Pages

Saturday 5 July 2014

విహంగ విలాపం

    



   విహంగ  విలాపం

    నిద్రలెమ్మనే .. 
    కువకువల  మేలుకొలుపు,
    రెక్కల చప్పట్లతో....,
    రాగాల మేళవింపూ...,

    తరువు తల్లి తలారా స్నానించి,
    విరబోసుకున్న  జుట్టులా... 
    పరచుకున్న కొమ్మల్లోనుండి,
    నీటి బొట్ట్లుల్లా  రాలే పండుటాకులూ...,

    పల్లె పడుచు నడకలో ..,
    వయ్యారాన్ని తలపించే..,
    అందెల చిరు సవ్వడిలా.. .,
    కొమ్మల రాపిళ్ళూ ...,

    ఓ సాయంత్రం..,

    చెట్టునీడలో..,
    నులకమంచం మీద  
    కొలువు  దీరిన  కామందు,
    అపార్టుమెంటుల ఆవాసాలకై....,బేరసారాలూ..,

    అమ్ముడు పోయిన,
    తరువు తల్లి,..కసాయి గొడ్డలి పెట్టుకు,
    ముక్కలై మూలపడింది. 

    సాయం సంధ్య, గొదూళి  వేళా..,
    విత్తులు ముక్కున పట్టుకొచ్చిన ,
    తల్లి పక్షి కంటికి 

    చిద్రమైన  తన పేగు బంధాలూ...,
    చిట్లిన వాటి  లేత అంగాలూ..,
    నేలంతా నెత్తుటి రంగవల్లుల్లా..,

    అయ్యో, రెక్కలు రాలేదే..,
    ముక్కులూ  ఆరలేదే...,
    పుట్టి  మూణ్ణాళ్ళయినా కాలేదే..,

    ముద్దులొలికే..  ఈ బుజ్జి పిట్టలు,
    నేల తల్లికి నెత్తుటి  అభిషేకం చేస్తూ...,
    కన్న తల్లికి  కడుపు శోకం మిగులుస్తూ.. 

    పక్షులన్నీ...,నిరాశ్రయులై.. 
    కొంగు చాటున... అమ్మ గుండె మాయమైతే..,
    వెక్కి పడే  శిశువులై...,

    తమ పెద్ద దిక్కునెవరో  హత్య చేస్తే,
    గగ్గోలు పెట్టే ఇంటి సభ్యుల్లా...,
    పగిల గుండెలతో... ,ప్రార్దిస్తున్నాయి.

    తరువుల  తల్లిని  లేపి నిలబెట్టూ..,
    మా బిడ్డల ఊపిరి ఇకనైనా  నిలబెట్టూ..  

     (మానవా....నీవిక ఇలాంటి  పనులు మానవా?)


 

 

 
   


4 comments:

  1. అను నిత్యం మానవుల మనుగడకి , వేకువఝాము నుంచి మనలో ఎక్కడైనా వున్న నిద్ర(మత్తు)ను వదలించి , మనలను చలాకీగా నడిపించే ఆ విహంగాలకు నీడ లేకుండా చేయటం , అందునా ? అనకుందునా ? తప్పదనుకొని అందులే . తన ఆకాశ హర్మ్యాల కొఱకు ఈ మానవులు యిలా ప్రవర్తించటాన్ని జీర్ణించుకోలేని దయనీయస్థితి వాటిది .
    ఆ తరువులు వెచ్చదనాన్ని తమ ఒంటికి పట్టించుకొంటూ , తోటి పక్షులకు నీడనిస్తూ , సాటి మానవులు సేదతీరేలా మలయమారుతాన్నందిస్తున్నా , కృతఙ్నతను వీడి , తమ గొడ్డలిపెట్టులతో ఒక్క పెట్టున కూకటివేళ్ళతో పెకలిస్తున్న వైనం స్వార్ధపరత్వానికి ప్రతీక .

    ఎవరైనా మానవులు సరిగ్గా నడచుకోకపోతే మా పేరుతో తిడతారే , మఱి ఈ మానవులను ఏమనాలో మీరే ఆలోచించుకోండి అన్న చందాన ఫ్రశ్నిస్తున్నతీరు బహు భేషుగ్గా వున్నది .

    ReplyDelete
  2. మనుషులకు పశుపక్ష్యాదుల గూర్చి ఆలోచించే సమయమూ. హృదయమం లేవు సర్.
    మా ఇంటి ముందున్న తెండు పెద్ద చెట్లు కొట్టనీకుండా...నేను ఎందరితో వివాదం పడుతున్నానో..,
    అందుకే అంటాను నేను ఆచరణ అవసరం ఆలోచనే కాదు.
    మీ స్పందన నాకెంతో స్పూర్తినిస్తుంది.

    ReplyDelete


  3. తరువు తల్లి తలారా స్నానించి, విరబోసుకున్న జుట్టు .... విస్తరించుకునున్న కొమ్మల్లోనుండి, నీటి బొట్టుల్లా రాలే ఆ పండుటాకులూ..., ఆ పల్లె పడుచు నడక .., వయ్యారాన్ని తలపిస్తూ..., అందెల చిరు సవ్వడిలా.. ., ఆ కొమ్మల రాపిళ్ళూ ...,
    అలాంటి ఓ సాయంత్రం..,
    చెట్టునీడలో.., నులకమంచం మీద కొలువు దీరిన కామందు, అపార్టుమెంటుల ఆవాసాల....,బేరసారాలకు.., అమ్ముడు పోయిన, తరువు తల్లి,..కసాయి గొడ్డలి పెట్టుకు, ముక్కలు చెక్కలయ్యి మూలపడింది.
    గోదూళి వేళ.., విత్తులు ముక్కున పట్టుకొచ్చిన, తల్లి పక్షి కంటికి చిద్రమైన తన పేగు బంధాలూ..., చిట్లిన వాటి లేత అంగాలూ.., నేలంతా నెత్తుటి రంగవల్లుల్లా..,
    రెక్కలైనా రాని.., ముక్కులైఅనా ఆరని..., మూణ్ణాళ్ళయినా కాని పుట్టుక.., ముద్దులొలికే.... ఈ బుజ్జి పిట్టలు, నేల తల్లికి నెత్తుటి అభిషేకం చేస్తూ..., కన్న తల్లికి కడుపు శోకం మిగులుస్తూ....కొంగు చాటున... అమ్మ గుండె మాయమై.., వెక్కి పడే శిశువుల్లా..., పక్షులన్నీ...,నిరాశ్రయులై....

    విహంగాల విలాపం ఎంతో ఆర్ద్రంగా ఉంది. మనుషుల్లోనూ ఎందరో పక్షుల్లా బ్రతుకు తెరువు కోసం వలసెళ్ళి తిరిగొచ్చి గల్లంతైన పరివారాన్ని చూసి బావురుమన్న సంఘటనలు గుర్తుకొచ్చాయి. బృతి కోసం విదేశాలకు వెళ్ళి ఉగ్రవాదుల చేతుల్లో బలైపోయిన పెద్ద దిక్కు ను కోల్పోయి అనాధలైన ఎందరో నీడలేక విలపిస్తున్నట్లుంది.

    చక్కని వస్తువు.
    బాగా వ్రాసారు. అభినందనలు మెరాజ్ గారు! శుభసాయంత్రం!!

    ReplyDelete
  4. మీ వాఖ్య నా బాధ్యతను పెంచింది, ఎంత విశాలంగా ఆలోచించి రాశారో..అంతే ఉదార స్వభావిక శైలి మీది, ధన్యవాదాలు సరి మీ స్పందన చాలా విలువైనది.

    ReplyDelete