Pages

Wednesday, 16 April 2014

గో(డు)డ.

    
   గో(డు)డ.

    నా ఇరుకు గది  కటకటాల  వెనుక,
    ఉన్న గోడ నాతో మాట్లాడుతుంది.

    నా నినాదాన్ని మానవ సమూహానికి,
    చేరవేస్తుంది.

    భయంతో ముడుచుకొనే నా వెన్ను నిమిరి,
    నన్ను  తనకు  హత్తుకుంటుంది.

    నేను  చూసే ఎర్ర,ఎర్రని అశాంతి చూపులకు,
    దవళ హసితమై  దర్శనమిస్తుంది.

    గోతాముల్లో మూతి బిగుంచుకున్నపిరికి వాళ్ళను 
    భుజానికెత్తుకుంటుంది. 

    నైతిక,అనైతిక సూత్రాలను  వల్లెవేస్తుంటే,
    తెల్లబోయిన  ముఖంతో చూస్తుంది.

    విశ్వాస,విప్లవ,విద్వంస, రక్తాక్షరాలకు,
    శిలా ఫలకమై స్థిరంగా ఉంటుంది.

    కులపు కంపులో కుంచె ముంచి రాసినా..,
    వర్షపు తడిలో ఒళ్ళు  తుడుచుకుంటుంది.

    ఎదురుగా మోకాళ్ళపై మోకరిల్లినా,
    తథాస్తూ... అంటూ దీవిస్తుంది.

    స్వార్ద శక్తులు బలా,బలాలు ప్రదర్శించినా,
    బీటలు వారి  భూమద్యరేఖగా  మారుతుంది.

    ఒకటిమాత్రం నిజం శవాల ఆవాసాల మద్య,
    మంచు ముద్దలా మౌనంగా ఉంటుంది.

    బ్రతుకు   భాగాహార  భూబోగాతాల్లో..,
    తానూ భాగస్వామ్యమై అడ్డంగా అఘోరిస్తుంది.

    ఆవలి ప్రపంచానికి అడ్డుగా అనిపించినా,
    నాకు  మాత్రం  అద్దంలా  అనిపిస్తుంది. 


10 comments:


 1. చూసారా మీ రచనల్లోని ప్రత్యేకతలు .
  ఓ రుమాలు,
  ఓ చందురుడు,
  ఓ రైతు బజార్,
  ఓ గోడ, ... ఇలా ఎన్నెన్నో.
  ఏ ఇతివృత్తం అయినా, సునాయాసంగా ఓ పరిపూర్నమైన మాలను అల్లగలరు.
  అల్లిన మాలకు సుఘంద సువాసనలను పులుమగలరు.

  " నైతిక,అనైతిక సూత్రాలను వల్లెవేస్తుంటే,
  తెల్లబోయిన ముఖంతో చూస్తుంది."

  " విశ్వాస,విప్లవ,విద్వంస, రక్తాక్షరాలకు,
  శిలా ఫలకమై స్థిరంగా ఉంటుంది."

  ఓ ' శ్రీశ్రీ ' ని గుర్తుకు తెస్తున్నారు.
  పదజాలం బరువున్నా , ఓ సామాన్యుడి గుండెల్ల్లోకి చొచ్చుకు పోతాయి.
  అందుకే మీ రచనలంటే చాలా చాలా ఇష్టం.

  కవిత ఆసాంతం అర్ధవంతంగా ఉంది - అందరి మన్ననలనీ ఆపాదించు కుంటుంది .
  అభినందనలు ఫాతిమా గారూ.
  *శ్రీపాద.

  ReplyDelete
  Replies
  1. శ్రీపాద గారూ, మీ వాఖ్య చదివితే ఎంతోగర్వంగా ఉందండీ,
   ఓ మహా కవితో పోల్చబడటం మామూలు విషయమా??
   నా ప్రతి రచన వెనుకా మీ ప్రశంస ఉంది, అందుకే ఇంకా రాయాలి అనే ప్రేరణ వస్తుంది,
   నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

   Delete
 2. మేడం నమస్తే, ఈ కవిత "నాటా" పోటీకి పంపారు కదా, ఇందులో గోడ తో మీరు చెప్పుకొనే గోడు ఎంత బరువైనదో తెలుస్తుంది.
  దేశ,సామాజిక,సాంఘిక,మానసిక సంఘర్షణ కనిపిస్తుంది.
  చూశారా్ రోజీ మీతో ఉండి నేను కూడా ఎదో,ఎదో రాయగలుగుతున్నాను.
  మీతో కలసి మన స్కూల్ లో జాబ్ చేయటం అదృష్టంగా భావిస్తాను నేను.

  ReplyDelete
  Replies
  1. లక్ష్మీ, నిన్నెప్పుడూ ఓ టీచర్ గా చూడలేదు నేను, నా చెల్లిగానే అనుకుంటాను,
   మీ మనస్సులో ఏమున్నా నా సాహిత్యం పట్ల రాయొచ్చు.
   అయినా మొదట చూపించేది మీకే కదా..:-))

   Delete
 3. ఫాతిమాజి ,

  శ్రీశ్రీ గారన్నట్లు ,

  అగ్గిపుల్ల , సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నట్లు . ఈ " గోడ గోడు " అందర్నీ ఆలోచింపచేసేదిలా , ఆకర్షించేదిలా వున్నది .

  వెరీ వెరీ నైస్ .

  ReplyDelete
  Replies
  1. శర్మాజి, మీ ప్రశంసకు ధన్యవాదాలు,
   అన్ని కవితలూ అందర్నీ ఆలోచిపజేయవు, ఎందుకో

   Delete
 4. ప్రతీ గోడ (గుండె)వెనుక ఒక గోడు ఉంటుంది కదా దీది .... చాలా బాగా తెలియచేసారు

  ReplyDelete
  Replies
  1. స్వేతా నిజమే ప్రతి గుండే వెనుక ఓ కథ ఉంటుంది.

   Delete
 5. గోడకు చెవులే కాదు
  వినే మనసు ఓదార్చే ఓర్పూ
  సేద తీర్చే చెలిమీ ఉందని
  ఆ సాన్నిహిత్యపు సంఘర్షణల్లో
  ఎనలేని ఆత్మీయతా
  ఒంటరితనపు అంతః సమరానికి
  ఆ మట్టిగోడ మైనమై
  జీవితాన్ని
  ఆశాకాంతి మయం చేస్తుందనీ
  హృద్యంగా చెప్పారు దీదీ
  నిజానికి గోడ అదే ...
  గోడు లోని అతి సాంద్రత,
  నిశ్చల మనొస్థితిని,
  గోడ ఘనీభవ స్థితిని ద్రవీభవించి
  తన మౌనం నుంచే
  మానవాళికి ఎన్నో
  పరోక్ష ప్రత్యక్ష సహవాసాన్నిస్తుంది
  ఎన్నో సహజాసహాజ సంఘటనలకు
  ప్రత్యక్ష సాక్షిగా
  మనముందు మనల్నే చూపే
  దర్పణమై దర్పంగా
  ఇంకెన్ని పుటలు
  తన పొట్టలో దాచుకోవాలో
  అనుకుంటూ
  తన బీటల్ని లెక్కిస్తూ
  ఎదురు చూస్తూనే ఉంది. 

  ReplyDelete
  Replies
  1. జానీ, గోడ ఓదారుస్తుంది
   అనుకుటే
   సేద తీరుస్తుందీ అనుకుంటే,
   మనస్సుకు ఓ త్రుప్తి,
   కానీ మన గోడు వినేందుకు అదో సాదనం,
   నిజమే సామాజిక, సాంఘిక గోడ బీటలు వారే ఉంది.
   అమూల్యమైన మీ స్పందనకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెల్పుతూ....మీ దీదీ.

   Delete