భావన
ప్రియా నా మదిలో మెదిలే భావన చెప్పనా,
నిను చూసిన ఆ క్షణం .....
పూలతేరుపై ఊరేగినట్లు ......
పాలకడలిపై పవళించినట్లు .....
తేనే అలలపై తేలుతున్నట్లు...
నిను తాకిన ఆ క్షణం .....
దూదిపింజనై తేలికైనట్లు .....
పారిజాతమై పరవశించినట్లు .....
పూలసరాలపై జారినట్లు .....
నినుతలచిన ఆ క్షణం .....
వెన్నెల వెల్లువై ఎగసినట్లు .....
మల్లెల పరిమళమై సాగినట్లు .....
వలపు ఊయల ఊగినట్లు ......
నిన్ను స్వరించిన ఆ క్షణం .....
మువ్వల మురళినై మురిసినట్లు .....
రవ్వల వీణనై మ్రోగినట్లు ....
తుంబుర నాదమై తరించినట్లు ....
నిను స్మరించిన ఆ క్షణం ....
మయూరమై నర్తించినట్లు ....
చకోరమై నిరీక్షించినట్లు .....
కీరమై కీర్తించినట్లు .....
నినుచేరిన ఆ క్షణం .....
వెన్నముద్దలు మింగినట్లు .....
వెన్నెల కొమ్మను వంచినట్లు .....
వెండికొండను ఎక్కినట్లు .....
నినుపొందిన ఆ క్షణం .....
పెదవులను మధువులో ముంచినట్లు .....
మనసుకు మకరందం పూసినట్లు .....
తనువుకు గంధం రాసినట్లు .....
నీతో కలసి నడిచే ఈ క్షణం .....
పచ్చటి ప్రక్రుతి పరచుకున్నట్లు .....
కాలుష్యానికి కాలం చెల్లినట్లు .....
నగరమంతా నందనవనమైనట్లు .
("మల్లెపందిరి" మాసపత్రిక మార్చ్ 2012 సంచికలో ప్రచురితం)
No comments:
Post a Comment