Pages

Thursday, 12 September 2013

నిప్పుల స్నానం    నిప్పుల స్నానం 


   ఒళ్ళంతా పచ్చి పుండులా,
   కళ్ళు మండుతున్న చింతనిప్పుల్లా...

   గోటిచివరి నొక్కుడుతో,
   విరిగిపడ్డ విరజాజిలా.

   నత్తనడక జీవనయానంలో
   పల్లేరుకాయల పానుపులా.

   సోమ్మసిల్లె బతుకులో,
   శక్తిని కోల్పోయిన కాయంలా

   శిశిరంలో వివస్త్రమైన మోడులా,
   నీరు దొరకని ఎడారిలా.

   గీరుకున్న గాజుల గాయాలతో,
   కాలికింద నలిగిన మల్లెయలా

   చుట్టుకున్న జ్ఞాపకాల పరంపరలో,
   చిట్లిన పెదవి చివరినవ్వులా.

   కుళ్ళిన శవపు సంస్కారంలో
   కళ్ళనుండి జారని అశ్రువులా.

   గుచ్చుకునే తలపుల ముళ్ళ మద్యలో,
   విచుకున్న సుకుమార కుసుమంలా.

   నిట్టూర్పుల మద్య నిప్పుల స్నానంలో
   మృగతృష్ణకు బలైన హరిణిలా,

.


20 comments:

 1. "సోమ్మసిల్లి .... శక్తిని కోల్పోయిన కాయంలా
  చుట్టుకున్న జ్ఞాపకాల .... చిట్లిన పెదవి చివరినవ్వులా.
  గుచ్చుకునే తలపుల ముళ్ళ లో .... విచ్చుకున్న సుకుమార కుసుమంలా."

  నిప్పుల స్నానం .... చెయ్యాల్సొస్తున్నట్లు .... మీ కవిత చదువుతున్నంత సేపూ స్వేదపు మరకలు అంటినట్లు ఏదో ఆవేశం కసి లజ్జ అసహ్యం .... మెరాజ్ జీ మీ కలం మీ మనోభావనల శక్తి అపారం!

  ReplyDelete
  Replies
  1. చంద్ర శేఖర్ గారూ, ప్రతి అక్షరమూ ఓ నిప్పుకణికై దుర్మార్గులను కాల్చివేయగలిగితే బాగుండు అనిపిస్తుంది. మీ ప్రశంసకు ధన్యవాదాలు.

   Delete
 2. మరీ నిప్పులు కురిపిస్తున్నారు.

  ReplyDelete
  Replies
  1. నిజమే సర్, పన్నీటి జల్లులే గుర్తురావటం లేదు.

   Delete
 3. వాడిగా వేడిగా ఉంది మీ కవిత

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ప్రేరణ గారు.

   Delete
 4. మీ నిప్పుల స్నానం చదివిన తర్వాత , నాలో ఆలోచన ఆరంభమైంది . ఆడవాళ్ళే నిప్పుల స్నానం దేనికి చేస్తున్నారు అని ?
  ఆడవాళ్ళకు సహజంగా నీళ్ళాడటమంటే బహు యిష్టం కదా ! దానిని ఆసరాగా తీసుకున్న మగవాళ్ళు నిప్పుల స్నానం వాళ్ళ చేత చేయిస్తున్నారు అని అర్ధమైంది .
  ఎంత మగవాళ్ళు మీకు అలవాటే కదా అడుగడుగుకి స్నానం చేయటం , ఈ స్నానమూ చేయండి అని బలవంతం చేసినా చేయించకండి . ఆ స్నానం ఆఖరున అందరూ చేయాల్సినదే , ఏ ఒక్కరూ తప్పించుకొనలేనిది .
  నిట్టూర్పుల మద్య నిప్పుల స్నానంలో
  మగతృష్ణకు బలైన (హరిణిలా) నిర్భయలా ,

  ReplyDelete
  Replies
  1. శర్మ గారూ, ప్రతి దుర్మార్గుడి చేతా నిర్భయంగా నిప్పుల స్నానం చేయించే కాలం రావాలి. అదే కోరుకుందాం.

   Delete
 5. నిప్పుల స్నానంలో నిలువెల్ల దహింకు పోయే అభాగ్యులపై
  ఓదార్పు పన్నీటి జల్లు కురిసే ప్రయత్నం.

  ReplyDelete
  Replies
  1. రాజారావ్ గారూ, ఓదార్పు తప్ప మార్పు తీసుకు రాలేని అతి సామాన్యులం మనం. సమాజమ్లో మార్పు వచ్హేలొగా ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయో..

   Delete
 6. జీవితం నల్లేరు మీద బండిలా నడవదని,
  పల్లేరు పానుపులా ఉంటుందనీ
  తెలిసే సమయానికి, ఆశలు ఆవిరై
  జీవితం మోడులా మిగిలిపోతే
  ఎవరిని నిందించాలో తెలియక
  ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు,
  చెప్పాలనుకున్నదేదో
  గొంతులో అడ్డంపడ్డట్లు అనిపిస్తోంది!

  ReplyDelete
  Replies
  1. సర్, జీవితం ఇలా ఉంటుందీ... అని తెలియటానికి కొన్ని జీవితాల అనుభవాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి, కానీ.. అడుగు తడబడితే, జీవితం తిరగబడుతుంది. మీరన్నది నిజమే చెప్పాలనుకున్నది గొంతులో అడ్డుకుంటుంది. సరిగా చెప్పలేకపోతున్నాను.

   Delete
 7. అడ్డం పడేది నా గొంతులో. మీ అంత బాగా చెప్పలేనే అంటున్నా. చాలా బాగా వ్యక్తీకరించారు కవితలో
  ఎందరివో వ్యథలను.

  ReplyDelete
  Replies
  1. సర్, నేను చెప్పాలనుకున్నది సరిగా అక్షరీకరిస్తున్నాను అని మీరు అంటున్నారు అంతకంటే ఇంకేమి ప్రశంస కావాలి. ధన్యవాదాలు.

   Delete
 8. వేదనాభరితమైన సబ్జెక్ట్ తో వాడి బాణాలు విసిరారు. బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంసకు ధన్యవాదాలు పద్మగారు.

   Delete
 9. గుచ్చుకునే తలపుల ముళ్ళ మద్యలో,
  విచుకున్న సుకుమార కుసుమంలా.

  నిట్టూర్పుల మద్య నిప్పుల స్నానంలో
  మృగతృష్ణకు బలైన హరిణిలా,
  కామా వుంటే చివరిగా ఇంకా చెప్తారనుకున్నా.. గాయపడ్డ హృదయాన్ని ఆవిష్కరించారు. అభినందనలతో..

  ReplyDelete
  Replies
  1. వర్మ గారూ, మీ గ్రహింపుకు అభినందనలు, నిజమే కామా(,) పెట్టాను ఎందుకో తెలుసా ఈ వేదనకు ముగింపు లేదు. ఇంకా ఎన్నో అక్షరీకరించలేని బాదలు. మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 10. వేదన కలిగించారు మీ వాడి వేడి పదాలతో.... మనస్సు చాలా బరువెక్కింది ....

  ఏదో తెలియని ఆవేదన ఈ కవిత చదివిన తరవాత. త్రివిక్రం శ్రీనివాసు గారి మాటలు జ్ఞప్తికి వచ్చాయి "ఒక మనిషిని కదిలించ గలిగే శక్తీ సాహిత్యానికి మాత్రమె ఉంది " అని. మీ ఈ రచన స్థాయి చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. నా కవిత మిమ్ము ఆలోచింప చేయటం మీకున్న సున్నిత మనస్సుకు తార్కాణం. ధన్యవాదాలు మీ ప్రశంసకు సాగర్ గారు.

   Delete