Pages

Tuesday, 31 July 2012

మాయావిమాయావి


అందరూ అంటారు మనసు మల్లెలు పూయిస్తుందనీ, మనోహరంగా ఉంటుందనీ.. 
కానీ మనసు ఇలా కూడా ఉంటుంది   తెలుసా.. 

సజావుగా సాగుతున్న జీవితానికి లేని పోనీ సొగసులద్ది , 
సతమతం  చేసి  సంజాయిషీ అడుగుతుంది.

వెన్నెలలా, పట్టుదారంలా  మెరుస్తూ, మురిపిస్తూ,
చిక్కు వెంట్రుకలా  చికాకు పెడుతుంది.

మ్రోగుతున్న హృదయాన్ని  మూగదాన్ని చేసి,
దిక్కుతోచక దిగంబరమై  రోదిస్తుంది.

తనువు తగలబడి పోతున్నా  తాను  మాత్రం ,
రక్తం మరిగిన వ్యాఘ్రం లా  వేటాడుతుంది.

ముఖం మీది చిరవ్వులతో  నటిస్తూఉంటామా ,
చర్నాకోలుతో  కొట్టి చెవులుమూస్తుంది.

నిద్రను  చెడగొట్టి  కళ్ళకు  చీకటి  గంతలుకట్టి,
కలతలను   కానుకగా  ఇస్తుంది.

మరగున  పడిన  తలపులను  తలనుండి  తోడి,
తనువును  తడిపేస్తుంది.

చిక్కిశల్యమైన   శరీరానికి  శుష్కించిన  చిరునవ్వునద్ది,
చిత్రంగా  తిలకిస్తుంది.

గొంతునుండి  గుబులు   బైటకి  రానీక ,
మాటలకు  మమకారపు   రంగు  వేస్తుంది.

ఎదురుపడి   వేదనను  వెళ్లగక్కే  సమయానికి,
అభిమానపు  ఆభరణం  అరువుగా  ఇస్తుంది.

బంధనాలు  తెంచుకొనే   తెగింపు  వచ్చినప్పుడు,
బేలగా  మారి  గోలచేస్తుంది.

విచ్చుకొనే   వేకువకూ .  .అంతమయ్యే  సంద్యకూ,
సంకెళ్ళు  వేసి  మరణశాసనం  రాస్తుంది.

గుండెను  మెలిపెట్టి, నరాలను నుజ్జుచేసి, ఆశ్రువులను  ఆరనివ్వక,
అయినవారికి దూరమైనప్పుడు ముక్కలవుతుందీ   మహమ్మారి  మనస్సు.

చింతతో చితగ్గొట్టి, వేదనతోవిరగొట్టి,  బాధతో బంధించి,
మాయలతో  మాలిమి చేస్తుందీ    మాయావి మనస్సు.  


29 comments:

 1. కవిత అద్భుతంగా సాగింది.మనసు చేసే విన్యాసాలను కళ్ళకు కట్టారు .ప్రతి వాక్యం అక్షర మక్షరం నిజం.చాలా గొప్పగా వర్ణించారు.

  ReplyDelete
  Replies
  1. రవి శంకర్ గారూ, చూసారు కదా మనసు విన్యాసాలు ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది మనసు. కవిత నచ్చినందుకు థాంక్స్.

   Delete
 2. అద్భుతం! అనితర సాధ్యం! మీలో ఎంత
  కవిత్వం ఉందో కదా!
  చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు,
  ఎప్పటికప్పుడే!

  ReplyDelete
  Replies
  1. సర్, నా కవిత్వం బాగుందని మెచ్చుకోనటం,
   విశ్లేషించటం, ఓపిగ్గాచదవటం, ప్రోత్సహించటం మీ నిరాడంబరతకు తార్కాణం.
   మానసిక సంఘర్షణ,నిరంతర అక్షర అన్వేషణ ఇలా భావప్రకటన అవుతుంది.
   కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

   Delete
 3. ఫాతీమాగారు.....మీరు రాసినవన్నీ నా మనసుకు అనుభవేనని తనమాటగా చెప్పమంది:-)

  ReplyDelete
  Replies
  1. పద్మగారూ, మీ మనసు నాకు తెలుసు, అది మీ కవితల్లో ప్రస్పుటం అవుతుంది. అంత సున్నిత మనసు ఉంది కనుకనే మంచి భావాలను రాయగలుగుతున్నారు.

   Delete
 4. కోతి మనసు :)

  ReplyDelete
  Replies
  1. నిజమే సర్, ఆ విషయం దాని చేష్టలతో అప్పుడప్పుడూ తెలియజేస్తూ ఉంటుంది. ఏమి చేదాం అది ఆడిచ్చినట్లు ఆడాలిగా.

   Delete
 5. మనసంటేనే అంతే కదా,చక్కగా రాశారండి, అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. భాస్కర్ గారూ ధన్యవాదాలు కవిత నచ్చినందుకు.

   Delete
 6. మనసు చేసే చిత్ర విచిత్రాలను చాలా చక్కగా వర్ణించారు.

  ReplyDelete
  Replies
  1. నాగేంద్ర గారూ నిజమే మనసు చిత్ర,విచిత్రంగా ఉంటుంది. కవిత నచ్చినందుకు థాంక్స్.

   Delete
 7. మాయ ముసుగు వేసుకున్న "మాయావి " చాలా బావుంది.
  అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ, మనమందరమూ ఈ మాయావి చేతిలో కీలుబొమ్మలమే కాదంటారా.. నెచ్చలికి కవిత నచ్చింది సంతోషం.

   Delete
 8. నిజమేనండీ...మనసు మనో "హారం" లా కాక మనో "హరం" అయిన మాయావే...
  చాలా బాగా చెప్పారీ కవితలో.
  "......నిద్రను చెడగొట్టి కళ్ళకు చీకటి గంతలుకట్టి,
  కలతలను కానుకగా ఇస్తుంది....."
  అద్భుతం...

  ReplyDelete
  Replies
  1. చిన్ని ఆశగారూ, మనసును పట్టుకొని దాని(అవ) లక్షణాలన్నీ చెప్పగలిగాను కానీ చిత్రం వేయలేక పోయాను. మీరైతే "మనస్సు"రూపురేఖలు చూపగలిగే వారు కదా, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

   Delete
 9. మనసు చేసే విన్యాసాలను కవితగా గుచ్చి అలంకరించిన తీరు చాలా టచింగ్ గా సాగింది ఫాతిమాజీ...
  దేనికైనా మనమే కారణం కాదా??
  అభినందనలు...

  ReplyDelete
  Replies
  1. వర్మాజీ, కవిత నచ్చినదుకు ధన్యవాదాలు. మీరన్నట్లు మనమే కారణం ఏమి చేద్దాం ఒక్కోసారి ఎంత వివేకవంతులైనా, మనసు చేసే గారడీలో పల్టీలు వేయాల్సిందే.

   Delete
 10. హృదయాన్ని ఆవిష్కరించడం అన్నారు నావి కొన్ని కవితలు చూసి..
  కానీ మీ మాయావి ని చూస్తె అనిపిస్తుంది...
  మనసుని ఆవిష్కరించడం అంటే ఇది అని.....
  చక్కని కవిత ఫాతిమా గారూ!
  చిత్రం కూడా చాలా బాగుంది.
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీగారూ,నిజమే కానీ హృదయం స్పందిస్తుంది,
   మనస్సు బందిస్తుంది, బాదపెడుతుంది,ఆడిస్తుంది,
   మీ కవితల్లోయశోద(తల్లి)హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు సందేహం లేదు.
   కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

   Delete
 11. "వెన్నెలలా, పట్టుదారంలా మెరుస్తూ, మురిపిస్తూ,
  చిక్కు వెంట్రుకలా చికాకు పెడుతుంది."

  నిజమేనండీ మనసు మహా "మాయావి"..

  ReplyDelete
  Replies
  1. రాజీ గారూ, అందరమూ మనస్సు మరలో పడిన వాళ్ళమే తప్పదు ఏమిచేద్దాం.
   కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

   Delete
 12. మనసు మాయావి......అవును నిజమే..బాగుందండీ :-)

  ReplyDelete
  Replies
  1. సీత గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు.
   ఎక్కడున్నారు ఇన్నాళ్ళు బాగున్నారు కదా,
   మీ వ్యాఖ్య లేదేమిటా అనుకున్నాను.

   Delete
  2. నేను బాగున్నాను ఫాతిమా గారూ...
   అసలు తీరికే లేకుండా పోయింది అందుకే ఆలస్యం.థాంక్యూ.:-)

   Delete
 13. బాగుంది ఫాతిమా గారు....మనసును చాలా బాగా వర్ణించారు.. సూపర్...

  ReplyDelete
  Replies
  1. సాయి గారూ, ధన్యవాదాలు ప్రశంస ఆలస్యంగా వచ్చినా సంతోషాన్ని ఇచ్చింది. (బిజీ అనుకుంటా.. కదా )

   Delete
  2. ఫాతిమా గారు నిజమే కాస్త బిజీ అయ్యాను...5 రోజుల తర్వాత ఇలా వచ్చాను... సారీ లేట్ గా స్పందించినందుకు...

   Delete