కంటి (ఇంటి) దీపం మునిమాపువేళ బారులు తీరిన కొంగల రెక్కల చప్పుళ్ళ రొదలో , నా ఆలోచనలను చెదరగొడుతూ ఎవరెవరివో బాదాతప్త హృదయరోదనలో పేగు బంధాల మూగ వేదనలో గిర్రున తిరుగుతున్న నా తలలో ఎన్ని ఆలోచనలో.. ఉప్పగా జారేకన్నీరు నాపెదవులను తడుపుతూ....కన్నీటి తలపువై నన్ను నా నుండి దూరం చేసి, అదృశ్యమైన నీవు అనివార్యమరణమై, అర్ధంలేని వార్తవై ,అంతు దొరకని పరిశోదనవై, అంతర్దానమై,అపఖ్యాతివై,అఘోచరమై,... నా గుండెపై నిత్యం రగిలే ప్రేమజ్వాలవై..., నా అసమర్ధతకు బలైన నిస్సహాయవై ..., నా గుండెను నిత్యమూ సలిపే జ్ఞాపకానివై.., నా చుట్టూ శిరశ్చేదిత చలన దేహాలే.., చిక్కు ముడి విప్పలేక బేతాళ శవాన్ని మోసే విక్రమార్కులే.., పక్కన పిడుగు పడ్డా వినిపించని బదిరులే.., అర్దంలేని ఊసుపోని వ్యర్ద ప్రేలాపాలే... నా వేదనకు అంతం లేని వృదా ప్రయత్నాలే, నువ్వు మాయమైంది జనారణ్యములో, జంతు అరణ్యానైతే కేవలం ప్రాణమే పోయేది. నీ కన్నీళ్ళ నిస్సహాయ రోదన ఆ కామాందులను కరిగించగలిగితే, నీవెప్పుడో మానవీయ వంతెనపై నడిచి, మరో మంచు ముత్యానివై మమ్ము చేరవా.., ఈ గాంధారీ సుతుల వస్త్రాపహరణానికి తెరపడి, కలియుగ కురుక్షేత్రం జరిగేదెప్పుడు ఒంటరి సీతమ్మలనెత్తుకెళ్ళిన రావణాసురులకు వాయుపుత్రుని వాసన తగిలేదెప్పుడు...?????
మరోసారి ఓడిపోతూ..., ఈ నిశ్శబ్ద నిశి రాతిరిని, రెప్పలార్పుతూ ..తదేకంగా చూస్తున్నా.., తూర్పు పవనమొకటి తేలివచ్చి, పసితనపు తలపుని తాకించి వెళ్ళింది. ఆనాటి సౌధమింకా అలాగే ఉంది, ఎప్పటిలాగే చంద్రునితో పహారా కాయిస్తుంది. ఎత్తిపట్టుకున్న పట్టుపావడాతో, మూసుకున్న కళ్ళతో...వెన్నెటి గుడ్ల ఆటాడుతూ.., చిన్నమ్మా...అక్కడ ముళ్ళుంటాయి..., అర్దింపూ,అర్ద్రతా... అవే అరచేతులు, నా అరికాళ్ళ కింద మెత్తటి తివాచీలై....., అరే ఇక్కడో పారిజాతం ఉండాలి, రాలిన పూలను ఏరిన ఆ చిట్టి చేతులేవీ..., గొప్ప తోడుని అడిగిన ఆ మొక్కులేవీ..? గుడ్డబొమ్మలకి పెళ్ళిళ్ళు చేసిన, చిన్నారి ముత్తయిదువ ఆ చిన్నమ్మ ఏదీ..? ఆమె నడిచిన చిట్టి పాద ముద్రలేవీ..? కాలమంతా రంగుల రాట్నమై, గిర,గిరా,తిరిగే చలన చక్రమై,స్ఖలన దు:ఖమై.., యుగాల నాటి ప్రశ్నాపత్రమై.., మరణాంతరం సమాదులపై పాతిన, శిలా పలకమై,బాల్యాన్ని పాతిపెట్టిన, శిథిల సౌధమై.., ఇనుప చట్రాలలో ఇరుక్కున్న చిన్నమ్మ, ఈ నిశీథి సౌధాన ఆత్మను వదలి , విలువలేని శరీరాన్ని శిలువ వేసుకుంది.
నడిచే కల ఆమె నడుస్తుంది, కలలతో కలసి అడుగు కలుపుతుంది. అడవి మల్లె అందాన్నీ.. ఆత్మీయ బంధాన్నీ.., తనలో ఇముడ్చుకుంది. ఓ సుందర స్వప్నాన్ని కలవాలనీ.., వశీకరణంతో, ఒడిచేర్చుకోవాలనీ.., ఆశతో జీవిస్తుంది. మనస్సంతా ఎదురుతెన్నుల కన్నులైతే.., దూరమయ్యే అడుగుల చప్పుడు ఎదపై వినిపిస్తుంది. చిక్కటి చీకటి గదిలో.., తుదిలేని మది తలపులతో.., బ్రతుకంతా పయనిస్తుంది. శబ్దమై పాకుతూ.., శ్వాసై తాకుతుంది.