Pages

Saturday, 28 September 2013

చీకటి మార్పిడిచీకటి మార్పిడి


చీకటి సామ్రాజ్యానికి, 

ఆకటి స్నేహానికీ,
అతి దగ్గరిదా బొమ్మ.


శరీరమే ఇక్కడ పెట్టుబడి,
ఆడతనమే పలుకుబడి,
దానిపైనే రాబడి.


తనువే తగలబడి,
తరాల తరబడి అమ్మకానికే,
అలవాటుపడి.


వాడిన మల్లెల సవ్వడి,
గాజుల గల,గల అలజడి,
నలిగింది, ఆడ మాంసం సిగ్గుపడి.


నిప్పుల పాన్పుపై,
ఆకటి దేహపు ఒరిపిడి,
సుఖం నవ్వింది సిగ్గుపడి.


నగ్న శరీరపు కామం,
కాటేస్తుంది తెగబడి,
ఆగిపోతుందీ నాటకం తెరపడి.


ప్రతి సారీ సాగుతుందీ,
ఆత్మవంచనా దోపిడీ,
ఆడతనం ఉన్నంత వరకే.....ఈ పస్తు మార్పిడి.


***

అందుకే తెరతీయి
ఆత్మ స్థైర్యానికి త్వరపడి.

తట్టుకో ఆటుపోటుల జీవితపు ఒరవడి.


నిన్ను నువ్వు దిద్దుకో
ఎప్పుడూ వెళ్ళకు "తప్పుబడి"
నువ్వుతెచ్చే తరమే జగతికి "పసిడి".


నన్నోమారు బ్రతికించు.


     నన్నోమారు బ్రతికించు.

   
   ఆప్తుల నుండి  రాలిపడే నవ్వులను 
   నేను ఏరుకోవాలి.

   ఆరని  ఆత్మీయుల పాదముద్రలను 
   నేను ముద్దాడాలి.

   పిడికెడు గింజలకై వలస వచ్చే పిట్టల  చిట్టి కథలు 
   నేను వినాలి.

   అద్దాల కిటికీకి నా ముక్కునద్ది అందరినీ వెక్కిరిస్తూ ఇష్టంగా
   నేను ఆడుకోవాలి.

   అర్దాంతరంగా ఆపేసిన అమ్మమ్మ కథలో ముగింపేమిటో
   నేను తెలుసుకోవాలి 

   ఇంటివెనుక  జిల్లేడు మొగ్గలను  చిదిమి
   టప,టప్ లాడించాలి.

   పచ్చగడ్డిమోసే పల్లె పడచుల వెనుక కులుకుతూ నడిచి  
   వారిని వెక్కిరించాలి.

   ధాన్యపు గాదెల వెనుక నక్కిన నా దొంగ నేస్తాలను
   పోలీసునై  పట్టుకోవాలి.

   అర్దాంతరంగా నా శ్వాసను ఆపేశావు దయచేసి, ఒక్కసారి వెనక్కి  పంపు
   మదురమైన  ముత్యపు మూటలతో తిరిగివస్తా....
   Monday, 23 September 2013

నిన్ను తలచీ...నవ్వుకొంటే...

నిన్ను తలచీ...నవ్వుకొంటే...


ఎవరన్నారు
నువ్వు ఎదగలేదనీ..

ఎవరన్నారు,
కల్లాకపటం  ఎరుగని నిన్ను,
వెర్రివాడని.

ఏదీ తెలీని  పసితనం
మాయలో, మంత్రాలో  ఎరుగని
అమాయకం


చెట్టులా  ఎదిగినా,
పొత్తిళ్ళ నాటిలా,
చీరకుచ్చిళ్ళు వదలని
చిన్నతనం.

తోటి పిల్లలు తూలనాడినా,
గేలిచేసినా,
చప్పట్లు కొట్టే
స్వచ్చదనం.

మీసాలు వస్తున్నా,
ముద్దలు పెట్టమనే
మొండి తనం.

తప్పేదో, ఒప్పేదో తెలీక
ఆశలూ, ఊసులూ  అర్ధంకాని
నా వెనుక నక్కే
కుర్రతనం.

సొల్లు  కారుస్తున్నావని,
చెల్లి  విసుక్కున్నా,
మనసారా నవ్వుకొనే
మంచితనం.

రెక్కలొచ్చి అందరూ,
ఎగిరిపోయినా
అమ్మ కొంగు వదలని
ఆత్మీయం.

నీకై యోచిస్తూ
విలపించే నాకోసం
అపర  భ్రహ్మ  లా,
ఫోజిచ్చిన  అమ్మతనం.

Saturday, 21 September 2013

నివేదననివేదన 


నా చిట్టి తండ్రీ. ....

అవిటితనపు అమ్మనురా,
ఎలా నీ భవితకి బాట వెయ్యగలను. .....
రెక్కలు తెగిన పక్షిలా. ..... నిస్సత్తువనై,
ఇసుమున ఇగిరిన తైలంలా . ...... నిష్ఫలమై,
శాపము బాసిన మోడులా ..... నిర్వీర్యమై,     
శరము తాకినా ఖగములా  . ..... నిస్సహాయనై,
కాంతి సోకని తిమిరంలా . ...... నిశాచరినై,
నెలవులేని కుటీరంలా . ..... నిరాదరినై.

నా చిన్ని ప్రాణమా . ..... 

నీ పాలబుగ్గల పసితనం వీడలేదే . ..... నీ అరచేతుల రేఖలింకా అమరలేదే.
నీ చిన్ని బొజ్జ నింపలేని నేను . ..... నీ చిట్టి గుప్పిట  బువ్వ ఎలా తినను.

ఒటుకూడా వెయ్యలేని అవిటినే . ..... చేయి చాపి అడగలేని అబలనే,
ఏ పధకాలు, ఏ ప్రయోజనాలు అందుకోలేనే,
ఎలా నీ భవితను తీర్చి దిద్దగలను.  
   
భయపడకు అమ్మనుకదా . ..... అనంతమైన విశ్వాసంతో . ..... జోడించిన నీ  చేతులతో దైవాన్ని ప్రార్థిస్తా.  
నీ భవితకు బాట వేస్తా.


Wednesday, 18 September 2013

నేటి అనాథలే..రేపటి అన్నార్తులు.
నేటి అనాథలే..రేపటి  అన్నార్తులు.


ప్రశ్నించే  ఆ చూపులకు ..
నువ్వు  జవాబు  చెప్పలేవు.

దిక్కదించే  ఆ చూపులను,
దైర్యంతో  నువ్వు   డీ కొనలేవు. 

నగ్నత్వ  బహిర్గత  నిజాన్ని,
నీ కళ్ళతో  నువ్వు  కాంచలేవు.

విసిరేసిన  ఆ  కర్ణుల  గాధను,
నీ కర్ణంతో  నువ్వు వినలేవు.

వారిపై పడిన చీకటి  మరకలను,
ఏ వెలుగు వస్త్రం తోనూ  తుడవలేవు.

నువ్వెంత తల తిప్పుకున్నా,తల దించుకున్నా,
తల విదుల్చుకున్నా, తల ఊపుతున్నా...

నిత్యం  నీ ముందు నుండి  వెళుతూ..
నీ  కంటబడే  తలలు లేని  మొలలు వీళ్ళు.

భారతమ్మ భారంగా మోసే.. బాల్యం లేని,
భావి పౌరులు  వీళ్ళు.

భారతమ్మ  పురిటి  నొప్పుల  తరాజులో 
చీకటి   తప్పుల  తూకం రాళ్ళు  వీళ్ళు. 

Sunday, 15 September 2013

క్షతగాత్రినై...


క్షతగాత్రినై... 

మది గదిలో  స్వయంకృత   బందీనై....
నిశ్చల  ధ్యానములో  చెదరిన    స్వప్నాన్నై... 

చేయని  నేరానికి  తలవంచిన అపరాదినై...
నిదురలేని రాత్రిలో  విరిగిన  కలల విరాగినై... 

అక్షర  అగాధాల  మద్య  విరామ చిహ్నాన్నై... 
ఉన్మత్త  ఉచ్ఛులో  చిక్కిన  కపోతాన్నై... 

సుదీర్ఘ  అశాంతి  రాత్రుల  ఆటల పావునై... 
కసాయినే  సత్కరించిన  నిష్కల్మషినై... 

ప్రేమలు  లేని ప్రపంచాన  అనిశ్చల  మనస్కినై... 
నమ్మక  ద్రోహానికి   తలవంచిన  సన్నిహితనై... 

ఆశల ఉదయానికై  ఎదురుచూసే  అంధుని కంటిపాపనై...
వీడిన  మన:శాంతికై  వేచిఉన్న  నిరంతాన్వేషినై....

ఉప్పెన  ముప్పులో నిరంతరం  ఎదురీదుతూ..,
వెతల కడలిలో  లంగరుకై  ఎదురుచూస్తూ.. Thursday, 12 September 2013

నిప్పుల స్నానం    నిప్పుల స్నానం 


   ఒళ్ళంతా పచ్చి పుండులా,
   కళ్ళు మండుతున్న చింతనిప్పుల్లా...

   గోటిచివరి నొక్కుడుతో,
   విరిగిపడ్డ విరజాజిలా.

   నత్తనడక జీవనయానంలో
   పల్లేరుకాయల పానుపులా.

   సోమ్మసిల్లె బతుకులో,
   శక్తిని కోల్పోయిన కాయంలా

   శిశిరంలో వివస్త్రమైన మోడులా,
   నీరు దొరకని ఎడారిలా.

   గీరుకున్న గాజుల గాయాలతో,
   కాలికింద నలిగిన మల్లెయలా

   చుట్టుకున్న జ్ఞాపకాల పరంపరలో,
   చిట్లిన పెదవి చివరినవ్వులా.

   కుళ్ళిన శవపు సంస్కారంలో
   కళ్ళనుండి జారని అశ్రువులా.

   గుచ్చుకునే తలపుల ముళ్ళ మద్యలో,
   విచుకున్న సుకుమార కుసుమంలా.

   నిట్టూర్పుల మద్య నిప్పుల స్నానంలో
   మృగతృష్ణకు బలైన హరిణిలా,

.


Monday, 9 September 2013

కలసి రండి ,

   

   

   కలసి రండి ,

    అందరూ కలసిరండి,
   గొంతుదిగని దు:ఖాన్ని,
   పంచుకుందాం రండి.


   చీకటి కోణాలనుండి,
   మురికి కూపాల నుండి,
   గాయాల గేయాలు విందాం రండి.


   లేతప్రాయపు నగ్నగుండెలపై,
   నర్తించే ఆకలి చూపుల,
   కళ్ళను పొడిచేద్దాం రండి


   రాజదాని నడిబొడ్డు మీద నర్తించే,
   లైంగిక ఆనందాన్ని,

   అందరమూ కలసి అడ్డుకుందాం రండి.


   నడిచే దారిలో నర్తించే,
   అరాచక పిశాచాలను,
   అదిలిద్దాం రండి.


   కాలు కదిపితే కక్షలే,
   కంటినుండి జారేవి లావాదారలే,
   అందుకే అక్షరిద్దాం రండి, చెడును అరికడదాం రండి.
Saturday, 7 September 2013

పుస్తకం


పుస్తకం

నేను  చదివే పుస్తకం     " జీవితం "

ఇందులో ప్రతి  పేజీ  ఆసక్తికరంగానే ఉంది.

"కుటుంబం "...... కుదించ బడింది.

"అనుబంధం"...అబద్దం అయింది.

"ప్రేమ".........పాదరసంలా  జారుతుంది.

"ఆర్ధికం"......అర్బకంగా  ఉంది.

" దానం"........దారితప్పురుంది.

"ధనం ".........దొరక్కుండా ఉంది.

"ఆకలి ".........వదలకుండా ఉంది.

"రోగం".......కుంగదీస్తుంది.

"బలం ".......లొంగదీసుకొంటుంది.

"అనుమానం"........పెనుబూతమైంది.

"స్నేహం"........అదృశ్యం అవుతుంది.

"నాగరికత "..........పరిగెడుతుంది.

"సంస్కృతీ"...........వీడ్కోలు చెప్తుంది.

"కులం"...........అంటురోగంలా  ఉంది.

ఇంకా కొన్ని పేజీలు   ఉన్నాయి, చదివి చెప్తాను,

Friday, 6 September 2013

దునియా..
దునియా..

"ఆలోచించేది ఏమీ లేదు  అబ్బాజాన్,
మమ్మల్ని ఆ "దోజఖ్" నుండి  బైట పడెయ్యండి".
ఖచ్చితంగా చెప్పింది తండ్రితో  కూతురు రజియా సుల్తానా.

"మరొక్కసారి  ఆలోచించు  బేటీ..జహంగీర్   నీకు ససుర్(మామ గారు) మాత్రమే కాదు, నాకు స్నేహితుడు కూడా " నెమ్మదిగా సరిదిద్దే  ధోరణిలో  చెప్పాడు. రజియా తండ్రి  సలీం బాషా.

కూతురూ, అల్లుడూ వేరు కాపురానికి అన్నీ సిద్దం చేసుకొని తనను కేవలం  మాటవరసకు అడుగుతున్నారని గ్రహించ గలిగాడు, కానీ పెద్దమనిషిగా తన స్నేహితుని  మనసు ఎరిగిన వాడిగా అది తన భాద్యత అనుకున్నాడు సలీం బాషా.

"లతీఫ్ బేటా  నువ్వన్నా ఆలోచించు  అబ్బా, అమ్మీ ఎంత బాధపడతారో " అల్లుడివైపు  తిరిగి  అన్నాడు సలీం బాషా.(అటునుండి నరుక్కొచ్చే  పద్దతిలో)

"వద్దు అబ్బాజాన్ ఆ ఇంట్లో వాళ్లకు  మేము బాగుపడటం  ఇష్టం లేదు ముఖ్యంగా మీ దోస్త్ కు, " లాస్ట్   పదం వొత్తి  పలికింది   రజియా.

"రజియా మాటలు జారకు, నీకు పెళ్లి చేయలేని  స్థితిలో  ఉంటె తానే ముందుకొచ్చి  నీ బిడ్డ నా బిడ్డ కాదా, మా లతీఫ్ కు చేసుకొంటాను , అని  ఒక్క పైసా  ఆశించకుండా నిన్ను తన కోడలిని చేసుకున్న్నాడు, తల్లి లేని నిన్ను తల్లి కంటే ఎక్కువగా  చూసుకుంటున్నారు , వాళ్ళనా  నువ్వు తూలనాడేది.. "  కోపంతో గట్ట్టిగా  అరిచాడు సలీంబాషా.

" బంధువులతో తెగతెంపులు చేసుకున్న వాడికి జన్నత్ లో ప్రవేశం లేదు" అని ప్రవచించారు మహుమ్మాద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నరకం వైపు వెళ్ళే దారిలో వెళ్ళకు నాయనా, చివరి ప్రయత్నంగా అన్నాడు సలీం.

"పదండి మామూజాన్, నమాజ్ టైం  అవుతుంది నడవండి" , అంటూ బయలదేరదీసాడు లతీఫ్.

                                                           ***

"లతీఫ్  రాలేదా" , రాత్రి  పదకొండు  అవుతుండగా  అన్నం ముందు కూర్చుంటూ   అడిగారు లతీఫ్ తండ్రి  జహంగీర్.
"రాలేదు," భార్య జవాబు.
"నవాబుకి పెత్తనాలు ఎక్కువయ్యాయి."పెళ్లి  చేస్తే బాగుపడతాడని అనుకొన్నాం, ఆ పిల్ల గొంతు కోసామో ఏమో..చిరాగ్గా  ఉంది ఆయన గొంతు.

" కనీసం  రజియా ఇంట్లో  ఉన్నా తొందరగా  తగలడే వాడేమో.." కోపం పెరుగుతుంది ఆయన గొంతులో.

"మీతో ఒకవిషయం చెప్పాలి." నసిగింది భార్య  సలీమా.

"ఏంటది," సందేహంగా  అడిగాడు  భర్త.

"లతీఫ్   గురించి.." మాట పెగలటం లేదు. తనకు తెలుసు భర్త  యెంత ఖచ్చితంగా ఉంటాడో.. తప్పు చేస్తే ఎవరినీ క్షమించడు.

"అమ్మీ .." వారించాడు పెద్ద కొడుకు  ఇస్మాయిల్ 
.
" ఏమైంది, ఈ సారి ఏం చేసాడు, సెల్లు ఫోన్లు దొంగతనం, ఇంకేదో  రౌడీఇజం .. చేసి ఉంటాడు ఈ సారి కూడా.."
గట్టిగా అరుస్తూ దస్తర్ ఖాన్ ( భోజనమ్  పళ్ళేలు  ఈ బట్ట మీదనే పెట్టుకొని  తినటం  ఆనవాయితీ. ) ముందు నుంచి లేచిపోయాడు జహంగీర్ భాషా.

"అవన్నీ వాడు చేయలేదు, ఎవరో దోస్తులు  చేస్తే వీడి మీద పడి  ఏడిచారు పోలీసులు..." అయినా ఇంట్లో వాళ్ళే  అర్ధం చేసుకోక పొతే  వాడి బతుకేమి కాను .. అల్లా.. నా కడుపునా ఎందుకు  పడేశావయ్య్యా .." శోకాలు  మొదలెట్టింది  సలీమా.

"నోర్ముయ్.. నువ్వెంత మొత్తుకున్నా.. ఈ సారి వాడిని కొంపలోకి  రానిచ్చేది లేదు." జహంగీర్  కోపం తారాస్థాయిని   అందుకొంది. దగ్గు తెర  మాటలను  మింగేసింది.

"అబ్బాజాన్  పానీ." పెద్ద కోడలు ఆసియా  నీళ్ళు ఇచ్చింది.

" బేటీ, నువ్వాన్నా చెప్పు , అస్సలు ఏమిజరిగిందో " కోడల్ని అడిగాడు, ఆమె కూడా  ఓ మిత్రుని కూతురే, చనిపోయిన మిత్రుని  కుటుంబాన్ని  ఆదుకోవాలని  పెద్దకొడుకు  చదువు కున్నవాడైనా  చదువులేని  ఈ పిల్లని  కట్టబెట్టాడు. కానీ తను  కోడలన్న  సంగతి  ఎప్పుడో మరచిపోయారు  ఆ దంపతులు, కూతురుకంటే  ఎక్కువే అనుకున్నారు,  అదీ ఆమె నడవడిక.

"అబ్బాజాన్ , ఈ సారి లతీఫ్  జాలీనోట్ల  కేసులో  ఇరుక్కున్నాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. మీరు  వెళ్లి అడిగి చూడండి.." మెల్లగా చెప్పింది  ఆసియా.

"ఎన్ని సార్లు  ఇలా...ఛీ.. ఉండనివ్వండి  జైల్లో అయినా ఉంటె బుద్ధి  వస్తుంది." అసహనంగా  అన్నారు  జహంగీ భాషా.
                                                                 ***


ఈ మద్య  కాలంలో  లతీఫ్  లో చాలా మార్పు వచ్చింది జులాయిగా తిరగటం లేదు. ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. పల్లెల నుండి ధాన్యం  కొనుగోలు చేయటం సిటీ లో అమ్మటం  లో చాలా ప్రావీణ్యం   సంపాదించాడు. అప్పుడప్పుడూ సిటీ దాటి  వెళ్ళటం  వారం పది   రోజులకు తిరిగి  రావటం చేస్తున్నాడు,
తను చేస్తున్న వ్యాపారంలో  మంచి రాబడి ఉందనీ , అన్నని కూడా ఆ దిక్కుమాలిన నౌకరీ  వదిలేయమనీ  పోరుపెట్టాడు. తండ్రి  సుగుణాలు  పుణికి పుచ్చుకున్న పెద్ద కొడుకు ససేమిరా  అనేశాడు.


ఇంట్లో  చాలా   వస్తువులు  వచ్చి చేరాయి.  టెలివిజన్, ఫ్రిజ్, ఇంకా రజియా వంటి మీదికి  బంగారూ వగైరా వగైరా.. ఇవన్నీ  ఎక్కడివని తండ్రి అడిగిన ప్రతిసారీ  వ్యాపారంలో  చిన్నకొడుకు  ఎంతగా రాణిస్తున్నాడో.. మురిసిపోతూ చెప్పేది  తల్లి.

ఈ  నేపద్యంలో  రజియా  హోదా పెరగటం  పెద్దకోడలు కేవలం వంటింటికే  పరిమితం కావటం, పెద్దకొడుకు  సంపాదించలేని వెర్రి  వాడిగా  ముద్రపడటం లాంటి విషయాలు   జహంగీర్ బాషాని దాటిపోలేదు.

తన భర్త సంపాదన  ఉమ్మడిగా  ఖర్చు  కావటం భరించలేని రజియా  మెల్లగా  వేరింటి  ఆలోచనా పధకం  అమలుపరచటానికి  ఆయత్తమైంది.

                                                                     ***

పుట్టింటి నుండి వచ్చిన  రజియా  తన తట్టా,బుట్టా సర్దుకోవటం  చూసిన పెద్ద కోడలు మెల్లిగా  వచ్చి పక్కన నిల్చుంది.

"రజియా, నేను విన్నది నిజమేనా..?" సందేహంగా అడిగింది.

"ఏం విన్నావో చెప్తేగా నిజమో కాదో తెలిసేది?"   తల ఎత్తకుండానే  వ్యంగంగా  పలికింది రజియా.

" లతీఫ్   వేరే ఇల్లు చూశాడట కదా.."

"అవును".

"ఎందుకు ఇక్కడ అందరమూ  బాగానే ఉన్నాం కదా.."

 "ఎందుకుండమూ .. ఒక్కడు సంపాదిస్తుంటే ..అందరమూ పడి  తింటుంటే." కటినంగా అన్నది రజియా..

"అలా కాదు  ఇద్దరూ యెంత ఇబ్బంది  పడతారో .." ఆర్దోక్తి లో ఆపేసింది  తోటికోడలి  ముఖం చూసి ఆసియా .

"అయ్యో ఎంత ప్రేమో..అయినా మాకు ఇబ్బంది  ఎందుకూ, ఉంటె మీకు ఉండాలి గానీ.. ఇప్పటివరకూ మా ఆయన కొన్న  అన్ని  వస్తువులకూ అలవాటు పడ్డారు కదా  ఇకముందు ఉండబోవని." చీదరగా ఓ చూపు విసిరి అక్కడి నుండి  వెళ్ళింది రజియా...

ఇంట్లో ఎవరికీ  చెప్పకుండానే  సామాను మొత్తం తీసుకొని వేరు కాపురం వెళ్ళారు  రజియా లతీఫ్లు.


                                                                           ***

అప్పుడప్పుడూ  లతీఫ్  వచ్చి తల్లిని పలకరించి వెళ్ళేవాడు.  సొంత ఇల్లు కొన్నాననీ గృహప్రవేశమనీ  పిలిచి వెళ్ళాడు. తల్లీ వదినా  వెళ్ళారు, వారిని నిర్లక్ష్యం  చేసి  అవమాన పరచి  పంపింది రజియా.. తన దైన  ధోరణిలొ.

అలా మూడేళ్ళు  గడచి పోయింది. లతీఫ్  గురించి అతని సంపాదన గురించి  రకరకాలుగా వింటూనే ఉన్నాడు జహంగీర్.

ఓసారి  స్నేహితుడూ, వియ్యంకుడూ  అయిన  సలీం తో కూడా ఈ విషయమై  చర్చించాడు. తన నిర్ణయం చెప్పాడు.
స్నేహితుని  మానవతా, ఇమాందారీ  తెలిసిన సలీం, ఏమీ చెప్పలేక పోయాడు, కానీ  పిల్లల్ని  మన్నించి దారిలో పెట్టమని,  వీలుంటే తన దగ్గరికే  పిలిపించుకోమనీ.. ప్రాదేయపడ్డాడు.

                                                                               ***

జహంగీర్ బాషా ఇంట్లో  వాతావరణం  నిశ్సబ్దంగా  స్మశాన  వైరాగ్యాన్ని తలపిస్తుంది. అప్పుడప్పుడూ.. లతీఫ్  తల్లి
ఏడుపు, నిస్టూరాలూ  తప్ప ఎలాంటి చప్పుడూ లేదు. పెద్ద కొడుకు  తల్లిని సముదాయించే ప్రయతంలో ఉన్నాడు.

"అమ్మీ... ఏడవకు, ఏదో ఒకటి చేసి  లతీఫ్ ని తీసుకొస్తాను." మెల్లగా అన్నాడు.

" ఇంకేమి తీసుకొస్తావ్ రా  బాబూ.., ఆ బద్మాష్  పోలీసులు, కొడుతున్నారో ఏమో,.. అయినా  ఆ పెద్దమనిషి  చూడు ఏమీ పట్టనట్లు ఎలా కూర్చున్నాడో.." భర్తని చూపిస్తూ  ముక్కు చీదేసింది.

"బెహన్, కొంచం ఆగు, ఇది మామూలు  కేసు కాదు, విదేశీయులకు, తీవ్రవాదులకూ  సహకరించాడని  నమ్ముతున్నారు పోలీసులు," సలీం మెల్లగా చెప్పాడు.

" వాళ్ళు ఎలా అనుకున్నారో తెలీదు గానీ ఈ బడా ఆద్మీ కూడా అదే  నమ్ముతారు.." కోపంగా అసహనంగా  పెద్దగా భర్తని ఉద్దేశించి అరిచింది బార్య సలీమా.

" ఇందులో సందేహం ఎందుకూ, నిజమే కదా, నేను చెప్తూనే ఉన్నాను, వ్యాపారమూ  కాదూ  గాడిద  గుడ్డూ  కాదూ" , కోపంతో అరిచాడు జహంగీర్.

" అయితే ఏంటి చంపు కుంటారా  బిడ్డని.."గట్టిగా  అరిచింది  సలీమా.

"నోర్ముయ్యి, చంపుతారో, సాకుతారొ  అది పోలీసులే చూసుకుంటారు." దేశద్రోహులు నా ఇంట్లో ఉండకూడదని  ముందే చెప్పాను." నిక్కచ్చిగా చెప్పేసాడు జహంగీర్.

"అబ్బాజాన్  మేరె బచ్చేకు  దేఖో.." ఏడుస్తూ తన ఏడాది  బిడ్డని మామగారి ముందు  నిల బెట్టి  మోకాళ్ళ మీద కూర్చుంది రజియా..

 కన్నీటి పొరని చీల్చుకొని  మనవడిని చూసి తల మీద చెయ్యి వేసాడు జహంగీర్.

నీ బిడ్డ భవిషత్తులో  తప్పు చేయకూడదనే నమ్మా  నా బిడ్డని  నేనే పోలీసులకు పట్టించింది అనుకున్నాడు మనస్సులో..

దోస్తు  కళ్ళలో నీళ్ళు చూసి, తనూ మౌనంగా  రోదించాడు సలీం, స్నేహితుని  ఉన్నతమైన దేశ  భక్తికీ, నిగ్రహానికీ  మనస్సులోనే  సలాం చేసాడు.


                                                                           ***
.


Wednesday, 4 September 2013

పక్షులు


పక్షులు

చల్ల గాలి వీస్తుంది, ఆకాశం నల్లగా  మేఘాలతో  నిండి ఉంది.తెల్లవారటానికి  ఇంకా  చాలా 
సమయంఉంది. నేనూ,తమ్ముడూ ముడుచుకొని  మూడంకె  వేసుకొని  పడుకొని  ఉన్నాం.

"అమ్ములూ.".అమ్మ పిలుపు మెల్లగా  చెవి దగ్గరగా  వినిపించింది.
"ఊ .." మత్తుగా  పలికాను.

"లేవండి, నేను వెళ్ళాలి కదా, తమ్ముణ్ణి  కూడా  లేపు". మందలించినట్లుగా  ఉంది అమ్మ స్వరం.
 నేనూ తమ్ముడూ  బలవంతంగా  లేచాము.

ఇద్దరమూ  అమ్మ వడి చేరాము. అమ్మ నన్ను నిల్చోబెట్టి, తమ్ముణ్ణి  వడిలో పెట్టుకొని, వాడి రెండు  చేతులు  కలిపి, మా ఇద్దరి చేతా  ప్రార్దన  చేయించింది. ఇక్కడ  నాకు   నచ్చని  విషయం ఒకటుంది, అదేంటంటే  అమ్మ మున్నియమ్మ  గురించి కూడా  ప్రార్దన  చేయిస్తుంది. ఇష్టం లేకున్నా  అమ్మని నొప్పించటం ఇష్టం లేక  ఆమె చెప్పినట్లే  చేస్తాను రోజు.


నన్నూ తముణ్ణి  అందరూ ముద్దుచేస్తారు, మా బుల్లు బుల్లి రెక్కలూ, ఎర్రటి ముక్కులూ  అంటే అందరికీ ముద్దే.కానీ ఈ  మున్నియమ్మ  మాత్రం మా వంక  కూడా చూడదు.
అబ్బా  మీ సందేహం నాకు అర్దమైన్ది లే  చెప్తాను, మేము  పక్షులం  మున్నియమ్మ ఇంటి ప్రహరీ గోడని ఆనుకున్న వేప చెట్టు మీద మా గూడు.


మున్నియమ్మ పేరేమిటో తెలీదు అందరూ అల్లాగే పిలుస్తారు.ఆ ఇంట్లో ఆమె,ఆమె అత్తగారు  ఓ పండు ముసలి  తప్ప ఎవరూ ఉండరు. ఓ  పనిపిల్లా, ఓ కుక్క (దాని పేరు మోటూ) ఆమె కి తోడుగా ఉంటారు. ఆ మోటూ అంటే మాకు భయం  ఎప్పుడూ  మమ్మల్నే చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా జారి దాని నోట్లో  పడతామేమో అనే భయం నాకు.
                                                                           ***

అమ్మ రోజూ  చాలా దూరం వెళ్లి  మా కోసం  మంచి మంచి  తిండి తెస్తుంది. అలాగే ఆరోజు కూడా వెళ్ళింది.
సాయంకాలం అయింది  వర్షం వచ్చేలా ఉంది. చీకట్లు కమ్ముకున్నాయి. మా అమ్మ రాలేదు, మెల్లగా మొదలైన గాలి వేగాన్నందుకుంది. పక్షులన్నీ గూళ్ళు చేరుకొంటున్నాయి.వర్షం మొదలైంది  అమ్మ ఇంకా రాలేదు.నాకు భయం ఎక్కువైంది. ఆకలికి తమ్ముడు  అరవటం  మొదలెట్టాడు  నేను  అక్క  స్తానం నుండి  అమ్మ  స్తానానికి  మారాను , నా  బుల్లి  రెక్క వాడికి కప్పాను,(వాడికింకా రెక్కలు రాలేదు.) ఇద్దరమూ  తడిచిపోయాము . ఏ క్షణానయినా  గూడు  పడిపోయేలా   ఉంది. కొమ్మలు  విరుగుతున్నాయి. మేము  పుట్టినప్పుడు కట్టిన గూడు, మా నాన్న మమ్ము వదిలి  కొత్త పిట్టతో  వెళ్ళాడు, అమ్మ ఒక్కటే  మా కోసం  కష్టపడుతుంది, ఏంచెయ్యాలి  నేనూ  అమ్మతో ఆహార  సేకరణకి  వెళ్దామంటే  తమ్మున్ని  ఎవరు చూసుకొంటారు చెప్పండీ......రాత్రంతా అమ్మకోసం ఎదురుచూస్తూ   తడిసిన  శరీరాలతో  బిక్కు,బిక్కు,బిక్కుమంటూ  గడిపి ఎప్పుడో  నిద్రలోకి  జారిపోయాను.మున్నియమ్మ మా వంకైనా చూడలేదు. ఈ బాద  నన్ను ఇంకా కుంగదీసింది.


పొద్దున్నే  మోటూ  అరుస్తుంది  ఉలిక్కిపడి   లేచాను.గడపలో ఎక్కడినుండో  ఎగిరివచ్చి పాత పేపర్  పడిఉంది  దాన్నీ  చూస్తూ మోటూ  అరుస్తుంది. ఇంతలో మున్నియమ్మ  తలుపు  తీసుకొని  బైటకి  వచ్చింది. పనిపిల్ల కూడా వచ్చి మున్నియమ్మ పక్కన నిల్చుంది. వాకిట్లో పేపర్ తీసింది పనిపిల్ల  నేను ఒక్క సారిగా షాక్ తిన్నాను. ఎందుకో తెలుసా పేపర్ కింద మా అమ్మ,  విరిగిన రెక్కతో.. నేను గోలగోలగా  ఏడిచాను, మున్నియమ్మ పనిపిల్ల సాయంతో అమ్మకి కట్టు కట్టింది, సపర్యలు చేసింది. అమ్మని  మెత్తటి పాత బట్ట మీద పడుకోబెట్టింది పనిపిల్ల. ఓ మగ మనిషి సహాయంతో  మమ్మల్ని గూటిలో నుండి  తీసి అమ్మ పక్కన పెట్టారు, ఆ తర్వాత మా కోసం  తన ఇంట్లోనే ఓ చేక్కపెట్టేతో  గూడు చేయించి  మమ్ము అందులో ఉంచారు.., ఇప్పుడు మేము చాలా హ్యాపీ గా.. ఉన్నాము. అయితే అమ్మ చెప్పిన మున్నియమ్మ కథ  నన్ను కదిలించింది. అమ్మ ఆమెను దైవంగా  ఎందుకు చూస్తుందో ఇప్పుడు  అర్ధం అయింది.

***
మా అమ్మ చెప్పిన  మున్నియమ్మ  కథ.

మున్ని  తన పదమూడో ఏటనే  కాపురానికొచ్చింది. అత్తామామలె  తన తల్లుదండ్రులు  అనుకొంది , మామగారు రైల్వే లో చిన్న ఉద్యోగి.ఎప్పుడూ అత్తింటి వారి సేవలోనే  గడిచిపోయేది.అలా అత్తింటికే  అంకితం అయిపొయింది భర్త  డబ్బు సంపాదనలో  దుభాయ్  వెళ్ళిపోయాడు. రెండేళ్లకొకసారి  వచ్చేవాడు. ఒకసారి ఇక వెళ్లోద్దని  మొండికి  వేసింది, కనీసం  పుట్టబోయే  బిడ్డకోసమైనా  ఉండిపొమ్మని  బ్రతిమిలాడింది. అలాగైతే  ఇంకా  సంపాదించాలని  వెళ్ళిపోయాడు.  విధి  వక్రించి  బిడ్డ పుట్టక  ముందే...అల్లా దగ్గరికి వెళ్ళాడు. కొంత  కాలానికి  మామగారు   కూడా పోయారు,  ఆయన పెన్షన్  వచ్చేది అత్తగారికి ,ముసలి అత్త   సేవలో బిడ్డని  పెంచుకోవటంలో  రెక్కల కష్టాన్ని  నమ్ముకొన్న  విదవరాలైన  మున్ని,పూటకూళ్ళ  మున్నియమ్మగా  మారిపోయింది.


బిడ్డ పేరు   షరీఫ్  అని పెట్టుకుంది, షరీఫ్ కి  చదువు  అబ్బింది, అతని  చదువు  కోసం  రాత్రీ పగలూ  కస్టపడి పని చేసేది. ఎక్కడ  కోచింగ్  అవసరం  అయినా పంపేది. తన  అరిచేతులనే  సోపానాలుగా  చేసి ఒక్కోమేట్టే ఎక్కించింది  షరీఫ్ ని.


షరీఫ్ మొదటిసారిగా  అమెరికా  వెళతానంటే , విపరీతంగా భయపడింది  , బిడ్డ కూడా  దూరం  అవుతాడేమో అని, కానీ  అలాంటిదేమీ  ఉండదులే  అనుకోని  గుండె దిటవు  చేసుకొని, పంపింది.

అయితే  ఆ గుండెపై  మరోమారు  వేటు  పడింది    కోడలు రూపంలో ..

షరీఫ్ కి   తానంటే  చాలా ఇష్టం   ఆవిషయం  తనకు  తెలుసు, తప్పకుండా  తనవెంట  తీసుకొని వెళ్తానంటాడు, కానీ  తాను ఈ ఇంటిని వదిలి  వెళ్ళ గలదా..? ఇలా ఆలోచిస్తున్న  మున్నియమ్మను  ఆ ఇంటికె  వదిలి  షరీఫ్  భార్యతో కలసి  వెళ్ళాడు.(కొంత  తల్లి వియోగం నటిస్తూనే)

                                                                       ***
ప్రతి రంజాన్ కి   అత్తగారింటికి  వచ్చి  వెళ్ళేటప్పుడు ఆకరి  రెండురోజులూ  తప్ప్పని  సరిగా  వచ్చి (భార్య లేకుండా) అమ్మ  చేతి  షీర్ కోర్మా (పాయసం) తాగి  వెళ్ళేవాడు. నానమ్మ సణుగుడు  విసుగు అనిపించేది.


"బేటా  దులహన్  రాలేదా?"  కళ్ళకి చేతులు అడ్డుపెట్టుకొని అడిగేది.

"లేదు , తను ఇక్కడెలా ఉండగలదూ ?' కొంచం  మెల్లగా అనేవాడు.

" ఏం " రెట్టించేది .

"అత్తమ్మా నువ్వూరుకో "  మందలించేది  మున్నియమ్మ.

"ఏరా, మీ అమ్మ ముఖం కూడా మొట్టుతుందా నీకు?"  మళ్ళీ  అడిగేది  పెద్దావిడ.


"అబ్బా,, అమ్మీ  దాది  నోరుమూయించు,  విసుక్కుని లేచి బైటకి వెళ్ళేవాడు. షరీఫ్.అలా  వెళ్లి బైట నుండే ఫోన్ చేసేవాడు  తన ప్రయాణం  కరారు అయిందనీ. ఈ సారి వచ్చినప్పుడు  ఎక్కువరోజులు ఉంటాననీ..


మున్నియమ్మ  తనకు చేతనైన వంట పని చేసి బతుకుతుంది. అది అవమానంగా భావించిన  వియ్యంకులు మాత్రం ఎప్పుడూ రారు.


ఓ రోజు  మున్నియమ్మ వడియాలు  ఎండబెట్టుకొంటుంది, అప్పుడే  అటుగా ఎగురుకుంటూ  వచ్చిన మా అమ్మ  కరంటు తీగలకు  చిక్కుకున్న గాలిపటం  దారానికి చిక్కుకొని  రెక్కలు టప ,టప  లాడిస్తూ  విలవిల లాడింది. అది చూసిన మున్నియమ్మ, పిట్ట గొడమీదినుండి  ముందుకొంగి  చిక్కు విప్పుతూ  ముందుకు తూలీ  కరంట్  తీగలపై పడి  కళ్ళు పోగొట్టుకుంది. ఆరోజు  ముసలి అత్తగారు  పడ్డ వేదన అంతా  ఇంతా  కాదు. ఆ అమెరికా ఎటుందో తెలీని ఆ తల్లి  కొడుకు కోసం పెట్టిన శోకం గానీ, మనవడి  తో బాధని చెప్పుకోవాలనుకున్న  నాయనమ్మ  వేదనగానీ కోడలి తరపు వారిని  కరిగించలేదు. దిక్కో, మొక్కూ  లేని ఆ ఇద్దరు విదవరాళ్ళు, గరీబీ తల్లుల రోదన అరణ్యరోదనే అయింది. ఎలాగో ఇరుగు,పొరుగు హాస్పిటల్ లో చేర్చారు.  మొత్తం మీదికి  షరీఫ్ రానే వచ్చాడు.


కొడుకూ, కోడలూ వచ్చారు,కళ్ళు పోగొట్టుకున్న  మున్నియమ్మని  పరామర్శించారు. ఆమెని  తీసుకెళ్ళమని  కళ్ళులేని ఆమె  బ్రతకటం  కష్టమనీ ముసలి అత్తగారు  వేడుకొంది  తనకి పెన్షన్  వస్తుంది కనుక  ఎలాగో బతకతానని   బ్రతిమిలాడింది. షరీఫ్ కొంత మెత్తబడ్డాడు.కానీ  షరీఫ్  అత్తగారు,మామగారూ  షరీఫ్ ని   దూరంగా తీసుకెళ్ళి  హితబోద   చేసారు.  దేశం  కాని దేశంలో  ఆమెతో  తమ బిడ్డ తిప్పలు పడలేదనీ.. ఇక్కడే పని పిల్లని పెడితే  ఆ పిల్ల  సహాయంతో  హాయిగా ఉంటుందనీ, తాము  అప్పుడప్పుడూ  వచ్చి చూసి వెళ్తున్తామనీ.. చెప్పి ఒప్పించారు.


అక్షరాలా పాటించిన  షరీఫ్  అంతర్దానమయ్యాడు. చెప్పినట్లే కొన్నాళ్ళు  డబ్బులు పంపాడు.  రాను,రానూ ఫోన్ లో మాట్లాడటం  కూడా తగ్గించేసాడు

                                                                   ***
పక్షులు  రెక్కలోస్తూనే  ఎగిరిపోతాయి, అని చెప్పుకొనే ఈ  మనుషులు  రెక్కలు  తెగిన తల్లి పక్షుల్ని  వదిలి ఎక్కడికి  పోతున్నారో  నా చిన్ని  బుర్రకి అర్ధం కాదు.


మా కోసం కంటి చూపు  పోగొట్టుకున్న.. మున్నియమ్మ  ని అర్ధం చేసుకోలేక  ఇన్నాళ్ళూ  గుడ్డిదాన్నిగా ఆమెని  అపార్దం  చేసుకున్నాను.ఇప్పుడు  అమ్మ చెప్పకుండానే నేనే ఆమె కోసం ప్రార్దన  చేస్తాను.  మేమంతా ప్రతి ఉదయం  ఇలాంటి అమ్మలకోసమే  ప్రార్దన (కిలకిలా రావాలు)   చేస్తూనే ఉంటాము. తన గూటి చుట్టూ  గువ్వల తోడుంచుకున్న  మున్నియమ్మే  మా  అమ్మలకి  అమ్మ.Sunday, 1 September 2013

ఏమి చేయను


ఏమి చేయను


కంటి నిండా చూసుకుందామంటే

మబ్బుతునకవై సాగిపోయావు.


మనస్సు నిండా నింపుకుందామంటే,

వెన్నెల తునకవై జారిపోయావు.


పలకరించి పరవశిద్దామంటే,

పవనమై పారిపోతావు.


చిలిపిగా నిను చిత్రిద్దామంటే,

సైకత చిత్రమై చెదరిపోతావు.