Pages

Saturday, 11 August 2012

బందీ

బందీ

నిను నీవు బంధించుకున్నప్పుడు, నీ చుట్టూ నీవే ప్రదక్షిణ చేసుకున్నప్పుడు...
మొదట మందగమనంలా  వీచిన సమీరం ..తర్వాతా సుడిగాలిలా వీస్తుంది. 

వలపుగాటులా అనిపిస్తుంది, కానీ వడిశిలలా తగులుతుంది .
నిను శిలగా చేసి,..ఉలి చేత పట్టుకుని  తాను  శిల్పి అవుతుంది .

నీ తలపుల  సరాగాలకు, సరదాలకూ, సరసాలకూ పరదా పడుతుంది.
నిత్యం తానె  అయి ..నీతోనే ఉంటూ, నీకై తానేనంటూ...హారతి పడుతుంది.

దేనికోసం  ఏది విడవాలో, ఎవరికోసం  ఎవర్ని వదలాలో..,
అస్సలు మరచిపోవాల్సింది  ఏమిటో..గుర్తుకు రానిదేమిటో.?? 

నీకు మాత్రమే గుర్తున్న  నీ జ్ఞాపకాలని ఎదుటివారినుండి
ఎలాదాచాలో, అసలెందుకు దాచాలో తెలీని పరిస్థితి.

అమ్మా, నాన్నలకు  యువరాజుగా  అభయం  ఇవ్వటం.
చెల్లికి  తగిన జోడిని తెస్తానని  ప్రగల్బాలు పలకటం.
తన ప్రేమ గొప్పదని,   నమ్మమని  ప్రేయసికి  మాటివ్వటం.

అప్పుడప్పుడూ  వాటితాలూకు  వాసనలూ, వాస్తవాలూ,
ఇంట్లో  చర్చలై సాగుతుంటాయి. జవాబు లేని  ప్రశ్నలే  ఉంటాయి . 
కలతలంటే  కలవరపాటు, తగవులంటే తత్తరపాటు.

బిడియంతో బిగుసుకు పోయే  బిత్తరపాటు, తమకంతో  తత్తరపాటు.
ఎవరైనా చూస్తె  ఎలా అనే తడబాటు, తెలిసిపోతే ఎలా అనే  గ్రహపాటు.   

మౌనిలా, జ్ఞానిలా ఉండేందుకు  ప్రయత్నం, యోగిలా, విరాగిలా అంతరంగం.
తలపుల తుంపరలో  తడుస్తూ, మణుగుల కొద్దీ మౌనాన్ని  మోస్తూ.

మనస్సు పడే మధనాన్ని  చేదిస్తూ, ఎద వేదనని ఖండిస్తూ,  
అడుగడుగునా అర్ధాంగిని అనుసరిస్తూ,(అనుకుంటూ).

ఇంతకీ  నీవెవరూ  నీకైనా తెలుసా  అస్తిత్వానివి 

నిత్యం మానసిక మైదానంలో  ఇరుపక్ష  పోరు నీవే  సాగిస్తూ, 
నీటిని దోసిట నిలపాలని చూస్తూ, నిప్పును మూట కట్టాలనుకుంటూ.

ఒంగిపోతూ, క్రుంగిపోతూ ఒక బంధం కోసం వేయి బంధాల ముందు,
ఓడిపోయిన అవిజేయుడివి..జీవితాన్ని కుదవ పెట్టిన  వివాహితుడివి. 

28 comments:

 1. ఫాతిమా గారు..
  చాలా చక్కగా వర్ణించారు అండీ..వివాహితుడి మనసును...

  "దేనికోసం ఏది విడవాలో, ఎవరికోసం ఎవర్ని వదలాలో" ఆ లైన్ ఎందుకో కదిలించేలా ఉంది..

  ReplyDelete
  Replies
  1. సాయి, కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
   జీవితంలో నిర్ణయాలు సమతుల్యంగా ఉండేలా చూసుకోండి,
   మీ జీవితాన ఎలాంటి ఒడిదుడుకులు ఉండరాదని కోరుకుంటూ ...అక్క మెరాజ్

   Delete
 2. అవును బందీనే !
  ' బ్రతుకు భద్రత ' పొందిన బందీ .
  ' అమృత మయి ' తోడు కోల్పోతే -
  ' అస్తిత్వం ' కోల్పోతాడు మరి !
  బంధనాలు 'తెంపుకో' జూస్తే -
  ' బ్రతుకే ' అభద్రతలో పడిపోతుంది మరి !

  తల్లీ , చెల్లీ , ఆ ' అమృత ' వల్లీ
  అనురాగాల ఉలులతో తొలిస్తేనే
  జడమైన ఈ ' బండశిల '
  మాన్య ' మానవతా ' శిల్పంగా మారేది మరి !
  ' ప్రేమామృతాన్ని ' చిలుకరిస్తేనే -
  ప్రాణ ప్రతిష్ఠ జరిగేదీ ,
  మగవాడు ' మహోన్నత ' మూర్తి మంతు డయ్యేది మరి !

  అందాకా
  అతగాడు
  హీరో కాదు
  జీరో !

  ఫాతిమాజీ ,
  మీ రచనా శైలి అమోఘం ,
  ఆ వచన సంవిథానం అనితర సాథ్యం ,
  ఆ పద గుంఫనం అతులితం ,
  ఆ భావ ప్రకటనా కౌశలం అమందానంద తుందిలం .
  ----- సుజన-సృజన

  ReplyDelete
  Replies
  1. సర్, ఈరోజు చాలా సుదినం ,
   గురువుగారి మెప్పు పొందాను. నా కవిత, నా శైలి, వచనా సంవిదానం బాగుంది అన్నారు.
   ఇంకేమి కావాలి. చాలా కాలం తర్వాత నా బ్లాగ్ దర్శించారు.
   ఇతర బ్లాగుల్లో మీ వ్యాఖలు చూసి నా రచనలు బాగా లేవేమో అనుకున్నాను.
   సర్ చాలా సంతోషంగా ఉంది మీఎకు కవిత నచ్చినందుకు.

   Delete
  2. మల్లియ లన్న , వెన్నెల సమాగమ మన్న , ప్రభాత రోచులన్
   జల్లు ఉషోదయం బనిన , చల్లని యేటి జలంబులన్న - ఏ
   యుల్లము పల్లవింపదు ? మహోన్నత తెల్గు పదాల తేనె చి
   ప్పిల్లు ' మెరాజు ఫాతిమ ' కవిత్వపు విందులు నట్టివే కదా !
   ----- సుజన-సృజన

   Delete
  3. గురువుగారి దీవేనలకొరకు ఏ శిష్య రత్నం తపించదు.
   కృతజ్ఞతలతో ..మెరాజ్

   Delete
 3. "మౌనిలా, జ్ఞానిలా ఉండేందుకు ప్రయత్నం, యోగిలా, విరాగిలా అంతరంగం."

  తన బాధ్యతలు అనుకున్న వాటిని నిర్వర్తించటానికి ఆరాటపడే ఒక సగటు మనిషి
  అంతరంగాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారండీ ..

  ఇలాంటి వాళ్ళు ప్రతి చోటా మనకు ఎదురవుతూనే వుంటారేమో..
  మన వాళ్ళగానో మనకు తెలిసిన వాళ్ళలాగానో..
  చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. రాజీ గారూ, మీరు అక్షరాలను ఆకళింపు చేసుకుంటారు అందుకే సంగీత ప్రియులు కూడా.
   నేను చెప్పిన కవిత అదే, వీరంతా మన వారే, మనమధ్య ఉన్నవారే,
   నిత్యం తన కుంటుంబం కోసం శ్రమిస్తూ ..
   తన వారి నుండే విమర్శలు ఎదుర్కోవటం లో సతమతమయ్యే వీరు ఎంత క్షోభను అనుభవిస్తున్నారో కదా.

   Delete
 4. మీ కవిత ఒక ప్రశ్న అయితే శ్రీ వెంకట రాజారావు గారి కవిత ఒక
  సమాధానం.
  ఇద్దరికీ శాభాసులు!

  ReplyDelete
  Replies
  1. సర్, కవిత చదివిన మీకు ధన్యవాదాలు. నా కవిత మీద మీ అభిప్రాయం చెప్పలేదు.
   ఈ కవిత మీద మీ స్పందన తెలియ లేదు. బహుశా ప్రమోషన్ హడావిడిలో ఉన్నారు అనుకుంటా., కంగ్రాట్స్ సర్.

   Delete
 5. చక్కగా రాసారండి...:-)

  ReplyDelete
  Replies
  1. సీత గారూ, కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

   Delete
 6. ఫాతిమా గారూ!
  అవును ...
  బందీ ఒకబంధం కోసం చాలా బంధనాలను తెంచుకుంటున్నాడు...
  ఉలి సరి అయిన శిల్పి చేతిలో పడితే సుందర శిల్పమౌతుంది
  లేకుంటే అర్థం కాని మోడరన్ ఆర్ట్ లాగ అయిపోతుంది...
  ఎక్కడో విన్న జ్ఞాపకం...
  "నారి తల్లి స్థానంలోనే పూజనీయురాలు" అని...
  మహిళలు ఇందులో వేరే అర్థాన్ని వెదుక్కోకండి దయచేసి...
  మహిళా పోషించే మిగిలిన పాత్రల్లో స్వార్థం ఉండవచ్చు కానీ
  తల్లి మాత్రం నిస్వార్థంగా ప్రేమనిస్తుంది అని చెప్పటం...
  మహిళా స్వేచ్చని కట్టడి చేసే పురుషాహంకార ప్రపంచంలో...
  మీరు వ్రాసిన బందీలు తక్కువ మాత్రం లేరేమో???
  అద్భుతమైన పదజాలంతో సాగింది మీ కవిత.
  కవిత "బందీ" యే
  కాని అక్షరాలు మాత్రం చాలా స్వేచ్చగా చరించాయి మీ కలం నుంచి...
  అభినందనలు...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. సర్, నేను చెప్పాలి అనుకున్నది ఇంకా చాలా ఉంది.
   మీరన్నది నిజమే తల్లి మాత్రమె స్వార్ధం లేనిది.
   ఇకపోతే అలాంటి బంధాన్ని కూడా వదులుకొని,
   అందరినీ వదులుకొని వచ్చిన తన పత్ని కోసం జీవితాన్ని పంచటానికి వెనుకాడడు,
   అయితే జీవితాన్ని పంచుకోవాలి అమ్ముకోకూడదు,
   ఒకరిని మెప్పించటం కోసం ఇంకొకరిని నొప్పించకూడదు.కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

   Delete
 7. అంత పరిపక్వతలేని పొడిగారాలి చిన్ని చిన్ని ఉలిదెబ్బలకే పగిలిగాట్లుపడే శిలని శిల్పిమాత్రం అందమైన శిల్పంగా మలచి అందరి మన్ననలూ పొందలేదనిపిస్తుందండి. ఏదో కొన్నాళ్ళు తను మలచిన శిల్పాన్ని చూసుకుని ఆనందిస్తుందేమోకాని క్రమంగా బీటలువారే తను మలచిన శిల్పాన్ని చూసి మురవలేదేమోకదా! ఏదో నాభావాన్ని ఇలా పలికాను మన్నించాలి.

  ReplyDelete
  Replies
  1. పద్మ గారూ, మీరన్నది నిజమే పనికిరాని రాయిని ఎవరూ మంచి శిలగా మార్చలేరు.
   కానీ, ఆ రాయి ఎవరి చేతిలో ఉంటె వారి ఆలోచనాపరంగానే రూపు దాలుస్తుంది.
   కానీ అది కేవలం తనకు మాత్రమె నచ్చేవిదంగా మలచుకుంటే దాని శోభ అందరికీ కనిపించదు.
   పద్మ గారూ, ఇక్కడ ఓ విషయం ప్రస్తావిస్తాను .....
   ఈనాడు సమాజంలో చాలా బంధాలు విచ్చిన్నం కావటానికి కారణం, అహంకారం, అభద్రతా భావనలే. ముఖ్యంగా స్త్రీలు తీసుకొనే నిర్ణయాలు. వారి ప్రవర్తనా పురుష లోకానికి సవాల్ విసురుతున్నాయి, ఒక్కోసారి భర్త ప్రవర్తనలో ప్రతిదీ తప్పుగా అనిపించటం పలితంగా విడిపోవటం. ఒక్కసారి తమ నిర్ణయాలు ఎంత గోరమైనవో వారి బిడ్డల మీద ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయో ఆలోచించాలి. మేడం నేను చెప్పాలి అనుకున్నది ఏమిటంటే స్త్రీలు తమ హక్కులను సక్రమంగా ఉపయోగించుకోవాలి

   Delete
 8. అమ్మో ఇదేదో మాపై ఎక్కుపెట్టిన అస్త్రంలా ఉంది.:)
  వివాహితుడై శిల్పంగా మారాలా లేక శిలగా కరిగిపోవాలా?

  ReplyDelete
  Replies
  1. అనికేత్ గారూ, బయపడకండి జీవితాన్ని ఉన్నతంగా తీసుకోండి.
   నైతిక విలువలున్న బాగాస్వామిని ఎన్నుకొని, బంధాలను గట్టిపరచుకోండి
   కవిత చదివిన మీకు కృతజ్ఞతలు.

   Delete
 9. వివాహితుడి మనసును'బందీ'రూపంలో చక్కగా వర్ణించారు. అభినందనలు ఫాతిమా గారు!

  ReplyDelete
  Replies
  1. నాగేంద్ర గారూ, మీ ప్రశంస నన్ను చాలా ఆనందాన్ని ఇచ్చింది.
   నా కవితలు చదివి నన్ను ప్రోత్సహించే మీకు థాంక్స్.

   Delete
 10. నిత్యం మానసిక మైదానంలో ఇరుపక్ష పోరు నీవే సాగిస్తూ,
  నీటిని దోసిట నిలపాలని చూస్తూ, నిప్పును మూట కట్టాలనుకుంటూ.


  పాతిమా జీ .. ఇది నిజం.
  మీ మనసులోని భావాలని చక్కని వ్యక్తీకరణలో.. మా ముందుకు తెస్తున్నారు.
  రోజూ..చెప్పే మాటే ..బాగుంది..అని
  కాని అది హృదయంలోటు నుండి వెలికి వస్తుంది. .. థాంక్ యు!!

  ReplyDelete
  Replies
  1. వనజగారూ, మీరు బాగుంది అని మనస్పూర్తిగా అంటారని తెలుసు.
   మీ ప్రశంస చాలా ఆత్మీయంగా ఉంటుంది.
   నా భావాలను వ్యక్తీకరించటంలో నేను క్రుతకృత్యురాలను కావటానికి మీరూ కారణమే.
   ధన్యవాదాలు మీ ప్రశంసకు.

   Delete
 11. చాలా బాగా రాసారు :)

  ReplyDelete
 12. హర్షా , కవిత చదివి మెచ్చినందుకు థాంక్స్.

  ReplyDelete