Pages

Thursday 13 December 2012

ఆవేదన







ఆవేదన 

మా ఇంట్లో నేను ఆరో ఆడ  సంతానం, మా  ఇంటిని చుట్టేసుకుని ఉన్న చుట్టం గరీబీ. నాకు చదువంటే చాలా ఇష్టం. అక్కల చదువులు  అలీఫ్ ..బె ., దగ్గరే ఆగిపోయినా,  నా చదువు మాత్రం ఏడో  తరగతి వరకూ సాగింది. అబ్బాజాన్ కు  తన కుట్టు మిషనే ప్రపంచం.   నమాజుకు మజీదుకు వెళ్ళడం కోసం తప్ప వీధి ముఖం  ఎరుగడు, కుట్టు మిషను  తనతోనే పుట్టినట్లు భావిస్తాడు. తలకి మించిన భారమైనా ఊరిబట్టలన్నీ  తీసుకొని రాత్రి పగలూ కుడుతుంటాడు. ఆయన కుట్టే రంగు, రంగుల బట్టలు చూస్తుంటే  అవి మా వంటి మీద ఎలా ఉంటాయో ఊహించుకునేవాళ్ళం. అవి కుట్టిన తర్వాత ఎదో వంకతో మా వయస్సు వారైతే ఆల్తీ చూసినట్లుగా మమ్మల్నిఆ బట్టల్లో   కాసేపు చూసుకొనే వారాయన.  రంజాన్ పండక్కి  అమ్మిజాన్ మా కోసం కొనే సరుకులు చూడటం కోసం  అందరంచుట్టూ మూగే వాళ్ళం. మా పెద్దక్క మాత్రం  అన్నీ మాకోసం త్యాగం చేసేది, వంటిల్లు గడప దాటి ఎరుగదు. ఐదుపూటలా అల్లాను  తలవటం. అబ్బాజాన్ కి కలాం షరీఫ్ (ఖురాన్ గ్రంధం)  చదివి  వినిపించటం ఆమెకి నచ్చిన/వచ్చిన పనులు.దాదీ చెప్పే కధల్లో "పరీ" (ఫెయిరీ) ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది నాకెప్పుడూ. ఆఖరి చేల్లినైన నేనంటే అక్కకి ప్రాణం. మిషన్ దగ్గరి బట్ట ముక్కలతో రంగు రంగుల రిబ్బన్లు చేసి నాకు జడలు వేసేది. నా చిట్టి అరిచేతుల్లో పండిన గోరింటాకును చూసి మురిసి పోయేది.

* * *

ఆ రోజు రంజాన్ పండుగ రోజు. నేను ఆటలతో అలసిపోయి ఇంటికొచ్చాను. ముందు గదిలో ఇద్దరు ముగ్గురు మొగవాళ్ళు, వారి మధ్యలో ఇస్త్రీ చేసిన తెల్లటి కుర్తా పైజామా, టోపీతో అబ్బా జాన్ కూచుని ఉన్నారు. పెరటి తోవనుంది వంటింట్లోకి చేరాను. ఇల్లంతా అత్తరు వాసన. అబ్బాజాన్ పక్కన తెల్లటి గడ్డంతో,  "త్వాబ్" మరియు  "ఇగల్" ధరించి  (అరబ్బులు ధరించే సాంప్రదాయాక అంగ వస్త్రం మరియు తలపై ధరించే వస్త్రం) తెల్ల్లటి ఓ ముసలాయన. వాళ్ళను చూస్తూ వంటింట్లోకి వెళ్లాను. వంటింట్లో పళ్ళాల నిండా మిఠాయిలు ఉన్నాయి. ఆపాజాన్ (పెద్దక్క) శుబ్రమైన బట్టాల్లో ఓ మూల కూర్చుని వుంది. నేను అక్క ముఖం వంక చూసాను. ఎదురుగా బొలెడన్ని మిఠాయిలున్నా మంచి బట్టలు కట్టుకున్నా అక్క ముఖాన నవ్వు లేదు. అమ్మీజాన్ ఓ నడి వయసు ఆవిడతో  మాట్లాడుతూ ఉంది. నాకు కొంత వింతగా అనిపించినా మిఠాయి చేతికోస్తూనే తుర్రుమనబోయాను. ఆ పెద్దావిడ నన్ను దొరకబుచ్చుకుని ఏమే మున్నీ! నువ్వూ  ఎక్కుతావా విమానం మీ అక్కతో అంది. నా కళ్ళు మెరిసాయి. ఓ, మా ఆపాజాన్ ఎక్కడుంటే నేనూ  అక్కడే అన్నాను. కానీ ఆ తర్వాతే తెలిసింది  ఆపాజాన్  ని "అల్మాస్ బిన్ సులేమాన్" అనే పేరు గల ఆ ముసలి అరబ్బు షెకుకిచ్చి  పెళ్లి చేసారని.

* * *

ఐదేళ్ళకోసారి ఆపాజాన్  వసంతంలా  వచ్చేది. మెరిసిపోయే అక్కని చూసి మురిసి పోయే వాళ్లం. ఆపాజాన్ తెచ్చిన కానుకలతో మా ఇల్లు కళ కళ లాడేది. మా ఇంట్లో గరీబీని అక్క కొంత తరిమేసింది. అక్క సాయం తోనే  మిగతా అక్కలందరూ అత్తవారింటికి వెళ్లారు. కానీ నాకు మాత్రం ఎదో అనుమానం. అక్క మొఖంలో ఎదో వెలితి కనిపించేది.  ఎవరు లేని సమయంలో అమ్మ, అక్క ఒకర్నొకరు పట్టుకుని ఏడవటం నా దృష్టిని దాటి పోలేదు. మొత్తం మీద ఆపాజాన్ జీవితం సాఫీగా సాగిపోవటం లేదని నాకు అర్థం అయ్యింది. నా చిన్ని బుర్రకి పరిష్కారం తట్టేది కాదు. ఆపాజాన్ ఉన్నన్ని నాళ్లు  ఈద్ (పండగ) లాగా ఉండేది. ఆమె వెళ్తుంటే వసంతంవెళ్ళిపోతున్నట్టు అనిపించేది.

***

ఆఖరి అక్క పెళ్ళిలో ఆపాజాన్ ప్రస్తావన వచ్చింది. ముసలి షేకు అల్మాస్ ఓ శాడిస్టు అని ఆపాజాన్ నానా హింసలు పెడతాడని, అయినా సరే డబ్బుకోసం అఖ్తర్ సాయిబు, కూతుర్ని అమ్ముకున్నాడని తూలనాడారు. అన్నీ తెలిసినా కూతురు మీద ప్రేమ కంటే ఆకలి, బీదరికమే జయించింది అమ్మీ అబ్బాని. అక్క పంపే రక్తం అంటిన రంగు కాయితాలు మా ఇంట రుమాలి రోటీలయ్యేయి.
***

ఆ రోజు చాలా మన్హూస్ రోజు. అక్క బదులుగా ఓ పెద్ద చెక్క పెట్టె వచ్చింది.  మా అక్క మొఖం చూపకుండా కఫన్ కప్పుకుని వుంది. నా గుండె పగిలింది, మా గూడు చెదిరింది. ఆ దుర్మార్గుడు అక్కకి కఫన్ కానుకగా ఇచ్చి దఫన్ చేయమని మాకు పంపించాడు. పరామర్శించడానికి వచ్చిన పెద్దలందరూ తలో రకంగా విమర్శలు, సానుభూతీ ప్రదర్శిస్తున్నారు.
***

కాలం అన్ని గాయాల్నీ మాన్పుతుంది అంటారు, కానీ అన్ని గాయాల్నీ మాన్పే  కాలం  నా గుండెకు మరో  గాయాన్ని చేస్తుందని నేనూహించలేదు. మరోమారు గరీబీ జయించి అక్క స్థానంలో నన్ను కూచోబెట్టింది. నా రోదన అరణ్య రోదనే అయ్యింది. ఆడ పిల్లని, పైగా బీద పిల్లని ఎవరు ఆదుకుంటారు ఈ దేశంలో. బీదరికానికి తలవంచాను. నా నికాః-  పెళ్ళికొడుకు షేకు లేకుండానే ఇంటర్నెట్ ద్వారా ఇద్దరు సాక్షుల సమక్షంలో జరిగింది. నా అసమ్మతికి  ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదు. పెళ్ళంటే ఎన్నో ఊహించుకుంటుంది ప్రతి ఆడపిల్ల, కాబోయే పతి  తనను  ఏంటో అపురూపంగా చూసుకుంటాడని ఆశ పడుతుంది. నలుగురు స్నేహితురాళ్ళు హాస్యాలాడుతుంటే  సిగ్గుల మొగ్గ్గై తన వైవాహిక జీవితం ప్రారంబిస్తుంది ప్రతి ఆడపిల్లా.. అలాంటి అనుభూతి నోచుకోని నా దురదృష్టం  నన్ను వెక్కిరించింది.ఆకలి  పోరాటంలో  ఓడిపోతూ   భారమైన హృదయంతో అసహ్యం, అసహనంతో, కోపంతో విమానం ఎక్కాను.
***

అప్పుడు తెలిసింది నాకు అక్క దుఖానికి కారణం. ఆమె ఒక నరరూప రాక్షసుడితో కాపురం చేసిందని. అక్కడున్నన్ని రోజులూ నరకమంటే ఏమిటో, అవమానం అంటే ఏమిటో తెలిసింది.మూడుపూటలా తిండి దొరికిందని సంతోషించాను, అందరినీ వదులుకొని దేశం కాని దేశాన ఈ దుర్మార్గుడి రాక్ష క్రీడలో పావునై  నలిగి పోతున్నందుకు  నాలో నేనే కుమిలి కుమిలి ఏడ్చాను.  నేనక్కడ ఓ యంత్రంలా చూడబడ్డానే  గాని మనిషిలా కాదు. ఏ చట్టాలూ,  ఏ మానవ హక్కులు నన్నాదుకోవడానికి రాలేదు. ఆ నరకం లో నిస్సహాయంగా ఒక సంవత్సరం గడచింది.

***

ఎన్నో రోజులు ఆ నరకంలో గడిపాక అల్మాస్ నన్ను అమ్మీ జాన్, అబ్బా జాన్ దగ్గరికి పంపడానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు నాకింకా గుర్తే, అమ్మ ఒళ్లో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చాను.మరోమారు అమ్మ  పెద్దక్కని  తలచుకొని గుండె పగిలేలా ఏడిచింది, అమ్మ వడిలో సేదతీరిన నేను,  నిశ్చయించుకున్నాను ఇక ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళకూడదని. బాగా అలోచించి నిశ్చయించుకున్నాను ఆ  రాక్షసుడికి "ఖుల" (ఇస్లాం లో స్త్రీ తరపునుంచి ఇచ్చే విడాకులు) ఇవ్వాలని. ఐతే  "ఖుల" ఇవ్వాలంటే వరుడు ఇచ్చిన "మహార్"  సొమ్ము (వరుడు వధువుకు వివాహ సమయంలో తప్పనిసరిగా ఇవ్వాల్సిన డబ్బు లేక వస్తువులు) తిరిగి ఇవ్వాలి. నిఖానామా (వివాహ ప్రమాణ పత్రం) చూస్తే అందులో  "మహార్" వెయ్యి దీనార్లు గా రాసి వుంది, అంటే మన విలువలో ఐదు వేలు. వెంటనే నా చిన్ననాటి స్నేహితురాలైన వకీలు కౌసర్ సాయంతో  ఐదు వేలు  "మహార్" సొమ్ము ఆ రాక్షసుడి అకౌంట్లో వేసి ఇంటర్నెట్ ద్వారా  ఆ రాక్షసుడికి   ఇచ్చాను" ఖుల "  ఖుల్లం  ఖుల్లా.
***
మనసుకు ప్రశాంతంగా ఉంది. కానీ ఎదో అసంతృప్తి... ఎందుకిలా జరుగుతుంది? ఇలా ఎంతమంది ఆడ పిల్లలు బలైపోతున్నారు? తప్పెవరిది? వ్యక్తులదా, వ్యవస్థదా?  అసలు సమస్య బీదరికమా? బీదరికానికి కారణం? అధిక సంతానమా? చదువూ సంధ్యా లేని నా చిన్ని బుర్రకు అర్థమౌతోంది... దేశ సామాజిక సమస్యల్లో చాలా వరకు సమస్యలకు అధిక జనాభాయే కారణం అని . అయితే సర్కారు ఎందుకు ఈ సమస్య పై దృష్టి సారించదు. ఎందుకు  ప్రజల్లో, ముఖ్యంగా అవగాహన లేని వర్గాల్లో, అవగాహన కల్గించే ప్రయత్నం చేయదు? ఏమో...







31 comments:

  1. అయితే సర్కారు ఎందుకు ఈ సమస్య పై దృష్టి సారించదు. ఎందుకు ప్రజల్లో, ముఖ్యంగా అవగాహన లేని వర్గాల్లో, అవగాహన కల్గించే ప్రయత్నం చేయదు? ..............

    బాదేసింది మేడం....కానీ ఈ సమాజం పిరికిది,ఒక కుటుంబం కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు ముందుకు రాదు ,ఈ సమాజానికి అవకాశం కావాలి కాని భాద్యతలు కాదు కనుక సర్కారు కూడా ఎమి చేయలెకుంది...ధనమూలం ఇదం జగత్ అంటారు కాని ఇలంటి కథల్లో ధనం మాత్రమే కారణం కాదు...ఇంకా ఏదో ఉంటుంది దాన్ని ఎదిరించలేకుంటాము కాని వచ్చే తరాల్లో ఎదిరించే వారుంటారని ఆశిద్దాం.

    ReplyDelete
    Replies
    1. Narasimha garu,మీరు చెప్పింది నిజమే, మార్పు ఒక్కసారిగా రాదు,
      వచ్చేతరాన చదువు పెరిగి అవగాహన వస్తుందేమో,
      మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  2. చదువుతుంటే చాలా బాధగా అనిపించిందండి.... నిజమే మన గవర్నమెంట్ చర్య తీసుకోవాలి...

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. మరే, ఇంటికి పదిమంది పిల్లలు ఉంటారు, కుటుంబ నియంత్రణ అనేది ఒకటుంటుందని కూడా తెలియదనుకుంట. మళ్ళా చుస్తే బోలెడన్ని నివేదికలు, ముస్లిమ్స్ లో పేదరికం ఎక్కువని, వాళ్లకి సరిఅయిన సౌకర్యాలు లేవని,ఎన్నో బాధలని , మళ్ళి వాటి చుట్టూ రాజకీయాలు. మంచి బతుకునివ్వలేని వాడు పిల్ల్లల్ని ఎందుకు కనడం, ఈ కథ చదివిన తరువాత నాకేమి బాధ కలగలేదు, కోపం తప్ప. ఇక్కడ సానుభూతి కురిపించే వాళ్లంత , ఎందుకు కురిపించాలో ఆలోచించుకోవాలి.

      Delete
    3. కావ్యాంజలి గారు
      , మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
    4. Anonamous garu, నేను ఎవరి సానుబూతి ఆశించటం లేదు, ఓ రచయిత్రిగా నా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచాను.
      మిత్రులు తమ పరిష్కారం తెలిపారు నా జాతి అనుకోని రాయలేదు, నేను ఎన్నో విష యాలమీద స్పందిస్తాను మనమంతా మానవ జాతి,
      ఎక్కడైనా మన అవసరం అయితే మంచి చెప్దాం. సమాజ మార్పు ఒక్కరోజులో రాదు.

      Delete
  3. పరిష్కారం చెప్పలేను. నా గుండె మెలిపెట్టిన మాట వాస్తవం, అభాగ్యులకు నా సానుభూతి

    ReplyDelete
    Replies
    1. సర్ పరిష్కారం అంత త్వరగా రాదు,
      కానీ రావాలి, అవిద్య తొలగాలి

      Delete
  4. ఆకలి, బీదరికంతో ఆటలాడుకునే అమానుషత్వం.
    ఎవరిని నిందించాలో, ఎవరిని శిక్షించాలో కూడా తెలీని పరిస్థితి, చాలా దయనీయం!

    ReplyDelete
    Replies
    1. సర్, జీవితాలలో మార్పు రావాలంటే ఆలోచనా సరళి మారాలి అందుకు స్త్రీ విద్యావంతురాలు కావాలి
      .అప్పుడు ఆమె బిడ్డల గూర్చి ఆలోచించగలదు. కుటుంబ నియంత్రణ అవగాహన తెలుస్తుంది. ఇలా ఎన్నో మార్పులు రావాలి.

      Delete
  5. అధిక సంతానాన్ని అరికట్టడం, అందరికి విద్య , ఉపాది కల్పించడం , సొంత వృత్తిని నిపుణతను ప్రభుత్వం గుర్తించి , తక్కువ వడ్డిలో రుణాలు ఇప్పించడం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ప్రోత్చాహక పథకాలు ప్రవేశపెట్టడం.
    సంఘం లో పేరుకుపోయిన కొన్ని మూడాచారాలను రూపుమాపి, ప్రజలలో చైతన్యం తేవడం , తద్వారా ఇలాంటి సమస్యలు క్రమేనా తగ్గుతాయి.
    మీ రచన శైలి బాగుంది. మీ కవిత మంచి మార్పు కు నాంది పలకాలని ఆశిస్తూ ...... విజయ్ రెడ్డి

    ReplyDelete
    Replies
    1. Vijay Reddy garu,మీ విశ్లేషణ చాలా బాగుంది,
      నిజమే మార్పుతో పాటు వీరి ఆలోచాన మారాలి
      జీవన సరళి మారాలి. మీ స్పందనకు

      Delete
  6. ముస్లిమ్స్ లో ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు.
    పోషించే స్తోమత లేని వాళ్లకి కూడా ఎక్కువ మంది పిల్లలుంటారు.
    ఇదేదో వేరే ఉద్దేశ్యం తో అడగడం లేదు. నేను చాలా మందిని చూసాను హైదరాబాద్ లో , ఇంకా వేరే చోట్ల, ఇంటి నిండా పిల్లలే ఉంటారు, ఇంట్లో చుస్తే దరిద్రం తాండవిస్తుంది, ఏంటో

    ReplyDelete
    Replies
    1. మీ ఆవేశంలో అర్ధం , ఉంది కానీ మనం అనుకొన్న కోణం కాక ఇతర కారణాలలో చూడగలగాలి.
      చదువు లేకపోవటం, కొన్ని కుటుంబ పద్దతులు, కొన్ని మతపరమైన సంస్కృతులు జీవన విదానం మీద ఆదారపడి ఉంటాయి,
      సమాజ మార్పుకోసం సహనం అవసరం. ఏమంటారు ?

      Delete
    2. మీరు రాసిన విషయాలు మన సమాజంలోని కొన్ని
      కోణాలను ఆవిష్కరింప చేస్తున్నాయి.
      దారిద్ర్యాన్ని మించిన శాపం మానవజాతికి మరొకటి లేదు అని శాస్త్రం.
      ఆ మాట నిజం. అన్ని పాపాలాకు, బాధలకు అదే రహదారి.
      దానికి చదువులేకపోవడానికి సంబంధం ఉంది.
      మీ కథనం మాకు తెలియని విషయాలను తెలియచేస్తూనే
      ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తోంది.
      శుభాభినందనలు. చాలా మంచి ప్రయత్నం చేసారు.

      Delete
    3. సర్, మీకు తెలియని విషయాలు చెప్పేవరకు నేను ఇంకా ఎదగలేదు.
      నా అలోచనా విదానం , నా కవితా ధోరణి మీకు తెలుసు, ఇకపోతే మీరు సామాజిక అంశాలను ఎన్నో మీ "అడుగు "(ఆంద్ర భూమి ) లో ప్రస్తావించారు.
      నాకు చేతనైన మార్పు తేవటానికి కవయిత్రిగా నా వంతు ప్రయత్నిస్తాను. నా రచనలు చదివి నన్ను ప్రోత్సహించే మీకు ధన్యవాదాలు.

      Delete
  7. బాదాకరం... పురుషులలో మార్పు రానంతవరకు ఇలా కొనసాగుతూనే ఉంటది..

    ReplyDelete
    Replies
    1. Thanks andi, meeru naa kavitalu chadavatam santoshamgaa undi.

      Delete
  8. ఫాతిమా గారు,
    చాలా రోజుల తర్వాత మంచి కథనం వ్రాశారు.. ఈ మధ్య ఎక్కువగా కవితలు వ్రాస్తున్నారు కదా.. అందరిలో ఈ విషయంలో అవగాహన అవసరం.

    ReplyDelete
    Replies
    1. Chinni garu, mee abhipraayam amoolyam. dhanyavaadaalu meeku .

      Delete
  9. అసలు నన్నడిగితే .. ముస్లిం కుటుంబాలలో ఆడపిల్ల మనఃస్పూర్తిగా ఒప్పుకోకపోతే .. ఆ నిఖా జరగదు.

    మత సంప్రదాయం ఏమో కాని అధిక సంతానం కని వారిని ఇక్కట్ల పాలు చేయడం సర్వసాధారణం. డబ్బుకి ఆశపడి బిడ్డల గొంతు కోస్తున్నామని తెలిసి కూడా సమర్ధించుకునే వారిని చూస్తుంటాం. వారిని చూస్తే కూడా నాకు చాలా కోపం.

    ముస్లిం కుటుంబాలలో పుట్టినందుకు వారికి చదువులకి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే! అయినా వారు చడువుకోరు. పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకోరు. నాకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఒకోరోజు ఆహరం కి విపరీతంగా ఖర్చు పెట్టి మిగిలిన రోజులు పచ్చడి మెతుకులు తింటారు. ఎవరో వచ్చి జీవితాలని బాగు చేయరు. ఎవరికీ వారే బాగు చేసుకోవాలి.

    ఆఖరి చెల్ల్లికి ఉన్న తెగువ,అవగాహన ముస్లిం యువతులకి రావాలి. సానుభూతి కురిపించడం కన్నా.. అరబ్బు షేక్ ల వలలో పడకుండా వాళ్ళని మోటివేట్ చేస్తే బావుంటుంది. ప్రభుత్వం,స్వచ్చంద సేవాసంస్థాలు, పౌరులు . ఇలా రచయితలూ అందరికి బాధ్యతా ఉంది కదా!

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. వనజ, మార్పు అనేది చాలా అవసరం, కానీ ఇది తప్పు అని తెలీని వారిని మార్చటానికి ఓర్పు అవసరం.
      అది ఒక వ్యక్తీ కి సాద్యం కాదు . నా కలం ఇలాంటి మార్పు కోసం నిరంతరం శ్రమిస్తుంది

      Delete
  11. మొరాజ్ గారు సమస్యను చాలా చక్కగా వివరించారు.
    నదిలో మునిగిపోతున్న వారికి చేయూత నివ్వాలి కాని నువ్వెందుకు నదిలోకెళ్లావ్? వెళ్ళబట్టి కదా ఈ పరిస్థితి వచ్చింది అని ప్రశ్నిస్తే సమస్యకు సమాధానం దొరకదు. వారి పరిణితి, అవగాహన ఇంకో ఎన్నో విషయాలు వారినా
    పరిస్థితిలో నిలబెట్టాయి. ఒడ్డునున్నవారు వారిని ఎలా రక్షించాలో ఆలోచించాలి. మనం సమస్యను రెండో వైపునుంచి విశ్లేషిస్తే కొంత పరిష్కారం దొరుకుతుందేమో మనుషులు రాక్షసులుగా మారడానికి కారణాలేంటి? వారివారి ఇళ్ళలో ఆడవాళ్ళు ఉండరా? వుంటే ఇలా ఎలా ప్రవర్తించగలరు? పిల్లలకు చిన్నప్పట్నుంచే సమాజం పట్ల సమాజంలోని సమస్యల పట్ల, మానవత్వం పట్ల అవగాహన కలిగిస్తే ఇలాంటి ఎన్నో సమస్యలను అరికట్టగలమేమో అనిపిస్తుంది.

    ReplyDelete
  12. జ్యోతి గారూ , మీ పరిపక్వత చెందిన మాటలు నన్ను ఆలోచింప చేస్తాయి.
    నిజమే సమస్యను ఇతర కోణాలనుండి చూడాలి. కూతురు పెల్లిచేసిన తల్లి ఆమెను అత్తవారింటికి పంపటానికి ఏడుస్తుంది, పెళ్లిచేయటం ఎందుకూ ,ఏడవటం ఎందుకూ
    అంటే ఎలా..?, కొడుకును విదేశాలకు పంపిన తల్లి ఏడుస్తుంది డబ్బుకోసం పంపి ఏడిస్తే ఎలా అనకూడదు. ఆతల్లి హృదయాన్ని అర్ధం చేసుకోవాలి. ఆఇంటి పరిస్తులను అంచనా వేయాలి. అస్సలు ఒక పొరపాటును గ్రహించగలిగే పరిపక్వత మతాలూ,కులాలు అడ్డుకుంటున్నాయి. మనిషి ఎదగాలి ఇతరులను చదవాలి. నేను చెప్పిందే వేదం అనుకుంటే మనం అక్కడే ఉన్నట్లే. మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు తోడుంటాయని ఆసిస్తూ..మెరాజ్ .

    ReplyDelete
  13. హృదయమంతా భారమైంది. ఎంతో బాధ.....


    మనిషి ఎదగాలి, ఇతరులను చదవాలి...
    ఓ మార్పుకై ఎంతో ఓర్పుగా శ్రమించాలి...
    ఎంతో చక్కగా చెప్పారు.
    మీ కలం చక్కటి మార్పుని తీసుకొచ్చి మంచి మార్గదర్శనం చేస్తుందని నా నమ్మకం.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, మీ వ్యాఖ్య కోసం ఎదురుచూస్తున్నాను,
      మీరు చెప్పినట్లు మనుషుల్ని చదవాలి, వారి జీవన స్తితి గతులు తెలుసుకోవాలి,ఇకపోతే మూర్కత్వం, మూడనమ్మకం లేని జాతి లేదు.
      కొన్ని మారటానికి తరాలే పడుతుంది. మనవంతు మనం చేయాలి, అయితే విమర్శలు తప్పక వస్తాయి. భారతి గారూ... శృంగార కవిత్వం రాసుకొని నలుగురి చేత శెభాష్ అనిపించుకోగాలను, కానీ మీ వంటి మిత్రులను వారి వల్లా స్పూర్తిని పొందలేను కదా..మొన్న ఓ కవిత కోకిల మీద రాసాను, మాటలు చెప్పటం తేలికే.. చేయటం కష్టం అనే ఓ విమర్శను ఎదుర్కొన్నాను, కానీ నేను గర్వంగా చెప్పుకొంటాను నేను చేస్తేనే రాస్తాను. నన్ను అర్ధం చేసుకొనే మిరులు చాలు కొండంత స్పూర్తి నాకు...మెరజ్

      Delete
  14. హృదయం బరువెక్కే కథలివి.దారిద్ర్యం మనుషులను ఇలాంటి వాటికి పురిగొల్పుతూ ఉంటుంది.ఇతరుల అనుభవాలను చూసైనా మనం పాఠాలను నేర్చుకోవాలి.మార్పు రాకుండా్పోదు.మీ కథ లోనే అక్కకూ చెల్లికీ తేడా చూడండి.అక్క పరిస్థితులతో రాజీ పడి జీవితాన్ని చాలిస్తే, చెల్లెలు తప్పుదిద్దుకుని కొత్త జీవితాన్ని వెదుక్కోవడానికి సిధ్ధ పడింది కదా.ఆయా సంఘాల పెద్దలు కృషి చేస్తే మార్పు తప్పకుండానూ తొందరగానూ వస్తుంది.

    ReplyDelete
  15. గోపాల కృష్ణ గారూ, మీరు చెప్పింది నిజం మార్పు వస్తుంది.
    అంతవరకూ ఈ వేదనా, చికాకులో తప్పవు.
    నా రచనలు చదివే మీకు కృతఙ్ఞతలు.

    ReplyDelete
  16. చాలా బాధగా ఉంది మీ పోస్ట్ చదివాక....వ్యవస్థ లోని ఒక సమూహం ఎదుర్కొంటున్న సమష్యను కల్లముందుంచారు...కాని దీనికి కారణం ఎవరనేది అలోచించాలి..ఈ వ్యవస్థలో మార్పు రానిదే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు...కాని అంతవరకు ఎదురుచూడక మన వంతుగా వీటిని రూపుమాపేందుకు కృసి చేయాలి.

    ReplyDelete