Pages

Wednesday, 25 April 2012

పాప నవ్వు



పాప నవ్వు

ఓ   చిన్నారి  పాప  బోసిగా  నవ్వుతుంది,   చప్పట్లు  చరుస్తుంది,  ఏదో పులకింత. తొర్రి పళ్ళ మద్య  నాలుక తొంగి చూస్తుంది,  కళ్ళ నుండి ఆనందం జారి పడుతుంది. అంతలో వెన్నెలనీ  మంచునీ కల బోసినట్లున్న  ఓ కారు  ఆగింది,  అందుండి  కారు మేఘానికి  కాంతులీను  వస్త్రాలు కట్టినట్లున్న  ఓ ఆకారం దిగింది,  గులక రాళ్ళు , గాజు పెంకులు  కలిపి   గిలకొట్టిన  సవ్వడిగల   గొంతుతో,    పాప   ఎదురుగా ప్రత్యక్షం  అయింది. 
     
సౌధం పై స్వేద బిందువుల్లా... కూలీలు తమ  నుదుటి పై  చేతులడ్డుపెట్టుకుని   కిందికి చూసారు .., పొంత పొయ్యి లో  దొర్లుతున్న  కుక్క పిల్ల  బూడిద ముఖం  పైకెత్తి  చూసింది ..., 

ఇంతకీ పాప  ఎందుకు నవ్వినట్లు ??? 

పగిలిన పాదాలు .., చిరిగినా పాతలు , నడకని వంకర చేస్తుంటే  కంగారుగా మురికి చేతులు జోడిస్తూ  అన్ని ఆకారాలు  వరసగా చేరాయి కరంటు తీగ పై కాకుల్లా... అమ్మో  ఎదురుగా దొరగారు  ఉన్నారు మరి.  పైన బట్ట కొరత ఉంది,  కింది బట్ట  కొంతే  ఉంది,  అయినా  దొరగారి కుర్చీ తుండుతో  తుడవబడింది. 

గుడిసెలో  మట్టిముంతలోని  పది నోటు  షాపుకెళ్ళి  కూల్  డ్రింకు గా    తిరిగొచ్చింది.  ప్రసాదంగా ఇచ్చిన  పానీయం దొరగారి గొంతు దిగుతుంటే  ఎదురుగా ఉన్న కాకులు పెదాలు తడుపుకున్నాయి.              

ఇంతకీ పాప ఎందుకు  నవ్వినట్లు ???

దొరగారోస్తే  నాన్న  నంగి నవ్వులు నవ్వుతాడు.   ఆ తర్వాత అమ్మ చేత కోడి కూర వండిస్తాడు.. వహ్ కూరా కూడు.. దొర  వదిలేసిన బోమికెలు,  అమ్మ  దాచి పెడ్తాది,  వహ్   అమ్మా నాన్నా నవ్వతా  ఉంటారు.

ఆ చిన్ని బుర్రకి తెలుసు  సంతోషం ధనంతోనే వస్తుందని ..., అదీ  దొరతోనే వస్తుందని.

అదిగో అందుకే పాప నవ్వింది.
                 
నిజమే ఈ దొరలంతా నవ్వుతూ ఉంటారు, పోగొట్టుకుంటూ పొందుతున్నామనే అమాయకుల జూసి.




12 comments:

  1. ఆ చిన్ని బుర్రకి తెలుసు సంతోషం ధనంతోనే వస్తుందని ..., అదీ దొరతోనే వస్తుందని.Its true

    ReplyDelete
    Replies
    1. అనికేత్ గారూ, హిందీ లో ఒక సామెత ఉంది "आगाज अछा है तो अंजाम अछा होगा" అంటే (a good starting leads to successful result) మీ బ్లాగ్ ప్రారంభం తల్లిదండ్రుల కాన్సెప్ట్ తో ప్రారంభించారు. శుభం జరుగుతుంది.

      Delete
  2. ఎందుకో మనసంతా అదోలా అయిపోయిందండి ఫాతిమాగారు.. బాగుంది.

    ReplyDelete
    Replies
    1. Madam, సున్నితమైన మనసున్నవారు మీలాగే ఇతరుల కష్టాలు బాధలకు చలిస్తారు. నా కవిత మిమ్మల్ని ఆలోచింప చేసింది. ధన్యవాదాలు.

      Delete
  3. కంటి ముందు చూసే కొన్ని వాస్తవాల వెనుక ఆలోచిస్తే కలిగే అసలు రూపం మీరు అద్భుతంగా కళ్ళముందుంచారు ఫాతిమా గారూ.

    ReplyDelete
    Replies
    1. Sir,
      అర్థం చేసుకునే సహృదయం ఉన్న మీకు కృతఙ్ఞతలు.

      Delete
  4. టాపిక్ బాగుంది.మీ వర్ణన అంత కన్నా బాగుంది.కాలే కడుపుకు అంతకన్నా ఏమి తెలుస్తుంది.

    ReplyDelete
  5. Sir,
    ధన్యవాదాలు.

    ReplyDelete
  6. మట్టిముంతలోని పది నోటు షాపుకెళ్ళి కూల్ డ్రింకు గా తిరిగొచ్చింది...
    పోగొట్టుకుంటూ... పొందుతున్నామనే అమాయకుల జూసి.
    కూలి బ్రతుకుల జీవితాన్ని అద్దంలో చూసినట్లుంది...
    @శ్రీ

    ReplyDelete
  7. శ్రీ గారూ, ప్రశంసకు కృతఙ్ఞతలు.

    ReplyDelete