సఖా..... హాలికా.
ఎన్ని వేకువలు వాకిట నిరీక్షించానో
ఎన్ని కుసుమాలతో రంగవల్లులు దిద్దానో,
నాగలిని లాఘవంగా భుజంపై ఎత్తుకుని,
నాగలిని లాఘవంగా భుజంపై ఎత్తుకుని,
బలమైన బాహువులతో ధృడమైన పాదాలతో,
రిషభ రాజుల వెనుక మృగరాజులా వెళతావ్,
ఓరకంట ఈ కలికిని కాంచలేవా.....
అనంతమైన ఆత్మ విశ్వాసం ఆ వదనంలో,
అందమైన శోభావిలాసం ఆ అధరాలలో,
యువత విద్యాలయాల విదేశాల బాట పడితే,
యువరాజులా ధరణి ఎద పై దరఖాస్తు పెట్టుకుంటావ్,
హలంతో పొలం పుటలు తిరగేస్తూ,
విత్తనాల అక్షరాలను ముచ్చటగా చల్లుతూ,
వసుధ సంచికకు వసంతుడి ముఖచిత్రం వేస్తావ్,
పృథ్వి పుస్తకానికి మొలకల కవితలద్దుతావ్ ,
ధరణి ధారావాహికకు ధాన్యం ముగింపునిస్తావ్.
క్రిషీవలా, చిరుగాలితో నా చిరునామా పంపనా,
కర్షకా, కదిలే నదితో నా ప్రేమ విలాసం పంపనా.
ఎదుటపడి నేనే విన్నవించుకుందామంటే,
వేకువ చీకటి నీ ఆకృతిని అస్పష్టం చేస్తుంది,
సంధ్యా సమయం నీ ఆగమనాన్ని అగోచరం చేస్తుంది.
క్రిషీవలుడైన నీకు కులకాంతను కావాలి,
సంఘజీవివైన నీకు సహచరిణిని కావాలి,
ధరాపుత్రుడైన నీకు ధర్మపత్నిని కావాలి.
భూమికే ఆభరణం నీవు, భావికే ఆధారం నీవు.
Excellent!!!
ReplyDeletesheershika ..suitable gaa ledanipisthunnadi. gamaninchandi
ReplyDelete