Pages

Sunday, 16 March 2014

అన్నా... అన్నం పెట్టు

   

    అన్నా... అన్నం  పెట్టు 

    ఎక్కడున్నావ్,
    మెడసారించి  మేఘాలను 
    బ్రతిమిలాడుకుంటున్నావా...?

    గ్రాసం లేక,
    డొక్కలెండిన,
    బసవన్నలను ఓదారుస్తున్నావా...?

    ఆకలి తీర్చే,
    పథకాలన్నీ, 
    అటకలెక్కాయని వగస్తున్నావా..?

    అంబలి పోయలేక,
    ఆలు బిడ్డలకు,
    ముఖం చాటేస్తున్నావా...?

    అధికారులకు,
    దుర్బిక్షాలను,
    వివరించలేకపోయావా....?

    నేలతల్లిపై,
    వ్యాపారంచేసే  నీచులకు,
    అన్నం పెట్టిన చేత్తో  దణ్ణం పెడుతున్నావా..?

    వలసపోయిన,
    పల్లెవాసుల,
    పాదముద్రల్లో వెతలను వెతుకుతున్నావా..?

    అధైర్య పడకు,
    భూమాతను నమ్ముకున్నావ్,
    బువ్వ పెట్టకపోదు,
    ఎన్నికలోస్తాయి,ఎల్లలు మారుతాయి,
    కానీ.... ఆకలి మారదు,
    అందరూ తినేది అన్నమే సున్నం కాదు. 

(అన్నం పెట్టు  ఎవడికీ  దణ్ణం పెట్టకు,నీకు అండగా మా పెన్ను ఉంటుంది)        11 comments:

 1. ఎన్నికలొచ్చినా ఎదురు చూపులే.
  ఎల్లలు మారినా ఇంట్లో ఎసరు పొంగదు.
  బువ్వనిచ్చే భూతల్లి బుగ్గలు బీళ్ళయ్యాయి
  కడుపు నింపే కన్నతల్లి చేతులు
  వట్టి వేల్లయ్యాయి
  పథకాల పన్నాగాలకు పావులుగా మారి
  రాక్షకీయ శకుని గాళ్ళకు
  రాచమార్గాలయ్యాయి.
  నమ్ముకున్న భూతల్లిని అమ్ముకున్న్నా
  కమ్ముకున్న చీకటి మబ్బుల్లోంచి
  ఒక్క వెలుగు చుక్కా కానరాదు
  ఒక్క నీటి చుక్కా నేలరాలదు.
  కాలాన్ని నిందిద్దామా?
  కలికాలం ఆకలికాలమే అనుకుని
  సర్దుకుందామా?
  అందాకా పెగలని ఎండు గొంతుకను
  కన్నీటితో తడుపుకుందామా?
  భూమ్మీద మన ఉనికిని తడుముకుందామా?
  గళాన్ని కదిపి కలాన్ని ఝులిపి
  కాలాన్ని హరించే ముష్కరులను
  పాతాళంలో పాతేద్దామా!!?
  కలమూ హలమూ భూతల్లికి
  కవల పిల్లలే అని నిరూపిద్దామా..

  ReplyDelete
  Replies
  1. ఏమిచెప్పను,ఎన్ని సందిగ్దాలో,ఎన్ని సలహాలో,
   జానీ నీ కలం నుండి పలికిన ప్రతి పలుకూ...ఓ ఆదర్శ అక్షర గుళిక,
   ఈ ఆవేశాన్ని ఓటు పోటుతో ముగిద్దాం.

   Delete
 2. ఎన్నికలోస్తాయి, ఎన్ని కలలో కనేలా చేస్తాయి. ఓటు కోసం తేడాలు దూరమౌతాయి, ఆకలిని మాయం చేస్తాము. అందరికి గూడు ఉద్యోగం ఇస్తాము అని వినిపిస్తుంది. అది కల కాని కలలాంటి మోసం అని ఎన్నికలయ్యాకే తెలుస్తుంది.
  చక్కని వేదిక లా కవిత

  ReplyDelete
  Replies
  1. నిజమే సర్, ఓటుతోనే సంద్రపు(సామాన్యుని) బోటు తేలుతుందో,మునుగుతుందో తెలుస్తుంది.
   మీ స్పందనకు నా ధన్యవాదాలు.

   Delete
 3. మేడం నమస్తే,మీకు హ్యాపీ హోలీ,
  రైతు గురించి రాయాలంటే మీరే రాయాలి,
  చాలా బాగా రాశారు,

  ReplyDelete
  Replies
  1. హాయ్,లక్ష్మీ.., హోళీ కి రెండురోజులు సెలవ్ పెట్టి అత్తగారింటికి వెళ్ళావా?
   రేపు రావు కదా కొంచం వెలితిగా ఉంటుంది,(పిల్లలకి కాదులే ఫీలైపోకు.:-))

   Delete
 4. అన్నదాత గూర్చి ఎంత బాగా రాశారు మీరజ్,మీరన్నట్లు పట్టెడన్నం లేకపోతే ప్రతి మనిషి దురవస్థల పాలవవలసిందే.

  ReplyDelete
  Replies
  1. దేవీ,నా భావాలతో ఏకీబవించే మీ వాఖ్యకు నా ధన్యవాదాలు.

   Delete
 5. Good poem Madam.

  ReplyDelete
  Replies
  1. అక్షరగారూ, థాంక్స్.

   Delete
 6. పథకాలన్నీ పేపర్ మీద తప్ప ఆచరణలో అతి తక్కువని సామాన్యుడికేం తెలుసు పాపం.

  "నేలతల్లిపై,
  వ్యాపారంచేసే నీచులకు,
  అన్నం పెట్టిన చేత్తో దణ్ణం పెడుతున్నావా..? "

  "అధైర్యపడకని" చివరగా మీరు రాసిన ఆ వాఖ్యాలు ఎంతో విలువైనవి.
  కవిత అసాంతం చాలా బాగుంది ఫాతిమా గారూ .
  *** శ్రీపాద

  ReplyDelete