Pages

Sunday, 28 April 2013

" శ్వాసించని  క్షణాలు "

ఒక్కో క్షణం  నీది  కానిది  అవుతుంది,
ప్రేతాత్మల  సంభాషణ తో్... ,
నిన్ను చిద్రం  చేసేస్తుంది. 

అల్లండుతున్నా కనికరం లేకపోతుంది,
అనుమానపు అంకుశంతో..,
నిన్ను పొడిచేస్తుంది. 

మవునపు  శవపేటికలో  నిన్ను దాస్తుంది.
పిశాచాల పలకరింపులతొ ... 
నిన్ను తూట్లు పొడుస్తుంది.

కలసిరాని కాలాన్ని నెత్తికెత్తుతుంది,
చంపడము  అనే సరదాతో...,
నిన్ను హింస పెడుతుంది.

ఇప్పటికింతే అనుకోవల్సి వస్తుంది,
శ్వాసించని  క్షణాలతో....,
నిన్ను విగతజీవిని చేస్తుంది.......... (ఇదీ జీవితం)
Friday, 26 April 2013


అన్నా...

తొండలు  గుడ్లు పెట్టె  పొలంలో,
ఏమి పండిస్తావు?

బండలు నిండిన భూమిలో,
ఏమి బావుకున్టావు ?

చెప్పులు లేని  అరికాళ్ళలో,
కసుక్కున దిగిన ముల్లును  ఎలా తీసుకుంటావు ?

మడక దున్నేందుకు,
చచ్చిన బక్క ఆవును ఎక్కడ   తోలుకొస్తావు ?

కరువు శవాల గుట్టల్లో,
అయిన వారిని ఎలా వెతుక్కుంటావు ?

ఎరువులు కొన్న అప్పుల్లో,
ఎన్ని తప్పులో ఎలా కనుక్కుంటావు ?

బావులన్నీ   భవంతుల కింద,
నక్కిన నల్లుల్లా ఉంటె ఎలా చేదుకుంటావు ?

వ్యవసాయం  నీ నెత్తిమీదనే,
లేదని ఎలా తెలుసుకుంటావు ?

ఆకలి పెరిగి దబ్బున్నోడి పేగులు,
అరిచేవరకూ  ఆగి ఉండాలని  ఎలా తెలుసుకుంటావు ?

అన్నధాతవే  కానీ అనాథవు  కావని,
ఎవరు చెప్పితే వింటావు ?

Wednesday, 24 April 2013కొడుకు 

అన్న ప్రాసతో ఆరంబించు ,
కన్న కొడుక్కు క్లాసు పీకటం.

సోదరి అంటే తన తోటిదే అనీ,
ఆడపిల్ల అంటే ఆత్మీయురాలే అనీ,

తరగతి గది అంటే తరగని నిధి అనీ,
కళాశాల అంటే ఆడపిల్లలే కాదనీ,

ప్రేమలో విపలమైతె నష్త మేమీ లేదనీ,
యాసిడ్ బాటిల్తో బయలదేరొద్దనీ,

సహ చరణి అంటే దాసీ కాదనీ,
జీవితాంతం తోడుండే సంజీవనీ అనీ,

అడుగడుగునా ఆడవారుంటారనీ,
ఆత్మీయులేగానీ, అర్భకులుకాఅదనీ,

ముందు తనపుట్టుకేమిటో తెలుసుకోమనీ,
తర్వాతే పున్నామ నరకం నుండి తప్పించమనీ...

Monday, 15 April 2013

నిన్ను తలచీ...నవ్వుకొంటే...
నిన్ను తలచీ...నవ్వుకొంటే...


ఎవరన్నారు
నువ్వు ఎదగలేదనీ..

ఎవరన్నారు,
కల్లాకపటం  ఎరుగని నిన్ను,
వెర్రివాడని.

ఏదీ తెలీని  పసితనం
మాయలో, మంత్రాలో  ఎరుగని
అమాయకం


చెట్టులా  ఎదిగినా,
పొత్తిళ్ళ నాటిలా,
చీరకుచ్చిళ్ళు వదలని
చిన్నతనం.

తోటి పిల్లలు తూలనాడినా,
గేలిచేసినా,
చప్పట్లు కొట్టే
స్వచ్చదనం.

మీసాలు వస్తున్నా,
ముద్దలు పెట్టమనే
మొండి తనం.

తప్పేదో, ఒప్పేదో తెలీక
ఆశలూ, ఊసులూ  అర్ధంకాని
నా వెనుక నక్కే
కుర్రతనం.

జోల్లు  కారుస్తున్నావని,
చెల్లి  విసుక్కున్నా,
మనసారా నవ్వుకొనే
మంచితనం.

రెక్కలొచ్చి అందరూ,
ఎగిరిపోయినా
అమ్మ కొంగు వదలని
ఆత్మీయం.

నీకై యోచిస్తూ
విలపించే నాకోసం
అపర  భ్రహ్మ  లా,
ఫోజిచ్చిన  అమ్మతనం.

Thursday, 11 April 2013


గుర్తులు 

బస్టాప్  లో  నుల్చుంటానా,
అదిగో  అక్కడే  తచ్చాడే  చిరుగుల లంగా  చిన్నది,
నేను గుర్తున్నానా  అన్నట్లు చూస్తుంది, 
నేను  మరచిపోయిందెప్పుడూ.... 

టీకొట్టు  దగ్గరికి  వెళ్తానా ,
అడిగో  అక్కడే చొక్కాలేని చిన్నోడు,
చిట్టిచేతుల్తో  టీ  కప్పులు కడుగుతూ,
వచ్చావా  అన్నట్లు  చూస్తాడు,
నేను  రాకుండా  ఉండగలనా... 

గుడికి  వెళ్తానా  అక్కడ,  
రెండు  చేతులు లేని  వృద్దుడు  
మొండి  చేతులతో దండమెడుతూ,
వచ్చావా అన్నట్లు చూస్తాడు,
నేను రాకుండా ఉండగలనా... 

బడి ముందు  నుండి వెళ్తూ ఉంటానా,
కళ్ళు లేని  ఓ తల్లి,
నా అడుగుల చప్ప్పుడుకి  కర్ర టక ,టక  లాడిస్తూ,
వచ్చావా అన్నట్లు  కళ్ళు ఓ మారు ఆర్పుతుంది,
నేను రాకుండా ఉండగలనా,

నిద్ర నిండా ఈ స్వప్నాలే,
ఈ  ఒలికిన  కన్నీటి సాక్షాలే,
దేవుని ముందు నేను నిలపాల్సిన ,
ఈ సజీవ  చలనమెరిగిన  చిత్రాలే,
నేను  నివేదించకుండా  ఉండగలనా...........   Tuesday, 9 April 2013
కొడుకా... ఇదేనా..జీవితమ్?


అప్పుడు  అన్నం  తినని  మారాం చేశావు.,
ఇప్పుడు  అన్నం పెట్టనని  దూరం తోశావు. 

నా బ్రతికు   పుస్తకంలో ప్రతిపేజీ  నీదే,
నా జీవన డైరీలో  ప్రతి అక్షరమూ నీదే. 

నీ చదువుకై  నేను  చేసిన  పోరాటం,
నీ ఆరోగ్యానికి  నేను పడిన ఆరాటం.

జీవిత  గారడిలో  ఎన్నో పిల్లిమొగ్గలేసాను. 
కస్టాల ,నష్టాల  సుడిగుండంలో  పడిలేచాను. 

తనివితీరా   ఏడుద్దామంటే కన్నీళ్ళు  లేవు. 
కరువుతీరా నిను చూద్దామంటే  కళ్ళే లేవు. 

నీకు  జన్మనిస్తూ  నాతోడు  దూరమైంది,
నాతో తోడు ఉంటానన్న  మాటే మరచింది.. 

నిన్ను మోసిన  ఈ భుజాలు  జారిపోయాయి,
నీ భుజం ఆసరా ఇచ్చి ఆఖరి మజిలీ చేర్చు. 

నిన్ను కన్నందుకు  నన్ను నిందించుకోని   రోజులేదు. 
ఇంకా ఎన్నాళ్ళు  ఈ భువిపై  అని లెక్కపెట్టని  క్షణం లేదు. 

Sunday, 7 April 2013


కరుణ మానినారా 

నేను చిన్ని వేళ్ళతో  పట్టుకోబోతే 
అల్లిబిల్లిగా  జారిపోయారు.

నోరారా "ఆ " అనిపిలిస్తే,
వచ్చి నా పలకలో  వాలిపోయావు,

నిన్ను అమ్మతో పోల్చి 
ఆ అంటే  అమ్మ అన్నానో లేదో నాతొ పాటు 
అమ్మ వొడి చేరిపోయావు.

ఈ.. అంటూ చిట్టి పళ్ళు బైట పెట్టి ,
వెక్కిరిస్తే వంకర టింకరగా,
వచ్చి  చిక్కిపోయావు.

ఊ... అంటూ చిన్ని నోరు సున్నాలా చుట్టి,
ఊయలలూగుతూ పిలిస్తే,
వయ్యారంగా వచ్చి పక్కన చేరావు.

మిమ్మలంతా పలక పల్లకీ  ఎక్కించుకొని,
మిమ్ము దిద్దిన గంధం 
నా బుగ్గలకు రాసుకోనేదాన్ని.

ఇన్నాళ్ళుగా నా ప్రతి మాటలో మీరే ,
నా ప్రతి పాటలోనూ మీరే ,
నా నట్టింటా మీరే,నా పుటింటా మీరే .

ఇప్పుడేమయ్యారు 
పలుకుల నుండి పారిపోయారా?
పలకల  నుండి  జారిపోయారా?

మిమ్ము వదిలి మేమంతా 
కొత్త లిపితో  తైతక్క లాడుతుంటే,
మమ్ము వెక్కిరించి వెళ్ళిపోయారా ?

కాగితం పూలకి,
మేము వెంపర్లాడు తుంటే,
కలువ పూలై సర్కారీ కొలనులో కొలువయ్యారా?

ఎక్కడున్నారు  ప్రియతమలారా...
ఏ కవుల హృదయాల్లో ఉన్నారు? 
పద్య రూపాన నర్తించిన  నాట్య మయూరాలు,
కావ్య కడలిలో  దాగిన అక్షర ముత్యాలు.

దేశ  బాషలందు  తెలుగు లెస్స ,
అనిపించి అన్య భాషలందు  నన్ను,
అగ్ర  స్థానాన ఉంచిన మణి మాణిక్యాలె.


కన్నతల్లి నుండి కానుకగా,
తెచ్చుకున్న కంటి పాపలో,
వెలిగే మింటి దీపాలే.

ఏరి ఏమయ్యారు? 
నా అక్షర మాల నుండి రాలిపోయారా?
నన్ను నిరక్ష్య రాసిని చేసి పారిపోయారా?

రారా...ఇకరారా.. కరుణ మానినారా 
ప్రియతమలారా..

Tuesday, 2 April 2013


అడగండి  చెపుతాడువిలేఖరి: విత్తును నమ్ముకున్నావ్ ఎమైంది?
రైతు : మొలకెత్తనని మొడికేసింది 


వి.: వానను నమ్ముకున్నావ్ ఎమైంది?
రై : రానని మొరాయించింది.

నీ : నీ డొక్కలెందుకు ఎగిరెగిరి పడుతున్నాయి?
రై : వాటికింకా ఆకలిగుర్తుంది 


 వి:   నీ బక్కచిక్కిన ఎద్దులేవి?
 రై :   కట్లు విప్పి గడ్డిఉన్న చోటుకెళ్ళమన్నా.

 వి : నీవు  ఏ పండగ చేసుకుంటావ్?
 రై :  పస్తుల పండగ.

 వి.: నీ ఆస్తులేమైనాయి ?
 రై  : అప్పులకు జమ అయ్యాయి.

 వి. :నీ అయ్య ఉండాలిగా యేడి?
 రై :  రోగాలు ఎత్తుకెల్లాయి (తెల్ల కార్డ్ లేక)

 వి  : కరంటు కోత ఉంది తెలుసా?
 రై  : తెలుసు 

  వి :రెండు గంటలు ఇస్తారు చాలా?
  రై : రెండు నిమిషాలు చాలు.

  వి: పురుగుల మందు వాడుతున్నారా?
  రై : ఓ ఇంటిల్లిపాదీ.

   వి.:  మల్లి కలుద్దాం .
   రై : వీలుండదు, ముందు,ముందు ఊరుండదు 

   వి.: మరి ఏముంటుంది ?
    రై : వల్లకాడు.

    వి : అయితే ఈ సారి  ఇంకా హంగామా ఉంటుంది  తెలుసా?
    రై  : తెలుసు, పిసాచాలు వస్తాయి  పరామర్సించటానికి.