Pages

Saturday 10 May 2014

హలం బాటలో కలం.

    




   హలం బాటలో కలం 

    పచ్చిక తివాచీపై  నడిచే పాదాలు, 
    నెర్రెల నేలపై నడిచి, 
    పగుళ్ళుబారుతున్నాయి. 

    గవ్వలూ ,మువ్వలూ మెడలో వేసుకొని, 

    తలలూపే బసవన్నలు, 
    కబేళాలకు తరలి వెళ్తున్నాయి. 

    జన్మనిచ్చిన  ఆవాసాలు  నడ్డివిరిగి, 

    నేలరాలుతున్నాయి. 

    పొట్టకూటికై  ఊరొదిలి  వెళ్ళే  వలసలు

    కాలిబాటలోనే కడతేరుతున్నాయి. 

    దెయ్యాలు హస్తాలు చాచి,  

    ప్రాణాలని లాక్కున్నట్లు,
    ఓట్లు  పట్టుకెళ్ళిన   నాయకులు,

    కుర్చీదక్కగానే సోమ్ముల కుమ్ములాటలో,

    నమ్మకాలను వమ్ముచేస్తున్నారు. 

    అన్నదాత ,రైతన్నా.., అని బాకాలూడిన వైనం 

    గుర్తున్న గాడిదకొడుకులైతే..,
    తిన్నది అన్నమే అయితే..,భవితకు భరోసా ఇవ్వండి. 

    విభజన మంత్రాన్ని భజనగీతం చేసి, 

    చచ్చిన రాష్ట్రం అని రాసిన  రోతగాళ్ళ నాలుకలు తెగ్గోసి,
    పొలాలలో  పోలి చల్లాలి. 

    మా కాలాలు ఖడ్గాలుగా మారక ముందే,

    అన్నం పెట్టిన చేతులు ఆయుధాలు  పట్టక ముందే,
    దుర్నీతి పాలన విడవండి. 

    తల్లిపేగు తెగ్గోసి, పల్లెకు పాడి కడుతున్నారు,

    దుష్ట పాలనలో దున్నపోతుల్లా,పందుల్లా పొర్లుతున్నారు. 

    మరో ఐదేళ్లకు  మీ పాడె మీరే మోసుకొనే ,

    దుస్థితి   తెచ్చుకోకండి. 

    ఇప్పటికీ  మించిపోలేదు  రైతన్నను ఆదుకొని,

    అన్నం తినండి. 

10 comments:

  1. రైతన్నకు మంచిరోజులు రావాలని ప్రార్ధిద్దాం ఆ దేవుణ్ణి , రాజకీయనాయకులను నమ్మలేకపోతున్నాం మీరజ్.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు దేవీ.

      Delete

  2. ఫాతిమా గారూ !
    ఓ మంచి కవిత మరో మారు మీ కలం నుండి
    అతిశయోక్తి లేదిక్కడ

    " తల్లిపేగు తెగ్గోసి, పల్లెకు పాడి కడుతున్నారు,
    దుష్ట పాలనలో దున్నపోతుల్లా,పందుల్లా
    పొర్లుతున్నారు. "

    అవును . మీ భావాలు ఎంతో నిజమైనవి,
    ఆలోచనలను రేకెత్తించేవి కూడాను.
    భావోద్వేగంగా ఉన్నా .. అవి వాస్తవ రూపాలు .
    మళ్ళీ మళ్ళీ చదవాల్సిన కవిత ఇది,

    అభినందనలు మీకు ఫాతిమా గారూ .
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Delete
  3. పచ్చికపై నడవాల్సిన పాదాలు, నెర్రెల నేలపై నడిచి, పగుళ్ళమయమై బసవన్నలు, కబేళాలకు తరలి వెళ్తూ, పొట్టకూటికై వలసలు .... దెయ్యాలు హస్తాలు చాచి, ప్రాణాలని లాక్కున్నట్లు, ఓట్లు పట్టుకెళ్ళిన నాయకులు,
    తల్లిపేగు తెగ్గోసి, పల్లెకు పాడి కడుతున్నారు, దుష్ట పాలన చేస్తూ దున్నపోతుల్లా, పందుల్లా పొర్లుతున్నారు. మరో ఐదేళ్లపాటు ఎవరి పాడె వారే మోసుకొనే, దుస్థితి తెచ్చుకునేలా వాగ్దానాల జోరు హోరు
    సమకాలీన సమాజానికి అద్దం పడుతున్నట్లు ఆలోచనలను రేకెత్తించుతూ .... అక్షరాలను ఆయుధాలు గా మార్చి రాసినట్లు కవిత చాలా బాగుంది
    అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. మీ స్పందంకు నా ధన్యవాదాలు సర్.

      Delete
  4. హలం బాట ఎప్పుడో పట్టింది మీ కలం !
    అంతర్జాలం లో రేపుతూ ఉంది , కల కలం !
    అవినీతి రేగడి ని ఎంత 'దున్నినా', మీ 'కలం '
    సారవంత మవుతుందా ఆ హాలా హలం ? !
    మొలకెత్తు తుందా ప్రజల లో, ఆనంద కోలాహలం ?!
    తీరుతాయా హాలికుల కష్టాలు కల కాలం ?
    నోటుకు అవుతోంది ఓటు , దాసోహం !
    ఆ వేటు తో అవుతోంది ప్రజాస్వామ్యం, అపహాస్యం !
    'మంద'కు లేని దురద కామందు కెందుకు ?!

    ReplyDelete
    Replies
    1. నిజమే.., కానీ మంద తో కామందు ముడిపడి ఉన్న్నాడు ,
      ఆకలికీ, కలికీ, కలికాలానికీ రైతే దిక్కు.
      మీ స్పందన నా కవితకన్నా బాగుంది సర్.

      Delete
  5. కవిత చాలా బాగుంది ఫాతిమాజీ.చిన్న అచ్చు తప్పుల్ని సరి చూసుకుంటూ ఉండండి. మా కలాలు ఖడ్గాలుగా అనే చోట మా కాలాలు అని ఉంది. రోత గాళ్ళ నాలుకలు తెగ్గోసి పొలాలలో పోలి చల్లాలి అనడం వరకూ బాగానే ఉంది. కవిత్వంలో కసి ఉండొచ్చు.ఆ కసిని దున్నపోేతులూ పందులూ గాడిదలూ అంటూ వాచ్యంగా చెప్పడం పరిహరిస్తే కవిత్వం ఇంకా పరిమళిస్తుంది. చాలా రోజులై చాలా కారణాల వలన బ్లాగులు చూడడం కుదర లేదు. మీ పాత కవితలన్నీ చదువుతాను.

    ReplyDelete
  6. సర్, నమస్తే,
    మీరన్నది నిజమే ఆవేశం తెలియజేయటానికి అలాంటి బాష వాడాల్సిన పనిలేదు, కానీ ఎందుకో బాద తారాస్థాయిని చేరినప్పుడూ...,ఏమీ చేయలేకపోతున్నామే అనుకున్నప్పుడూ ఇలాంటి బలహీనతకు గురవుతుంది నా కలం.
    మీ నుండి స్పందన రావటం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు

    ReplyDelete