Pages

Monday, 5 May 2014

ఊపిరి విలాపం.

       ఊపిరి విలాపం. 

    మోడుని అల్లుకొని  మోదుగలు  పూయిస్తూ..,

    చిరిగిపోయిన  కాగితంపై  చివురు  సంతకం చేస్తూ..,

    గుండె దొన్నెలోకి  కన్నీళ్ళను  ఒంపుకుంటూ..,

    కాలం  వెంబడి  అవిటి   కాళ్లతో నడవాలని చూస్తూ..,

    చెదిరిన గుండెల్లో  చివికిన దృశ్యాలని   చెరిపేస్తూ..,

    వక్రించిన కత్తివేటుకు  ఖండాలుగా తెగిన  గుండె శకలాలను  అతికిస్తూ.., 

    ఈ సైకత బొమ్మని  మనిషిగా  నిలబెట్టాలని  ప్రయత్నిస్తూ.., 

    ఓడిన ప్రతిసారీ....,

    వర్తమానపు  వధ్యశిలపై  తలారివేటుకై   తల పెట్టేస్తూ...,

    మరో జన్మలోనైనా...మనో ఆశ్రమ  ఆవరణలో...,
    మనశ్శాంతిని కోరుకుంటున్నాను.  

8 comments:

 1. గుండె ఆవేదనకు గురై ...
  వూపిరిని బారంగా మార్చి ...
  కలం బరువుగా రాస్తే ఉబికివచ్చే భావాలివి.

  "కాలం వెంబడి అవిటి కాళ్లతో నడవాలని చూస్తూ..,
  చెదిరిన గుండెల్లో చివికిన దృశ్యాలని చెరిపేస్తూ..,
  వక్రించిన కత్తివేటుకు ఖండాలుగా తెగిన గుండె శకలాలను అతికిస్తూ.., "

  ఆవేదనాభరితమైన ఆలోచనలకు రూపం దిద్దుకున్న అగ్నిభాండం ఇది.

  " మరో జన్మలోనైనా...మనో ఆశ్రమ ఆవరణలో...మనశ్శాంతిని కోరుతూ..., "

  ముగింపు కూడా భారమె.
  పెద్ద నిట్టూర్పు !!!
  ఇలా రాయడం మీకే తగును ఫాతిమా గారు.
  కళ్ళను చెమ్మగిల్లించారు.

  *శ్రీపాద.

  ReplyDelete
  Replies
  1. కొన్ని సందర్బాలంతే..., గుండెను తొలచుకొని వస్తుంది కవిత్వం,
   ఇవన్నీ ఊపిరి సంతకాలు.
   మీకు నచ్చినందుకు సంతొషం.

   Delete
 2. ఫాతిమాజీ ,

  కవితలంటేనే కనపడకుండా అట్టడుగున వున్న గుండెలను పిండి చేస్తాయి . సాటి జీవి మీద , సమాజం మీద మీ దృక్పధాన్ని చక్కగా తెలియచేస్తుంటాయి .

  ఈ కవితలో కడ వాక్యం అసంపూర్ణంగా వున్నట్లు భావిస్తున్నాను .

  " వర్తమానపు వధ్యశిలపై తలారివేటుకై తల పెట్టేస్తూ...,

  మరో జన్మలోనైనా...మనో ఆశ్రమ ఆవరణలో...మనశ్శాంతిని కోరుతూ..., "

  ఈ రెండు వాక్యాలలో ఏ వాక్యం చివరనైనా తుది వాక్యంగా పరిగణిస్తూ ' పెట్టేస్తున్నా ' / ' కోరుతున్నా ' అంటూ ముగింపు యిస్తే యింకా బాగుంటుందేమో అనిపించింది . కొంచెం ఆలోచించండి .

  ReplyDelete
  Replies
  1. నిజమే కనపడని వేదనా మంత్రాలివి.
   మీరు చెప్పినట్లే సవరించాను. మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 3. సోదరీ, ఈ కవిత ఎందుకో ఇంకొ బాదని మూటగట్టుకొని వచ్చింది.
  అయితే...దీనిలో ఎదో చెప్పాలని చెప్పలేకపోయావేమో.., అనిపించింది,
  కవిత్వం గురించి నీతో చర్చించే అంత సాహిత్యకారున్నీ కాదు ,
  కానీ నువ్వు సరిగా చెప్పలేకపోయావేమో అనిపించింది.
  వక్రించిన కత్తివేటుకు గురవుతున్న నీ సాహిత్యాన్ని అందరికీ పంచు తల్లీ.
  ఎప్పటిలాగే ఏదో చాలా చెప్పాలని కూర్చుంటాను, నీ డిగ్నిటీ ముందు మూగబొతాను.
  గమనిక:- ఏకసంబోధన చేశాను నా చెల్లే అనుకున్నా. నువ్వెమైనా అను.

  ReplyDelete
  Replies
  1. బ్రదర్ ప్రభుగారూ,
   ఈ మద్య కాలం లో మీ కామెంట్స్ నేను అనుమతించలేదు,
   దానికి మీరన్నట్లు కోపం కాదు,
   మీరు నన్ను అతిగా పొగడ్త తో ముంచి ఉన్నారు,
   నిజానికి నాకు అంత గొప్ప స్థాయి లేదు సాహిత్యం లో.
   ఇప్పటి కవితకి మీ స్పందనకు నా ధన్యవాదాలు.

   Delete
 4. మేడం నమస్తే,
  కవిత చాలా బాగుంది,
  కొంచం దిగులు వేసింది చదువుతుంతే..,
  ఊరొచ్చేశానే గానీ మీ పోస్ట్స్ మిస్స్ ఔవున్నాను

  ReplyDelete
 5. లక్ష్మీ, నమస్తే, ఎలా ఉన్నారు?
  ఈ సారి మంచి కవిత రాసి నవ్విస్తాలే.

  ReplyDelete