Pages

Sunday, 29 April 2012

చిన్ని ఆస్తి

  చిన్ని ఆస్తి   

నాకున్న చిన్ని ఆస్తి నా చొక్కా జేబులో ఇమిడి పోతుంది, అదేంటో తెలుసా? ఒకటి "చారణా" బిళ్ళ ఇంకోటి 'ఐస్ క్రీం" పుల్ల.  ఇవి రెండూ నాకు ప్రాణం.
     
అవునూ, నా గురించి  మీకు చెప్పలేదు  కదా, నాకు మూడేళ్ళు, మీరు నన్ను చాలా సార్లు చూసే వుంటారు. ఎక్కడా అనుకుంటున్నారా? ఫుట్ పాత్ మీద.

    ఎర్ర సిగ్నల్ పడినప్పుడు ఒక్క నిమిషం నా వంక చూస్తారు. నేనక్కడే ఆడుకుంటూ ఉంటా. మీతో  వుండేది మీ పాపనుకోండి, నేను కరెంటు స్థంభం చాటుకేల్తా. ఎందుకంటారా, నాకు సిగ్గు బాబూ, నా చెడ్డి చిరిగి పోయింది కదా.

     మా అమ్మకీ ఆస్థి వుంది, అదంతా రెండు సంచుల్లోకి వస్తుంది. రెండు బొచ్చెలు, రెండు ప్లాస్టిక్ గ్లాసులు, రెండు చీరెలు. పూసలూ, బొమ్మలూ అమ్ముతుంది. మేముండే స్థలం కూడా రెండు బారలే. అసలీ "రెండు" అనే పదం మా బ్రతుకులో అచ్చు పది పోయింది. మేమూ ఇద్దరమే.

     నేను అనుకుంటూ ఉంటా, ఎన్ని కార్లో, ఎన్ని మోటారు సైకిల్లో, అసలీ జనాలంతా అటూ ఇటూ ఎందుకు తిరుగుతుంటారు. షాపుల నిండా వీళ్ళే, హోటళ్ళ నిండా వీళ్ళే. ఏమి కావాలంటే అవి కొనుక్కుంటారు. ఎక్కడివి ఇన్ని డబ్బులు. సదువుకుంటే వస్తాయా. ఎట్లా సదువుకోవాలి. ఎవర్ని అడగాలి. నేను సదువుకోవాలంటే ఏం చేయాలి. అడగదామంటే ఒక్కరూ ఆగరుకదా.

     మీకు తెలుసా మా అమ్మ చెప్తాది చానా మందికి రెండు జన్మలకి సరిపడా డబ్బులు ఉంటాయట. 

     నాకూ సదువుకోవాలని ఉంది. సదువుకుని డబ్బులు సంపాదించి అమ్మకూ నాకూ ఓ  దుప్పటి కొనాలి. కానీ సదువుకోవడం ఎట్లా. 
     
     ఎవరైనా ఒక్క క్షణం ఆగి చెప్పండి.

   


Saturday, 28 April 2012

నవ జీవనంనవ జీవనం

అసహనాల సెగలు ఇంటిలోనే మొలకెత్తుతున్నాయి,
అనుమానాల పొగలు కంటికిందే మొదలౌతున్నాయి.

నేనే గొప్ప అనే అహాన్ని నెత్తికెత్తుకుంటూ,
బింకంగా వంటరితనాన్ని గుండెకు హత్తుకుంటూ.

నన్నెవరూ గుర్తించడం లేదని, నేనే ఎక్కువ శ్రమిస్తున్నాననీ, 
ఏకపాత్రాభినయం చేసుకుంటూ.

పోటీ ప్రపంచంలో పరుగులెత్తుతూ బోర్లాపడుతూ,
విలువలు వలువలు విడిచేస్తూ ఉన్నాయి.

అర్ధరాత్రిని అక్కున చేర్చుకుని నిదుర కళ్ళకి, 
రూపాయి బొమ్మను ఆశగా చూపిస్తూ.

కొలువుల కొలమానంలో జీతం దాగుడుమూతలు,
పనుల కాలమానంలో జీవితం దోబూచులాటలు.

ఒకప్పుడు చిన్ని చిన్ని పలుకులు కళ్ళలో పలికేస్తూ ....
ఇప్పుడు చిన్ని చిన్ని మేస్సేజులు సెల్లులో తుడిపేస్తూ.

ఎవరి లెక్కలు వారివి, ఎవరి పక్కలు వారివి,
ఎవరి పరుగులు వారివి, ఎవరి పాట్లు వారివి.

స్వేచ్చా సంద్రంలో తేలియాడే పిల్లలూ,
నాగరికత మత్తులో జోగుతూ చెరిపేసే ఎల్లలూ.

జీతాలను పెంచుకుంటూ ... జీవితాలను తెంచుకుంటూ,
నాగరికతను వెతుక్కుంటూ ... నెట్లో చిక్కుకుంటూ.

శూన్యం లోకి, సుషుప్తిలోకి  ... జీవితం జారిపోక ముందే,
అంధకారం అలుముకోకముందే, అవివేకాన్ని అణిచివేద్దాం,
వెలుగు వివేకాన్ని ఆహ్వానిద్దాం.                     Wednesday, 25 April 2012

పాప నవ్వుపాప నవ్వు

ఓ   చిన్నారి  పాప  బోసిగా  నవ్వుతుంది,   చప్పట్లు  చరుస్తుంది,  ఏదో పులకింత. తొర్రి పళ్ళ మద్య  నాలుక తొంగి చూస్తుంది,  కళ్ళ నుండి ఆనందం జారి పడుతుంది. అంతలో వెన్నెలనీ  మంచునీ కల బోసినట్లున్న  ఓ కారు  ఆగింది,  అందుండి  కారు మేఘానికి  కాంతులీను  వస్త్రాలు కట్టినట్లున్న  ఓ ఆకారం దిగింది,  గులక రాళ్ళు , గాజు పెంకులు  కలిపి   గిలకొట్టిన  సవ్వడిగల   గొంతుతో,    పాప   ఎదురుగా ప్రత్యక్షం  అయింది. 
     
సౌధం పై స్వేద బిందువుల్లా... కూలీలు తమ  నుదుటి పై  చేతులడ్డుపెట్టుకుని   కిందికి చూసారు .., పొంత పొయ్యి లో  దొర్లుతున్న  కుక్క పిల్ల  బూడిద ముఖం  పైకెత్తి  చూసింది ..., 

ఇంతకీ పాప  ఎందుకు నవ్వినట్లు ??? 

పగిలిన పాదాలు .., చిరిగినా పాతలు , నడకని వంకర చేస్తుంటే  కంగారుగా మురికి చేతులు జోడిస్తూ  అన్ని ఆకారాలు  వరసగా చేరాయి కరంటు తీగ పై కాకుల్లా... అమ్మో  ఎదురుగా దొరగారు  ఉన్నారు మరి.  పైన బట్ట కొరత ఉంది,  కింది బట్ట  కొంతే  ఉంది,  అయినా  దొరగారి కుర్చీ తుండుతో  తుడవబడింది. 

గుడిసెలో  మట్టిముంతలోని  పది నోటు  షాపుకెళ్ళి  కూల్  డ్రింకు గా    తిరిగొచ్చింది.  ప్రసాదంగా ఇచ్చిన  పానీయం దొరగారి గొంతు దిగుతుంటే  ఎదురుగా ఉన్న కాకులు పెదాలు తడుపుకున్నాయి.              

ఇంతకీ పాప ఎందుకు  నవ్వినట్లు ???

దొరగారోస్తే  నాన్న  నంగి నవ్వులు నవ్వుతాడు.   ఆ తర్వాత అమ్మ చేత కోడి కూర వండిస్తాడు.. వహ్ కూరా కూడు.. దొర  వదిలేసిన బోమికెలు,  అమ్మ  దాచి పెడ్తాది,  వహ్   అమ్మా నాన్నా నవ్వతా  ఉంటారు.

ఆ చిన్ని బుర్రకి తెలుసు  సంతోషం ధనంతోనే వస్తుందని ..., అదీ  దొరతోనే వస్తుందని.

అదిగో అందుకే పాప నవ్వింది.
                 
నిజమే ఈ దొరలంతా నవ్వుతూ ఉంటారు, పోగొట్టుకుంటూ పొందుతున్నామనే అమాయకుల జూసి.
Tuesday, 24 April 2012

నా మది
నా మది

నీ  నిరసన  రుచి  చూసిన  నా మది  ఇలా  ఉంది;

అడవికాచిన  వెన్నెలలా ...
అనాఘ్రాత   పుష్పంలా  ...
అనిశ్చల  సరోవరంలా ...
సడి చేయని  శంఖంలా ...
నిరీక్షించని   చకోరంలా ...
అలిగిన  అభిసారికలా ...
రంగు  వెలసిన  హరివిల్లులా ... 
సువాసనలేని  కుసుమంలా ...

నీ  విరహం   రుచి   చూసిన  నామది  ఇలా  ఉంది; 
వెన్నెల  ఎరుగని  సోమునిలా ...
విరులు  పూయని  తరువులా ...
కొలను  తెలియని  మీనంలా ...
కదలలేని  కాలంలా ...
మెలిపడిన  ఇనప  తీగలా ...

నీ  ఆగమనం  చూసిన  నామది  ఇలా  ఉంది;
నర్తించిన  మయూరంలా ...
లిఖించిన  ప్రేమ  కావ్యంలా ...
తేనేపలుకుల  చిలుకలా ...
విరబూచిన  పూవనంలా ...

నడిచివచ్చిన వసంతంలా ఉంది.
Sunday, 22 April 2012

అతివ అంతరంగం

అతివ అంతరంగం

నీ  రాకకై  ఎదురు  చూసిన  "ఊర్మిళను"
నీ  తలపుతో  తపించిన  " శకుంతలను"
నీ  ఆనతో  కానలకేగిన  "అయోనిజను" 
నీ  పాద  స్పర్శతో  నాతియైన  "అహల్యను"
నీ  ప్రేమ  నాకే  చెందాలని  సాధించిన  "సత్యను"
నిను  తులసి దళంతో తూకం వేసిన "రుక్మిణిని"
నీ  పదాలనే  పలవరించిన  "మీరాని"
నీ  సత్యపథంలో  నడిచిన  "చంద్రమతిని"
నీకు  పరస్త్రీ  వ్యామోహం  వలదని  పలికిన  "మండోదరిని"
మూర్చిల్లిన  నిను  ముప్పునుండి  తప్పించిన  "నరకాసుర మర్దినిని"
నీ  ప్రేమకై  రేపల్లెను  పొదరిల్లు  చేసిన  "రాధని"
నీవాడిన  జూదంలో  పావునైన  "పాంచాలిని"
యుగాలు  మారినా  నీ "యువతినే", తరాలు మారినా నీ "తలోదరినే"
కలియుగంలోనూ నీ "కలికినే".
ఈ యుగం లో నీ ఉన్మాదానికి బలి అవుతున్న "అబలను".
రాక్షసంగా  నీవు మారి నన్ను విగతను చేస్తున్నావు.
నా అంతం నీ అంతర్థానమే సుమా.

Thursday, 19 April 2012

కన్నీటి చారిక


కన్నీటి చారిక

చెక్కిలి పై  జారే  కన్నీటికి  తెలుసు  కరువేమిటో, 
కడుపులో కదిలే పేగులకు తెలుసు ఆకలేమిటో,
అరచేతిలో రేఖలకి  తెలుసు జీవితం ఏమిటో,
రాత్రికి తెలుసు చీకటి కాఠిన్యం ఏమిటో,
ధైర్యానికి తెలుసు తన సత్తువ ఏమిటో,
విధి తోస్తుంది తప్పు చేయమని,
మది చెప్తుంది ఒప్పు ఏమిటో,
బ్రతుకు తుప్పు పట్టింది...... అయినా, వెతల మరలు తిరుగుతున్నాయి.
ఓర్పు పడవ ఒటిదవుతుంది,
అయినా వివేకం పిల్లిమొగ్గలేస్తుంది,
బీదతనం ఉచ్చులా బిగుసుకుంటుంది,
లేమితనం మచ్చలా అచ్చు పడిపోతుంది,
ఆశ ఓ రేఖలా అడ్డు పడుతుంది,
దారిద్య రేఖ అంటే తెలుసా?  నిన్ను దాటి పోయే రేఖ.
అదేమిటో తెలుసా ............... నీ   కన్నీటి చారిక.

Tuesday, 17 April 2012

సమాంతర రేఖ


సమాంతర రేఖ

నా గుండె నిండిన నీ తలపు ఆవిరై ఆశ్రువులా జారిందివెచ్హగా .... వ్యధగా, " నను అభాగినిని చేసి " 
నను నడిపించిన నీ చేయి దూరమై ఎండమావుల వెనక్కి వెళ్ళింది,
మెరుస్తూ ..... మురిపిస్తూ                                   " నను ఏకాకిని చేసి "

నా మనసును  ఆవహించిన  నీ  వలపు  ఆశై చూపులో స్థిరించింది,
నిశ్చలంగా ..... నిరీక్షణగా                            " నను  అనామికను చేసి "

నా  అందమైన ఊహాలోకంనుండి నీ స్వప్నం  కరిగిపోతుంది,
కాలుతూ ..... జారుతూ                                    " నను అవివేకిని చేసి "

నా  అపురూప చెలిమి తరువునుండి నీ స్నేహఫలం రాలిపోతుంది,
నిష్ఫలంగా ..... నిర్దయగా                          " నను నిర్గ్భాగ్యురాలినిచేసి "

అందమైన నా జీవన బాటలో నీ రాక మెరుపులా మెరిసి మాయమైంది,
నీడలా .....  నిరాశలా                                  " నను అభిసారికను చేసి "

మానసిక మైదానంలో ఏకాగ్రతను వెతుకుతూ చూపు చెదిరిపోతుంది,
అలలా ..... ఆవిరిలా                                          " నను తాపసిని చేసి "

నా జీవితాన్ని నడిపించిన నీ జ్ఞాపకం నిన్నలలో నిలుస్తుంది,
మసగ్గా ..... మాయగా                                     " నను నిరాదరిని చేసి "

నేను అలుపెరుగని బాటసారినే,  కానీ నిను ఎన్నటికీ కలువలేని సమాంతర రేఖను.

Monday, 16 April 2012

గురువు

చిట్టి వేళ్ళకు అక్షరం నేర్పే అయ్యవారివి,
చిన్నారులకు బంగారు బాట వేసే గురువుగారివి.


అక్షర కిరణ సంస్కారివి.
అజ్ఞాన తిమిర సంహారివి.


                                   క్రమశిక్షణ నేర్పే శిక్షకుడివి,
                                   విచక్షణ చెప్పే దీక్షకుడివి,


                                   మేధస్సుని పెంచే పెన్నిధివి,
                                   తేజస్సుని పంచె  సన్నిధివి.


విద్య నేర్చిన విశ్వామిత్రుడివి,
వివేకం నేర్పిన   సరస్వతీ పుత్రుడివి,


 బొమ్మను చేసిన పరబ్రహ్మకే అభయం ఇచ్చిన   గురుబ్రహ్మవు,
 నీతిని నేర్పిన శాస్త్రానివి... జాతిని నడిపిన సూత్రానివి.


                                  వెతలు పోయే బుజ్జాయికి  రాతలు నేర్పిన ఒజ్జవి,
                                  పుస్తక పుటల మీద అక్షర దుక్కి దున్నిన కర్షకుడివి


                                  నీవే సాక్షాత్ పరబ్రహ్మవి, నీవే సర్వదా పూజార్హుడివి,
                                  అవనిపై అలవోకగా జాలువారి జగతిని జాగ్రుతిచేసి,
                                  నరుల నాలుకపై నర్తించిన "అక్షరశ్రీ" వి.
Saturday, 14 April 2012

సఖా..... హాలికా.సఖా..... హాలికా.

ఎన్ని  వేకువలు  వాకిట  నిరీక్షించానో
ఎన్ని  కుసుమాలతో  రంగవల్లులు  దిద్దానో,
నాగలిని  లాఘవంగా  భుజంపై  ఎత్తుకుని,
బలమైన  బాహువులతో  ధృడమైన పాదాలతో,
రిషభ  రాజుల  వెనుక  మృగరాజులా  వెళతావ్,
ఓరకంట  ఈ  కలికిని  కాంచలేవా.....

అనంతమైన  ఆత్మ  విశ్వాసం  ఆ  వదనంలో,
అందమైన  శోభావిలాసం  ఆ  అధరాలలో,

యువత  విద్యాలయాల  విదేశాల  బాట  పడితే,
యువరాజులా  ధరణి  ఎద పై  దరఖాస్తు  పెట్టుకుంటావ్,

హలంతో  పొలం  పుటలు  తిరగేస్తూ,
విత్తనాల  అక్షరాలను  ముచ్చటగా  చల్లుతూ,
వసుధ  సంచికకు  వసంతుడి   ముఖచిత్రం వేస్తావ్,
పృథ్వి  పుస్తకానికి  మొలకల  కవితలద్దుతావ్ ,
ధరణి  ధారావాహికకు  ధాన్యం  ముగింపునిస్తావ్.

క్రిషీవలా,   చిరుగాలితో  నా  చిరునామా  పంపనా,
కర్షకా,       కదిలే  నదితో  నా ప్రేమ  విలాసం  పంపనా.
ఎదుటపడి  నేనే  విన్నవించుకుందామంటే,
వేకువ  చీకటి  నీ  ఆకృతిని  అస్పష్టం చేస్తుంది,
సంధ్యా  సమయం  నీ  ఆగమనాన్ని  అగోచరం  చేస్తుంది. 

క్రిషీవలుడైన  నీకు  కులకాంతను  కావాలి,
సంఘజీవివైన   నీకు  సహచరిణిని   కావాలి,
ధరాపుత్రుడైన  నీకు  ధర్మపత్నిని  కావాలి.

భూమికే  ఆభరణం  నీవు,  భావికే  ఆధారం  నీవు.


Sunday, 8 April 2012

ఆక్రందన

సమాజంలో మనందరి మధ్యా జరిగిందీ సంఘటన  తెనాలిలో.  అమానుషంగా ఒక  స్త్రీని గర్భం పై కొట్టి,  హింసించి  భ్రూణ హత్య చేసిన సంఘటన. సభ్యసమాజం తలదించుకొనే సంఘటన. ఎన్ని చట్టాలు వచ్చినా మనిషిలో అనైతికత, సాంఘిక దురాచారాలు ఇంకా సమసి పోవడం లేదు.  సాంఘిక దురాచారానికీ, అనైతికతకు గర్భంలోనే పసిబాలలు  బలైపోతున్నారు. ఈ సంఘటన పై  ప్రభుత్వ స్పందన ఏమీ కనిపించ లేదు. రెండు రోజుల తర్వాత ప్రజలు కూడా మర్చి పోయారు. రాజారాం మోహన్ రాయ్, కందుకూరి, గురజాడ లాంటి సాంఘిక సంస్కర్తలు గానీ, ప్రవక్తలు గానీ వచ్చే కాలం కాదు ఇది. పరివర్తన  రావాలి, నైతిక విలువలు అందరికీ తెలియచేయాలి.  
నవమాసాలు మోసి కనే తల్లికి ఏ బిడ్డైనా ఒకటే...  స్త్రీ జాతిని భూదేవితో పోల్చిన కర్మ భూమి మనది.... కానీ, అటువంటి భూమిపై జన్మించిన స్త్రీ అదే జాతిని అంతం చేయటంలో సహకరించడం అమానుషం. 

మన  సమాజంలో ఈ మధ్య కాలంలో ఎక్కువవతున్నభ్రూణ హత్యలు శిశు హత్యలు  నా ఈ చిన్ని కవితకు ప్రేరణ.

* * *
అమ్మా...
ఎక్కడున్నావు, ఇక్కడంతా చీకటి, ఏవో కదలికలు, బహుశా నాలాంటి నెత్తుటి గుడ్లు అనుకుంటా. 
నీ గర్భంలో వెచ్చగా ఉండేది, ఇంకేన్నాళ్ళులే ఈ అంధకారం,
త్వరలోనే దొరుకుతుంది అమ్మ మమకారం అనుకున్నా,
లింగ పరీక్షలో నను దొంగలా పట్టుకుని, నిను నిందించి, నాన్నని ఒప్పించారు. 
నా  అంతానికి నాన్న సంతకాన్ని  పునాది చేసారు.

శాస్త్రమా... 
నీది వైజ్ఞానమా అజ్ఞానమా! నా జాడ తెలుసుకొనుట నీకు సత్ఫలితమా, 
విధాత నిర్ణయం నీకు పరిహాసమా,
బ్రహ్మకు ప్రతిసృష్టి అయిన ఆడ శిశువులకిది సమాప్తమా.

దేవుడా ...
ముకుళిత హస్తాలతో మోకరిల్లుతూ రక్తసిక్తమై విలపిస్తూ విన్నవించుకుంటున్నా, 
నా రోదన, అమ్మ వేదన కనని  కర్కశపు చేతులు నను తల్లి నుండి వేరు చేసాయి.

ప్రభూ... 
అమ్మ వడి కరువైన నన్ను నీ దరిచేర్చుకో.
నేను లేక ఆగిపోనున్న ఈ జగతిని జాగృతి చెయ్యి.  
నా ఆగమనం అజరామరం చెయ్యి.  


Female Infanticide: how did Prophet Mohammed "Peace be upon him" treat with that?
In pre-Islamic era if any one blessed with girl child, the child buried in the sand. Prophet Mohammed forbidden to do that and professed that Allah said, do not kill your children for fear of poverty; We give them sustenance and yourselves too; surely, to kill them is a great sin.
Prophet Mohammed teaches that if you have girl child, educate, teach and give her the right behavior, recompense will be the Paradise.  He loved his daughter Fathima so much and when he sees her he smiles.  So we have to be happy if Almighty gives you girls.

Friday, 6 April 2012

చిన్నారి

బుల్లి  బుల్లి  అడుగులేసే  బుజ్జాయివి  నీవు,
చిట్టి  చిట్టి  పలుకుల  చిన్నారివి  నీవు,
చిరు  చిరు  తడబాటుల  తువ్వాయివి  నీవు,
కళకళలాడే  కన్నులమిన్నవు  నీవు,
నవనవలాడే  నట్టింట  సౌభాగ్యం  నీవు,
తళతళలాడే  ముంగిట  వెలుగువు  నీవు,
బుడిబుడి  అడుగుల  బుడతవు  నీవు,
మిలమిలలాడే  మేలిమి  బంగరు  నీవు,
మిసమిసలాడే  నుదిటి  కుంకుమ  నీవు,
కువకువలాడే  గువ్వ  పిట్టవు  నీవు,
విసవిసలాడే  విరుల  బుట్టవు  నీవు,
అలా  అలా  మెరిసే  అల్లారు  ముద్దువు  నీవు,
అవనిపై  వెలసిన  ఆడ  శిశువువు  నీవు,
అంబరాన్ని  మించిన  ఆలంబనవు  నీవు ,
సంద్రాన్ని మించిన  సంపదవు  నీవు,
నా  నట్టింట  నడయాడే  చిన్ని  దేవతవు  నీవు,

బ్రహ్మ  సృష్టివి  నీవు,  మాకు జన్మనిచ్చే  ప్రతిసృష్టివి  నీవు.

Thursday, 5 April 2012

నను గెలిచిన స్వప్నం


నను  గెలిచిన స్వప్నం

కవి  మెచ్చిన  చక్కని  చరణం నీవు 
రవి  తెచ్చిన  వెచ్చని  కిరణం నీవు.

గగన  వీధిలో  కరిమబ్బువు  నీవు,

హిమగిరిని  మించిన  సిరివి  నీవు.

రాగాల  రహదారిలో  తెరువరి  నీవు,

అనురాగాల రసగీతిలో  తేటగీతివి నీవు. 

ఎడారిలో  చక్కటి  పూతోటవు  నీవు,

ఎండమావుల్లో   చల్లటి  నీటి  తేటవు. 

జీవిత  పాఠంలో  నిత్య  నీతివి  నీవు,

భవిత  బాటలో  సత్యహితవు   నీవు.

మల్లెను  మించిన  మానసవు  నీవు,

మంచిని  పంచిన  మానవతవు  నీవు. 

నిజాన్ని  నమ్ముకున్న  గొప్ప  వ్యక్తివి నీవు,

నీతిని  గెలిపించిన  గొప్ప  శక్తివి  నీవు.

నిర్భాగ్యులకు  నీడనిచ్చే  వృక్షం నీవు,

నిజాయితీకి  నిలువెత్తు  సాక్ష్యం నీవు.

హంస  వడకట్టిన  పాలవు  నీవు,

హింస  వీడిన  పరమహంసవు నీవు.

నా  అంతరాన  ఉన్న ఆశయం  నీవు,

నను  గెలిపించాల్సిన  స్వప్నం  నీవు.

నిరీక్షణ

అసలే  నీవు  ఆకాశానివి,  అలివికాని  అనంతానివి,
విలువైన  విశ్వానివి,  విల్లు  ధరించని  విలుకానివి,
నేనో  సాహసిని,  కానీ  అతిచిన్ని  సాలీడుని,
వెలుగు  దారాలను  వెతుకుతూ..... జిలుగుదారాలను  ఎక్కుతూ,
నీ కోసం  తపిస్తూ..... నిన్ను  చేరగలనని   ఆశిస్తూ,
వెన్నెల దారాలతో  నిన్ను  చుట్టివేయాలని,
పట్టు  దారాలతో  నిన్ను  కట్టి వేయాలని,
అనంతమైన  నిన్ను  అణువులా  చేసి,
గుండె  గుడిలో  బందీ  చేయాలని  నా  ఆశ.

దిగంతాలవరకు  ఆవహించిన  నీవు  దీనంగా  నా  ఉనికి  కోసం  విలపిస్తావు.
అంతవరకూ  ఈ జిలుగు  దారాలను  ప్రేమ  పాశాలుగా  చేసుకుని వేలాడుతూ  ఉంటాను.


                      ఏదో ఒక రోజు 

నా  నిరంతర  శ్రమ,  నా  అంతర ప్రేమ  నీవు  గుర్తిస్తావు,
నీ   అంతర్మధనం  శాంతించి  నువ్వు  మేఘమై  వర్షిస్తావు,
సృష్టి   సమతుల్యముతుంది,  నీవే  కిందికి  వంగి,
ఈ చిన్ని  జీవిని  ఆర్తిగా  హత్తుకునే  రోజు  వస్తుంది.Sunday, 1 April 2012

ఆశ


లేమితనం  కమ్ముకున్న  లేతప్రాయం   నాది,
తెలివి  మీరిన  నాగరికత  ముందు  తెగిన  బాల్యం నాది,
ఉదయపు  వెలుగు  మీకు  ఆనందాన్నీ,  నాకు ఆకలిని   చూపిస్తుంది,
అమ్మా నాన్నలకు ఆధారమై .... జీవిత గాలిపటానికి నేనూ దారమై,
అక్కనైనా అమ్మ స్థానంలోకొచ్చి,  తమ్ముడికి నా చిన్ని వడిని ఆశ్రయం ఇచ్చి,
చిదుగులు  ఏరి, చిట్టి  చేతులతో  అన్నం  వంపి,  అన్నపూర్ణలా   తమ్ముడి బొజ్జ నింపి,
పావురాల్ళలా,  పాలరాతి బొమ్మల్లా,  బడికెళ్లే పిల్లలను... పట్టు లంగాల్లో గుడికెళ్లే పాపలను, టికెట్ లేని వినొదంలా చూస్తూ ఉంటాము నేనూ, తమ్ముడూ.
చింపిరి జుట్టు, చిరుగు పాతల్లో ఉన్న మాకు అందమైన వలువలు తొడిగితే అలాగే ఉంటాము,
చట్టాలూ హక్కులూ అన్నీ కాగితాలమీదేనా, మా జీవితాలమీద ప్రభావం చూపవా.
అంతర్జాతీయ బాలల దినోత్సవం కోసం బెస్ట్ ఫోటోకి  సెలేక్టైన ఫస్ట్  బాలనే నేను.
బాల కార్మికులు ఉండరాదన్నారు, మరి బాల్యమే లేని నేను ఏ కోవలోకి వస్తాను.
నాకు బడికేల్లాలనే ఆశయం, మరి తమ్ముడికో, నా వడియె ఆశ్రయం.

                                చెయ్యగలవా ....... 

ఆకలి కేకల,  ఆశల చూపుల నిర్భాగ్యం  నుండి విముక్తి,
చిరుగుపాతల, చింపిరి తలల దౌర్భాగ్యంనుండి ముక్తి,
వ్యథలు నిండిన మనస్సూ, ఎదిగే వయస్సూ, ఎన్నాళ్ళు ఈ తపస్సూ.
వస్తుందా నేనాసించిన ఉషస్సు.