Pages

Thursday, 20 December 2012

మరో హింస.


మరో హింస.


జలగండం, పాము గండం, నా తద్దినం గండం, పిండాకూడు గండం అంటూ రక రకాల గండాలు విన్నా, కానీ ఈ టి.వి. గండం ఒకటి ఉందని జోతిష్యుడు  చెప్పే వరకూ నాకు తెలీదు. అదీ నాకే ఉండాలా? అందుకే ఆ దిక్కుమాలిన టి.వి. ని  తప్పించుకు తిరగడం. నేను ఇంట్లో ఉండేది ఆదివారం ఒక్కరోజే కనుక ఆ ఒక్క రోజు టి.వి పెట్టనని ఒట్టేయమని నా శ్రీమతి మాధవినడిగాను. కాస్త తటపటాయించినా, పసుపు కుంకాలతో వ్యవహారం కాబట్టి ఆవిడ సరేనని అన్యమనస్కంగానే ఒట్టేసింది.

ఆరోజు ఆదివారం.  నాకు ఆదివారం కాస్త  ఆలస్యంగా లేచి  ఏమాత్రం హడావిడి లేకుండా హాయిగా పేపర్ చదువు కుంటూ గడపటం చాలా ఇష్టం. కానీ ఆ రోజు పొద్దున్నే హడావిడిగా  నన్నూ పాపనీ, బాబునీ  నిద్రలేపెసింది  మా ఆవిడ.
ఏంటీ హడావిడీ? అన్నాను చిరాగ్గా. 
"ఏడిసి నట్లుంది...  మా అన్నయ్య వదినా వస్తున్నారని  చెప్పానా, లేవండి, లేచి తయారవ్వండి", అంటూ విసురుగా ఓ తోపు తోసి, ఒక్కచోట నిలవకుండా  హడావిడిగా అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంది మా శ్రీమతి.

తన వదిన ముందు తాను ఏ విషయంలోనూ  తక్కువ కాకూడదని మాధవి ప్రయత్నం. అస్సలు విషయం చెప్పలేదు కదా! మా శ్రీమతి గారికి అన్నీ టి.వి. సీరియళ్ళలో  జరిగినట్లే జరగాలి. మా పిల్లలు అప్పుడప్పుడూ టి.వి. పిల్లల్లా ముదురు మాటలు మాట్లాడి వాళ్ళ అమ్మదగ్గర  మార్కులు కొట్ట్టేస్తూ ఉంటారనుకొండి.
మమ్మల్ని స్నానాలకి తోలేసి ఇల్లు సర్దటం  మొదలెట్టింది, అన్నీ కొత్త సామానులతో ఇల్లు ఎగ్జిబిషన్ లా ఉంది. నన్నూ బాబునీ టి.వి. సీరియల్లోలాగా సూటూ, బూటుతో  కట్టిపడేసింది. పాపకి  జుట్టు నిన్ననే కట్ చేయించేసింది. దానికి ఓ చిన్న మిడ్డీ  తొడిగి, తానూ ఓ మిడ్డీ.. ఛి.. ఛీ.. మిడ్డీ కాదు, జుట్టు విరబోసుకొని కొంత ముఖం మీద వేసుకొంది, చెప్పొద్దూ ఆ వేషం చూసి నాకు నవ్వొచ్చింది, నవ్వితే జరిగబోయే పరిణామాలు ఊహించుకుని నోరు మూసుక్కూర్చున్నా.

ఇంచుమించు మద్యాహ్నం  వరకూ ఎదురుచూస్తూ ఆ ఇరుకు బట్టల్లొ  ఇరుక్కుపొయాము. మా పిల్లలకి  మొఖాలు పదిసార్లు  కడిగి  పది సార్లు పౌడర్ వెసింది  మాదవి, వాళ్ళ  మొఖాలు  పాత ఇంటికి  సున్నం  కొట్టి నట్లు మరకలు, మరకలుగా ఉన్నాయి. 

సాయంకాలం  ఆరు  గంటలు. మూకుమ్మడిగా తయారై కూచున్నాం మేమంతా.  పెళ్ళిలో మా అత్తగారు పెట్ట్టిన బిగుతుగా వొంటికతుక్కుపోయిన  సూటూ, బూటూ లో ఇరుక్కుపోయి, మొఖానికి పౌడరు రాసుకుని  మూకాభినయ కళాకారుడిలా నేనూ,ఫస్ట్ బర్త్ డే  నాటి బట్టల్లో ఇరుక్కుపోయి "జగన్మోహిని" సినిమాలో పిల్ల రాక్షసుడిలా మా బాబూ తయారై ఉన్నాం. 

ఇంతలో వాళ్ళు రానే వచ్చారు. 
"ఆ... ఏం బావగారూ, బావున్నారా? కాస్త లావైనట్టున్నారే? హి .. హి .. హి ... " మా బామ్మర్ది పలకరింపు.

"అవున్రా, నీ బాబు సొమ్ము తిని లావయ్యాను" మనసులో అనుకుంటూ మొహమాటానికి హి..హి.. హి.. అంటూ నేనూ సకిలించాను.. సారీ.. ఇకిలించాను. చెప్పొద్దూ నాకు ఎవరైనా లావైయ్యారు అంటే తెగ కోపం వచ్చేస్తుంది.

"బావగారు సూట్లో బావున్నారు... అన్నట్టు ఇది మీ పెళ్ళిలో పెట్టిన సూటు కదండీ" బామ్మర్ది చురక.

బామ్మర్దికి తిరిగి చురక అంటించడానికి నోరు తెరవ బోయిన నేను "నోరు తెరవకండి"  అన్నట్టున్న మా శ్రీమతి హావ భావాన్ని గ్రహించి, బామ్మర్ది కుళ్ళు జోకు జీర్ణం చేసుకుని సైలెంట్ అయిపోయ్యా.

బిగుతు దుస్తుల్లో చిరాగ్గా ఉన్న నాకు "మల్లిక్" కార్టూన్లా ఉన్న మాధవి వాళ్ళన్నయ్యను చూసి కాస్త ఊరట కలిగింది. వాళ్ళు రావటం చూసినా ఆబిగుతైన బట్టలతో త్వరగా లేవలేకపోయాం. పాపకి జుట్టు ముఖం మీదికి  పడేట్టు దువ్విందేమో వాళ్ళమ్మ పాపం అది కళ్ళు కనిపించక   డోర్ మ్యాట్ తగిలి గడపలో పడింది. ఇక మాధవి వదిన అరవ యాంఖర్ లాగావిపరీతమైన  అలంకరణతో నల్ల కళ్ళజోడుతో  నానా అవస్తా పడుతూ గడపదాటబోయి  అప్పుడే బిగుతు ప్యాంటు సరిచేసుకొని లేవబోతున్న నా మీద తాటకిలా కూలింది.  మొదలే బక్కప్రాణిని, ఇంకేముందీ వెనకున్న సోఫాలో కూలబడ్డాను  ఆమెతో సహా. 

"అయ్యో, అయ్యో వదినా పడిపోయారా? అంటూ హడావిడి చేసిన మాధవి ఆమెను  లేపటానికి వాళ్ళ అన్నసాయం తీసుకుంటోంది. సరే ఆఘట్టం ఎలాగో  ముగిసింది.

కాసేపు పలకరింపుల ప్రాయోజిత కార్యక్రమం  అయ్యాక  టిఫిన్ల  కార్యక్రమం  మొదలెట్టింది మాధవి. ఆకలి దంచేస్తుంటే (బట్టలు  పాడు చెసుకుంటామని మద్యాహ్న బొజన పదకం  రద్దయింది) హదావిడిగా  లేచాను. నా వెనుక బిగుతు బట్టల్లో మా వాడు నా షర్ట్ పట్టుకు లాగాడు,  నాకు పిచ్చి కోపం వచ్చింది  కానీ తమాయించుకొని, ఎంటినాన్నా  కంఫర్ట్ గా లేదా అన్నాను, కాదు నాన్నా వెనుక మీ పాంట్ చిరిగిపోయింది అని చిరుగు కబురు  "ఛిల్డ్"  గా చెప్పాడు. నా గుండె జల్లుమంది. ఇప్పుడు ఈవిడ  చూడకుండా ఎలాగో బెడ్ రూమ్ వరకూ వెళ్ళగలిగితే  చాలు అనుకుంటూ వెనుక బాగం కనిపించకుండా  ఓ తువ్వాలు చుట్టుకొని  ఎలాగో జారుకోబోతున్నాను  అంతే.. వంటింట్లో నుండి ఎప్పుడొచ్చిందో  మాధవి  ఒక్క ఉదుటన తువ్వాలు లాగేసి, చేతులు తుడుచుకోండి  వదినా అంటూ మీరూ  రండి త్వరగా అని నన్ను ఓ గుంజు గుంజింది. ఆ గుంజుడికి పంట్లాం ఇంకొంచం  చిరిగింది. అయితే చటుక్కున కుర్చీ లాగి ఆ  చప్పుడులో  పంట్లాం చిరిగిన చప్పుడు కలిసిపోయేలా మ్యానేజ్ చేశాను. మా వాడు  నా సమయానుకూలమైన తెలివితేటలకు ఓ ఆస్కార్ అవార్డ్ గ్రహీతను చూసినట్టు ఆరాధనగా చూసాడు. ఎట్టకేలకు వాళ్ళ కంట నా చిరుగు కనపడకుండా  టిఫిన్ కార్యక్రమం ప్రారంబించాను. 

"అయ్యో అయ్యో  ఎవరన్నా టి.వి. పెట్టండీ"  టిఫిన్ చేస్తున్న మాధవి వదిన గారు  ఒక్కసారిగా గంగవెర్రులెత్తినట్లు   అని గుండెలవిసేలా ఓ పొలికేక పెట్టింది.  
నాకు  పోలమారి తింటున్న ఇడ్లీ  అందరి ముఖాలపైకీ స్ప్రే  చేసినట్లు పడింది.
సారీ.. సారీ. అంటూ లేవబోయాను. 
ఒక్కసారిగా చిరుగు చింత నన్ను లేవనియ్యలేదు, సిగ్గుతో కూర్చుండిపోయాను. అవేమీ పట్టించుకోని మహిళా మణులు  టి.వి.కి  కళ్ళు అప్పగించేశారు. నా పరిస్తితి ఇరకాటాన పడింది. చచ్చినట్లు టి.వి. కి బలయ్యాను.

ఏదో తెలుగు ధారావాహికం వస్తుంది."శ్రీ నిలయం" ఆడవాళ్ళందరూ వంటింట్లో కూడా పట్టుచీరలతో ధగ ధగా నగలతో మెరిసిపోతున్నారు.  ఓ పెద్దావిడ ఏదో తెలుగులాంటి బాషలో ( తెలుగే) భారీ డైలాగులు చెప్తుంది.

ఎవంషీ..నా మాంగల్యం  కోసం ఏమైనా చేస్తాను  అంటూ సెల్ తీసి నంబర్  నోక్కకుండానే ఎవరెవరికో పోన్లు చేసి తలా ఒక కోటి ఇస్తానని తన భర్తను పట్టుకొని వదలకుండా ఉండే అవతలిఆడ శాల్తీని మట్టు పెట్టమనీ గాండ్రించింది, సారీ.. హుంకరించింది.

సదరు భర్తగారు మాత్రం దిగులుగా సూటూ, బూటు లో (పసుపు రంగు ) ఒక్కోవేలికి నాలుగేసి ఉంగరాలతో కూర్చుని ఉన్నాడు.  ఇంతలో అవతలి    మహిళ ని  చూడాలి  ఆడ బీష్మునిలా  ఉంది. పగలైనా నల్ల కళ్ళజోడుతో. అప్పుడు అర్దమైంది నాకు మాధవి వదిన  ఎందుకు నల్ల కళ్ళజోడు పెట్టుకుందో.  ఇంట్లో కూడా  హై హీల్ చెప్పులు వేసుకొని అసహనంగా తిరుగుతుంది.

"ఎయ్, నేను పదికోట్లు ఎడం చేత్తో పడేస్తానే  నీ మొగుడు పరిగెత్ట్టుకొంటూ వస్తాడే" అవునూ కుడిచేతికి ఎమైందా అని చూసాను, బహుసా సెల్ ఉంది కదా అందుకేమో.. మొత్తం మీద  ఆ హింస అయిపొయింది, ఏదో పిల్లల ప్రోగ్రాం వస్తుంది. అమ్మయ్య బతికాను అనుకున్నాను.

చిన్న చిన్న పిల్లలు పీలికల్లాంటి బట్టలు కట్టుకొని డ్యూయట్లు పాడుతూ తెగ మెలికలు తిరుగుతున్నారు. జడ్జి గారు "చింపేసారు" అని  పేపర్ చింపి తన అభిప్రాయాన్ని చెప్పేశారు.

"ఏమి సేస్తిరి, నాన్ దా  రొంబ సంతోషంపుడిస్తిని. డార్లింగ్ నీకు దా మంచి ఫ్యూచర్ ఉంది" అన్నాడు గారపళ్ళు మొత్తం బైట పెట్టి. ఫ్యూచర్ లో ఇంకా చాలా మందిని చంపుకోవచ్చని ఆ పిల్ల ఒక్క గెంతు గెంతి కింద పడి తన  సంతోషం తెలియ జేసింది.... ఇలా నరకం నిరంతరాయంగా సాగుతుండగా కరంట్ పోయింది .

ఆహా.. ఏమి నా భాగ్యం.   నా సంతోషం అంతా ఇంతా కాదు.. యురేకా అని అరిచాను... ఎందుకో మీకు తెలుసు కదా చిరుగు కనిపించకుండా బెడ్ రూం లోకి  వేల్లోచ్చోచ్..

అయ్యో భలే గుర్తుచేశారు ఇప్పుడు "యురేకా" తో ఇంటర్యూ ఉందండీ ఆమె 10,000 ఎపిసోడ్స్ పూర్తి  చేసినందుకు.. అయ్యో ఈ దరిద్రపు కరంట్ ఇప్పుడే పోవాలా... అయ్యో ఎక్కడున్నారండీ కరంట్ వాళ్ళకి  ఫోన్ చేయండీ, చిందులు తొక్కింది మాధవి. నేను చీకట్లోనే వెళ్లి   అల్మారీలో లుంగీ తీసుకొని దానిలోదూరిపోయి  ఇదిగో వెళ్తున్నా అంటూ హడావిడిగా బైటికి వెళ్లాను. వీదిలో చీకట్లో నడుస్తున్నా  ఎందుకో అడుగులు సరిగా పడటం లేదు, వెనుక నా సుపుత్రుడు వస్తున్నాడు. "నువ్వేక్కడికిరా చీకటిలో" అన్నాను.

నేను " షవర్ చెంజస్ " చూడాలి అందుకే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా " అన్నాడు. అప్పటికి కరంట్ వస్తుంది కదా  అన్నాను అసహనంగా. వచ్చినా తన టి.వి. లోనే చూడాలి  అన్నాడు. "ఏం మన టి.వి. కంటే బాగుంటుందా, వేలు పోసి కొనిపించారు కదరా!  ఇప్పుడు పనికి రావట్లేదా? చిరాగ్గా అన్నాను, మొదలే లుంగీ చిన్నదైందో.. లేక నేను లావయ్యానో నడవటానికే ఇబ్బందిగా ఉంది...

"అబ్బా  డాడీ మీకేమీ తెలీదు  "తన" అనేది ఓ చానల్ పేరు. మన పాల అంకుల్ బెటర్  రోజూ నేను చూడకున్నా ఏం జరిగిందో చెప్తాడు. అన్నాడు. మొదటి సారిగా థూ .. నాదీ ఒక బతుకేనా అనిపించి, అప్పుడర్థమయ్యింది, ఓ సినిమాలో రవి తేజ అద్దంలో చూసుకుని తన మొఖంపై తనే ఎందుకు ఊసుకుంటాడో.  సివిల్స్  పాసయ్యి  పెద్ద ఆఫీసర్  పోస్ట్ లో ఉన్నా కూడా .. పాలవాడికి ఉన్న నాలెడ్జ్  లేదనిపించుకున్నాను.

"డాడీ" గాట్టిగా  అరిచాడు  మావాడు. వీది  మలుపులో స్ట్రీట్ లైట్  కిందకి వచ్చాము.
ఏమైందిరా ?  చిరాగ్గా అన్నాను.

"డాడీ  మీ లంగా ? నోటికి చెయ్యి అడ్డుపెట్టుకొని  ముసి.ముసి గా నవ్వుతూ అన్నాడు. లుంగీ చూసుకున్న నాకు  గుండె ఆగినంత  పనైంది, ఇప్పటికే మీరు ఊహించి ఉంటారు, అయ్య బాబోయ్.. నేను కట్టుకుంది  మా ఆవిడ  లంగా, లుంగీ కుట్టి కట్టుకొనే అలవాటు  వల్ల తేడా తెలీలేదు. అరె ఇప్పుడు ఇంటికి వెళ్ళ లేను, కరంటు వాణ్ణి కలవ లేను. ఆ...  ఐడియా..  బాబుని పంపి లుంగీ తెప్పించుకుంటా, అనుకుంటూ వెనక్కి తిరిగానా...  మావాడు ఎప్పుడో పలాయనంచిత్తగించాడు. ఖర్మ, ఏదీ మన చేతిలో లేదు అని వేదాంతం వల్లించుకుంటూ నిర్వికారంగా వెనక కుక్కలరుస్తుండగా, ఇంటివైపు బయల్దేరాను.

                                                *  *  *


16 comments:

 1. :-) :-) very very nice so funny

  ReplyDelete
 2. బాగా నవ్వించారు, ఆరోగ్యకరం ;)
  ఇంతకీ ఆ గండం గట్టెక్కినట్టేనా?

  ReplyDelete
  Replies
  1. సంతొషం మీ ఆరొగ్యమె మా మహా భాగ్యం.
   ఆ గండం గూర్చి ఇంకొ హింస లొ చెపుతాను

   Delete
 3. హింస అంటే ఏమో అనుకున్నాను.
  టివి పై సటైర్ తో బాగా నవ్వించారు.
  అయినా, రేడియో వాళ్ళకు టివి వాళ్ళకు పడదంటారు నిజమేనా?!

  ReplyDelete
  Replies
  1. సర్, నిజమె హింసల్లొ బేదాలు ఉం్టాయి కదా.
   ఒకరు కళ్ళు, ఒకరు చెవులు తీసుకుంటారు.
   మెచ్హు కున్న మీకు ధన్యవాదాలు.

   Delete
 4. :-)...మేరాజ్ గారూ!...మీరు హాస్యం పండించాడలో కూడా దిట్టే నండి....చాలా బాగుంది...@శ్రీ

  ReplyDelete
  Replies
  1. ఒప్పుకున్నారు కదా, మీ అభిమానానికి ధన్యవాదాలు.

   Delete
 5. గతంలో 'గృహహింస', ఇప్పుడు 'మరోహింస'.......హింస అంటూనే నవ్విస్తున్నారు. బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. భారతి గారూ, హింసను కూడా మెచ్హుకున్న పరమ హంసలు నా మిత్రులు మీరు.

   Delete
 6. బాగుంది ఫాతిమ గారు కాసేపు హ్యాప్పిగా నవ్వించారు.

  ReplyDelete
  Replies
  1. డెవిడ్ గార్.. సదా నవ్వుతూ ఉండాలి మీరు.

   Delete
 7. మరో హింసతో నవ్వించారు..
  హింసిస్తూ కూడా ఆనందించటం ఒక్కోసారి చాలా బాగుంటుందండీ..

  ReplyDelete
  Replies
  1. సరె మీ అనుమతి దొరికింది, ఇంకొసారి హింసకు:-))

   Delete