Pages

Thursday, 21 November 2013

పేగు బంధాలు      పేగు బంధాలు 


        కనురెప్పలు   విప్పక ముందే..,
                   పొత్తిళ్ళను వీడక ముందే..,

       ఉమ్మనీరు  ఆరక  ముందే...,
                   అమ్మ స్పర్శ  తమీ తీరక ముందే..,

       చనుబాలు  రుచి చూడక ముందే...,
                   చిట్టి  పిడికిలి  వీడక ముందే...,

       ఉదయపు  వెలుగు  అవనిని  చేరక ముందే..,
                   వినిపిస్తుంది  మనకి  ఓ  రోదన.  

       తొమ్మిది   నెలల  కలలపంట   నేలపాలై...,
                    ఒంటి నిండా మట్టి పులుముకొని మలినమై.., 

       వీధి శునకాలకు   ఆకటి  ఎరలై..,
                     నెత్తుటి  ముద్దలైన అనాథ  వార్తలై..,

       మరుగున పడుతున్న మానవీయతను  ప్రశ్నిస్తూ..,
                      చెత్త కుప్పలనే  చరిత్ర  పుఠల్లా  నిర్మిస్తూ..,

       గుప్పెడు  మాతృ ప్రేమకై   గుండెలు మండేలా..,
                       అల్లాడుతున్న  మరో కర్ణుని  కన్నీటి  కేక.  

8 comments:

 1. Replies
  1. నిజమే కదా అనికేత్ గారూ,

   Delete
 2. "కనులు విప్పలేదు.., ఉమ్మనీరు ఆరలేదు..., అమ్మ స్పర్శ తమీ తీరలేదు.., చిట్టి పిడికిలి వీడలేదు..., కానీ వో రోదన వో మూలుగు వినిపిస్తుంది.
  తొమ్మిది నెలల కలలపంట .., వీధి శునకాల ఆకటి ఎర అయి.., అనాథ వార్త అయి.., నేటి కర్ణుని కన్నీటి కేక అయి ...." ఈ ఉదయం,
  పరితపిస్తుంది మానవత్వం .... తెల్లవారింది యిందుకా అని,

  "పేగు బంధాలు" కవిత హృదయ విదారకం గా ఉంది. పట్టణాలు ఆకాశహర్మ్యాలను చూసే కళ్ళతో చూడని ఎన్నో దౌర్భాగ్యపు వాస్తవాల్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ మానవత్వము, మనిషి బాద్యతల్ని గుర్తుచేస్తూ .... సామాజిక స్పృహావశ్యకతను గుర్తు చేస్తూ ....

  ReplyDelete
  Replies
  1. సర్, మనిషికి సామాజిక అవగాహన అవసరమే,
   మానవత్వం మంట కలుస్తున్న రోజులివి.

   Delete
 3. మాఅనవత్వాన్ని తీవ్రంగా శంకించే దృశ్యాలు ఇవి.
  అనాథ మృత శిశువులకు గౌరవంగా అంత్యక్రియలు చేసే స్వచ్చంధ సంస్థలు కావాలి.
  మా కెందుకు అని వార్డు బాయ్,
  మాకెందుకు అని నర్సమ్మ,
  మాకెందుకు అని దారిని పోయేవాళ్ళు
  అనుకుంటే ఎలా?
  మీ కవిత ఎవరో ఒకరికి ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నాను.
  బ్రతకడానికి అవకాశం కల్పించలేకపోయినా
  కనీసం మానవ దేహాలు పెంటకుప్పలను చేరుకోకూడదు.
  కుక్కలకు ఆహారం కాకూడదు.
  దేహం అంటే దేవాలయమే.
  అలాంటి దేహాలకు ఇలాంటి గతి పడితే అది చాలా పెద్ద అపచారం అవుతుంది.

  ReplyDelete
  Replies
  1. సర్, మీ ఆవే్శములో అర్ధముంది, దీనుల శవాలకు దిక్కులేదు,
   కనీసం బ్రతికున్న ఆ పసిగుడ్డులకు కూడా దారిలేదు.
   నా అక్షరాలకు స్పందించిన మీకు నా ధన్యవాదాలు.

   Delete
 4. చాలా హృద్యంగా.. మనసు పిండేసేలా ఉందక్కా

  ReplyDelete
  Replies
  1. నిజమే కదా, మార్పు ఎప్పుడొస్తుందో..
   శోభా ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete