Pages

Monday, 13 August 2012

ఎవరు దోషులు?ఎవరు  దోషులు?

ఆడపిల్లగా,అవిటిపిల్లగా  పుడితే  పెంచటానికి  చావ లేని 
పార్కులో   పారవేసిన   కన్నవాళ్ళా?

చేతికెత్తుకొని ,  చంకనేసుకొని  ఎర్రటెండలో  అడుక్కునేందుకు   
ఆయత్తమయిన   యుక్తి తెలిసిన   యాచకులా  ?

అడుక్కున్న  అన్నాన్ని  పంచలేదని   అలకబూనిన 
చెంత నుండే    చిన్న నాటి    నేస్తగాళ్ళా  ?

అడ్డుపడే   చింకి లంగా   చీకిపోయి  చినిగిపోతే
చొంగకార్చే  రోతమాలిన   కొంటెగాళ్ళా ?

చెట్టుకింద  కూర్చున్నా ,మెట్టుమీద  కూర్చున్నా 
చీదరించుకొనే   కోట్లు  సంపాదించే   కొట్టుగాళ్ళా ?

చీటింగూ,  చైనుస్నాచింగూ   కేసులు  బనాయించి 
బొక్కలోతోసే   కనికరం  లేని  ఖాకీ గాళ్ళా ?

నడిరోడ్డు  మీద  అడుక్కుంటూ  అమ్మా, అయ్యా  అంటున్నా 
చలించక  తలతిప్పక   కూర్చున్న   సిటీ గాళ్ళా ?

హంసలా  ఉన్నా  కాకిలా ఉన్నా  అర్ధరాత్రి  ఆడవాసనకు 
అలవాటుపడి   వెంటపడే   వేట గాళ్ళా ?

ధరలు  మండుతున్నా , దరిద్రం  వదలకున్నా ,
పదవిపట్టుకు   పాకులాడే  నేతగాళ్లా ? ( నేత అంటే ఇక్కడ మంత్రి  ) 

అర్ధ రాత్రి దందాలను ,  అసాంగిక కార్యాలను   దారి కాచి , 
కెమెరాల్లో   బంధించి  కథలుగా  చూపే  మీడియాగాళ్లా ?


(ఇల్లూ,వాకిలీ, కూడూ,గూడూ, తోడూ,నీడా ,దారీ ,తెన్నూ 
లేక ,రోగాలకీ, ఆకలికీ, బలై   జీవచ్చవాల్లా  బ్రతికే  బడుగు జీవుల ;
ఆనాదల జీవితాలు  కోకొల్లలు  కంటిముందు  కనిపిస్తున్నా , ఏమి చేయాలో తెలీక ,
ఏమిచేయకుండా  ఉండలేక, మనసును  మబ్యపెట్టి , అంతరాత్మను  అదిలించి ,
పాపబీతిని  పాతిపెట్టి , మానవత్వానికి  మంటబెట్టి  కళ్ళున్నా కబోదుల్లా  కాలాన్ని లాగేస్తున్న  సగటు  మధ్యతరగతి  మనుషులం మనమంతా.... సమాజంలో  మనమూ బాగమే కనుక  మనమూ కొంతవరకు  దోషులమే  ఏమంటారు? ఎంతమంది నాతో ఏకీభవిస్తారు.?)  

( నా కవిత   ఏ  వర్గం   వారినయినా  నొప్పించి ఉంటె  మన్నించాలి )

28 comments:

 1. ఫాతిమా గారు చాల బాగా చెప్పారు మీరన్నది నిజమే కవిత లో మీరు చెప్పిన అందరితో పాటూ మనమూ దోషులమే చక్కని కవిత.

  ReplyDelete
  Replies
  1. వీణ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
   మనం కూడా దోషులమే అనుకునే మీ ఆత్మ విమర్శ ప్రశంసనీయం.

   Delete
 2. ఫాతిమాజీ !..మనమందరం దోషులమే ! అలా అని సంస్కరించే దైర్యం మనకి ఉందంటారా?
  మీ ఆవేదనాక్షరాలు కదిలించాయి.

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ, మనం దోషులం అనే ఆత్మవిమర్శ మనలో ఉంది అంటే కనీసం పీడిత వర్గానికి చేయూత ఇవ్వలేకున్నా,
   పీడించే వారిలో ఉండం అదే మనం చేసే మేలు.

   Delete
 3. నిజాయితీగా ఎవరిపని వారు చేసుకుంటూ, వీలయితే చేతనయినంత మేరకు ఇతరులకు సహాయం చేసేవారు ఎక్కువే ఉన్నారు మన సమాజంలో. వారంతా దోషులెందుకవుతారు? ఆ మాటకొస్తే మీరు దోషి ఎలా అవుతారు, ఏ తప్పూ చేయకుండా??

  ReplyDelete
  Replies
  1. సర్, మొదటిసారిగా నా బ్లాగ్ కు విచేసిన మీకు కృతజ్ఞతలు.
   మన్నించాలి నేనిక్కడ ప్రస్తావించినది నిజాయితీగా పనిచేసుకుపోయే వారిని కాదు.
   ఇకపోతే నేను ప్రస్తావించిన వృత్తులు ( పోలిస్, మీడియా,పొలిటికల్,) నిజాయితీగా నిర్వర్తించే మహానుభాయులు లేకపోలేదు.
   ఇకపోతే ప్రతి విషయానికీ మనకెందుకులే మనకు సంబంధం లేదుకదా అనుకోవటం, కళ్ళముందు ఏది జరిగినా చలించకపోవటం ఓ విదమైన అసమర్దతే నా దృష్టిలో (మన్నించాలి ఇది నా అభిప్రాయం మాత్రమె ) సర్ కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

   Delete
 4. అందరూ! మనమందరమూ బాధ్యులమే

  ReplyDelete
  Replies
  1. సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 5. ఫాతిమా గారూ!
  గతంలో మీరు వ్రాసిన కవిత
  ' ఏం చేద్దాం.'..కి పొడిగింపులా..ప్రశ్నల పరంపరలా సాగింది మీ కవిత.
  వాళ్ళ ఆర్ధిక స్థితికి కారణం సర్కారు వారిదైతే..
  మిగిలిన దోషం కుసంస్కారులదే....
  కవితలో వారి పట్ల జరుగుతున్న అన్యాయానికి
  నిరసన స్పష్టంగా కనపడుతోంది...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
   మీరన్నది అక్షరాలా నిజమే దోషం కుసంస్కారులదే..
   ఆవిదమైన కుసంస్కారం ఇలాంటి అనాదల మీద ఎక్కువగా ప్రదర్శించటం జరుగుతుంది.
   అస్సలు తప్పును తప్పుగా ఒప్పుకునే సంస్కారం ఎంతమందిలో ఉంటుంది.
   వారి పట్ల జరిగే అన్యాయాలను ఎవరు ఎదిరించగలరు? నా ఆవేశాన్ని అర్ధం చేసుకున్న మీకు కృతజ్ఞతలు.

   Delete
 6. కూడు గూడు లేని మగపిల్లల కంటే ఆడపిల్లల కష్టాలు దారుణంగా ఉంటాయన్న
  సత్యాన్ని మరో మారు చెప్పారు. మీరు ఆడపిల్లలకు మీ ఆలోచనను పంచుతున్నారు, సమాజాన్ని చైతన్యం చేయడంలో
  మీ వంతు పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నారు. మీ ఆవేదనను హృద్యంగా, ఆర్థ్రంగా
  చెప్తున్నారు. క్రమేపీ మన సమాజం మారుతుందని ఆశిద్దాం.
  సాకులాగా చెప్పడం కాదు గాని ప్రపంచంలో ఏ మూల చూసినా ఇటువంటి పరిస్థితులు ముల్లుల్లా గుచ్చుకుంటున్నాయి. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ పరిస్థితికి మినహాయింపులేదు.
  వేచి చూద్దాం. మంచి రోజుల కోసం!!
  మరోమారు మీ సత్ప్రయత్నానికి మా మద్దతు తెలియచేసుకుంటూ...

  ReplyDelete
  Replies
  1. సర్, నా ఆవేదను అర్ధం చేసుకున్నారు,
   అనాదలు కారు అందరిలో వారు అనుకోవాలి వారిని ,
   అందులో ఆడపిల్లల జీవితాలు దుర్బరం తల్లిదండ్రులూ, కూడూ , గూడూ అన్నీ ఉన్న ఆడపిల్లలకే సరైన రక్షణ లేని దౌర్భాగ్యపు సమాజంలో ఉన్నాము మనం , ఇలాంటప్పుడు ఓ ఆనాద బాలిక ఎలా బ్రతకగలదు. ఎవర్ని నమ్మగలదు? ఎవరు రక్షిస్తారు? సర్, ఉన్నారు ఎందఱో మహానుభావులు , ఎన్నో స్వచ్చంద సంస్థలు ముందుకొస్తున్నారు ( వారందరికీ శతకోటి వందనాలు ) ఇంకా అందరిలో పరివర్తన రావాలి. నిస్సహాయులైన వారిని ఆదుకోవాలి మనవంతు కర్తవ్యాన్ని మనం విడనాడకపోతే మనం ఈ పోరాటంలో గెలిచినట్లే. సర్ మరో మారు ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
  2. కొత్త పోస్టులకోసం చూస్తూ ఉన్నాను.
   మీరు పండగ హడావుడిలో ఉన్నారేమో కదా!
   మీకు, ఇస్మాయిల్ గారికి జీబాకు రంజాన్ సందర్భంగా
   శుభాకాంక్షలు. మీ ఇంటిని భగవంతుడు చిరకాలం సుఖసంతోషాలతో
   నింపాలని ఆకాంక్షిస్తున్నాను.

   Delete
  3. సర్, మీ అభిమానానికి సంతోషంగా ఉంది.
   కొత్త పోస్ట్ రేపు పెడతాను.

   Delete
 7. "సమాజంలో మనమూ బాగమే కనుక
  మనమూ కొంతవరకు దోషులమే ఏమంటారు?"

  నేను కూడా మీతో ఏకీభవిస్తానండీ.. ఎందుకంటే మనందరం
  "మహాత్మాగాంధీ గారి మూడుకోతులము" కదా!!

  ReplyDelete
  Replies
  1. రాజీగారూ, మనమూ సమాజములో బాగమే అన్న మీ వ్యాఖ చెప్తుంది మీ బాధ్యతని,
   ధన్యవాదాలు నాతో ఏకీభవించిన మీకు. సమాజపు మంచి చెడులకు మనమే కారణం అవునా కాదా అనేదే ముఖ్యం కాదు.
   దాని లోటు పాట్లు సరిచేయటం మనవంతు కర్తవ్యం అనుకోవటం మానవత్వం. కవిత చదివిన మిత్రురాలికి కృతజ్ఞతలు.

   Delete
 8. చాలా ఆవేదనగా ప్రశ్నించారు.ప్రతి సమస్య మన నుండే వచ్చింది కాబట్టి అందరు బాధ్యులే !కాకపోతే ప్రభుత్వానికి మరింత బాధ్యత ఉంటుంది.

  ReplyDelete
  Replies
  1. సర్, చక్కగా చెప్పారు, మనవంతు కర్తవ్యాన్ని గుర్తుచేసుకున్నాం .
   ధన్యవాదాలు నా ప్రతి కవితకి మీ అమూల్య అభిప్రాయాన్ని ఇస్తున్నందుకు.

   Delete
 9. సమాజంలోని చీడ పురుగులకు మీ కవిత ఓ కనువిప్పు కావాలి పాతిమా గారు! ఇలాంటి రచనలు నేటి సమాజానికి ఎంతో అవసరం.

  ReplyDelete
  Replies
  1. నాగేంద్ర గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు,
   కవితలోని భావాన్ని అర్డంచేసుకున్న మీకు కృతజ్ఞతలు.

   Delete
 10. వీథి బాలల దుస్థితిని గురించి మీరు సంధించిన ప్రశ్నాస్త్రాలు -
  వాళ్ళను కని వదిలించుకున్న దౌర్భాగ్యులు ,
  సమాజం , ప్రభుత్వాలు , స్వచ్చంద థార్నిక సంస్థలూ -
  ఇలా అన్నింటి బాధ్యతలను గుర్తు చేస్తున్నాయి .

  దేశంలో ప్రభుత్వ , ప్రభత్వేతర యాజమాన్యాలలో పనిచేసే
  అనేక ఆర్ఫనేజీ లున్నాయి .
  మనల్ని మనం నిందించు కోవడం కాకుండా -
  పిల్లల్ని వాటిలో చేర్పించి ,
  వాటిని బలోపేతం చేయడానికి ,
  మనవంతు కృషి చేస్తే -
  సమస్య పరిష్కారమౌతుంది .
  ----- సుజన-సృజన

  ReplyDelete
  Replies
  1. సర్, మీ మాటలు చక్కని పరిష్కారాలు, గతంలో నా కొన్ని కవితలకి స్పందించిన మిత్రులు ప్రిన్స్ గారు కొన్ని సంస్థల పేర్లను సూచించారు.
   ఇకపోతే మనల్ని మనం నిందించుకుంటున్నాము అంటే మన భాద్యతను స్వీకరించటానికి ఆయత్తమవుతున్నాము అని అర్ధం.తప్పకుండా మనవంతు కృషి చేద్దాం. సర్, నేను కవితల్లోనే కాదు చేతల్లోనూ చేయటానికి (చేస్తున్న) సంసిద్దమే. మీ అమూల్యమైన సలహాని అందరూ పాటించటానికి వారికి ఆ శక్తి అల్లా (దేవుడు) ఇవ్వాలని కోరుకుంటున్నాను. సహృదయులైన మీకు నా కృతజ్ఞతలు.

   Delete
 11. ఇన్ని అరాచకాలు, నేరాలు జరుగుతున్నా, చట్టాలని సరిగ్గా అమలు చెయ్యని నాయకులే ప్రధమ దోషులు.
  ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి.

  ReplyDelete
  Replies
  1. bonagiri gaaroo, మీరు చెప్పినదానిలో నిజం ఉంది,
   ఒక సామాన్య మానవుడు ఎంత కృషి చేసినా చట్టాలను అమలు చేయలేడు కదా,
   పాలకులు కళ్ళుమూసుకుంటే గుడ్డి రాజ్యమే అవుతుంది. మీ స్పందనకు,
   మీ సామాజిక పరిశీలనకు అభినందనలు.
   నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

   Delete
 12. ఎవరు దోషులు అని ఒకరిని ఇంకొకరు అనుకోవడంకన్నా పరిష్కారమార్గం అన్వేషిస్తే బాగుంటుందేమో!

  ReplyDelete
  Replies
  1. ప్రేరణ గారూ, సున్నిత హృదయాలూ, కార్యదీక్ష గలవారూ ఇలాగే ఆలోచిస్తారు, మీ ఆలోచన విదానం చెప్తుంది మీరు సంస్కారవంతులని. అదృష్టం ఏమిటంటే మన బ్లాగ్ మిత్రులంతా సున్నిత హృదయులు వారి పరిదిలో వారు మంచిని చేస్తున్నవారే లేకుంటే నా ఈ అక్షరాలకు స్పందించారు. నా కవితలోని భావాన్ని అర్ధం చేసుకున్న మీ అందరికీ నా హ్రిదయపూర్వక కృతజ్ఞతలు.

   Delete
 13. ఎవరు దోషులు?

  ReplyDelete
 14. సందీప్ గారూ, నా అభిప్రాయం లో కొంత మందిని సూచించాను (నాతో కలిపి),
  ఇక మీరు చెప్పాలి ఎవరు దోషులో,
  నా బ్లాగ్ కు విచ్చేసిన మీకు ధన్యవాదాలు,

  ReplyDelete