Pages

Wednesday, 4 September 2013

పక్షులు


పక్షులు

చల్ల గాలి వీస్తుంది, ఆకాశం నల్లగా  మేఘాలతో  నిండి ఉంది.తెల్లవారటానికి  ఇంకా  చాలా 
సమయంఉంది. నేనూ,తమ్ముడూ ముడుచుకొని  మూడంకె  వేసుకొని  పడుకొని  ఉన్నాం.

"అమ్ములూ.".అమ్మ పిలుపు మెల్లగా  చెవి దగ్గరగా  వినిపించింది.
"ఊ .." మత్తుగా  పలికాను.

"లేవండి, నేను వెళ్ళాలి కదా, తమ్ముణ్ణి  కూడా  లేపు". మందలించినట్లుగా  ఉంది అమ్మ స్వరం.
 నేనూ తమ్ముడూ  బలవంతంగా  లేచాము.

ఇద్దరమూ  అమ్మ వడి చేరాము. అమ్మ నన్ను నిల్చోబెట్టి, తమ్ముణ్ణి  వడిలో పెట్టుకొని, వాడి రెండు  చేతులు  కలిపి, మా ఇద్దరి చేతా  ప్రార్దన  చేయించింది. ఇక్కడ  నాకు   నచ్చని  విషయం ఒకటుంది, అదేంటంటే  అమ్మ మున్నియమ్మ  గురించి కూడా  ప్రార్దన  చేయిస్తుంది. ఇష్టం లేకున్నా  అమ్మని నొప్పించటం ఇష్టం లేక  ఆమె చెప్పినట్లే  చేస్తాను రోజు.


నన్నూ తముణ్ణి  అందరూ ముద్దుచేస్తారు, మా బుల్లు బుల్లి రెక్కలూ, ఎర్రటి ముక్కులూ  అంటే అందరికీ ముద్దే.కానీ ఈ  మున్నియమ్మ  మాత్రం మా వంక  కూడా చూడదు.
అబ్బా  మీ సందేహం నాకు అర్దమైన్ది లే  చెప్తాను, మేము  పక్షులం  మున్నియమ్మ ఇంటి ప్రహరీ గోడని ఆనుకున్న వేప చెట్టు మీద మా గూడు.


మున్నియమ్మ పేరేమిటో తెలీదు అందరూ అల్లాగే పిలుస్తారు.ఆ ఇంట్లో ఆమె,ఆమె అత్తగారు  ఓ పండు ముసలి  తప్ప ఎవరూ ఉండరు. ఓ  పనిపిల్లా, ఓ కుక్క (దాని పేరు మోటూ) ఆమె కి తోడుగా ఉంటారు. ఆ మోటూ అంటే మాకు భయం  ఎప్పుడూ  మమ్మల్నే చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా జారి దాని నోట్లో  పడతామేమో అనే భయం నాకు.
                                                                           ***

అమ్మ రోజూ  చాలా దూరం వెళ్లి  మా కోసం  మంచి మంచి  తిండి తెస్తుంది. అలాగే ఆరోజు కూడా వెళ్ళింది.
సాయంకాలం అయింది  వర్షం వచ్చేలా ఉంది. చీకట్లు కమ్ముకున్నాయి. మా అమ్మ రాలేదు, మెల్లగా మొదలైన గాలి వేగాన్నందుకుంది. పక్షులన్నీ గూళ్ళు చేరుకొంటున్నాయి.వర్షం మొదలైంది  అమ్మ ఇంకా రాలేదు.నాకు భయం ఎక్కువైంది. ఆకలికి తమ్ముడు  అరవటం  మొదలెట్టాడు  నేను  అక్క  స్తానం నుండి  అమ్మ  స్తానానికి  మారాను , నా  బుల్లి  రెక్క వాడికి కప్పాను,(వాడికింకా రెక్కలు రాలేదు.) ఇద్దరమూ  తడిచిపోయాము . ఏ క్షణానయినా  గూడు  పడిపోయేలా   ఉంది. కొమ్మలు  విరుగుతున్నాయి. మేము  పుట్టినప్పుడు కట్టిన గూడు, మా నాన్న మమ్ము వదిలి  కొత్త పిట్టతో  వెళ్ళాడు, అమ్మ ఒక్కటే  మా కోసం  కష్టపడుతుంది, ఏంచెయ్యాలి  నేనూ  అమ్మతో ఆహార  సేకరణకి  వెళ్దామంటే  తమ్మున్ని  ఎవరు చూసుకొంటారు చెప్పండీ......రాత్రంతా అమ్మకోసం ఎదురుచూస్తూ   తడిసిన  శరీరాలతో  బిక్కు,బిక్కు,బిక్కుమంటూ  గడిపి ఎప్పుడో  నిద్రలోకి  జారిపోయాను.మున్నియమ్మ మా వంకైనా చూడలేదు. ఈ బాద  నన్ను ఇంకా కుంగదీసింది.


పొద్దున్నే  మోటూ  అరుస్తుంది  ఉలిక్కిపడి   లేచాను.గడపలో ఎక్కడినుండో  ఎగిరివచ్చి పాత పేపర్  పడిఉంది  దాన్నీ  చూస్తూ మోటూ  అరుస్తుంది. ఇంతలో మున్నియమ్మ  తలుపు  తీసుకొని  బైటకి  వచ్చింది. పనిపిల్ల కూడా వచ్చి మున్నియమ్మ పక్కన నిల్చుంది. వాకిట్లో పేపర్ తీసింది పనిపిల్ల  నేను ఒక్క సారిగా షాక్ తిన్నాను. ఎందుకో తెలుసా పేపర్ కింద మా అమ్మ,  విరిగిన రెక్కతో.. నేను గోలగోలగా  ఏడిచాను, మున్నియమ్మ పనిపిల్ల సాయంతో అమ్మకి కట్టు కట్టింది, సపర్యలు చేసింది. అమ్మని  మెత్తటి పాత బట్ట మీద పడుకోబెట్టింది పనిపిల్ల. ఓ మగ మనిషి సహాయంతో  మమ్మల్ని గూటిలో నుండి  తీసి అమ్మ పక్కన పెట్టారు, ఆ తర్వాత మా కోసం  తన ఇంట్లోనే ఓ చేక్కపెట్టేతో  గూడు చేయించి  మమ్ము అందులో ఉంచారు.., ఇప్పుడు మేము చాలా హ్యాపీ గా.. ఉన్నాము. అయితే అమ్మ చెప్పిన మున్నియమ్మ కథ  నన్ను కదిలించింది. అమ్మ ఆమెను దైవంగా  ఎందుకు చూస్తుందో ఇప్పుడు  అర్ధం అయింది.

***
మా అమ్మ చెప్పిన  మున్నియమ్మ  కథ.

మున్ని  తన పదమూడో ఏటనే  కాపురానికొచ్చింది. అత్తామామలె  తన తల్లుదండ్రులు  అనుకొంది , మామగారు రైల్వే లో చిన్న ఉద్యోగి.ఎప్పుడూ అత్తింటి వారి సేవలోనే  గడిచిపోయేది.అలా అత్తింటికే  అంకితం అయిపొయింది భర్త  డబ్బు సంపాదనలో  దుభాయ్  వెళ్ళిపోయాడు. రెండేళ్లకొకసారి  వచ్చేవాడు. ఒకసారి ఇక వెళ్లోద్దని  మొండికి  వేసింది, కనీసం  పుట్టబోయే  బిడ్డకోసమైనా  ఉండిపొమ్మని  బ్రతిమిలాడింది. అలాగైతే  ఇంకా  సంపాదించాలని  వెళ్ళిపోయాడు.  విధి  వక్రించి  బిడ్డ పుట్టక  ముందే...అల్లా దగ్గరికి వెళ్ళాడు. కొంత  కాలానికి  మామగారు   కూడా పోయారు,  ఆయన పెన్షన్  వచ్చేది అత్తగారికి ,ముసలి అత్త   సేవలో బిడ్డని  పెంచుకోవటంలో  రెక్కల కష్టాన్ని  నమ్ముకొన్న  విదవరాలైన  మున్ని,పూటకూళ్ళ  మున్నియమ్మగా  మారిపోయింది.


బిడ్డ పేరు   షరీఫ్  అని పెట్టుకుంది, షరీఫ్ కి  చదువు  అబ్బింది, అతని  చదువు  కోసం  రాత్రీ పగలూ  కస్టపడి పని చేసేది. ఎక్కడ  కోచింగ్  అవసరం  అయినా పంపేది. తన  అరిచేతులనే  సోపానాలుగా  చేసి ఒక్కోమేట్టే ఎక్కించింది  షరీఫ్ ని.


షరీఫ్ మొదటిసారిగా  అమెరికా  వెళతానంటే , విపరీతంగా భయపడింది  , బిడ్డ కూడా  దూరం  అవుతాడేమో అని, కానీ  అలాంటిదేమీ  ఉండదులే  అనుకోని  గుండె దిటవు  చేసుకొని, పంపింది.

అయితే  ఆ గుండెపై  మరోమారు  వేటు  పడింది    కోడలు రూపంలో ..

షరీఫ్ కి   తానంటే  చాలా ఇష్టం   ఆవిషయం  తనకు  తెలుసు, తప్పకుండా  తనవెంట  తీసుకొని వెళ్తానంటాడు, కానీ  తాను ఈ ఇంటిని వదిలి  వెళ్ళ గలదా..? ఇలా ఆలోచిస్తున్న  మున్నియమ్మను  ఆ ఇంటికె  వదిలి  షరీఫ్  భార్యతో కలసి  వెళ్ళాడు.(కొంత  తల్లి వియోగం నటిస్తూనే)

                                                                       ***
ప్రతి రంజాన్ కి   అత్తగారింటికి  వచ్చి  వెళ్ళేటప్పుడు ఆకరి  రెండురోజులూ  తప్ప్పని  సరిగా  వచ్చి (భార్య లేకుండా) అమ్మ  చేతి  షీర్ కోర్మా (పాయసం) తాగి  వెళ్ళేవాడు. నానమ్మ సణుగుడు  విసుగు అనిపించేది.


"బేటా  దులహన్  రాలేదా?"  కళ్ళకి చేతులు అడ్డుపెట్టుకొని అడిగేది.

"లేదు , తను ఇక్కడెలా ఉండగలదూ ?' కొంచం  మెల్లగా అనేవాడు.

" ఏం " రెట్టించేది .

"అత్తమ్మా నువ్వూరుకో "  మందలించేది  మున్నియమ్మ.

"ఏరా, మీ అమ్మ ముఖం కూడా మొట్టుతుందా నీకు?"  మళ్ళీ  అడిగేది  పెద్దావిడ.


"అబ్బా,, అమ్మీ  దాది  నోరుమూయించు,  విసుక్కుని లేచి బైటకి వెళ్ళేవాడు. షరీఫ్.అలా  వెళ్లి బైట నుండే ఫోన్ చేసేవాడు  తన ప్రయాణం  కరారు అయిందనీ. ఈ సారి వచ్చినప్పుడు  ఎక్కువరోజులు ఉంటాననీ..


మున్నియమ్మ  తనకు చేతనైన వంట పని చేసి బతుకుతుంది. అది అవమానంగా భావించిన  వియ్యంకులు మాత్రం ఎప్పుడూ రారు.


ఓ రోజు  మున్నియమ్మ వడియాలు  ఎండబెట్టుకొంటుంది, అప్పుడే  అటుగా ఎగురుకుంటూ  వచ్చిన మా అమ్మ  కరంటు తీగలకు  చిక్కుకున్న గాలిపటం  దారానికి చిక్కుకొని  రెక్కలు టప ,టప  లాడిస్తూ  విలవిల లాడింది. అది చూసిన మున్నియమ్మ, పిట్ట గొడమీదినుండి  ముందుకొంగి  చిక్కు విప్పుతూ  ముందుకు తూలీ  కరంట్  తీగలపై పడి  కళ్ళు పోగొట్టుకుంది. ఆరోజు  ముసలి అత్తగారు  పడ్డ వేదన అంతా  ఇంతా  కాదు. ఆ అమెరికా ఎటుందో తెలీని ఆ తల్లి  కొడుకు కోసం పెట్టిన శోకం గానీ, మనవడి  తో బాధని చెప్పుకోవాలనుకున్న  నాయనమ్మ  వేదనగానీ కోడలి తరపు వారిని  కరిగించలేదు. దిక్కో, మొక్కూ  లేని ఆ ఇద్దరు విదవరాళ్ళు, గరీబీ తల్లుల రోదన అరణ్యరోదనే అయింది. ఎలాగో ఇరుగు,పొరుగు హాస్పిటల్ లో చేర్చారు.  మొత్తం మీదికి  షరీఫ్ రానే వచ్చాడు.


కొడుకూ, కోడలూ వచ్చారు,కళ్ళు పోగొట్టుకున్న  మున్నియమ్మని  పరామర్శించారు. ఆమెని  తీసుకెళ్ళమని  కళ్ళులేని ఆమె  బ్రతకటం  కష్టమనీ ముసలి అత్తగారు  వేడుకొంది  తనకి పెన్షన్  వస్తుంది కనుక  ఎలాగో బతకతానని   బ్రతిమిలాడింది. షరీఫ్ కొంత మెత్తబడ్డాడు.కానీ  షరీఫ్  అత్తగారు,మామగారూ  షరీఫ్ ని   దూరంగా తీసుకెళ్ళి  హితబోద   చేసారు.  దేశం  కాని దేశంలో  ఆమెతో  తమ బిడ్డ తిప్పలు పడలేదనీ.. ఇక్కడే పని పిల్లని పెడితే  ఆ పిల్ల  సహాయంతో  హాయిగా ఉంటుందనీ, తాము  అప్పుడప్పుడూ  వచ్చి చూసి వెళ్తున్తామనీ.. చెప్పి ఒప్పించారు.


అక్షరాలా పాటించిన  షరీఫ్  అంతర్దానమయ్యాడు. చెప్పినట్లే కొన్నాళ్ళు  డబ్బులు పంపాడు.  రాను,రానూ ఫోన్ లో మాట్లాడటం  కూడా తగ్గించేసాడు

                                                                   ***
పక్షులు  రెక్కలోస్తూనే  ఎగిరిపోతాయి, అని చెప్పుకొనే ఈ  మనుషులు  రెక్కలు  తెగిన తల్లి పక్షుల్ని  వదిలి ఎక్కడికి  పోతున్నారో  నా చిన్ని  బుర్రకి అర్ధం కాదు.


మా కోసం కంటి చూపు  పోగొట్టుకున్న.. మున్నియమ్మ  ని అర్ధం చేసుకోలేక  ఇన్నాళ్ళూ  గుడ్డిదాన్నిగా ఆమెని  అపార్దం  చేసుకున్నాను.ఇప్పుడు  అమ్మ చెప్పకుండానే నేనే ఆమె కోసం ప్రార్దన  చేస్తాను.  మేమంతా ప్రతి ఉదయం  ఇలాంటి అమ్మలకోసమే  ప్రార్దన (కిలకిలా రావాలు)   చేస్తూనే ఉంటాము. తన గూటి చుట్టూ  గువ్వల తోడుంచుకున్న  మున్నియమ్మే  మా  అమ్మలకి  అమ్మ.15 comments:

 1. అంతర్లీనంగా మానవ మనస్తత్వాన్ని,స్వార్ధాన్నీ బాగా చిత్రీకరించారు. బహుశః నిజ చరిత్రే కావచ్చు. గుండె పిండేసింది.

  ReplyDelete
  Replies
  1. సర్, నిజమే ఇలాంటి నిజ చరిత్రలెన్నో.... మీకు నచ్హటం సంతోషం. మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 2. నిత్యం మన కళ్ళముందు కనపడ్తున్న పాత్రలు మున్నియమ్మ ,భర్త , అత్తమ్మ , షరీఫ్ , షరీఫ్ భార్య , అతని అత్త మామలు .

  ఆ పాత్రలను పక్షుల ద్వారా కధ నడపటం చాలా బాగుంది . పక్షులకు స్వతహాగా , అందరికీ అగపడ్తూ రెక్కలుంటాయి , రెక్కలొస్తాయి . ఆ రెక్కలకు ఓ లెక్క గూడా వుందని , అది ప్రకృతి ధర్మమని ఎంతమందికి తెలుసు ? అటువంటి పక్షులు కూడా యిలాంటి మనుషులను చూసి ఎంతగా విల్విలల్లాడి పోతున్నాయో కధను నడిపించిన తీరు బాగుంది . కొద్ది కాలం మనుగడ సాగించే పక్షులకున్న ఇంగిత జ్ఞానం ఈ మానవులకు లేకుండా పోయిందే అని నేనూ బాధపడ్తున్నా ఆ పక్షులతో సమానంగా .

  ReplyDelete
  Replies
  1. శర్మ గారూ, మనం పశుపక్ష్యాదులకు ఎప్పుడూ సరికాదు, వాటి జీవితాలకు విశిష్ట లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా స్వార్దం అనే రోగం వాటికుండదు. కథను ఓపిగ్గా చదివిన మీకు నా ధన్యవాదాలు.

   Delete
 3. వడి = speed (in telugu)

  ReplyDelete
 4. వడి = speed. you should have written it as oDi which means lap. Please pay more attention to words.

  ReplyDelete
  Replies
  1. మీకు నా బ్లాగ్ కి స్వాగతం. మీరన్నది నిజమే నేను " ఒడి " కి బదలుగా "వడి " వాడాను సవరణకు ధన్యవాదాలు.

   Delete
 5. ఎంత చక్కని కథ ..మేరాజ్ . చెప్పడంలో ఎంత నవ్యత . నాకు బాగా నచ్చింది . ఇది వాకిలి లో వచ్చిన కథ కదూ ! రెక్కలు వస్తే పక్షులు ఎగిరిపోతాయి.పిల్లలు ఎగిరిపోతారు. మునియమ్మాలో కరుణ,ప్రేమ మాత్రం అలాగే ఉండాలి .
  మేరాజ్ ..మీరు ఇంకా ఇంకా కథలు వ్రాయాలి .అలాగే మీకు పరిచితమై ఉన్న లలితా గీతాలు కూడా పరిచయం చేయాలి.
  ఎలా ఉన్నారు? ఇంతకన్నా ఏమడుగగలను? నెచ్చేలినిక్కడ.
  keep writing.

  ReplyDelete
  Replies
  1. వనజా.., నేను బాగున్నాను , నేను కథలు రాయటానికి ప్రేరణ మీరే. నువ్వు బాగా రాస్తావ్ మెరాజ్ అని చెప్పి నా చేత రాయించారు. మీ అభిమానం ఉంటే ఇంకా రాస్తాను. ధన్యవాదాలు మరోమారు.

   Delete
 6. గుండెను పిండేసే కథా..మన కల్లముందే నిత్యం జరుగుతున్న కథ...మీరు పక్షుల ద్వారా వివరించిన విధానం బాగుంది..హ్మ్ పక్షులకు ఉన్న జ్ఞానం మనకు ఉంటే బాగుండు..

  ReplyDelete
  Replies
  1. దేవిడ్ గారూ, మెచ్చిన మీకు ధన్యవాదాలు. మనం పక్షులంతటి మంచివారం కాదండీ.

   Delete
 7. అమ్మ లేనప్పుడు అక్క అమ్మ లా మారడం, అలాగే .... భార్య, అత్తమామల మనోభీష్టాలకు అణుగుణంగా నడుచుకోవడానికి కొడుకు కన్నతల్లికి కూడా దూరంగా జరిగిపోవడం, అయినా అతని క్షేమాన్ని ఆనందాన్నే కోరుకునే శపించని ఆ అమ్మ మనస్సు,
  మనిషి కి మాత్రమే ఉన్న అదృష్టం మెరాజ్!
  మనుషుల్లో .... అన్నీ పోగొట్టుకునీ అన్నీ ఉన్నట్లు ఆత్మ సంతృప్తి చెందే మాతృమూర్తుల్నీ చూడగలము. అన్నీ ఉండీ ఏమీ లేనట్లు అసంతృప్తి చెందే మందరలనూ చూడగలం. కథ చదువుతున్నంత సేపూ కళ్ళముందు ఎన్నో మధ్యతరగతి కుటుంబాలె కనిపించాయి. కళ్ళుకోల్పోయి రెక్కలిరిగి....న మాతృమూర్తులు, రెక్కలొచ్చి ఎగురి పోతున్న విచక్షణతని పరిచయం చేసిన తీరు బాగుంది. అలా పరిచయం చేస్తూ పాటకుల్లో ఒక మంచి ఆలోచనకు కారణం కావాలనే ప్రయత్నం విజయవంతంగా చేసావు. అభినందనలు మెరాజ్!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు కథను చదివి మీ అభిప్రాయం రాసినందుకు

   Delete
 8. మీ కథ చాలా, చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. కిషోర్ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

   Delete