Pages

Saturday, 2 November 2013

అగుపించని అంగళ్ళు

      


      అగుపించని అంగళ్ళు 

       
       రోడ్డ్డు  పక్కనే  ఓ దృశ్యం,
       హడావిడి అడుగులకు  అడ్డుగా అనిపిస్తూ,
       ఎవరికీ కనిపించదు,స్వయం ప్రకాశం కాదుగా,

       గోనె సంచిపై కొన్ని కాయగూరలు,
       సత్తుగిన్నెలో కొంత చిల్లరా,
       కష్టాల కెరటాన్ని బుజానెత్తుకున్నట్లు గాబరాగా ఓ అవ్వ,

       చుప్పనాతి సూర్యుడు  తొంగి  చూస్తాడనే బాదతో,
       వడలిపోతున్న కూరగాయలకు కొంగు కప్పుతూ,
       పచ్చని చిగుర్లు  రాల్చుకున్న మోడులా... 

       వేగుచుక్కని నొసటన అద్దుకొని వచ్చీ,
       ఎర్రటెండని అయిష్టంగా  నెత్తినెత్త్తుకొని,
       రెక్కలూడిన విసురు పురుగులా.. 

       మట్టి రోడ్డుపై ఎగసే మెత్తటి మట్టిలో,
       పొద్దు తిరుగుడులో పహారా కాసే కళ్ళతో,
       సంచిపై ఎంతకీ  తరగని  కూరగాయలతో.. 

       పొద్దుట విచ్చుకొని వెళ్ళిన ముఖాలు 
       ముడుచుకొని  ఇళ్ళుచేరే సమయం,
       పెరటి పంటను పెంట కుప్పలపై విదిల్చి,
       చెమట చెట్టుకు కాసిన శిశిర ఫలంలా... 

       మంచుపెట్టెలో నానినవి  తినే నాగరికులముందూ,,
       రంగుల అంగళ్ళ హంగులకు  సలాం కొట్టే పెద్దలముందూ,
       ఆర్ధిక వ్యవస్థలో  ఆకటి అవస్థగామారి , 
       కత్తిఅంచుపై  నెత్తుటి బొమ్మగా..... శ్యం,

8 comments:

 1. గోనె సంచిపై కొన్ని కాయగూరలు, సత్తుగిన్నెలో కొంత చిల్లరా .... వడలిపోతున్న కూరగాయలకు కొంగు కప్పుతూ .... ఎర్రటెండని అయిష్టంగా నెత్తినెత్త్తుకొని, రెక్కలూడిన విసురు పురుగులా .... ఓ అవ్వ,
  సంచిపై ఎంతకీ తరగని కూరగాయలతో .... చెమట చెట్టుకు కాసిన శిశిర ఫలంలా .... ఆర్ధిక వ్యవస్థలో ఆకటి గంజిలా మారి , కత్తిఅంచుపై నెత్తుటి బొమ్మగా.....
  ఆ అవ్వ అంగడి కాని అగుపించని అంగట్లో .... అక్కడ
  చూసే కళ్ళకు ప్రపంచం ఎంత విశాలమో మీ కవితలో .... భూమి తల్లి ని చూసాను. నమస్సులు మెరాజ్ జీ!

  ReplyDelete
  Replies
  1. చంద్ర శేఖర్ సర్, , చూసే కళ్ళకు విశాలప్రపంచం కనిపిస్తుంది అన్నారు?
   ఎక్కడ చూస్తున్నాయి కళ్ళు, అంతటా అంధకారమే అయోమయమే,
   ఈ చిరుదీపాలు ఆరిపోకుండా చేయినడ్డుపెట్టటం చేయాలి చేయూతనివ్వాలి.

   Delete
 2. ఒక చిన్ని అంగడిలో ఎంతటి
  జీవన సత్యం చూపించారు.
  ఆకటి అంగళ్ళు చీకటి సమాజంలో !
  నాగరికత పరిమళించాలంటే
  సోషల్ సెక్యూరిటీ ఇవ్వడం !
  సమిష్టి బాధ్యత.
  కడూపు నిండా తిండి,
  ఒంటి నిండా గుడ్డ,
  తల దాచుకునే గూడు
  మాత్రమే కాదు జీవిత చరమాంకంలో
  తోడు మానసిక, సామాజిక అవసరం కూడాను !
  సొంత తల్లిని నీళ్ళల్లోకి తోసేసాడు ఒక కొడుకు
  అని పేపర్లో చదివాము. దాని వెనుక
  ఆ కొడుకు పడ్డ క్షోభ ఎంత ఉందో.
  ఆ కోడలి రాక్శసత్వం ఉందా, లేక
  ఎదిరించలేని ఆర్థిక పోరాటం ఉందా?
  బతుకు తెరువు కానక పోతే చావు ఎక్కడుందా అని చూసే ఆఖరి చూపులు.
  కవిత బాగుంది.
  వస్తువు ఆలోచింపచేసిదిగా ఉంది.
  భాష కళ్ళు చెమర్చేలా చేసింది.
  కీపిట్ అప్ !

  ReplyDelete
  Replies
  1. మీరన్నది నిజమే ఈ ఆకటి అంగళ్ళకు సోషల్ సెక్యూరిటీ్ కావాలి,
   వీరు ఆర్దికంగా నిలదొక్కుకొవాలంటే వీరికి తమ సరుకు అమ్ముకొనేందుకు కొంత వెసలుబాటు కల్పించాలి,
   ప్రజల్లో షాపింగ్ మాల్స్ పై ఉన్న మోజు తగ్గాలి,
   అంత ముసలివయస్సులో కూడా ఇంట్లోవాళ్ళకు భారం కాకూడదు అనుకున్న ఆ తల్లి ఎందరి సోమరులకు గుణపాటమో కదా..
   ప్రభుత్వ కనీస సహాయం కూడాలేక, స్థానికుల నిర్లక్ష్యం వల్లా వీరు నిరాశ్రయులు అవుతున్నారు, కొందరు బిక్షాటన కూడా చేసుకుంటున్నారు.
   ఇలాంటివి చూసినప్పుడు హృదయం బరువెక్కుతుంది.
   సర్, నేనికముందు కేవలం ఇలాంటి తల్లులదగ్గరే కొనాలనీ, నా చేతనైన సహకారం వారికి అందించాలనీ నిర్నయించుకున్నాను.

   Delete
 3. Ee kavitha chaduvutunte ekkado komchem baadhagaa undi fathima gaaru... elaanti chinna chinna pedarikapu angallu andharu gurtistaaru... Kaani evaroo adharinchadaaniki munduku raaru.. emito vintha manashulam..

  ReplyDelete
 4. మన మనస్సులో ఆలోచన రావటమే మార్పుకు నాంది,
  తప్పకుండా వారినీ ఆదరించే రోజు వస్తుంది,
  మీ స్పందన నాకెంతో స్పూర్తిదాయకం

  ReplyDelete
 5. జీవన సత్యాన్ని, చక్కని కోణం లో చూపారు మెరాజ్ !
  ఈ జవ సత్వాలుడిగిన ముదుసలులు,
  శ్రమ తత్వం మూర్తీభవించిన దేవతలు !
  మాదక ద్రవ్యాలతోనూ ,
  మానసిక రుగ్మతల తోనూ,
  'అచేతన' మవుతున్న యువత కు
  స్ఫూర్తి దాయకులు !

  ReplyDelete
  Replies
  1. సర్, మీరు చెప్పినట్లు "అచేతనా యువత " కు వీరు స్పూర్తిదాయకాలు.
   శ్రమను నమ్ముకున్న ఈ తల్లులు మన సమాజమ్లో ఎందుకూ పనికిరాని వారుగా కనిపించుట మన దురదృష్టం.
   మీ స్పందనకు నా ధన్యవాదాలు.

   Delete