనలలూ ,ఆశలూ ,ఊసులూ,  
     తలకెక్కించి  తమాషా చూస్తుందీ..... మహమ్మారి మనస్సు.  

Saturday, 7 December 2013

మంగమ్మత్త మంచిదే


మంగమ్మత్త మంచిదే


మేమిద్ద్డరం ఉద్యోగస్తులం కావటం వల్ల, మా పిల్లల్ని చూసుకొనేందుకు ఎవరైనా పెద్ద దిక్కు ఉంటె బాగుంటుంది అని ఆలోచించి, మా వారికి మేనత్త వరసైన మంగమ్మత్తను పిలిపించుకోవాలని నిర్ణయించుకున్నాం.వెంటనే మా ఆలోచనను అమలుపరిచాం ఆవిడగారు రావటానికి ఒప్ప్పుకున్నారు కూడా.

***
ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడైంది. నేను వాకిట్లో కూరలబ్బాయిని కేకేస్తూ అక్కడే ఉన్నాను. ఆటో ఆగిన చప్పుడుకు ఎవరా అని అటువైపు చూసాను.

ఆడ సూమో పహేల్వాన్ లాగా ఉన్న ఓ భారీకాయం ఆటో దిగి, హడావిడిగా వెనక్కి వెళ్ళి అక్కడ ఆటోకి ఆనుకొని సెల్లులోకి చూసుకుంటున్న ఆటోడ్రైవర్ని చూసి నెత్తిమీద ఒక్కటిచ్చింది, ఆ దెబ్బకు అతనికి కళ్ళలో నక్షత్రాలు కనిపించాయిగానీ ఎదురుగాఉన్న శాల్తీ కనిపించలేదు పాపం.
"అరె, అగ్గో, ఏందివమ్మా గట్ల మీదబడి కొట్టబడ్తివి? మీదబడి కొట్టనీకె నేను ఏమిచేసినా" ... చిరాగ్గా అన్నాడు ఆటోవాలా.

"అరె, మొండికేసిన కొల్లు దున్నలా గట్ల నిలబడ్తివేమిరా అమ్మాయినడిగి పదో పాతికో పుచ్చుకొని ఈ సామాన్లు లోపల పెట్టి తగలడు" గట్టిగా అరుస్తూ నన్ను చూపెట్టింది ఆటోలో దిగినావిడ.

సందేహం లేదు ఈమె గారు మేము ఎదురుచూసే మంగమ్మత్తే .. నేనూ నవ్వుతూ ఎదురెళ్ళి ప్రయాణం బాగా జరిగిందా పిన్ని గారూ అన్నాను.

"ఆ.. ఏమి ప్రయాణం లెమ్మా...ఇదిగో ఈ తింగరి భడవ ఊరంతా తిప్పితెచ్చాడు, గుంటల్లో పడిలేచి వచ్చాను, కాస్త వేడినీళ్ళు పెట్టి కాసింత టిఫిను నాముఖాన పడెయ్యి తల్లీ, ఆ,, మర్చిపోయాను ఆ సచ్చినోడి ముఖాన పదో పరకో పడెయ్యి, దారంతా ఒకటే సణుగుడు దిక్కుమాలిన అర్ధం కాని భాషా వాడూనూ..ఏదడిగినా క్యా..క్యా అంటున్నాడు కాకిలా". అంటూ ఆటొవాలాను మరోమారు ఉరిమిచూస్తూ లోపలికెళ్ళారావిడ.

"అరె బిచ్చం గిట్ల ఏస్తున్నారామ్మ? పదో పరకో ఇవ్వనీకి. అడ్రసు మంచిగ తెల్వదు, మా అబ్బి తెల్వదార నీకు? వాళ్ళ తాత ఎంత మోతబరి మనిషి. గాయాన పేరుగూడ తెల్వ బట్టవు, అంటూ పెద్ద లొల్లిజేసింది. "మీటరు మీదికెల్లి పచ్చీస్ ఎక్కువివ్వాలే " గట్టిగా అరిచాడు ఆటో డ్రైవరు. అతనడిగిన డబ్బు ఇచ్చి వంటింట్లోకి వెళ్లాను. వాడు వెళ్ళాడా లేదా అని చూడటానికి బైటకి వచ్చి నిల్చున్నారు పిన్నిగారు.

"పేపర్" ఓ గావుకేకతో పాటు పేపర్ వచ్చి పిన్నిగారి ముఖానికి ఫాట్ మని తగిలి ఆవిడ కళ్ళజోడుని ఆమడ దూరం ఎగరగోట్టింది.

"అయ్యో, అయ్యో, ఇదేమి చోద్యమే తల్లీ, ముఖానికేసి కొట్టాడు. నా అద్దాలెక్కడే ముదనష్టపు ఊరు, వేర్రికేకలూ, పిచ్చి అరుపులూ,, అంటూ శివాలెత్తి పోయిందామె. నేను వెళ్లి కళ్ళజోడు తీసి ఇచ్చాను అవి దుమ్ము కొట్టుకున్నాయి కానీ పగల లేదు. ఇక్ష్వాకుల కాలం నాటివి లా ఉన్నాయి బాగా పాతవి మరి.

"పిన్నిగారూ టిఫిన్ తీసుకుందురుగాని రండి" అన్నాను.

"పదవే తల్లీ " అంటూ నా వెనుక వస్తూ ఉండగా .. డబ డబా చప్పుడయ్యింది. చెడి పోయిన విమానం చెవిలో దూరినంత చప్పుడుతో ఇంటి ముందు ఓ స్కూటర్ ఆగింది. దాని చుట్టూ రకరకాల సైజుల్లో స్టీల్, ఇత్తడి, సిల్వర్ క్యాన్లు తగిలించి ఉన్నాయి. ఆ చప్పుడుకు కంగారు పడిన పిన్నిగారు శరీరమంతా లోపలే ఉంచి ముఖం మాత్రం బైట పెట్టి వచ్చింది ఎవరా అని చూశారు.

"దూద్ " గట్టిగా కేక వేసి, నా మొఖం నా ఇష్టం అన్న ఫీలింగ్ లేని ముఖం తో ఓ శాల్తీ కనిపించాడు. మంగమ్మత్త గబగబా బైటికెళ్ళి "ఏంటబ్బాయ్ అది" అని అడిగారు. అతని నుండి జవాబు రాలేదు సరికదా అసలక్కడ ఎవరూ లేరు అన్నట్లుగా నడుమ్మీద చెయ్యేసుకుని సిగరెట్టు పొగ మామ్మగారి మొఖం మీద ఉఫ్ఫూ, ఉఫ్ఫూ అని ఊదుతూ నిల్చున్నాడు.

"ఇదిగో అమ్మాయ్! వీడెవడో చెడ్డీలో గండుచీమ దూరినట్లు ఓ గావు కేక వేసి అంతలోనే వానకు తడిసిన నులకమంచంలా నీలుక్కుపోయాడు చూడు" అంటూ వాడినే చూస్తూ నుల్చున్నారు.

"పాలబ్బాయి పిన్నిగారూ, మీరు రండి టిఫిన్ చల్లారి పోతుంది." అని అంటూ పాలుపోయించుకుంటున్నాను.

ఇంతలో, గేటు చప్పుడయింది ఇంటి ఓనర్ జాగింగ్ నుండి తిరిగొచ్చి తమ పోర్షన్ లోకి వెళ్తూ నన్ను చూసి "గుడ్మార్నింగ్ విమలా" అన్నారు.

"హలో అంకుల్, గుడ్మార్నింగ్ " అన్నాను. పిన్నిగారు అతన్ని చూస్తూనే కొంగు నిండుగా కప్పుకొని హడావిడిగా లోపలికెళ్ళారు. ఆమె వెనుకే నేనూ లోపలికెళ్ళాను.

కాసేపటికి "ఇదిగో అమ్మాయ్, పాపం ఆపెద్దాయన కి సరైన బటలున్నట్లు లేవు, పాపం చెడ్డీ వేసుకొని ఆ చలిలో ఇంత పొద్దున్నే ఏ పని మీద వెళ్లి వస్తున్నాడో" అంటూ కాసేపు శ్వాస తీసుకొని "ఏంటో పాపం పెద్దవాళ్ళ తిప్పలు, అవునూ మన చందూవి ఏమైనా పాత బట్టలు ఉంటే ఇవ్వొచ్చు కదా, అన్నారు, నాకు నవ్వు ఆగలేదు. "అయ్యే పిన్నిగారూ, ఆయన ఈ ఇంటి ఓనరు, పొద్దున్నే వాకింగ్ వెళ్లి వస్తున్నారు అన్నాను.

"ఏడిచినట్లే ఉంది, అలాపిక్కలు కనపడేలా చెడ్డీ వేసుకుని పరిగెడితేనే ఆరోగ్యమా.. పంట్లాం వేసుకుని పరిగెత్తోచ్చుకదా! ఏమో పిదపకాలం" అంటూ చిరాకు పడ్డారు. అప్పట్నుంచి మామ్మ గారు మా ఇంటి ఓనరు కనబడితేచాలు పురుగుని చూసినట్టు చీదరగా చూసి లోపలికెళ్ళేవారు.

పిన్నిగారొచ్చి వారం రోజులు అవుతున్నా ఆమె ఈ వాతారణానికి అలవాటు పడ లేదు కదా, రోజురోజుకీ సణుగుడు ఎక్కువయ్యింది.

పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కిస్తూ... క్లీనర్ కుర్రాణ్ణి జబ్బ పట్టుకు కిందికి లాగి "అంట్ల వెదవా మా పిల్లని గుడ్డీ, గుడ్డీ అంటావా..బిడ్డకి చక్రాల్లాంటి కళ్ళు ఉంటే నీకు గుడ్డిదానిలా కనిపిస్తుందా, తాట తీస్తాను ఏమనుకున్నావో" అని పెద్ద గోలచేశారు. (హిందీలో గుడ్డి(గుడియా) అంటే బొమ్మ అనే అర్ధం అని ఆమెకు తెలీదు కదా). ఎదురింటావిడ జబ్బాల దాకా రవిక వేసుకుందనీ, పక్కింటి కాలేజీ పిల్ల మోటారు సైకిలు వేసుకొని మగ రాయుడిలావెళ్తుందనీ .., ఇలా ఎన్నో..

ఒక్కోసారి, ఆవిడ మాటలు గొడవలు తెచ్చి పెట్టేవి. చిరాకేసేది, కానీ మా పరిస్థితి అలాంటిది, సర్దుకుపోవాలి మరి.

ఆరు నెలల తర్వాత.

ఓరోజు మేము ఆఫీసు నుండి వచ్చేసరికి పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటున్నారు , పిన్నిమాత్రం దిగాలుగా కూర్చుని ఉన్నారు, నేను ఈయనగారికి కళ్ళతోనే సైగ చేశాను పలకరించమని.

"అత్తయ్యా, ఏంటి అలాఉన్నారు?" పక్కన కూర్చుంటూ పలకరించారీయన.
"ఏమీ లేదు నాయనా, ఒక్కోసారి దేవుడెండుకో చిన్నచూపు చూస్తాడు" అన్నది వేదాంత ధోరణిలో.

"ఎవరిని తీసుకెళ్ళాలో, ఎవరిని ఉంచాలో, తెలీదేమో ఆయనకి " అన్నది ఆమె మళ్ళీ.

"మామయ్యగురించా " అన్నారు ఈయన. (ఈయనెప్పుడూ నాతో అంటూ ఉంటారు ఈవిడ పోయి ఆయన ఉన్నా బాగుండేది, అని.)

"అయ్యో కాదురా తండ్రీ " పేపర్ కుర్రాడి గురించి" అన్నది ఎటో చూస్తూ,
"ఏంటీ ,మీరు మన కాలనీలో వాళ్ళే కాకుండా పేపర్లో వాళ్ళని కూడా వదలటం లేదా"? "రెస్ట్ తీసుకోండి, అన్నీ సర్దుకుంటాయి" ఈయనగారికి కాస్త గందరగోళంగా, తలతిక్కగా అనిపించిందేమో కాస్తా చిరాగ్గా అన్నారు. అక్కడి నుండి మెల్లగా లేస్తూ. నేను పిల్లల్ని పిలిచి విషయం ఏంటని అడిగాను.

"మనకు ఇంతక్రితం పేపర్ బోయ్ ఉండే వాడు కదా, వాడు రోజూ మేం స్కూల్ కెళ్ళే టైంకి బస్ స్టాప్ లో ఉంటాడు, బస్ వచ్చే లోగా కాసేపు మాతో ఆడుకుంటాడు, బామ్మ వాడిని రోజూ తిడుతూ ఉంటారు,మా పిల్లలతో నీకు ఆట్లేంటిరా అంట్లవెధవా అని. వాడీమధ్య కనిపించట్లేదు, ఈరోజు బామ్మ ఆరా తీయగా వాడికి అమ్మా, నాన్నా చిన్నప్పుడే పోయారట, మామ్మ దగ్గర ఉంటూ పేపర్ వేయడం, ఎవరికైనా సరుకులు తెచ్చిపెట్టడం చేసి పైసలు అడుక్కునేవాడట, ఈ మద్య వాళ్ళ మామ్మ కూడా చనిపోతే వాడిని ఎవరో అనాథశరణాలయం లో చేర్చారట, వాడిగురించి బామ్మ స్పీకుతుంటే మాబస్సువచ్చింది మేం వెళ్లాం "(ఇదీ పిల్లలు చెప్పిన సారాంశం )
పిన్నిగారిలో చాలా మార్పు వచ్చింది. చాలా వరకు ముభావంగా ఉంటున్నారు.

ఓరోజు ఉన్నట్లుండి, మావారిని పిలిచి, దగ్గర కూర్చోబెట్టుకొని,

"బాబూ,నేను ఊరెళ్ళి రావాలి" అన్నారు.
"అలాగే అత్త్తయ్యా" కానీ ఏమిటంత ముఖ్యమైన పని? పైగా పిల్లలకి హాలిడేస్ కూడా లేవు. అన్నారు.

"లేదు, ఇంకో వారం రోజుల్లో మీ మామయ్య వర్దంతి ఉంది, ఆరోజుకి ఆయనకీ ఇష్టమైన పని ఒకటి చేయాలి" అన్నారు.

(జీవితాంతం ఈమెకు ఇష్టమైనవి మాత్రమే జరిగేట్లు ప్రవర్తించారాయన. ఆవిషయం అందరికీ తెలుసు.)

"ఇంతకీ విషయం చెప్పలేదు మీరు" కొంచం అసహనంగా అన్నారు మావారు.

"ఊరెళ్ళి, మరిదిగారితో నా వాటా గురించి మాట్లాడి, ఎంత వస్తుందో తెలుసుకోవాలి. ఇప్పటివరకూ నాకు ఖర్చులకి ఇస్తే చాలు నా తదనంతరం ఎవరైనా తిననీ అనుకున్నాను, ఇప్పుడు అలా కాదు, నేను ఆ పసివాడిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను" చివరి మాటలు స్థిరంగాఅన్నారామె."బిడ్డలులేని మనం ఏ అనాథ బిడ్డనో పెంచుకుందాం అనేవారు ఆయన" స్వగతంగా అనుకున్నట్లు చిన్నగా పలికారామె.

నేను రోజూ చూసే పిన్నిగారికీ ఈమెకీ పోలికే లేదు, ఎప్పుడో ఎవరిమీదనో విరుచుకు పడుతూ, చిరాకు పడుతూ కనిపించే ఈమెగారిలో ఇంత ఉన్నతమైన ఆలోచనా, దయాగుణముందా???.

"ఏమోయ్ చూసావా.... మరక మంచిదే అన్నట్లు మా మంగమ్మత్త మంచిదే" నవ్వుతూ అన్నారు మావారు ఆమె నిర్ణయం విన్నతర్వాత.

Thursday, 5 December 2013

కొన్ని సందర్బాలు

     

     కొన్ని  సందర్బాలు 


     బ్రతుకు  పోరాటములో..., 
     ముక్కలైన  చీకటి ప్రతిమలెన్నో. 

     విశ్వామిత్రుల  విశ్వ సృష్టిలో..,

     వెలుగుచూసిన వీరోచితాలెన్నో. 

     గంజాయి వన దహనాన..,  

     కాలిపోయే గంధపు చెక్కలెన్నో. 

     అదికార  దాహానికి  బలవుతున్న..,

     గొంతు  పెగలని  పెనుకేకలెన్నో. 

     పవిత్ర  కుటుంబాలను  వీధికి లాగితే..,

     వెలువడే శాపనార్దాలెన్నో.

     బతుకు  బాగాహారాల  భోగాతాల్లో...,

     చేయికలిపే  అదృశ్య  హస్తాలెన్నో. 

     మారణహోమాల  మరణ  శాసనాలపై...,

     రంగులు మారిన జెండాలెన్నో.

     అర్దాంతర  మరణాల శవయాత్రలో..,
     నెత్తుటి  జ్ఞాపకాలెన్నో. 
Monday, 2 December 2013

ఎవరు నీవు?


   ఎవరు నీవు?


     కలత  నిదురలో  కనిపించే,
     కమ్మటి కలవా...?

     తూరుపు  తలుపు తెరిచిన,
     తొలి ఉషస్సువా...?

     కుబ్జలో అంత:సౌన్దర్యాన్నిచూసిన , 
     కన్నయ్యవా...?  

     గుండె గుడిలో కొలువైన,
     మనో దైవానివా...?

     భావ ప్రపంచాన వెలసిన ,
     అద్భుత అక్షరశ్రీవా...?

     హృదయానికి  స్పందన  నేర్పిన,
     తీయని శ్వాసవా... ? 

     యెదపై  ఎన్నటికీ  చెరగని,
     వెన్నెల  సంతకానివా ...?

     మదిలో ఊహగా  మెదులుతూనే ,
     ఎదుట  పడని  వాస్తవానివా...? 


Sunday, 1 December 2013

అనాథ
     అనాథ 


      గోరుముద్దలు పెట్టలేదు,
    చిట్టికథలూ చెప్పలేదూ..,

    లాల పోయలేదు,
    లాగు వేయలేదూ... 

    చెత్త బుట్టలో పడేశావు,
    చేతులు దులుపుకున్నావు.

    మాసిపోయిన పాతలూ,
    మట్టి కొట్టుకున్న చేతులూ.

    అంతటా... విదిలింపులూ,కదిలింపులూ,
    ఇకిలింపులూ,సకిలింపులూ.

    అమ్మ ఎలా ఉంటుందో చూడాలనీ,
    ఎందుకు కన్నదో నిలదీయాలనీ.

    ఎలాంటి దయనీయ స్థితి ఈ పనికి పురికొల్పిందో?
    ఎలాంటి కమనీయ స్థితి నాకు ఊపిరి పోసిందో?

    ఎదురుచూసినా...పారవేసిన అమ్మ రాదు,
    ఎంత ఏడ్చినా....చేరదీసే అమ్మే లేదు.

    జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
    ప్రతి దయగల అమ్మ కళ్ళలో తన జన్మని వెతుకుతూ.....
Friday, 29 November 2013

బాల్యం     బాల్యం  

        అందమైన  ముంగిట్లో   తిరుగాడాల్సిన  తువ్వాయి,
      సౌధాల సోపానాల నెక్కే  సిమెంటు  తట్టవుతుంది. 

      పున్నమి పుప్పొడిలాంటి  జాబిలికూన,
      శ్రమజీవై  మసిచేతులతో  మురికితేలుతుంది. 

      చిట్టి రెక్కలతో  ఎగరాల్సిన చిన్ని పావురం,
      రాబందుల ముక్కులకు రక్తపు ముద్దవుతుంది. 

      బాలకార్మిక  జీవనం భారంగా మారుతుంది,
      బతుకు బరువై  భవితలేకుండా  పోతుంది. 

     రూకల  మూటలుంటేనే  బడి తలుపు తెరిచేది.
     నూకలు కూడాలేని  ఈ బడుగులకిక  చదువేది?  

     "అ,ఆ" లు కాదు ఆకటిరాతలు  రాస్తున్నారు.
     మద్యాహ్న బువ్వుంటేనే  బడి వంక  చూస్తున్నారు. 

     అందుకే ..... 

     బుడతలకు  బువ్వతోపాటు  నవ్వుల  ఎరవేద్దాం,
     బుజ్జగించి,  బులిపించి  అక్షరాల  వలవేద్దాం.  

     వారిచేతనే  బంగరు  భవితకు   బాటవేయిద్దాం,
     బాటకడ్డుగా  ఉన్న  ఆకటి  కూకటివేళ్ళను తోలిగిద్దాం.   

Thursday, 28 November 2013

(ప) రాయిగా మారిన నా ప్రేయసి


(ప) రాయిగా  మారిన  నా ప్రేయసి

నన్ను చూస్తూనే  
వెలిగిపోయే.. ఆ కళ్ళు,
నా ప్రేమ వాకిళ్ళు ..


వాలిపోయే పొద్దులో,
నాకోసం ఎదురుచూస్తూ,
నా అరికాలి గుర్తులు ముద్దాడే... నా ప్రేయసి.


గాయాల పూదోటలో,
సోమ్మసిల్లిపోతూ, నాకోసం,
విరహ గీతం పాడే...నా ప్రేయసి.


శిశిరఋతువులో,
వసంతాన్ని ఆహ్వానిస్తూ,
కలల పచ్చిక తివాచీ పరచిన..నా ప్రేయసి.


పెను తుఫానులో,
చిగురుటాకులా లేలేత ప్రాయాన్ని,
విరహ వేదనలో త్యజించిన....నా ప్రేయసి.


దూరాన ఉన్నా,
తన తేనెల మాటలతో,
నా గుండెలో వలపు ఊయలలూగే..నా ప్రేయసి.


ఊసుల, ఊహల మద్య,
నా కోసం ఊపిరి నిలుపుకొని,
నన్ను చూడాలనుకొనే నా ప్రేయసి.


నిత్య సమస్యల నడుమ,
సతమత మయ్యె,
రెక్కలు తెగిన విహంగం..నా ప్రేయసి.


నా శ్వాసను శాసించి ,
ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేసి,
నన్ను పిచ్చివాణ్ణి చేసిన నా ప్రేయసి.

Wednesday, 27 November 2013

ఆతని రాకకై...

           ఆతని రాకకై... 

      ప్రతిరాత్రీ  కన్నీటి జ్ఞాపకాలతో, 
      కన్నీటి కడలిని  దాటే యత్నం  చేస్తుంది. 

      కలువభామ  సాక్షిగా ఆతని వీక్షణాలకై..,
      నీటిబిందువై   ఎదురుచూస్తుంది.

      దిగంతాల ఆవలున్న  ఆతని  కరచాలనానికై..,
      ఆర్తిగా తన  చేయి చాస్తుంది. 

      నీడ  సైతం   వెన్నంటిరాని  ఏకాకితనంలో..,
      పలకరింపుకై   పలవరిస్తుంది. 

      అందుకోలేని  ఆ అపురూప   పెన్నిదితో  సన్నిదిని..,
      సశేషంగానే   సరిపెట్టుకుంటుంది. 

      ఆకాశమే అవనికి  దిగివచ్చి  అభయమిస్తుంటే..,
      తనకు తోడుండమని  వేడుకుంది. 

      చీకటి హృదయాన వెలుగు నింపిన దినకరుని..,
      ఆగిపోమ్మని  ఆశగా  అర్ధించింది.

      కానీ..,

      జగత్సంచారిని   బంధించటం  సాద్యం కాదని...,
      బాదగానే  వీడ్కోలు పలికింది. 

      ప్రతి ఉదయం  పలకరించే  ఉదయుని  స్పూర్తితో,
      పరుల  సేవకై   శ్రీకారం  చుట్టింది.

      చీకటి చిట్టిచేతుల్లో  చిరుదివ్వెనైనా  కావాలని..,
      అక్షరకిరణమై  అంకితమయ్యింది.      

 


Tuesday, 26 November 2013

చూపు


     చూపు 


    నీ వాలు  చూపుల  గాలం 
    నా  గుండె  కవాటానికి,
    చిక్కుకుంది. 

    నీ  ఓరచూపుల  సోయగం,
    నా  మన:మందిరం,
    చేరుకుంది,

    నీ  చిలిపి చూపుల  చక్కదనం,
    నా  వలపు వాకిట,
    విరిసింది. 

    నీ  సోగచూపుల  సౌందర్యం,
    నా  ఎదముంగిట,
    పరచుకుంది. 

    నీ  ఆర్తి చూపుల  కోమలం 
    నా  ఆశల  దోసిట,
    నిలిచింది 

    నీ  కాటుక  చూపుల  కలికితనం,
    నా  మది  భావాలను,
    మీటింది. 

    నీ  మాలిమి  చూపుల  మంచితనం,
    నా  తీపి పలుకులను,
    మాల కడుతుంది. 

    నీ  దొంగ  చూపుల దోపిడితనం
    నా మనసు  మర్మాలను 
    వెతుకుతుంది. 

    నీ  అలక  చూపుల అల్లరితనం,
    నా  దాహార్తిని,
    దాచేస్తుంది. 

    నీ  కరుణ చూపుల కమ్మదనం 
    నా  ఆశయాలకు,
    బాట వేస్తుంది . 

    నీ  స్నేహ  చూపుల  చల్లదనం,
    నా  జీవితాన్ని,
    నీకంకితం  చేస్తుంది