Pages

Thursday, 31 October 2013

జారుడు మెట్లు
      జారుడు మెట్లు 

      అధిక దరలు బీదల బుగ్గలు నొక్కి ,
      వలస ఉగ్గ్గుపాలు తాగిస్తున్నాయి. 
      బరువు బతుకులపై 
      కరువు కదం తొక్కుతుంది. 

      రెక్కలొచ్చిన  పిల్లలు 

      తలో దిక్కు తరలి వెళ్ళారు.
      పట్నవాసపు మోజుబతుకులకి 
      ముసలి బంధాలు అడ్డుగా అనిపించాయి. 

      ఓ అవిటి తల్లి ఆకటి పేగు 

      రేషన్ క్యూలో నిలబెట్టింది,
      నడివయస్సు నెట్టుడికి 
      ఉడిగిన వయస్సు  ఓడిపోయి సొమ్మసిల్లింది. 

      కడుపులో ఆకలి పేగులు అరుస్తూ 

      నీరసంతో నిలవలేమని కాళ్ళు మొరాయిస్తూ,
      అచ్చు  కళేబరంలా  అనిపించినా, 
      చేతిలో కార్డ్  ఆమె బతికే ఉందని చెప్తుంది 

      అన్నదాతలా  పోజులిస్తున్న దున్నపోతుకు,

      పొలిదండాలు పెట్టాయి ముసలి చేతులు,
      కనికరించని కలియుగ కర్ణుడు 
      మన్నుతిన్న పాములా ఉండిపోయాడు. 

      మునిమాపు వేళకు ముష్టిగా  వేసిన 

      ముక్కి బియ్యం చిల్లు సంచిలోకి చేరాయి. 
      నేలతాకాల్సిన పాదాలు తేలిపోతున్నాయి. 
      చమటలు పట్టిన శరీరం అదుపు తప్పుతుంది 

      కాలచక్రం నుండి  జారుతున్న ప్రాణాలు,

      కళ్ళముందు అలుముకున్న చీకట్లు,
      ఆకలి తీర్చాల్సిన గుప్పెడు బియ్యం,
      కాకుల ఆకలి తీరుస్తూ  పిండంగా మారింది. 
                   
                       
                            *** 

     


      
      ( ఈ  ముసలి ప్రాణాలే మనల్ని కన్నవి ,
      మనల్ని  దీవిస్తున్నాయి,
      మనకు  స్వేచ్చనిస్తున్నాయి,
      మన కోసం కొస ఊపిరితో  ఎదురుచూస్తున్నాయి,  
      పల్లెనింకా  ప్రాణం తో  ఉంచుతున్నాయి. )    
Wednesday, 30 October 2013

ఏమనీ..వ్రాయను


       

     ఏమనీ..వ్రాయను 


      ఎన్నొరాత్రులు నిదురపోక

      నక్షత్రాలను ఏరికూరి అక్షరాలగా మార్చాను.

      అలవిగాని తలపుల జలపాతాన్నై

      నేలపైకి జారి  వలపుల కవితనైనాను.

      కలల  రేడుని  కన్నంతనే కలవరపడి,

      అలల కవనం లో ఆటు,పోటునై  ఎగసిపడ్డాను.

      ప్రతి పంక్తిలోనూ    పూల పరాగమద్ది,

      ప్రకృతంటే   ఆతనే  అని  చాటిచెప్పాను.

      అమావాస్య వస్తే, అదృశ్యం  అవుతాడనీ,

      ఆమని  వస్తే, పూల వెంట పరుగెడుతాడనీ,
      కలవరపడే మనస్సుకు నచ్చచెప్పాను.

      వెన్నెల దారాలను పట్టుకొని చంద్రుని చేరాలనీ,

      కలల కడలిలో వలపు  నావ ఎక్కాలనీ,
      మతిచెడి నా  స్థానం  మరచాను. 

      నువ్వనుకున్నట్లు  నేను దివిటీని కాననీ,,

      నువ్వు సూటిగా చూడలేని సూర్యుణ్ణనీ...  
      వెక్కిరించి  పక్కున నవ్వావు. 

      సాగరమంత నా  ప్రేమని నీటిచుక్క అనుకున్నావ్ ,

      అమృతమైన నా ప్రేమ హాలాహాలం  అనుకున్నావ్ ,
      నీ మెప్పుకై ఎడారిదాహార్తినై  ఎదురుచూశాను. . 

      చెట్టే  కొమ్మని విరిచేస్తే, గూడె గువ్వని తోలేస్తే, 

      ఆరాదించే  దైవమే  కోవెలమెట్లెక్కొదంటే..,
      తూట్లు  పడ్డ గుండెకు  కుట్లు వేసుకోవటమే  శరణ్యం... 

Tuesday, 29 October 2013

హత్య

    
    హత్య

    ఇక్కడో హత్య జరిగింది,
    బాహటంగా, కొంత బలవంతంగా.

    కానీ,
    పోలీస్ రాలేదూ,కెమెరాలూ క్లిక్ మనలేదూ,
    విలేకరులూ రాలేదూ, వార్తా కాలేదూ,
    తారీకూ లేదూ,తలకొరివీ లేదూ,

    (కానీ నేనో మూగ సాక్షిని,మాటరాని అక్షరాన్ని).

    అత్తగారికి ఆడపిల్ల నచ్చలా.... 
    అందుకే ఆర్డరేసేసింది.
    డాక్టరమ్మగారికీ అది అభ్యంతరం  అనిపించలా..... 
    అందుకే లాగిపారేసింది.
    దాయమ్మా ఫీలవలా....... 
    అందుకే ఊడ్చిపారేసింది.

    సాక్షులెవరూ ముందుకు రాలా,
    అందుకే  కేసు వీగిపోయింది,
    నా అక్షర  కోర్టు  ఆరిపోలా,
    అందుకే ఇద్దరిని  పట్టేసింది.

    (నా కోర్టులో ముద్దాయిలు ,ఒకరు కన్నీళ్ళతో,.ఒకరు కలవరంతో )

    హతురాలిని పరిశీలించాను 
    గుప్పిటి  విడివడలా.... ,
    అప్పుడే అరచేతి రేఖలు మారిపోయాయి.
    మూసిన కళ్ళు తెరుచుకోలా,
    అంతలోనే  లోకమంతా అంధకారమైంది.

    (దోషులు  చెప్పుకొనేది ఏమైనా ఉందా?  అడిగాను  ఇద్దరినీ,)

    తప్పు తమది కాదనీ,
    తమ బిడ్డ లింగ పరీక్షలో దొంగ  అని తేలిందనీ,
    ఆడబిడ్డలకిక్కడ  తావులేదనీ,
    తరాలు మారినా తమ సమాదానం ఇదేననీ...

    (హతురాలి చిట్టిచేతితో  నా కలాన్ని పట్టి రాయించాను)

    వెలుగు చూడాలని తహ,తహ లాడిన నాకు చీకటి ప్రసాదించిన                 అమ్మా,నాన్నలకు 
    నా చివరి రక్తపు బొట్టుతో  రాస్తున్నా,
    అమ్మఒడిలో కమ్మగా పడుకొవాలనీ,
    తీయని జోలపాట వినాలనీ  కలలు కంటున్నప్పుడు
    లింగపరీక్షలో నన్ను దొంగను చేసి,
    అమ్మని నిందించీ, నాన్నని  ఒప్పించీ
    నా ఊపిరి ఆపటానికి అనుమతి పొందారు."
    నా బుడి,బుడి అడుగులు మీ నట్టింట నడయాడుట  దోషమా.?
    చిట్టిదీపమై  ప్రతి  దీపావళీ  మీ ముంగిట  వెలుగుట పాపమా?

Monday, 28 October 2013

ఎలా?

    

    ఎలా?


    ఆవేదనలు చుట్టుముట్టినప్పుడు,  
    ఆలోచనలు ముసురుకుంటాయి,
    వాటివెనుకే పరుగెడితే,
    పట్టుకొని ప్రశ్నిస్తాయి. 

    రక్తాక్షరాలతో 
    లక్ష్యాన్ని లిఖించుకోను  
    కానీ.... ,
    దు:ఖాన్ని ఒంపుకున్న కలం 
    కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. 


    పనికిరాని  పదాలన్నీ కవితలై..,తవికలై.. 
    నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి,
    చైతన్యం నీకు చేతకాదంటే చెప్పు,
    చదువున్నచోట  చక్కబెట్టుకుంటానని  
    అక్షరం వెక్కిరిస్తుంది. 

    నిప్పుకణికల నినాదాలను 
    గుప్పిట బిగించేమిలాబం?
    అర్దం లేని వాదనలు అన్నం పెట్టవని 
    ఆత్మ ఘోషిస్తుంది,

    మదినిండా సమస్యల రణం రాజుకుంటే,
    కలల దుప్పట్లో కాళ్ళు ముడుచుకోలేను,
    జీర్నించుకోలేని  దు:ఖాన్ని మింగిన గుండె,
    పేలిపోవటానికి సిద్ద్దంగా ఉంది.

    ఆక్రమణల ,అణచివేతల వేలం లో ,
    అబలలు నలిగిపోతుంటే,
    కంటితుడుపు సానుబూతిగా కాదు,
    తెగబడే కత్తికమ్మంటుంది మనస్సు.


    జీవన పొరాటంలో తెగిపడుతున్న 
    భాహువులకు  బాసటగా,
    బ్రతకాలని  హెచ్చరిస్తుంది  వివేకం 
    అందుకే  ఈ  చేయూతనివ్వాలనే  ఆరాటం.


    మోడువారిన  బ్రతుకు చిత్రాలకు 
    చిగురుకుంచనవ్వాలనీ,... 
    ఇనుపముక్కుల  విహంగాలనుండి 
    చిట్టిగువ్వలను  రక్షించుకోవాలనీ....  

Saturday, 26 October 2013

అన్వేషి

   


   అన్వేషి 

   రాతిలో ప్రాణాన్ని  వెతికినట్లు 

   నిరక్షరినైన  నాలో  అక్షరాన్ని  అన్వేషిస్తాడు. 

   విషాదాశ్రువునై  జారుతుంటానా...,

   ఓదార్పై  వెన్నుతడతాడు. 

   అన్నీ మరచి సంగడీలతో సరదాగా ఉంటే,

   కన్నెర్రజేసి కర్తవ్యం  బోధిస్తాడు. 

   నా  కలంపాళీ  దు:ఖాన్ని  కక్కుతుంటే..,

   దొసిలొడ్డిన తెల్లకాగితమే అవుతాడు. 

   అక్షర  కడలిలో   మునుగుతుంటే,
   కాగితం పడవై నన్ను తీరం చేరుస్తాడు.

  కమ్మని పాలధారనై  సాగిపోతుంటే,

  సుధామధురమై  అడుగు కలుపుతాడు. 

  తన భావాలతో విభేదించానా,

  అక్షర దోషాన్ని  అంటగడతాడు. 

  ఇంతకీ అతగాడెవరో తెలుసా?

  ఇంకెవరూ.. 
  నాలో అక్షరాగాయాన్ని రేపిన  అభినవ శ్రీనాదుడు. 

  అంతులేని  ఆటుపోట్ల  భావ ప్రకంపనలకు 

  వైద్యం  చేసిన   అక్షరవైద్యుడు  

  ఉజ్వల  ఉషస్సుకై  కాలాన్ని కదపమని 
  ఉసిగొల్పిన  ఉదయుడూ , నా ఉపాద్యాయుడూ ..   

Wednesday, 23 October 2013

హనీకి, హానీ.

    
   హనీకి,   హానీ. 


   కళ్ళు కాయలు  కాచేలా 
   తోటంతా తిరిగాను. 

   ప్రతి  పువ్వునీ  సున్నితంగా  తాకి 
   పలకరించాను. 

   ఆదరించిన కొన్ని విరులు 
   మధువును  విందుగా ఇచ్చాయి. 

   అడ్డుకున్న గండు చీమలు 
   నా కాళ్ళ కండ  పీకాయి. 

   మత్తెక్కిన శరీరంతో  గూడుచేరి 
   మధుపాత్రలన్నీ  మధువుతో  నింపేశాను 
   అలసిన  శరీరాన్ని శయ్యపై 
   చేరవేశాను. 

   ఇంతలో... కలకలం 

   పొగలో,సెగలో...  నా ఇంటిని చుట్టుముట్టాయి. 

   ఆందోళనగా  లేచాను, అన్యాయాన్ని సహించలేక 

   ప్రకృతిచ్చిన  ఆయుధాలతో..  పోరు సాగించాను. 

   శత్రువుపై  పోరు  కాదుగానీ, 
   కాలిన నా రెక్కలు  నన్ను వెక్కిరించాయి. 

   వహ్..,వా..దోచుకోవటములో  నీదే పైచేయి. 

   మదువు తాగి విషం కక్కే  మనిషివి  నీవు. 

   తీపి తప్ప చేదు ఎరుగని  చిన్ని ప్రాణిని  నేను.
Tuesday, 22 October 2013

తెగిపోని నమ్మకం

   


   తెగిపోని నమ్మకం 

   తీరం చేరాలనే  అశతో దొరికిన  చిల్లు పడవలోనే  ,
   అనుభవాల  అలలను తడుముతూ,
   ఆశల శిఖరాలను  వెతుక్కుంటా.   

   అప్పుడప్పుడూ పలకరింపుల పల్లకినెక్కుతూ... , 
   మానసిక వేదనను మరచిపోతూ,
   విధిని నమ్మిన వేదాంతిలా వేదనను  ఉమ్మేస్తా..  

   అంతరపు కొంగుకు కట్టుకున్న నమ్మకమవుతూ,
   అపభ్రంశపు  చీకట్లను  ఆశా దీపంతో  తోలేస్తూ,
   జనం గుండెల్లో  నిలుపుకున్న దివ్వెనవుతా.  

   అట్టడుగు వర్గాలకు అన్నం ముద్దనవుతూ ...,
   సగటు జీవితాలను  సరిదిద్దాలని చూస్తూ.., 
   నెత్తుటి పేజీలో విత్తిన అక్షర అంకురాన్నవుతా .... 

   పరిపూర్ణతను ఆశించిన అనురాగంతో..,
   ముసి,ముసి నవ్వుల మౌనినై  ముందుకు సాగుతూ,
   అద్వితీయమైన అమరత్వాన్ని పొందుతా..  


Monday, 21 October 2013

అశృ వేదన   అశృ వేదన

   ఒక్క అశృవు   వర్షించటానికి

   గుండె చేసుకున్న గాయపు  మేఘాలెన్నో..

   మనస్సు రోదన వినటానికి

   వేదనతో  తెగిపోతున్న నరాలెన్నో,
 
   భ్రమల   బతుకు  సాగించటానికి

   దేహపు  పొరలకింద  చలనాలెన్నో..

   ఘనీభవించిన   కాలాన్ని కరిగించటానికి

   బ్రతుకు  బందీఖానాలోని  ఖైదు  క్షణాలెన్నో.

   యెదలో  మెదిలే  ఊసులను  దాచటానికి,

   పెదవులు  పలకలేని   పదాలెన్నో..

   కళ్ళముందే  కలల నావ సాగిపోతుంటే,

   దీర్ఘ వియోగాన్ని  మోసే  క్షణాలెన్నో...

   అన్వేషిస్తున్న అడుగుజాడలు కనబడకుంటే..

   కలత నిద్రలో ఉలిక్కిపడిన గడియలెన్నో  ...

   కడుపున  దాచుకోని  కడలి వెడలగోడుతుంటే ..

   తీరం వెంబడి  వేసే అడుగులెన్నో...

Sunday, 20 October 2013

మూగ(వేదన) రోదన .
   మూగ(వేదన) రోదన . 

   మరణించిన మూగ జీవుల 
   మరణ వాగ్మూలం  సాక్షిగా. 
   నెత్తురోడుతున్న,
   రహదారుల  సాక్షిగా. 

   ముక్కలై చెల్లాచెదురైన,
   దేహ శకలాల సాక్షిగా. 

   మత్తులో జోగుతూ  నడిపిన  కారు 
   కింద నలిగి  చిద్రమైన  
   దేహ చిద్రాల సాక్షిగా. 

   ఆకలి పేగులను చల్లబరిచేందుకు 
   రోడ్డుపక్క కాకా హోటళ్ళ ముందు 
   కాట్లాడుకొనే కుక్కలపై 
   ఎక్కిన లారీ చక్రాల సాక్షిగా. 

   మూతి కంటిన పాలింకా ఆరలేదు 
   ముడుచుకున్న దీహమింకా సాగలేదు 
   అమ్మ ఆర్తనాదం విన్న ఆ పసికూనల సాక్షిగా. 

   పేగు పంచుకుపుట్టిన 
   వాటి బిడ్డల  పేగుల్ని
   రోడ్ దండే నికి  ఆరేసిన 
   నీ  నిర్దయకు  సాక్షిగా

   చంపటంలో నీకున్న 
   సరదాయే వేరు,
   వహ..వా నీకు  నీవెసాటి,
   నీ నిర్లక్ష్యానికి ఆ మూగ రోదనే సాక్షి.    కళ్ళు కానరాకుండా  కారు నడుపుతావ్,
   ఒక్క సారి వాటి కళ్ళలోకి చూడగలవా... 
   అక్కడి ప్రశ్నలకు జవాబివ్వగలవా..? 

Saturday, 19 October 2013

ఎప్పుడొస్తావు ?

   ఎప్పుడొస్తావు? 
   తరాలు, మారుతున్నాయి,
   అంతరాలు గోషిస్తున్నాయి. 

   దిగంతాల ఆవలి నుండి,

   నీ ఆగమనం కోసం,
   కాలం ఋతువులను  
   దోసిళ్ళతో  ఎత్తిపోస్తూ ఉంది. 

   కలతలూ ,కన్నీళ్ళూ,

   విభేదాలూ,వైషమ్యాలూ,
   రంగుల రాట్నం లా,
   గిర, గిరా తిరుగుతున్నాయి . 

   ఎదురుచూపుల వెతలనూ,

   కాటిన్యపు కాలాన్నీ,
   కంటికొసల  ఆశల  మెరుపులో  దాచేస్తూ,

   అనంత ఆకాశంలో , 

   నక్షత్రాలనన్నింటినీ
   లేక్కేట్టేసాను. 

   అంబుదిలో 

   అలలనన్నిటినీ 
   పట్టి కట్టేసాను. 

   ఊహల గాలానికి,

   కలల మీనాన్ని  
   ఎరగా వెసాను.

   తలపుల తరువుకు,

   వలపుల నీరుపోస్తూ,
   స్వప్నాల ఎరువు వేసాను. 

   
   ఊహల పందిరికింద,
   ఆశల తీగనై అల్లుకొంటూ,
   కాలానికి కళ్ళెం  వేస్తున్నాను.  

   నీవు రాసిన లేఖని 

   వేయి సార్లు చదివాను,
   వలపురాతలన్నీ వల్లెవేసాను  

   
   నీ అడుగుల సవ్వడి 
   వినబడదేమో అని,
   చడిచేసే నాగుండెను ఆగిపొమ్మన్నాను. 
   Friday, 18 October 2013

ద్రోహీ..

   

   ద్రోహీ..  

   నీ చేతిలో  చచ్చాకే  తెలిసింది

   బ్రతుకెంత విలువైనదో..

   ఎంత కమ్మని కంఠం  నీది,

   నీ  వెనుకే  ఉరకాలనేలా చేస్తుంది.

   ఎంత నమ్మిక తెచ్చే మచ్చిక నీది,

   నీతోనే  ఉండాలనిపిస్తుంది.

   మచ్చికైన నెచ్చెలిని   వెన్ను నిమిరి,

   గొంతుకొరికే  సైతానువి.

   కసాయితో  చేతులు కలిపి,   

   చెలిమిపై  చురకత్తి  దూసే నేర్పరివి.

   తేనెల మాటలతో మాయచేసి,

   మరణద్వారం వైపు  లాక్కెళ్ళే  మృగానివి.

   నేరం చేయని వారిని  సైతం ఘోరంగా,

   శిక్షించాలని  తపనపడే  తలారివి.

   కాటి కాపరినే ఏమార్చి  కంపుకొట్టే శవాలను,

   కడుపునిండా తినే  జుగుప్సా జ్ఞాపకానివి.

   నమ్మక  ద్రోహానివి  నమ్మిన వారిని ,

   నడిరోడ్డుకు   ఈడ్చే జిత్తులమారివి.Thursday, 17 October 2013

బాటసారినై

   

   బాటసారినై  

   కొత్త  కత్తి అంచుమీద  నడుస్తుంటే....,

   కొలువు  దొరకని  దేవులాటలో..,
   గొడ్డుకారం గొంతు దిగకుంటే..,

   ఆరిపొతున్న కంటిచెమ్మకై ...

   దిగులు దివాణం లో...,
   తలరాత తగలబడుతుంటే..

   అన్నం  కుండలో చేయి పెడితే..,

   ఖాళీతనపు   కడవలో..,
   ఆకలి   కేకలు  వేస్తుంటే...

   కర్మ  సిద్దాంతాలను  తలకెత్తుకుంటే..,

   తప్పొప్పుల  చిట్టాలో..,
   వేదాంతం  వెక్కిరిస్తుంటే..

   దూరాన్ని కాళ్ళతో కొలుస్తూ,

   ఆశకు పునర్జన్మనిస్తూ..,
   కొత్త బాటకై వేట సాగిస్తున్నా.


Wednesday, 16 October 2013

నీ (ని) వాళ్ళు

  

   నీ (ని) వాళ్ళు 


   బ్రతుకంతా బంధాల చట్రములో తిరిగే...బొంగరాలు.

   ప్రేమ  కుసుమాలతో  అల్లిన హారములో దాగిన.....దారాలు.


   చిటికినవేలు  పట్టుకొని  నమ్మినదారిలో నడిచే.......బాటసారులు.


   అయినవాళ్ళను  అనునిత్యం   కాపాడాలనుకొనే......కనురెప్పలు.


   ఆశల కుటీరాలనుండి  అంభరాన్ని  అందుకొనే....మింటిదీపాలు 


   పుట్టింటీ,మెట్టింటీ కంఠాలకు  రక్షణ కల్పించే....రుద్రాక్షలు.


   నేడు....

   చీకటి గబ్బిలాల పాల్పడి  నిర్భాగ్యపు బంధీలై  ఉన్నారు,

   వరకట్న ఆకటి  కొరలలో  చిక్కి  ఉరికొయ్యకు ఊగుతున్నారు.


   కపట  ప్రేమలో  పడి  కాటికి  పయనమవుతున్నారు.


   అనుమానపు  రంపాల కొతకు  బలై ఆత్మహత్యల పాలవుతున్నారు.

   
   కదిలే శవాల్లా కాలం వెళ్ళబుచ్చుతున్నారు     
   
   అమ్మగా,ఆలిగా,చెల్లిగా,చెలిగా,తనయగా, వదినగా,ఉపాద్యాయనిగా.....

   ఏదో మలుపు వద్ద నిన్ను  మనిషిగా  చెక్కిన శిల్పులే....వీళ్ళు.


  నేడు...
   
   నిస్సహాయంగా,  ప్రతి  మలపువద్దా నీకు  దర్సనమిస్తారు,

   నిర్దయగా ఉండకు, మంచి శిల్పివై....వివేకపు  ఉలి చేత పట్టు,


   సృష్టి  కి , ప్రతి సృష్టి  అయిన  ఈ  రాతి బొమ్మలను 


   తిరిగి   నాతి బొమ్మలు   చేయి.


Tuesday, 15 October 2013

ఎదగ (నీయని) ని మొక్క.

           ఎదగ  (నీయని) ని మొక్క.

   పసి చేతులలో    పాతచిరుగులు 
   నీ ఇంటి గచ్హు మెరిపిస్తున్నాయి.

   కాలిన  కడుపుల  ఆకటి కేకలు 
   అంట్ల గిన్నెల  చప్పుడులో  అస్తమిస్తున్నాయి.

   వెచ్చటి రగ్గులో సుఖమెరిగిన నిద్రకు 
   చిట్టి చేతుల చీపురు సవ్వడి  చికాకు కలిగిస్తుంది.

   భాల్యం  కోల్పోయిన  దాస్యం,
   మెట్లు లేని దిగుడు బావి నుండి  పైకి  పాకలేకుంది.

   ఇనుప చట్రాలలో  ఇరుక్కుని,
   ఉక్కు పిడికిలికై  వెతుక్కుంటున్నట్లుంది.

   నువ్వు  కడుతున్న   సమాదుల కింద, 
   భవిత పునాదిని వెతుక్కుంటుంది.

   కొన్ని తరాల  అణిచి వేత  కలసి,
   తనను  కత్తి అంచున  కూర్చోబెట్టినట్లుంది.

.

Monday, 14 October 2013

అక్షర రూపాలు         
   

   మాలిమైన  పావురాళ్ళు , నా అక్షర  స్నేహితురాళ్ళు.

   తిరణాలలో తప్పిపోయిన  

   పసిపిల్లలు,

   దిక్కుతోచక అమ్మకొసం ఏడిచే..

   పిల్లికూనలు.

   నాకలం లోని   సిరాచుక్కలో  దాగిన,

   మేలిమి ముత్యాలు.

   సందించి  వదిలేస్తే  వాడిగా దూసుకెళ్ళే 

   అక్షర భాణాలు.

   దుర్మార్గుల గుండెల్ని  చీల్చి వచ్చే,

   అక్షర కడ్గాలు.

   అరాచకాలపై సమర భేరి మోగించిన,

   అక్షర శంఖాలు.

   నిదుర కాసి  నేను అల్లుకున్న  

   జాబిలి వెలుగులు.

   అలుపే  ఎరుగని  నిరంతర పోరు సలిపే, 

   అక్షర  వీరులు.

   ప్రతి సాహితీ ప్రియుని పలకరించే,

   ప్రేమ మాలికలు.

   విద్యావంతులైన  మీ ఆశ్శీస్సులను  నాకందించే,

   శుభాషితాలు 

    

Friday, 11 October 2013

మన కర్తవ్యం
   మన కర్తవ్యం 

   పట్టుపావడాతో బుడ,బుడా  తిరగాల్సిన 
   చిట్టిపాదాలు,  అరిష్టమనే  అంక్షలతో..
   అమ్మకడుపులోనే అర్దాంతరంగా...,
   కడతేరుతున్నాయి.

   తండ్రి భుజమెక్కి 
   ఊరేగాల్సిన  ముద్దుల తనయ,
   వేటగాని వేటుకు  నెత్తురుముద్దగా,
   నేలకొరుగుతుంది,

   కలలు కనే వయస్సులో..,
   పసుపు రాసుకొవాల్సిన పాదాలు,
   కష్టాల కడియాలతో...,
   నడయాడుతున్నాయి.

   మనతోడబుట్టిన పాపానికి,
   మన పరువు నిలిపేందుకు,
   రాక్షస క్రీడలో నలిగిన పావురాళ్ళై ,
   కదిలే శవాల్లా కాలం ఈడుస్తున్నారు.

   మన ఉదాత్తం  చాటుకొవటానికి,
   నిజాలగొంతు నులిమే ఇజాలతో,
   వారిని మాలిమి చేసుకొని,
   జాతిని పెంచే మరలను చేస్తున్నాం.

   ఇప్పుడు మనం ఓదార్చాల్సింది ,
   కసిగాయని  రాల్చుకున్న  బాలింతరాళ్ళని కాదు,
   కన్నకడుపు తీపినెరిగి ,
   వారిని కాపాడగలగటమే.

   ఇప్పుడు మనం చేయాల్సింది,
   మహత్తర మతాల అడుసుతొక్కటం కాదు,
   మనకు జన్మనిచ్చిన  జాతి,
   కాళ్ళు కడగటమే.
Thursday, 10 October 2013

జీవన పయనం

   

  
  జీవన పయనం 

   నీటిమీద గీసిన చిత్రం 
   చెదిరిపోవటం తద్యం.

   ప్రతి బంధం లోనూ,
   అందమైన ఓ ఒప్పందం.

   చలాకీగా సంద్రాన్ని ఈదటం నైపుణ్యం.
   నావ ఆగటానికి లంగరే శరణ్యం.

   మరణం ఒకేసారి రావటం సహజం 
   కానీ  కాలం ఆగిపొతే అసహజం.

   స్వప్నాన్ని సాకారం చేసుకొనేందుకే యుద్దం.
   అందుకై అవాస్తవ దారిలో  నడకే అనివార్యం.

Monday, 7 October 2013

అనుబంధాలు

   
   

   అనుబంధాలు 

   ఒంటరితనం  మనిషిని శాసిస్తుంది.
   ఆత్మీయం అందనంత 
   దూరం వెళ్తుంది.

   జీవిత పాఠం "అనుభవాన్ని" 
   శీర్షిక చేసుకొని  
   చర్చిస్తుంది. 

   ఆస్తుల తగాదాల్లో,
   అస్తికలను విసిరేసిన రక్త సంబంధాలు  
   రంగుమార్చుకుంటున్నాయి.

   పెరిగిన దూరాల మద్య,
   అనుమానాల  అంపకాలు
   అన్నదమ్ములనే అంధులను చేస్తున్నాయి.

   కన్నపేగుల కలహాల మద్య,
   పండుటాకులు ఎండుటాకులై,
   ఎటుగాలివీస్తే అటు ఎగిరిపోతున్నాయి.

   జీవన మరణాల మద్య,
   కూడబెట్టిన  కన్నీళ్ళు 
   తలాకొంచం తాగుతున్నారు.

Saturday, 5 October 2013

నాకింకోజన్మ కావాలి.

   నాకింకోజన్మ కావాలి.


   బతుకు పుస్తకం లోని అతుకు అక్షరాలను 
   కూర్చి కావ్యం రాయాలి.

   అందుకోలేని  అంతిమ లక్ష్యాన్ని నెరవేర్చే
   పథకాన్ని వెతకాలి.

   అన్నమే ఎరుగని ఆకటి పేగులను 
   గంజినీటితోనైనా తడిపి చూడాలి.

   దుర్నీతి రచనా దుశ్శాసనులు  విప్పిన వలువలను 
   నా అక్కచెళ్ళెళ్ళ  నగ్న దేహాలపై  కప్పాలి.

   ఆశల  అలలపై  నడిచే తమ్ముళ్లను వోటు(ఓటు)పడవ దించి    
   వేకువ దారిలో నడపాలి. 

   ముందు తరపు   ముదిమి అడుగుల తడబాటుకు
   ఊత కర్రనై ఊరటనివ్వాలి.

   నిషిద్ద్ద, నిర్హేతుక చర్యల నెదుర్కొని ఫినిక్స్  పక్షినై 
   ముసురుకున్న నివురునుండి  ఎగరాలి. 
Wednesday, 2 October 2013

రైతన్నా,   రైతన్నా,

   కాలిపోయిన కలలు మరచిపొదాం.
   రాలిపోయిన కంకులు ఏరుకుందాం.

   గుప్పెడు గింజల పలహారం చాలు,
   గుక్కెడు  నీటితో గొంతు తడుపుకుందాం.

   కరవురక్కసి  కాళ్ళు విరిచేద్దాం.
   కలో,గంజో  కలసితాగుదాం.

   మట్టి పొరలకింద బంగారముంది,
   తట్టి చూడు చిరుమొలకై  పైకి వస్తుంది.

   గొంతులో గూడు కట్టుకున్న గరళాన్ని దిగమింగు.
   గుండెలో ఆశల గూటిని కట్టుకుందాం.

   నీవు ఊగిన  ఉరికొయ్యని  నాగలి చేసి చూడు,
   అన్నదాతవై  అందరికీ   అన్నం పెడతావు. 

   పొలిమేరలపై   నీ  తమ్ముళ్ళ  పొలికేకలు చూడు,
   విత్తము కంటే విత్తు గొప్పదని చెప్పిచూడు.

   అమ్మ  రూపంలో ఉన్న అన్నవని తెలుస్తుంది,
   అన్నపూర్ణ గా  మరోమారు అవతారమెత్తిచూడు