Pages

Monday, 10 February 2014

అంకు(శ )ర స్పర్శ.

     
     

    అంకు(శ )ర  స్పర్శ. 

     కాయాన్ని కారుణ్యం  చేసి, మాటని మధురం చేసి,
     ఒడినే  లాలిత్యపు  పానుపు చేసాను.  

     స్పర్శ  కుండే  ఒక మహత్తర  శక్తి గూర్చిచెప్పేందుకే,

     నిన్ను గుండెకు హత్తుకున్నాను. 

     ఆకలి  గొన్న  నీ చిన్ని  బొజ్జను  అమృత బిందువులతో,

     నింపి  అమ్మ  స్థానమేమిటో  అర్ధమయ్యేలా  చేసాను. 

     బుడి,బుడి, అడుగుల పరిదిని దాటిన నీవు,
     వడి,వడిగా జంతు సమూహంలోకి ఎప్పుడెళ్ళావో...,

     
     రోజంతా అదృశ్యమైనా... అర్దరాత్రి ఇల్లు  చేరినా.., 
     అక్కున చేర్చుకొని  అన్నంపెట్టిన  అమ్మను కదా...,

     బూచీ... అంటూ రాత్రిని చూసి నా చీరకుచ్చెళ్ళలో దాగే నీవు

     రాత్రే  నిన్ను చూసి దడుసుకొనేలా బూచిలా మారావు. 

     పట్టుకొన్న నా వేలును కోసి  తీసుకెళ్ళి జనసమ్మర్దానికి,

     దాన్ని చూపుడు వేలుగా  బహుకరించావు. 

     నా అమలిన అంతరంగ ప్రపంచం మీద మాలిన్య పాదాలతో నడచి, 

     మరక అడుగుల ముద్రలను  మిగులుస్తావనుకోలేదు. 

     అమ్మతనపు  అమృతాన్నే  కదా  తాగించాను,

     మరి  విషాన్ని ఉమ్మే ఉన్మాదివయ్యావని  ఎలా అనుకోను? 

     నా ఎదురుగా నన్నే నిలబెట్టి  ఆత్మ విమర్శా అద్దాన్నిచ్చి,

     నీ  నిజాన్ని చూడమంటే  ఎలా  చూడగలనూ..?

     (అనకొండలో ,ఆక్టోపస్ లో   ఒంటిని చుట్టుకున్నా  పర్వాలేదు,

     అపనిందలూ,అనర్దాలూ ,పెంపకం చేతకాదనే  పెడర్దాలూ... 
     తల్లి మనస్సులో  గుచ్చుకొనే  బలురక్కసి ముళ్ళు ) 

16 comments:

 1. ఎందరో తల్లుల అంతర్మధనాన్ని బాహ్య ప్రపంచానికి అందించిన మీ కలం, మీ మనసుకు అద్దం పట్టింది మీరజ్ .

  ReplyDelete
  Replies
  1. నిజమే కదా దేవీ.. ఎవడైనా తప్పుచేస్తే మనం వాడి తల్లిని నిందిస్తాం.
   కానీ ఆమెకు ఆ తప్పు కనిపించదు, అస్సలు ఆమె ఆ తప్పు చూడదు, లోకం తో ఆమెకు పని లేదు, తన బిడ్డతప్ప. ఇది మనకు వింతగా అనిపించినా తల్లి మనస్సు ఎప్ప్పుడూ బిడ్డని కాపాడుకోవాలనే చూస్తుంది.

   Delete
 2. "బూచీ .... అంటూ రాత్రిని చూసి అమ్మ చీర్ చీరకుచ్చెళ్ళలో దాగే అతను రాత్రే అతన్ని చూసి దడుసుకొనే బూచిలా మారాడు."
  అనురాగం మాత్రమే పంచడం తెలిసిన అమ్మే ఆశ్చర్య పోయేలా ఆ బిడ్డ జీవన్సరళి మారడం తట్టుకోలేని మానసిక స్థితిని చక్కగా ఆవిష్కరించారు;

  "అమ్మతనపు అమృతాన్నే కదా తాగించింది, మరి విషాన్ని ఉమ్మే ఉన్మాదిని అవుతానని ఎలా అనుకోగలదు?"
  ఒడి దాటి, ఇంటి వసారా దాటి వీధిలోకి స్నేహితులు మధ్యకు సమాజం లోకి వెళ్ళాక ఆ ప్రాణాన్ని ప్రబావితం చేసే ఎన్నో లక్షణాలు .... ఆ జీవితం నడవడికను నిర్దేసిస్తాయి.
  మెరాజ్ గారు మీ ప్రశ్నను ఒక మాతృమూర్తి ఆత్మ్ ఘోష గా చూడలేకపోతున్నాను. సమాజం లో సహజీవనం చేస్తున్న ప్రతి మనిషి ఆత్మపరిశీలనను కోరుకుంటున్న దిశగా చూస్తున్నా!
  పొత్తిళ్ళలో ఉన్నంతవరకే అమ్మే ప్రపంచం బిడ్డకు.
  మంచి స్నేహం సాహచర్యం సమాజం నిర్మాణానికి తొలి చెమటబిందువును జారచేదెప్పుడూ అమ్మే అని నిర్ద్వందంగా చెప్పిన విధానం బాగుంది.
  నేనూ ఒక అమ్మకొడుకునే .... నా అమ్మ కోరుకున్న విధం గా బ్రతుకుతున్నానా .... కొన్ని లక్షల ప్రశ్నలుదయిస్తున్నాయి నాలో ....
  మనస్పూర్తిగా మీ లోని మాతృమూర్తికి నమస్సులు ఫాతిమా గారు!

  ReplyDelete
  Replies
  1. అమ్మ ప్రపంచం చాలా చిన్నది, అమ్మ మనస్సు చాలా పెద్దది,
   ప్రతి తల్లీ తన పెంపకాన్ని నమ్ముకొవటమే కాకుండా, బాహ్య ప్రపంచం లో తన బిడ్డ వేసే అడుగులను కనుక్కుంటూ ఉండాలి.
   సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 3. చాలా బాగుంది. చాలా చాలా చాలా బాగుంది... మెరాజ్ గారు. శ్రీదేవి గారు చెప్పినట్టు... ఎందరో తల్లుల ఆత్మఘోష ఇది. మంచి చేయకపోయినా ఫర్వాలేదు. కానీ.. ఒక్క చెడు... సమాజాన్ని మలినం చేసేస్తుంది. అవును తల్లులంతా పిల్లలను మహరాజుల్లాగా పెంచుతారు. కనీ పిల్లలే విషం కక్కుతున్నారు. అమ్మ గుండెను గునపాల్లాంటి మాటలతో గుచ్చుతున్నారు. మెరాజ్ గారు హాట్సాఫ్.

  ReplyDelete
  Replies
  1. సతీష్ గారూ, ప్రతిదీ సునిసిత పరిశీలన చేసే మీకు ఈ కవిత నచ్చుతుంది.
   సమాజాన్ని చదవటములో ముందుంటాను నేను, సమాజంతో కొంత వరకే నడిచే పరిది నాది, కానీ వృత్తి రీత్యా మీరు ఇంకా పరిశీలించే అవకాశం ఉంటుంది.
   మీ పరిశీలనాత్మక స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 4. " అమ్మతనపు అమృతాన్నే కదా తాగించాను,
  మరి విషాన్ని ఉమ్మే ఉన్మాదివయ్యావని ఎలా
  అనుకోను? "............
  కాస్తా మనస్సుని కదిలించిన మాటలివి .
  ప్రతి కవితలో మీ కంటూ ఓ ప్రత్యేకతను చూస్తాను నేను ఫాతిమా గారూ.
  మరి అదేనేమో మీకు ఓ అభిమానిగా మార్చింది నన్ను
  A Beautiful కవిత ఇది .
  శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. ఈ రోజు ఓ గొప్ప ప్రసంశను అందుకున్నాను.
   ఓ సాహిత్యాభిలాషి నాకు అభిమాని కావటం (ఎంత మాట)
   నా సాహిత్యాన్ని ఆదరించే మీ స్పందనను సదా ఆహ్వానిస్తాను.
   ధన్యవాధాలు మీకు.

   Delete
 5. స్పర్శ కుండే ఒక మహత్తర శక్తి గూర్చిచెప్పేందుకే,
  నిన్ను గుండెకు హత్తుకున్నాను......కొందరి అమ్మల అంతర్మధనావిష్కరణం మీ కలం నుండి మరో అద్భుతం.

  ReplyDelete
  Replies
  1. పద్మా, మనసారా స్పందించే మీకు నా ధన్యవాదాలు.

   Delete
 6. ...పట్టుకొన్న నా వేలును కోసి తీసుకెళ్ళి జనసమ్మర్దానికి,
  దాన్ని చూపుడు వేలుగా బహుకరించావు...

  ఇంతకన్నా కన్నతల్లి ఆవేదనను, మనఃక్షోభను
  మరింత ప్రస్ఫుటంగా ఏ తల్లి లోకానికి నివేదించగలదు...

  __/\__...

  ReplyDelete
 7. తల్లి మనస్సును అర్దం చేసుకునే మీ లాంటి వారి ఆదరణ ఉన్నంత వరకూ తల్లి పాత్ర బ్రతికే ఉంటుంది.
  మీ స్పందనకు ధన్యవాదాలు.

  ReplyDelete
 8. Replies
  1. ధన్యవాదాలు సర్,

   Delete
 9. చాలా బాగారాశారు ఫాతీమాగారు.....మీ ప్రతీభావం మదిలోయల్నెక్కడో తాకుతుంది.

  ReplyDelete
  Replies
  1. ప్రేరణ గారూ, మీ స్పందనకు చాలా సంతొషం.

   Delete