Pages

Tuesday, 12 August 2014

అతి (వల) లు

          అతివ(ల)లు

    మా కలలపై సుపరిచిత చిరునవ్వుల వలలు వేసి,
    వలపు ఎరవేసి ,సహవాస గాలమేసి ,
    ముద్దుచేసి ముచ్చటగా వలవేస్తారు.

    మా ఉద్రేక  సహిత భావాలపై ,
    ఉద్విజ్ఞ భరిత ప్రేమలపై ,రంగుల కలలపై,
    హంగుల,హంగామా గుప్పించి,
    కనిపించని కఫన్  కసితీరా కప్పుతారు.

    మా  సున్నిత హృదయాలపై,
    సూటిగా అనుమానపు అంకుశాన్ని గుచ్చి ,
    మా కన్నీటి తిరుగుబాటుపై ,
    విరుగుబాటై వంటింటి కుందేళ్ళను చేస్తారు.

    మా కడుపుతీపీ,గర్భసావ్రాలకూ ,
    మా  అంతర్యుద్దాలకూ, అశ్రువులకూ ,
    ఇసుమంతైనా చలించక ,
    నిరసనగా..,నిష్క్రమిస్తారు.

    దిక్కుతోచక అంధులమై ,
    నాలుగు  గోడలమద్యనే,
    పదే,పదే పరాజితులమై,
    నెత్తుటి కన్నీళ్ళతో వెక్కుతూ ఉంటాము.

    గోనె సంచులకెత్తిన  అనాథ శవాల్లా,
    అడవి మృగాల అభిరుచులకు అనుగుణంగా,
    మలచబడ్డ మంచు శిలలమై ,
    కరిగిపోతుంటాము.

    అందం తగ్గుతుందనో,ఆడపిల్ల పుడుతుందనో,
    రహస్య గర్భాసావ్రాల  రక్తచరిత్రలమై,
    పుఠలనిండా ,పరిగెడుతూ,
    ముఖచిత్రాలమై  సిగ్గుపడుతుంటాము.

    ఇంటిగుట్టు అనే ముళ్ళకిరీటాలను  పెట్టుకొని,
    పలుమార్లు  మమ్ము మేమే ,
    శిలువ వేసుకుంటూ ఉంటాము.

    కానీ,

    వచ్చేతరాన్ని  రక్షించేందుకై,
    మమ్ము మేము  పుస్తకాలుగా మలచుకొని,
    ప్రతిమలుపువద్దా...,సలివేంద్రమై,
    మా చిట్టి తల్లులకు సేద తీరుస్తాము.


   

4 comments:

 1. బెహేన్ జీ ,

  నా విశ్లేషణ యిబ్బందికరమైతే , విశ్లేషించటం మానివేద్దామనుకుంటున్నాను యిక ముందు .

  చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ . బాగా వ్రాయటం జరిగింది . చక్కగ పదాలు అమరాయి . ఈ లైను బాగుంది అని చెప్పటానికి వీలు లేకుండా అన్ని లైనులు మహ బాగున్నాయి . మనసుని హత్తుకుంటున్నాయి .

  అతివలు అనునిత్యం ఎదుర్కొంటున్న అలవిమాలిన సమస్యలే . అనుమానమేమీ లేదు .

  అయితే కొన్ని కొన్ని చోట్ల సహజమైన అచ్చుతప్పులు దొర్లాయి .

  టైట్ల్ " అతి(వల)లు " కంటే " అతివ(ల)లు " అంటే బాగుండేది .

  అతి (వల) లు

  సుపరిచిత చిరునవ్వుల వలలు వేసి,
  వలపు ఎరవేసి ,సహవాస గాలమేసి ,
  ముద్దుచేసి ముచ్చటగా
  మా కలలపై వలవేస్తారు.

  మా ఉద్రేక సహిత భావాలపై ,
  ఉద్విజ్ఞ భరిత ప్రేమలపై ,
  రంగుల కలలపై,
  హంగుల హంగామా గుప్పించి,
  కనిపించని కఫన్ కసితీరా కప్పుతారు.

  మా సున్నిత హృదయాలపై ,
  సూటిగా అనుమానపు అంకుశాన్ని గుచ్చి ,
  మా కన్నీటి తిరుగుబాటుపై ,
  విరుగుబాటి దాడితో ,
  వంటింటి కుందేళ్ళను చేస్తారు.

  మా కడుపుతీపి,గర్భస్రావాలకు ,
  మా అంతర్యుద్దాశ్రువులకూ ,
  ఇసుమంతైనా చలించక ,
  నిరసనగా..,నిష్క్రమిస్తారు.

  దిక్కుతోచక అంధులమై ,
  నాలుగు గోడలమద్యనే,
  పదే,పదే పరాజితులమై,
  నెత్తుటి కన్నీళ్ళతో వెక్కుతూ ఉంటాము.

  గోనె సంచులకెత్తిన అనాథ శవాల్లా,
  అడవి మృగాల అభిరుచులకు అనుగుణంగా,
  మలచబడ్డ మంచు శిలలమై ,
  కరిగిపోతూ , ఒరిగిపోతుంటాము .

  అందం తగ్గుతుందనో ,
  ఆడపిల్ల పుడుతుందనో,
  రహస్య గర్భస్రావాల రక్తచరిత్రలమై,
  పుటలనిండా ,పరిగెడుతూ,
  ముఖచిత్రాలమై సిగ్గుపడుతుంటాము.

  ఇంటిగుట్టు అనే ముళ్ళకిరీటాలను పెట్టుకొని,
  పలుమార్లు మమ్ము మేమే ,
  శిలువ వేసుకుంటూ ఉంటాము.

  కానీ,

  వచ్చేతరాన్ని రక్షించేందుకై ,
  మమ్ము మేము పుస్తకాలుగా మలచుకొని ,
  ప్రతిమలుపువద్దా...,చలివేంద్రమై ,
  మా చిట్టి తల్లులకు సేద తీరుస్తాము .

  ReplyDelete
 2. మీరు సరిచేసిన నా కవితను యదావిదిగా ఇక్కడ పెట్టేస్తున్నాను, సరిదిద్దుకొనే సమ్యం నాకు ఉండటం లేదు.
  నేను మీరు దిద్దటాన్ని అవమానం గా అనుకోను

  ReplyDelete
 3. తెలిసి తెలిసి ఎందుకు చిక్కుతారు వలలో ?

  ReplyDelete
 4. ఇంటిగుట్టు అనే ముళ్ళకిరీటాలను పెట్టుకొని,
  పలుమార్లు మమ్ము మేమే ,
  శిలువ వేసుకుంటూ ఉంటాము....నిజమేకదా!

  ReplyDelete