Pages

Tuesday, 28 May 2013

వెడలిపోయే తరం 

ఆకలి పేగులూ,అనారోగ్యాలూ 
కలసి  ఉన్నాయక్కడ. 

ఆశల ఊసులూ,అసహాయతలూ,
కలసి పలుకుతున్నాయక్కడ.

ఆప్తులను వదలేసి అన్నాఅర్తులై,
అలమటిస్తున్నారక్కడ.

గెంటివేయబడిన  ముసలితనం  పై  జాలిపడి,
ముద్ద  వేస్తున్నారక్కడ,

మనవళ్ళతో  ముద్దులాడాల్సిన  వయస్సులో,
సమ ఉజ్జీలతో  సమయాన్ని సాగదీస్తున్నారక్కడ.

ఇంటి  ఆవరణలో తావెందుకు లేదో,
అడిగితే రకరకాల  కారణాలు వినిపిస్తాయక్కడ. 

ఒలుకుతున్న పలుకుల్లో  దిగుల ముళ్ళు,
గుండెలో సూటిగా గుచ్హు కొంటాయక్కడ 

ఉబుకుతున్న కన్నీళ్ళలో నిప్పురవ్వల,
 బ్రతుకు బూడిద రాలుతుందక్కడ.

మృత్యువు  పిలుపుతో ముసలి గువ్వలు ,
నీ తరం కోసం  చోటు ఉంచిపోతున్నారక్కడ. 

అయిన వాళ్ళను  తరిమి వేసి దూరం చేస్తే,
నీ ముంత నీ కొసం తలాకిటనే ఉంటుదక్కడ.

Friday, 17 May 2013           అన్నా, రైతన్నా.     కరువుటెండలో పసిమొలకలు,
     నీళ్ళు లేక వసివాడుతున్నాయి.

     నేలలో దాగిన  విత్తనాలు,
     నిస్సత్తువతో నిద్రపోతున్నాయి.

     పొలందున్నే వృషభరాజులు గ్రాసం లేక,
     గ్రహపాట్లు పడుతున్నాయి.

     పచ్చని తోటై  పరిమళించాల్సిన పల్లెసీమ,
     కుళ్ళిన శవాల కంపు కొడుతుంది.

     ఇంటిగుమ్మానికి వేలాడే ఎండిన మావిడాకులు.
     తువ్వాయిల ఆకలి తీరుస్తున్నాయి.

     రాగిముద్దలో బెల్లం నంచుకుతునే ముసలి చేతులు,
     ముక్కిపోయిన రేషన్ బియ్యపు గంజి తాగుతున్నాయి.

     అంతకంతకూ పెరిగే అప్పులూ,ఆకలీ కలసి,
     రసాయనమందులను విందుగా చేసుకొంటున్నాయి.

     మట్టిబిడ్డల మరణ శాసనాలు రాతిగుండె రాజకీయ,
     ఎదుగుదలకు సోపానాలవుతున్నాయి.

     నక్కజిత్తుల నాటకీయ రాజకీయం కన్ను గీటి,వేశ్యలా,
     నంగినవ్వుల  రాయితీ ఇస్తుంది.

     ఆత్మహత్యలు విడనాడు, ఆత్మస్తైర్యం పెంచుకో,
     తినాల్సింది గడ్డికాదనీ, అన్నమనేది ఉందనీ తెలియజెప్పు.

     అన్నా.....  నేలతల్లిని నమ్ముకో అమ్ముకోకు,
     వాడి సమాదిపైనా ఇంత పచ్చటి పంట పండించు.Monday, 13 May 2013
గాయమైన గేయం
నీ  కోసం ఎదురుచూసే  సమయాన,
రాలేననే నీ సందేశం.
సాలెపురుగులా ఊహల దారాన్ని అల్లే తరుణాన,
విరిగిపడిన  ఇంటి చూరు.
జీవించే క్షణాలనే మరచి పోతున్న కాలాన,
తలపులను తవ్వుతూ.
చిరు పలుకుల కోసం తపించే  మదిలోన,
చెరిపివేసే  వాగ్ధానం.
నిరీక్షణ లో నుంచి  ఉన్మత్త  ఆవేశాన,
చటుక్కున నోరు జారిన పలుకులు.
మేఘాల ముంగురులు సవరించే నిముషాన,
పడమటి కొండల్లోకి జారిపోతూ.
రాతి పలకపై ప్రేమాక్షరంలికించే క్షణాన,
జారిపడి పగిలిన గుండె శకలాలు .
చలన రహిత నీడలే పలాయనమైన  వైనాన,
మూగబోయిన గుండె నిండా గాయమైన గేయాలే.

Wednesday, 8 May 2013


   


    కొత్తమ్మ 

   నాన్న కొత్తమ్మని చూపినప్పుడు 
   చంటిదాని బుగ్గలపై కన్నీరింకా ఆరలేదు.

   బెరుకు తీరి  దగ్గరవుతూ ఉంది,
   అదిగో అప్పుడే కొత్తమ్మ పుట్టింటికెళ్ళింది.

   కొన్నాళ్ళకు పొత్తిళ్ళలో బాబుతో వచ్హింది,
   చంటిదానికి సంబరమైంది  తమ్ముడొచ్హాడు.

   కానీ కొత్త భాద్యత వచ్హి పడింది,
   తమ్ముడి ఆలనా పాలనా తానే చూడాల్సి ఉంది,

   నాన్న కూతురుకి చుట్టంలా మారిపోయాడు,
   అప్పుడప్పుడూ పరిచయస్తునిలా నవ్వుతున్నాడు.

   అమ్మా నాన్నలు తమ్ముడితో బైట కెళితే,
   తాను ఇంటికి తాళం కప్పలా అతుక్కుని ఉండేది.

   ఆ ఇంట ఏ తప్పు జరిగినా  దండన రూపంలో ,
   చంటిదాని వీపున వాతలు  తేలేవి.

   మునిమాపు వేళ ఊడల మర్రిపై ఉంటుందన్న,
   దయ్యంకన్నా బయంగా ఉంది కొత్తమ్మంటే.

   ఇంటి చాకిరీతో చదువు అటకెక్కింది అందుకె,
   కొత్తమ్మ చుట్టాలకు తాను పనిపిల్లలా పరిచయమైంది.

   కాలచక్రం లో మరో కొన్ని బాదావత్సరాలు దొర్లాయి.
   చంటిదిప్పుడు  పడుచు పిల్ల అయింది.

ఇనుప చట్రాలకింద పాతయుగం  నలిగిపోయింది,
పసుపుతాడుతో కొత్త గడప తొక్కింది ,
అక్కడా ఓ కొత్తమ్మ (అత్తమ్మ) ప్రత్యక్షమైంది.

(అమ్మలూ, తల్లులూ, మీరూ బిడ్డలు కన్న వారె కనుక, సవతి బిడ్డలకీ, మీ బిడ్డలకీ బేదం చూపి ఆ పసి మనసులను  హింస పెట్టకండి) 


Saturday, 4 May 2013


   


  శవాల సంబరం 

   అయిదేళ్ళకొసారి గుర్తొస్తాము,
   అయినవాళ్లలాపరుగెత్తు కొచ్హి ,
   మమ్ము పలకరిస్తారు.

   మాయదారి జొరాలు గుప్పుమంటాయి,
   అంటురోగాలు  అంటుకోకుండా,
   ముందుజాగ్రత్తలు  పడే వస్తారు.

   గూడెపు సావులెక్కలకి రెక్కలొస్తాయి,
   ఒక్కో శవానికి రెండు  పేర్లు పెడతాము,
   అయినా దయతలుస్తారు దర్మాత్ములు.

   వాడలో అంబులెన్సుల హడావిడి,
   ముక్కుకారే మా పిల్లలు ముద్దోచ్హేస్తారు,
   దయామూర్తులు దగ్గరకి తీసుకుంటారు.

   బక్కచిక్కిన మా చిట్టి తల్లుల్ని,
   అక్కున చేర్చుకుంటారు,
   రంగుల పోటోలు హంగులుగా దిగుతారు.

   మా శవాలపై వాలే రాబందుల్లా,
   మా కురుపులపై వాలే ఈగల్లా,
   మా చుట్టూ చేరుతారు .

   మా ఓటు కోసం  మొసలి కన్నీరు కారుస్తూ,
   వెలయాలిలా వగలు పోతూ,
   నిర్లజ్జపు ముఖానికి నంగి నవ్వు అతికించుకుంటారు.

   మా గూడెపు అమ్మోరుని కూడా,
   బొమ్మోరుని చేసి,కనికట్టు చేసే,
   గారడి చేసి, ఓటు దోచుకొనే దొంగలు.