Pages

Monday, 24 February 2014

మ(తె)గువ

    
    మ(తె)గువ

    వెచ్చటి  కన్నీళ్ళనూ,కాలిపోయిన కలలనూ,
    వారసత్వపు  ఆస్తిగా అనుకుంటాం,
    ఎందుకంటే  మేం నిర్భాగ్య అబలలం.

    కడుపు కోతలనూ,గర్భ స్రావాలనూ,
    అలవాటుగా  అనుభవిస్తాం,
    ఎందుకంటే మేం  అమాయక అతివలం.

    మగతనం పెత్తనాలనూ,మదపు ఎత్తుగడలనూ,
    శిరస్సు వంచి  బరిస్తాం,
    ఎందుకంటే  మేం  మర్మమెరుగని మహిళలం.

    ఆరాచకాలనూ,అన్యాయాలనూ,
    అప్పుడే  మరచిపోతుంటాం,
    ఎందుకంటే మేం అసహాయ ఆడవాళ్ళం.

    కలల పూలతలల్ని తుంచిన  కర్కశ జంతువుతో,
    కలసి మెలసి  కమ్మగా కాపురం చేస్తుంటాం,
    ఎందుకంటే  మేం  పెదవివిప్పని పడతులం.

    మనసారా  స్నేహించేది  హంసయినా  దరిచేరనీయక,
    అపరసాద్విలా  అవతారమెత్తి  కాకితోనే కలకాలముంటాం,
    ఎందుకంటే  మేం  తప్పు తెలియని తలోదరులం.

    ఇంకోచోట,

    లాలించి,కవ్వించి  మరపించలేకున్నా ,
    శ్రమించి చెంతనుండే  సహచారునితో,
    రవ్వంతైనా  సహనంతో  ఉండలేం ,
    ఎందుకంటే  మేం  ఆదునిక అతివలం.

    మదిలో  స్థానాన్నిచ్చి రక్త సంబంధీకుల కంటే,
    ఉన్నతంగా ఉంచినా,
    తనని దేహం నుండి తెగిన అంగాన్ని చేస్తాం,
    ఎందుకంటే  మేం  విద్యా వనితలం.

    పందిరి తానైతే,పచ్చగా అల్లుకోవాల్సిన  సమయాన,
    ఎండినపుల్లై  విరిగి పడి విరుచుక పాడుతాం,
    ఎందుకంటే  మేం  స్వాతంత్ర్య ఉవిదలం.

    పుట్టింటి వాళ్ళతో కుమ్ముక్కై  హక్కులకై,
    అర్రులు చాచి  అత్తింటి ఆడవాళ్ళనే బజారుకీడుస్తాం.
    ఎందుకంటే  మేం  నాగరిక నారులం.

    (అగ్గయి  బగ్గున మండుతూ అన్యాయం జరిగిందని  విలపిస్తూ
    అనాలోచితంగా బుగ్గయ్యే  దుస్థితి  తెచ్చుకోకూడదని
    ఎందరో  సోదరీమణులకు  ఓ హెచ్చరిక మాత్రమే.. మెరాజ్.)


15 comments:

 1. అతివకున్న అన్ని పార్శ్వాలనూ
  నిర్మొహమాటంగా
  సమకాలీనతకు అద్దం పట్టి
  విద్యకూ
  వివెచనకూ
  మధ్య అడ్డుగోడల్ని
  అర్ధవంతంగా చీల్చారు
  హాట్సాఫ్ దీదీ....

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు చాలా సంతొషం జానీ

   Delete
 2. very inspiring. కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. అద్భుతంగా రాసారు

  ReplyDelete
  Replies
  1. అనూ,చదివిన మీకు నా ధన్యవాదాలు.

   Delete
 3. ఒకచోట
  వెచ్చటి కన్నీళ్ళు, కాలిన కలలు, కడుపు కోతలు, గర్భ స్రావాలు .... మగతనం పెత్తనాలు, మదపు ఎత్తుగడలు, ఆరాచకాలు, అన్యాయాలు సహించి కలల పూలతలల్ని తుంచిన కర్కశ జంతువుతో అయినా కలసి కాపురం చేస్తుంటాం, పడతులం.
  ఇంకోచోట,
  శ్రమించి, మదిలో స్థానాన్నిచ్చి రక్త సంబంధీకుల కంటే ఉన్నతంగా ఉంచినా .... పుట్టింటి వాళ్ళతో కుమ్ముక్కై అత్తింటి ఆడవాళ్ళనే బజారుకీడుస్తాం. నాగరిక నారులం.
  అన్యాయం జరిగిందని విలపిస్తూ అనాలోచితంగా బుగ్గయ్యే దుస్థితి తెచ్చుకుంటున్న ఎందరో .... స్త్రీ మూర్తులకు చక్కని సూచన లా ఒక భావనాత్మక కవిత "మ(తె)గువ"
  అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

  ReplyDelete
  Replies
  1. సర్, ఎందరో స్త్రీ ల గూర్చి వింటూ ఉంటాను, అంతా అయిపోయిన తర్వాత " అయ్య్యో నేనిలా చేసి ఉండాల్సింది కాదు," అనుకొంటూ ఉంటారు. ఆ అనాలోచిత చర్యలే వద్దు, కొంచం ఆలోచన అవసరమేమో... అనే అబిప్రాయంతో రాశాను.
   మీ స్పందన ఓ స్పూర్తి దాయకం.

   Delete
 4. ఆధునిక మహిళల్లోనూ అర్థం చేసుకుని అతివలున్నా... మీరు చెప్పిన కేటగిరీ చాలా ఎక్కువ. మాకు కొన్ని కేస్ స్టడీలు వస్తుంటాయి. డైవర్స్ కేసులకు అధిక శాతం కారణం ఓన్లి ఇగో. భర్త కన్నా ఒక్క వెయ్యి రూపాయలు ఎక్కువ సంపాదిస్తే చాలు.. ఇక వాళ్లను మించిన వాళ్లు ప్రపంచంలో లేరనుకుంటారు. ఇద్దరం చెరిసగం భావన వాళ్లలో కనిపించదు. వాళ్ల మధ్య ఉండేది వైవాహిక సంబంధమనీ అనిపించదు. జస్ట్.. ఆర్థిక సంబంధాలే అనిపిస్తాయి. వీళ్లలో అత్యధికులు తెగ చదివిన వాళ్లే. ఆ చదువు వాళ్లకేం నేర్పలేదన్న సంగతి డైవర్స్ కేసులకు అర్జీ పెట్టినప్పుడే అర్ధమైపోతుంది. మొదటి పేరాలో మీరు రాసిన అమాయక వనితల సంగతెందుకు లెండి. పాపం వాళ్లని ఎంచడానికి కూడా లేదు. అక్కడ మొగుళ్లనే నిందించాల్సిన పరిస్థితి. బాగుందండీ... ఇది పెద్ద చర్చనీయాంశం... ఒక జఠిలమైన సమస్య కూడా...

  ReplyDelete
  Replies
  1. నిజమే సతీష్ గారూ, ఇది ఓ పెద్ద చర్చనీయాంశమే..,
   వారి, నిర్నయాలపై కుటుంబ భవిషత్ ఆదారపడి ఉంటుంది,
   ముఖ్యంగా స్త్రీలకు వారితో పాటు బిడ్డల గూర్చి కూడా ఆలోచించాల్సి వస్తుంది.
   వేరు పడిన బార్యాభర్తల బిడ్డలకు ఏదో ఒక పెంపకం మిస్ అయ్య్యే అవకాశం ఉంది,
   మీ స్పందన ఓ ప్రత్యేకత సంతరించుకొంటుంది,(ఆలోచనలకు తెరతీస్తుందని భావం) ధన్యవాదాలు.

   Delete
 5. ఈ రోజుల్లో అబలలం, నిస్సహాయులం అనే మహిళలు చాలా తక్కువగా ఉన్నారనే చెప్పాలండి....ఏదో ఒక విధంగా పురోగాభివృద్ధి సాధించిన వారే అధికులు....ఇది గర్వించాల్సిన విషయం.

  ReplyDelete
  Replies
  1. పురోగాభివృద్ది నిజంగానే సంతోషదాయకమే.., దాన్ని నిలబెట్టుకోవటం లో తప్ప్పటడుగు వెయ్యకుండా ఉంటే చాలు,
   ఒక్కోసారి బిడ్డల భవిషత్తు అంధకారం అయ్యే ప్రమాదాలున్నాయి.
   మీ స్పందనకు ధన్యవాదాలు పద్మగారు.

   Delete
 6. స్త్రీ నాడు.....స్త్రీ నేడు చక్కగా చూపారు మీరజ్, నిష్పక్షపాతంగా.....

  ReplyDelete
  Replies
  1. దేవీ,ధన్యవాదాలు,మీ స్పందనకు .

   Delete
 7. నాణ్యానికి రెండువైపులా స్త్రీ విలువైనదే

  ReplyDelete
  Replies
  1. ఆ విలువ ఎప్పటికీ ఉండాలి, ఉంచుకొవాలి.
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 8. అప్పటీ, ఇప్పటీ తారతమ్యాలను చాలా బాగా చూపించారు మీ ఈ కవిత లొ.
  కుతూహలంగా తోచింది కవిత ఆసాంతం.
  *** శ్రీపాద

  ReplyDelete