Pages

Thursday 11 April 2013










గుర్తులు 

బస్టాప్  లో  నుల్చుంటానా,
అదిగో  అక్కడే  తచ్చాడే  చిరుగుల లంగా  చిన్నది,
నేను గుర్తున్నానా  అన్నట్లు చూస్తుంది, 
నేను  మరచిపోయిందెప్పుడూ.... 

టీకొట్టు  దగ్గరికి  వెళ్తానా ,
అడిగో  అక్కడే చొక్కాలేని చిన్నోడు,
చిట్టిచేతుల్తో  టీ  కప్పులు కడుగుతూ,
వచ్చావా  అన్నట్లు  చూస్తాడు,
నేను  రాకుండా  ఉండగలనా... 

గుడికి  వెళ్తానా  అక్కడ,  
రెండు  చేతులు లేని  వృద్దుడు  
మొండి  చేతులతో దండమెడుతూ,
వచ్చావా అన్నట్లు చూస్తాడు,
నేను రాకుండా ఉండగలనా... 

బడి ముందు  నుండి వెళ్తూ ఉంటానా,
కళ్ళు లేని  ఓ తల్లి,
నా అడుగుల చప్ప్పుడుకి  కర్ర టక ,టక  లాడిస్తూ,
వచ్చావా అన్నట్లు  కళ్ళు ఓ మారు ఆర్పుతుంది,
నేను రాకుండా ఉండగలనా,

నిద్ర నిండా ఈ స్వప్నాలే,
ఈ  ఒలికిన  కన్నీటి సాక్షాలే,
దేవుని ముందు నేను నిలపాల్సిన ,
ఈ సజీవ  చలనమెరిగిన  చిత్రాలే,
నేను  నివేదించకుండా  ఉండగలనా...........   



6 comments:

  1. నిత్యం చూస్తున్న సత్యాలకు అధ్బుతమయిన అక్షర రూపం బాగుంది

    ReplyDelete
    Replies
    1. మొదటగా మీకు నా బ్లాగ్ కు స్వాగతం. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete

  2. అక్షర సత్యాలతో ( ఎవరైనా మరచి ఉంటే ) మనసుని గుర్తు చేస్తున్నట్లుంది .

    శర్మ జీ ఎస్
    నా ఆలోచనల పరంపర బ్లాగు

    ReplyDelete
    Replies
    1. నాబ్లాగ్ కి స్వాగతం , మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

      Delete
  3. బస్టాప్ లో .... తచ్చాడే చిరుగుల లంగా చిన్నది, టీకొట్టు దగ్గర .... చిట్టిచేతుల్తో టీ కప్పులు కడుగుతూ చొక్కాలేని చిన్నోడు, గుడి మెట్ల వద్ద .... రెండు చేతులు లేని వృద్దుడు మొండి చేతుల దండాలు, బడి ముందు .... కళ్ళు లేని ఓ తల్లి కళ్ళు ఓ మారు ఆర్పులు, నా నిద్ర నిండా ఈ స్వప్నాలు .... ఒలికిన కన్నీటి సాక్షాలు,
    చూసే కళ్ళకు మన్సుంటే ప్రతి మినిషికీ చూపుంటే జీవితం ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది ఫాతిమా జీ ఈ కవిత చదువుతున్నంత సేపూ .... కర్తగా మీకు నా మనోభివాదాభినందనములు.

    ReplyDelete