Pages

Monday, 16 June 2014

పుస్తక విలాపం    పుస్తక విలాపం 

    నీ తాలూకూ  వాసనలింకా...,
    ఈ  ప్రాంతాన్ని  వదలిపోలేదు,
    నీవు నన్ను వదలి వెళ్ళగలవని, 
    నేనూ  అనుకోలేదు. 

    నీ చెలిమిలోనే సంస్కారం 
    అలవడింది అన్నావు. 
    ఎక్కడికెళ్ళినా... నా చేయి, 
    నీ చేతిలోనే ఉండేది. 

    ఎవరైనా సాహితీ మిత్రులొస్తే,
    నన్ను గర్వంగా వారికి , 
    పరిచయం చేసేవాడివి,
    నా గూర్చి ఎన్ని గొప్పలో.... ,

    ఎన్నో వస్తువులను,
    ఈ ఇంటినుండి మోసుకెళ్ళావు,
    నన్ను దాటుకుంటూ, 
    ఒక్కసారైనా నన్ను  చూడలేదు. 

    ఒక్కసారి వెనక్కి తిరిగి,
    చూసి ఉంటే.., 
    పాలిపోయిన నాముఖాన ,
    దిగులు రేఖలు నీకు  కనిపించేవి,

    నన్ను విరాగిని చేసి వెళ్ళావు,
    వెక్కిరించే  ఖాళీ గదిలో..,
    వెక్కి,వెక్కి  ఏడ్చాను,
    దిక్కులేనిదాన్నయ్యాను. 

    అపరిచితులు 
    నన్ను బైట నెట్టారు,
    ఇప్పటికీ ఆరుబైట,
    నీకోసం ఎండా,వానా అనక 
    ఎదురుచూస్తున్నా..,

    ఓరోజు...,

    ఇదే దారిన వెళ్తూ...,
    నాకు కనిపించావు, 
    పాలిపోయిన ముఖంతో,
    మట్టికొట్టుకున్న  నన్ను చూసి,
    గుర్తుపట్టలేదు,

    అవును  మీ చేతిలో  
    తన చేయి నుంచిన,
    మరో  నెచ్చలి,
    అవును హస్తభూషణం . 

    హుందాగా నడిచి వెళ్ళే,
    నిన్ను చూసి,
    గర్వంగా  నవ్వుకున్నాను,
    నిజమే నా వల్లనే నీకు గుర్తింపు,

   

  


9 comments:

 1. ఫాతిమాజి ,

  " ఒక్కసారి వెనక్కి తిరిగి,
  చూసి ఉంటే..,
  పాలిపోయిన నాముఖాన ,
  దిగులు రేఖలు నీకు కనిపించేవి,"

  ఇలా అనుకోవటం ఆ విఙాన గని సహజత్వం వెల్లడౌతున్నది .
  ఇదే మానవుల సహజబుధ్ధి అని తను తెలుసుకొన్న విఙానగని ద్వారా చెప్పకనే చెప్పించటం చాలా బాగుంది .
  " అపరిచితులు
  నన్ను బైట నెట్టారు,
  ఇప్పటికీ ఆరుబైట,
  నీకోసం ఎండా,వానా అనక
  ఎదురుచూస్తున్నా..,
  ఆ విఙాన గని మానవుల కొఱకు , ఉధ్ధరించాలని ఎంతగా తపిస్తున్నదో అర్ధమవుతున్నది .

  " ఇదే దారిన వెళ్తూ...,
  నాకు కనిపించావు,
  పాలిపోయిన ముఖంతో,
  మట్టికొట్టుకున్న నన్ను చూసి,
  గుర్తుపట్టలేదు,"

  ఇక్కడ తల్లి మనసుని వెల్లడి చేస్తున్నది . తనను పత్తించుకోని పిల్లలను ఎలా తన మాతృప్రేమతో సమర్ధిస్తుందో అలా .

  "హుందాగా నడిచి వెళ్ళే,
  నిన్ను చూసి,
  గర్వంగా నవ్వుకున్నాను,
  నిజమే నా వల్లనే నీకు గుర్తింపు,"

  అయినా తన పిల్లలు గొప్పగా ఉండాలనుకోవటం సహజమైన ఆశ .
  ఉన్నతంగా లేకపోయినా , ఉన్నారనుకోవటం ఆత్మ వంచన . తల్లి దగ్గర ఈ ఆత్మ వంచన , ఆత్మ సంతృప్తిని అందించి , ఆ చిరంజీవులను ఉన్నత స్థాయికి చేరేలా చేస్తుంది .  ReplyDelete
  Replies
  1. శర్మ గారూ !

   ఫాతిమా గారి రచనకు మీ విశ్లేషణ చాలా
   ఇంపుగా, మరెంతో అర్ధవంతంగా ఉందండీ.

   "అయినా తన పిల్లలు గొప్పగా ఉండాలనుకోవటం సహజమైన ఆశ .
   ఉన్నతంగా లేకపోయినా , ఉన్నారనుకోవటం ఆత్మ వంచన .
   తల్లి దగ్గర ఈ ఆత్మ వంచన , ఆత్మ సంతృప్తిని అందించి ,
   ఆ చిరంజీవులను ఉన్నత స్థాయికి చేరేలా చేస్తుంది ."

   - ప్రశంశించ తగ్గ మాటలివి.
   మంచి భావాలను మాకందించినందుకు అభినందనలు మీకు.

   *శ్రీపాద

   Delete
  2. శర్మా సర్, మీ వాఖ్యలు నా కవితకు ప్రానం పోశాయి.
   మీరే కాదు సాహితీ ప్రియులందరూ స్పందిస్తారు, కానీ మీరు చెప్పిన పో్లిక అద్భుతం.
   నిజమే పుస్తకం తల్లివంటిదే..., మీ స్పందన నాకు మంచి దారిని చూపిస్తుంది ధన్యవాదాలు.

   Delete
 2. ఫాతిమా గారూ ..
  అపూర్వమైన అల్లిక ఇది.
  'పుస్తక విలాపం' కవిత ఎంతో బాగా నచ్చింది.
  ఎలాటి ఇతివృత్తాన్నైనా సునాయాసంగా మలిచి
  మీకనుగుణంగా తీర్చిదిద్దడం మీకు కొత్తేం కాదు.

  ఓ పుస్తకం అనుభావవించే వ్యాకులతను ఎంతో దగ్గరగా చూపించారు,
  కదిలించారు కూడానూ మీ ఈ కవిత ద్వారా.

  " నన్ను విరాగిని చేసి వెళ్ళావు,
  వెక్కిరించే ఖాళీ గదిలో..,
  వెక్కి,వెక్కి ఏడ్చాను,
  దిక్కులేనిదాన్నయ్యాను. "

  చెమ్మగిల్లిన కళ్ళతో చదివాను.
  ఇలా రాయడం మీకే సాధ్యం సుమా.
  ముగింపు బాగుంది.

  మరో మారు అభినందనలు మీకు
  ఫాతిమా గారూ.

  *శ్రీపాద


  ReplyDelete
  Replies
  1. నా కవితలను పరామర్సించటములో మీరు నిష్నాతులు.
   ప్రతి పదాన్నీ పలకరించే సాహిత్యాభిలాషులు.
   కవి మిత్రులైన మీ స్పందన నాకు ఎప్పుడూ శుభసూచకమే.

   Delete
 3. మేడం నమస్తే,
  మీరు పెట్టిన టైటిల్ చూస్తేనే తెలుస్తుంది, అక్షరం మీద మీకున్న అభిమానం.
  నిజంగా పుస్తకాలకే మనసుంటే , ఇలాగే విలపిస్తాయో లేదో కానీ,
  సాహితీ ప్రియులు ఇది చదివితే నిజంగానే ఏదిచేస్తారు.
  ఏదైనా మనస్సుకు హత్తుకొనేలా రాయటం మీకే వచ్చు,
  మేడం ట్రాంస్ఫర్ వల్లా మీకు దూరమయ్యాను ,
  మన స్కూల్నీ మిమ్మల్నీ తలవని రోజు లేదు....మీ లక్ష్మి

  ReplyDelete
  Replies
  1. లక్ష్మీ.., ఎలా ఉన్నారు?
   నేనూ మీరు లేని కొరత ఫీల్ అవుతున్నాను,
   నా కవితలంటే మీకు ప్రాణం అదే నాకు సంతోషాన్నిస్తుంది.
   ధన్యవాదాలు.

   Delete
 4. నా పరిసరాల్లోనే నీ కదలికల వాసనలు, అని అనుకున్నానే కాని. నీవు నన్ను వదలి వెళ్ళగలవని అనుకోలేదు. నీ చెలిమిలోనే సంస్కారం లక్షణాలే అంతటా నాలో అన్నావని ....
  ఎక్కడికి వెళ్ళినా ... నా చేయి, నీ చేతిలోనే అని,
  ఎన్నో విలువైన భావనలను ఈ ఇంటినుండి నన్ను దాటుకుంటూ మోసుకెళ్ళేవే కానీ ఒక్కసారైనా నన్ను తిరిగి చూడలేదు .... నన్ను నా దిగులు రేఖలు, పాలిపోయిన ముఖాన్ని.
  ఎందుకో తెలియదు
  ఎవరో వెక్కిరించినట్లు
  విరాగినినై
  దిక్కులేని దానినై
  వెక్కివెక్కి ఏడుస్తున్నానేమో అని నాకే అనిపిస్తూ .....

  పేరు మాత్రమే కాదు
  రాసిన విధానం ఎంతో బాగుంది.
  భావనల లోతు .... ప్రాముఖ్యతను పొందాల్సిన భావుకులను
  సాహిత్యపరం గా కోల్పోతున్నానే అని .... పుస్తకం విలపించడం
  చాలా బాగుంది
  ఆలోచింపచేసేలా .... అందరినీ

  అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

  ReplyDelete
  Replies
  1. సర్, పుస్తక విలాపం , మీరు అర్దం చేసుకోగలరు.
   మీ కవితల్లో మీరు చేసే సున్న్నిత ఆలోచనా ప్రయోగాలు ఇటువంటివే..,
   ఓ రకంగా మీ శైలి కనిపించెలా అనుసరించి రాశాను.
   మెచ్చిన మీకు నా ధన్యవాదాలు.

   Delete