Pages

Friday, 22 September 2017

ఆశల ఉలినై.


ఆశల ఉలినై. 

ఓ చిన్న విరామం,
వేయివేదనలు మోసిన హ్రదయం,
రెండు వెచ్చటి కన్నీటి చుక్కల అనంతరం,
సుద్దీర్ఘ  నిట్టూర్పుతో ...,

ప్రతి క్షణమూ రగిలే పగల  నెగళ్ళూ ..,
ప్రతి కణమూ ఆక్రోశాన్ని దాచుకొన్న వైనాలూ ...,
సుదీర్ఘ  నిరాశతో ..... ,

ముక్కలైన చుక్కలన్నీ..., వెలివేసిన ఆకాశం వాకిట,
మబ్బుల  చాటున తలదాచుకోనిమ్మని ,
సుదీర్ఘ  శోకంతో ..... ,

సువిశాల ప్రపంచాన  మన చూపు మాత్రమే  సోకె  గవాక్షాన్ని,
అమర్చుకొన్న  మానవ నైజాన,

తాత్విక పునాదులవైపు దృష్టి సారిస్తూ... 
మార్మిక కామితాన్ని ఆహ్వానించే  జనసంద్రాన,

ఎంత తొలిచినా, ఒలిచినా ...పెచ్చులూడిపోయే...,
రాతి శిల్పం , ఓటి శిల్పం ...... ఈ  అస్థిర  హ్రదయం. 

Sunday, 11 June 2017

ఎవరైనా చూశారా ?


ఓ అధ్బుత మయూఖ శకలం ,

శూన్యపుదారుల్లో నడిచి వెళ్లింది ..,

సరిగమలు పలికిస్తూ వెళ్ళింది ,

మర్మరహిత మనోఫలకం పై ,

ఆత్మీయ మధుర సంతకమై .

తెగిపోయిన స్వర్గపు దారులను

వెన్నెల దారాలతో కలిపిన అద్వితీయ వారథి ..,

తొలకరి జల్లులో తడిచిన ఆరుద్ర పురుగు

పసితనపు పలవరింతల పచ్చిపాల నురుగు .

వెదురు వేణువు నుండి ...,

అల్లన ,మెల్లన సాగే ...అమర గానం ..

నమ్ముకున్న నేల పాదాల కింద ముక్కలైతే.
వేగు చుక్కయి సందించిన వింటి నారి నుండి .....

మింటి కెగిరిందేమో......మీరెవరైనా ..చూశారా..???


" నీ నేను "వెండిపంజరానికి అందం తెచ్చిన బంధీ నేను
పుత్తడి కత్తిపై నెత్తురులా పూసిన అత్తరు నేను ,
ఎన్నో అసాధారణ , నిరాధారణ వాక్యాల మద్య
అసంబద్ద కావ్యాన్ని నేను ,
ముంచెత్తే మానసిక కల్లం లో,
పలుకుల పరిగి ఏరుకునే పసిదాన్నే నేను,
నీకు తెలుసా
జీవితం అంటే ఏమిటో....?
కాలి గోటికి తగిలి ఎగిరపపడే గులకరాయి కాదు,

కొంగుకు కట్టుకున్న చెల్లని రూక కాదు ,

వశీకరణ ఒడిలోకి లాక్కునే చంచల వ్యామోహం కాదు ,

శిశిర వనాల పై వీచే...వడగాలి జీవితమంటే ,

కరకు చెరలను చేదించే కరవాలం జీవితమంటే ,

విషాదాన్ని తుడిచే వెన్నెల తుషారం జీవితమంటే ,

కామాన్నీ,భోగాన్నీ ఉసిగొలిపే వన్నెల విహారం జీవితమంటే ..,

నీకు తెలుసా..?

స్పృహనై ..

స్పూర్తినై ...,

స్పర్దనై... ,

స్పర్శనై.. ,

సాహసినై ..,

సహవాసినై ..,

సంతసం తో...సదా నీకై ...అద్దరిన వేచి ఉండే హిమాని నేను ,

జీవితానికీ..... జీవించటానికీ..,

భాష్యం చెప్పే ...నీ సహచరినే నేను

మెత్తని పూల బాటనై సాగిపోయే కాలాతీతం నేను ,

అచ్చ్హోట నీకై ప్రేమ ఫలాలను పరచిన శబరిని నేను,

అందరికీ అందని అద్దరిన ఉన్న అమృతాన్ని,

నీకై వేచిన హిమగిరిని నేను...,