Pages

Saturday 23 April 2016












గిజిగాడు

కిటికీ ఊచలకు  తలవాల్చి ,
తలపులు తోడుకుంటున్న  వేళ,
కిటికీ  రెక్కలపై  వాలి  తన రెక్కలు  విదిల్చాడు,
నా  బంగారు  గిజిగాడు.

నిశ్శబ్దం లో  ఒదిగిపోయిన  నాపై,
తడి  రెక్కల  టప ,టపల  విదిలింపు తో,
చిరుతడి చేసి తమాషా  చూస్తాడు,
నా బంగరు  గిజిగాడు.

నా  తపస్సును  బంగం చేస్తూ,
నా సమాధిపై  నాట్యం చేస్తూ,
తమస్సు  నాకే వదలి   వెళ్ళిపోయాడు,
నా బంగారు  గిజిగాడు.


వెతికి,వెతికి అలసిన  నేను ,
ఆకసాన  కనిపిస్తాడనే ఆశతో....,
ఇంటికప్పునే  తీసేశాను.....,


ఓ  శుభోదయాన .......,

పచ్చటి  వేపమానుపై
అందంగా తానల్లుకున్న  గూటిలో,
భార్యా ,పిల్లలతో ఊయలలూగుతూ..,
నన్ను చూసి  గర్వంగా  మీసం  దువ్వి కన్ను గీటాడు,


 నేనూరుకున్నానా ....?
దోరగా నవ్వుతూ ..,
దోసిట  గింజలతో... ,
మరోమారు వాడి ముందు అమ్మలా అవతరించాను ...,