Pages

Saturday 21 January 2012

మరీచిక


మరీచిక

ఎక్కడో చూసిన జ్ఞాపకం
ఎప్పుడో కలసిన వైనం

తలపుల  తలుపు తెరిస్తే  నీవే ప్రత్యక్షం 
గతం గనులు తవ్వితే నీవే నిధిలా నిక్షిప్తం

గుండె లోతుల్లో నీ తలపు మధురిమ 
హృదయ తంత్రుల్లో నీ వలపు సరిగమ                                                                                    

నా ఊహల్లో విహరిస్తున్తావు
నా ఊపిరిలో సంచరిస్తుంటావు 

తలపుల తలుపు తడతావు
గుండె గుడిగంటలు కోడతావు

చేలికాడనే అంటావు చెంత చేరవు
జతకాడనే అంటావు జాడ చూపవు

మరిచిపోఇనవే  గుర్తు చేస్తావు
మరుగున పడినవి చర్చిస్తావు

విలుకానిలా వేటాడతావు    
చేలికానిలా మాటాడతావు

ఎదలోనే ఉన్నాను వెతుకు అన్నావు 
మదిలోనే ఉన్నాను బ్రతుకు అన్నావు

పగలంతా నా అడుగులకు తడబాటువై
రేయంతా నా పలవరింతల అలవాటువై

దోసిట్లో నీళ్ళలా జారిపోతావు
వాకిట్లో నీడలా పారిపోతావు

కోకిలా అన్నావా   అనే ఉంటావు
కోవెలలో వున్నావా వుండే ఉంటావు 

వీడని నా పెదవినీ ముడివడిన నా భ్రుకుటినీ 
కరువడిన నా భాషనీ మరుగడిన నా ధ్యాసనీ పరిహసిస్తావు 

జ్ఞాపకాల దొంతరలు కదులుతున్నై   
కొన్ని కలలా కొన్ని కన్నీళ్ళలా 

ఎద సోదలలో సన్నని మెలిక
మది కధలలో చీకటి కదలిక

తెలిసింది.  
             నీవు గత జన్మ స్మృతివి
             నీవు మరుజన్మకు శ్రుతివి 
             ఈ జన్మకు మదినిండిన "మరీచికవి".
         
(ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రిక జూలై  2011 )
   





      

No comments:

Post a Comment