Pages

Saturday, 6 October 2012

నిన్నేమనుకోను

అలజడి అంబుధిలో మునుగుతున్న నాకు ఆధారంలా అనిపించావు,

ఆశగా పట్టుకుంటే... విదిలించి వదిలించుకున్నావు.


చింత సంద్రాన మునిగిన నాకు చిరుహాసంలా చేరువయ్యావు.

పట్టుకొని అధరంపై అద్దుకోనేలోగా..నిట్టూర్పువై నిష్క్రమించావు.


అంధకార పయోధిలో పడిపోయిన నాకు కాంతిరేఖవై కనిపించావు.

పట్టుకుని కళ్ళలో పెట్టుకొన్నానో లేదో .. కంటిపాపనే ఎత్తుకెళ్ళావ్.


కలల కడలిలో మునుగుతున్న నాకు స్వప్న కెరటంలా కనిపించావ్.

కళ్ళుమూసుకొని స్వాగతించానో లేదో..కలతనిద్రవై కష్టపెట్టావ్.


దిక్కులన్నీ ఏకం చేసి వెతికి,వెతికి జనసమూహాన నినుగాంచి,

పరుగున వచ్చి పలకరినచానో లేదో...అపరిచితునిలా వెడలిపోయావ్.


ద్రవించే హృదయం,మతిలేని మనస్సూ నీ చుట్టూ భ్రమిస్తున్నాయని ,

తెలుసుకోన్నావో లేదూ, కక్షగా వాటి కక్ష్య మార్చివెళ్ళావ్.


విసిగి,వేసారి ఈ వెక్కిరించే ఊహలన్నీ నను ఊపెస్తుంటే ఊపిరి సలపని,

ఉరిఊయల ఊగాలనుకున్నానో లేదో..ప్రాణవాయువై పలకరించావ్.


ప్రతి రోజూ నన్ను నేను గుర్తుచేసుకుంటాను శాపము మోసే శకుంతలలా,

చిరునవ్వుతో పలకరిస్తావ్ అసలేమీ నీకు తెలియదన్నట్లుగా... 

36 comments:

 1. కలల కడలిలో మునుగుతున్న నాకు స్వప్న కెరటంలా కనిపించావ్.

  కళ్ళుమూసుకొని స్వాగతించానో లేదో..కలతనిద్రవై కష్టపెట్టావ్.....


  ప్రతి రోజూ నన్ను నేను గుర్తుచేసుకుంటాను శాపము మోసే శకుంతలలా,

  చిరునవ్వుతో పలకరిస్తావ్ అసలేమీ నీకు తెలియదన్నట్లుగా......
  చాలా బాగున్నాయి మెరాజ్ గారూ!...
  ఎదురు చూపుల్ని ఇంతకంటే బాగా చెప్పడం కష్టమేనేమో!...
  అభినందనలు మీకు...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ, మీరు కవితని విశ్లేసించటం నచ్చింది నాకు,
   నిజమే ఎవరైనా తనని తానూ ప్రతిసారి గుర్తుచేసుకోవటం అనేది ఓ శాపం.
   మెచ్చిన మీకు ధన్యవాదాలు.

   Delete
 2. నిజమేనండీ ఇలాంటి వాళ్ళని ఏమనుకోవాలి..??
  కవిత చాలాబాగుంది..


  ReplyDelete
  Replies
  1. ఏమి అనుకోలేము..అలా తపించేవారి పిచ్చి ప్రేమకు జాలిపడాలి.
   రాజీ గారు కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

   Delete
 3. ప్రాణ వాయువై పలకరించటం.మంచి కవితా ప్రయోగం .కవితలోని అన్వేషణలో ఆవేదన ఉప్పొంగుతుంది.

  ReplyDelete
  Replies
  1. రవి గారూ, కవితాభావాన్ని అర్ధం చేసుకున్న మీకు ధన్యవాదాలు.

   Delete
 4. మీరజ్గారు కవిత సూపర్బ్. మీరు కొంచం ఫొటోల విషయమ్లో శ్రద్ద తీసుకోండి.కవిత మొత్తం పక్షుల మీద రాసారా అనిపిస్తుంది ఫోటో చూస్తుంటే!

  ReplyDelete
  Replies
  1. నరసింహం గారూ, కవిత నచ్చినందుకు థాంక్స్.
   అంత అందమైన అమ్మాయిని దాటి చూపు పక్షులమీదికి పోతుందంటారా?:-):-)

   Delete
  2. నా ఉద్దెశ్యం అమ్మాయి చిత్రం గురించి కాదండి. ఉదాహరణకు
   "అలజడి అంబుధిలో మునుగుతున్న నాకు ఆధారంలా అనిపించావు,
   ఆశగా పట్టుకుంటే... విదిలించి వదిలించుకున్నావు."
   అని మొదటి 2 లైన్లు చదవి బొమ్మను చూస్తే, పక్షిని పట్టుకోబోతే విదిలించుకుని పారిపోయిందని రాసారేమో అనిపించవచ్చు. అయినా మొత్తం మీ కవిత చదివాక ఇక బొమ్మను చూసేదెక్కడ ? మనసే బొమ్మైపోతేను!

   Delete
  3. నరసింహ గారూ, మీరన్నది నిజమే ఆ చిత్రంలో బాదా, విరహం లేవు. ఈసారి ఇంకా శ్రద్ద తీసుకుంటాను.
   అపురూపమైన మీ వ్యాఖకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.

   Delete
 5. మీ భావ వ్యక్తీకరణ చాలా బాగుందండీ!

  ReplyDelete
  Replies
  1. రసజ్ఞ గారూ, బహుకాల దర్శనం.
   ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 6. Extreme expression Fathimaji...వేచి చూసే హృదయాన్ని యింత బాగా కవిత్వీకరించడం అద్భుతం...అభినందనలతో...

  ReplyDelete
  Replies
  1. వర్మాజీ, వేచి చూసే హృదయాన్ని నా కవితలో చూసిన మీ భావుకత్వానికి అభినందనలు.
   కవిత మెచ్చినందుకు కృతజ్ఞతలు.

   Delete
 7. Beautiful expression in every word.

  ReplyDelete
  Replies
  1. పద్మ గారూ, మెచ్చుకున్న మీకు కృతజ్ఞతలు.

   Delete
 8. each word and every sentence is fantastic Meraj Fathima :)

  ReplyDelete
 9. ఆశ, కలత, నిట్టూర్పు...ఎన్నయి కష్టపెట్టినా ప్రాణవాయువై, చిరునవ్వై మిగిలిపోతే చాలదూ చివరికి...ఏమనుకోవాలో అర్ధం చేసుకోవటానికి?
  భావం చక్కగా కవితలో చెప్పారు...కాదు చూపారు.

  ReplyDelete
  Replies
  1. చిన్నిఆశ గారూ, కవితలో మీరు చూసిన భావాన్నే నేను చెప్పాలి అనుకున్నది
   చక్కగా అర్ధం చేసుకున్నారు. ఆ ప్రాణవాయువై ఉన్నందువల్లనే ఇంకా ఆశా ,నమ్మకం నిలిచి ఉంటుంది ప్రేమలో
   ధన్యవాదాలు మీకు.

   Delete
 10. నిన్నేమనుకోను అంటూ ఎన్నో అనుకున్నారు!
  శకుంతలను వదిలి వెళ్ళిన దుష్యంతుడు
  దురదృష్టవంతుడు అనిపిస్తుంది మీ కవిత
  చదివాక, అంత అందమైన సున్నితమైన హృదయాన్ని
  అనుక్షణం అనుభవించి ఆస్వాదించే అపురూపమైన
  అవకాశాన్ని పొందలేకపోవడం శాపమే కదూ!
  చివరకు మళ్ళీ కలిపి మంచి పనే చేసారు,
  కొంచమైనా ఆ వేసారిన గుండెకు కాస్త స్వాంతన.
  సారీ అని చెప్పని దుష్యంతుడిని శకుంతల
  ఏమంటుందో! పసివాడిలా అన్నీ మర్చిపోయాడనుకుంటుందా!
  కథకు పనికి వచ్చే మంచి ప్లాట్ ఉంది మీ కవితలో!
  హేట్సాఫ్!

  ReplyDelete
  Replies
  1. దుష్యంతునికి శకుంతల ప్రేమా, విరహం , జ్ఞాపకం ఉండిఉంటే అలాచేయలేడు.
   అలాగే చాలా ప్రేమలు విపలం కావటానికి ఎన్నో అడ్డంకులూ,ఇతర ఆకర్షణలూ..,
   ఇక్కడ నేను చెప్పాలి (చెప్పగలిగానో లేదో?) అనుకున్నది మీరు గ్రహించినదే ఓఅపురూపమైన ప్రేమ భావాన్ని విస్మరించిన వారికి
   తిరిగి దాన్ని ప్రతి రోజూ గుర్తుచేయాల్సిన స్థితి ఆమెకు రావటం వెనుక ఉన్న బాద.
   సర్, మంచి కథా రచయిత మీరు అందుకే అలా అనిపించింది.
   చదివి , మెచ్చిన మీకు కృతజ్ఞతలు.

   Delete
 11. చాలా బాగుంది. అభినందనలు.

  ReplyDelete
 12. సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.

  ReplyDelete
 13. చాలా బాగుంది !

  ReplyDelete
 14. కవిత చాలా చాలా చాలా బాగుంది.
  అద్భుతమైన భావవ్యక్తీకరణ.

  ReplyDelete
  Replies
  1. భారతి గారూ, మీకు నచ్చింది అన్నారు చాలా కృతజ్ఞతలు.
   నా భావాలను మెచ్చే మీకు ధన్యవాదాలు.

   Delete
 15. " ద్రవించే హృదయం,మతిలేని మనస్సూ నీ చుట్టూ భ్రమిస్తున్నాయని ,

  తెలుసుకోన్నావో లేదూ, కక్షగా వాటి కక్ష్య మార్చివెళ్ళావ్." మీ కవిత్వం వర్షంలో మల్లెల గుభాళింపులాంటిది మెరాజ్ గారూ. ఒకేసారి రెండు మూడు అనుభూతుల్ని కలిపిమరీ అనుభూతించినట్టు భావన..అభినందనలు

  ReplyDelete
 16. వాసుదేవ్ సారూ, మీ స్పందనకు, మీ విశ్లేషణకు ధన్యవాదాలు.
  నా కవితకు స్ఫూర్తి మీ ప్రశంస. కృతజ్ఞతలు.

  ReplyDelete
 17. ప్రతి రోజూ నన్ను నేను గుర్తుచేసుకుంటాను శాపము మోసే శకుంతలలా,
  చిరునవ్వుతో పలకరిస్తావ్ అసలేమీ నీకు తెలియదన్నట్లుగా... మీ కవిత ప్రవాహం బాగుంది మెరాజ్ గారు

  ReplyDelete