Pages

Tuesday, 29 October 2013

హత్య

    
    హత్య

    ఇక్కడో హత్య జరిగింది,
    బాహటంగా, కొంత బలవంతంగా.

    కానీ,
    పోలీస్ రాలేదూ,కెమెరాలూ క్లిక్ మనలేదూ,
    విలేకరులూ రాలేదూ, వార్తా కాలేదూ,
    తారీకూ లేదూ,తలకొరివీ లేదూ,

    (కానీ నేనో మూగ సాక్షిని,మాటరాని అక్షరాన్ని).

    అత్తగారికి ఆడపిల్ల నచ్చలా.... 
    అందుకే ఆర్డరేసేసింది.
    డాక్టరమ్మగారికీ అది అభ్యంతరం  అనిపించలా..... 
    అందుకే లాగిపారేసింది.
    దాయమ్మా ఫీలవలా....... 
    అందుకే ఊడ్చిపారేసింది.

    సాక్షులెవరూ ముందుకు రాలా,
    అందుకే  కేసు వీగిపోయింది,
    నా అక్షర  కోర్టు  ఆరిపోలా,
    అందుకే ఇద్దరిని  పట్టేసింది.

    (నా కోర్టులో ముద్దాయిలు ,ఒకరు కన్నీళ్ళతో,.ఒకరు కలవరంతో )

    హతురాలిని పరిశీలించాను 
    గుప్పిటి  విడివడలా.... ,
    అప్పుడే అరచేతి రేఖలు మారిపోయాయి.
    మూసిన కళ్ళు తెరుచుకోలా,
    అంతలోనే  లోకమంతా అంధకారమైంది.

    (దోషులు  చెప్పుకొనేది ఏమైనా ఉందా?  అడిగాను  ఇద్దరినీ,)

    తప్పు తమది కాదనీ,
    తమ బిడ్డ లింగ పరీక్షలో దొంగ  అని తేలిందనీ,
    ఆడబిడ్డలకిక్కడ  తావులేదనీ,
    తరాలు మారినా తమ సమాదానం ఇదేననీ...

    (హతురాలి చిట్టిచేతితో  నా కలాన్ని పట్టి రాయించాను)

    వెలుగు చూడాలని తహ,తహ లాడిన నాకు చీకటి ప్రసాదించిన                 అమ్మా,నాన్నలకు 
    నా చివరి రక్తపు బొట్టుతో  రాస్తున్నా,
    అమ్మఒడిలో కమ్మగా పడుకొవాలనీ,
    తీయని జోలపాట వినాలనీ  కలలు కంటున్నప్పుడు
    లింగపరీక్షలో నన్ను దొంగను చేసి,
    అమ్మని నిందించీ, నాన్నని  ఒప్పించీ
    నా ఊపిరి ఆపటానికి అనుమతి పొందారు."
    నా బుడి,బుడి అడుగులు మీ నట్టింట నడయాడుట  దోషమా.?
    చిట్టిదీపమై  ప్రతి  దీపావళీ  మీ ముంగిట  వెలుగుట పాపమా?

20 comments:

 1. Replies
  1. సర్, మీరు అధ్బుతం అన్నారంటే నేను రచనాపరంగా ఎదిగినట్లే...

   Delete
 2. నా బుడి,బుడి అడుగులు మీ నట్టింట నడయాడుట దోషమా.?
  చిట్టిదీపమై ప్రతి దీపావళీ మీ ముంగిట వెలుగుట పాపమా?

  దోషం కాదు కాదని ఎలుగెత్తి చాటుదాం!

  ReplyDelete
 3. ఇక్కడో హత్య జరిగింది, ఏ ఆదారాలూ లేవు
  ఆడపిల్ల నచ్చక .... ఆర్డరేస్తే డాక్టరమ్మ లాగిపారేసింది. దాయమ్మ ఊడ్చిపారేసింది.
  సాక్షులెవరూ లేక కేసు వీగిపోయింది,
  నా అక్షర కోర్టు లో అప్పీలు .... బోనులో ముద్దాయిలు, ఒకరు కన్నీళ్ళతో, ఒకరు కలవరంతో
  "దోషులు చెప్పుకొనేది ఏమైనా ఉందా?" అడిగాను ముద్దయిల్ని ....
  హతురాలి చిట్టిచేతితో నా కలాన్ని పట్టి రాయించాను.
  వెలుగు చూడాలని తహ, తహ లాడిన నాకు చీకటి ప్రసాదించిన ఓ అమ్మా, నాన్నల్లారా ....
  నా బుడి,బుడి అడుగులు మీ నట్టింట దోషమనుకున్నారా? చిట్టిదీపాన్నై, లక్ష్మినై మీ ముంగిట దీపావళినై వెలుగుట పాపమనుకున్నారా? అని

  పసి హస్తాలతో రాసిన ఆ అక్షరాలైనా కరకు మనస్తత్వులకు కొంతైనా జ్ఞానోదయం కలిగించాలని ఆ కాలాన్ని కోరుకుంటూ .... అభినందనలు మెరాజ్ గారు! వినూత్నంగా చెప్పాలనే మీ ప్రయత్నం చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. ప్రతి పసి చేతిలోనూ కలం ఉంటే ఇలాంటి కావ్యాలే వస్తాయి.
   అందంగా చెప్పలేకపోయినా అర్దవంతంగా చెప్పాలనే తపన.
   మీ స్పందనకు ధన్యవాదాలు చంద్ర గారూ,

   Delete


 4. ఆడ శిశువుల హత్యలకు చలించి మీరు రాసిన కవిత కలవరపెట్టింది.అభినందనలు.కాని,కవిత్వంలో ఇంకా నైపుణ్యాన్ని,భాషాకౌశల్యాన్ని అలవరచుకోవలసిఉంది.

  ReplyDelete
  Replies
  1. సర్, మీ సూచన తప్పకుండా పాటిస్తాను.
   నా కవిత చదివి స్పందించిన మీకు నా ధన్యవాదాలు.

   Delete
 5. కవిత సూపర్ మేడం.కదిలించింది.ఈ భ్రూణహత్యలను ఆపకపోతే దేశమే నాశనమవుతుంది.ఒక్కప్పుడు భారతదేశ స్త్రీలంటే ఎంతో గౌరవం ఉండేది.ఇప్పుడది అడుగంటి పోతుంది.కళ్లు తెరవకుండా చంపుతున్నారు,తెరిసిన తరువాత చంపుతున్నారు,ఆడపిల్ల కనిపిస్తే చాలు రక్తం త్రాగే రాక్షసులున్న దేశం మనది.

  ReplyDelete
  Replies
  1. అహ్మద్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 6. పాప కోరికలు, నిర్మలం !
  ఆ పాపను చంపే,
  పాపపు చేతులు, కల్మషం !
  చదివాక మీ కవితార్ధం ,
  ఒక్క పాప హత్య ఆగినా,
  అదే , మీ కవితకు పరమార్ధం !

  ReplyDelete
  Replies
  1. సుదాకర్ గారూ, మీరన్నట్లు ఒక్క పాపనైనా నా కవిత రక్షించగలిగితే నా అక్షరానికి పరమార్థం

   Delete
 7. చాలా బాగా డ్రమటైజ్ చేసారు.
  ఒక దృశ్యం ఆవిష్కరించారు ఈ లోకమనే స్టేజి పైన.
  చదువుకున్న వాళ్ళు కూడా
  ఇలా తమకు పుట్టే బిడ్డలను ' సెలెక్ట్ ' చేసుకోవాలి
  అనుకోవడం అమానుషం.
  కూరగాయలు ఏరుకున్నట్లు కడుపు పంటను ఏరాలనుకోవడం
  అమ్మతనానికి తీవ్రమైన ద్రోహం.
  సరైన వారినే న్యాయమూర్తిగా నియమించారు.
  దేవుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసారు.
  శుభాభినందనలు.

  ReplyDelete
  Replies
  1. సర్
   అమ్మతనానికే తీవ్రమైన ద్రోహం.
   చిట్టితల్లుల చిన్నిపాదాలు ఈ భూమిపై స్వేచ్చగా నడయాడే రోజు రావాలి,
   అభినందించిన మీకు నా నమస్సులు.

   Delete
 8. మాడం మనసంతా మూగబోయింది ఈ కవిత చదివాక

  ReplyDelete
  Replies
  1. మా తెలుగమ్మాయికి బోలెడు ధన్యవాదాలు.

   Delete
 9. వ్యధాభరితమైన అక్షరాలతో నిజాన్ని నిర్భయంగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. ప్రేరణ గారూ, మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 10. కవిత బాగుంది మీరు ఇంకా సామాజిక సమస్యలపై మరియు మూఢ నమ్మకాలపై మరింత పదునైన కవితలు అందించాలని కోరుకొంటున్నాను.

  ReplyDelete
 11. మన్నించాలి మీ పేరు అర్దం కాలేదు.
  ఇకపోతే నా కవితపై స్పందించిన మీకు నా ధన్యవాదాలు.

  ReplyDelete