Pages

Thursday 18 October 2012

ఇలా అనిపిస్తుంది











ఇలా అనిపిస్తుంది 

అలజడి రేపే  ఈ మనస్సు  కంటే  చలించని  శరీరమే  నయమనిపిస్తుంది.

అనుభవించే   వాస్తవాలకంటే   దుస్వప్నాలే  నయమనిపిస్తుంది.

నిదురరానిరాత్రి కంటే ,జ్ఞాపకాలతో  వీగిపోయే  వేకువే నయమనిపిస్తుంది.

నిశ్శబ్ద మోహపూరిత మనువు కంటే ,ముఖ పరిచయమే  నయమనిపిస్తుంది.

ఎదలోని  ఘోర  నిశ్శబ్ద యద్ధము కంటే , పెదవి దాటిన పలుకే  నయమనిపిస్తుంది.

ముఖం  తిప్పుకొనే  నిరసన కంటే, పలకరింపు లేని  విరహమే  నయమనిపిస్తుంది.

హృదయం మెలిపెట్టే  ఘోరనిరీక్షణ  కంటే , మనస్సును  మభ్యపెట్టే  ఊహే  నయమనిపిస్తుంది.

స్పందన  కలిగించలేని  స్పర్శ  కంటే,  రక్తమోడే  గాయమే   నయమనిపించింది 

రగిలించే  వర్తమానం  కంటే, నిదురించే గతమే   నయమనిపించింది.

వేదనను  భరించటం  కంటే, మనసారా  రోదించటమే   నయమనిపించింది.

శిక్షించే  అక్షరాలను  చదివేకంటే, నిరక్షరాస్యతే  నయమనిపించింది.

వేళ్ళ   చివర వేలాడే   ఈ జీవితం  కంటే  మరణమే  నయమనిపిస్తుంది. 



15 comments:

  1. అలా నిరాశ చెందితే జీవితమేముందండి.

    ReplyDelete
  2. నిజమే కదండీ..! అలా నీరాశ చెందితే జీవితమేముంది?!
    గుప్పెడున్న గుండెనిండా ఆశలు నింపుకొని చిరునవ్వుతో ధృడంగా ముందుకి సాగిపొండి :)

    ReplyDelete
  3. చలించని శరీరాన్ని భావావేశంతో రగిలించేదే మనస్సు
    దుస్వప్నాల నీడలను సమూలంగా నిర్మూలించేదే వాస్తవం
    జ్ఞాపకాలలో కరిగే వేకువ మరో వినూత్నమైన రాత్రికి పునాది
    ముఖ పరిచయమే మొహపూరితమైన మనువుకు నాంది
    పెదవి దాటిన పలుకు నిశ్శబ్ద యుద్దానికి సంధి
    విరహ౦ ఎన్నడూ నిరసనకు నెచ్చెలి కానేరదు
    మనస్సును మభ్యపెట్టే ఊహ నిరీక్షణలో మల్లెల దారిని చూపిస్తుంది
    రక్తమోడే గాయం కూడా ఆత్మీయ స్పర్శకు తల ఒగ్గుతుంది
    నిదురించే గతం అందమైన వర్తమానం కోసం కలగంటుంది
    రోదన వేదనను కరిగించి నైర్మల్యం ప్రసాదిస్తుంది
    నిరక్ష్యరాస్యతా అంధకార౦ ఏనాటికి అక్షారాల వెలుగుకు సాటిరాదు
    మరణాన్ని చేరే వరకూ జరిపే సాహసోపేతమైన ప్రయాణమే జీవితం

    ReplyDelete
  4. నిరాశావాది అంతరంగాన్ని సరిగ్గా వర్ణించారు.కాకుంటే కాస్త ఆశావాదం కూడా నేర్పండి ఆ అమ్మాయికి బావుండండి మీ కవిత

    ReplyDelete
  5. మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు
    కనులనీరు తుడుచువారు ఎవరులేరని చితి ఒడికి చేరకు
    ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
    నూరేళ్ళ నిండుగా జీవించమన్నది వేటాడు వేళతో పోరాడమన్నది !!

    ReplyDelete
  6. రాజీ గారి మాటే నాదీను...

    కవితలోని భావోద్విగ్నత నచ్చింది...
    కవితకు మాత్రమే పరిమితం కావాలి ఇలా...

    ReplyDelete
  7. కవిత వ్రాయటం లో మీరు ఎన్నుకున్నదొక పద్ధతి.దాన్లో మీరు ఓ.కే అలాగే ఆశావాదం తో పాటు నిరాశావాదం కూడా ఎప్పుడు మనిషి తోడుగానే ఉంటుంది.దాన్ని ఎలా తగ్గించుకొని ఆశావాదం తో ముందుకు సాగాలి అనేది జీవితంలో ముఖ్యం.దానికి సమాధానం జ్యోతిర్మయి గారు అద్భుతంగా వ్రాసారు.ఏదేమైనా కవిత వ్రాయటం లో ఇదో విధం.పదాల పొందిక బాగుంది.

    ReplyDelete
  8. నచ్చలేదు నాకు,
    జ్యోతిర్మయి గారు, రాజి గారు బాగా చెప్పారు :)

    ReplyDelete
  9. జ్యోతిర్మయిగారికే నా ఓటు కూడాను.
    మీరాజ్ గారు పదండి ఆశావాదంవైపు పయనిద్దాం:-)

    ReplyDelete
  10. మళ్ళీ అదే మాయాజాలం! మాటలతో ఆటలు!
    వాటిని అలా వాడుకునే
    హక్కు మీకు మీరే పుచ్చుకున్నారా,
    ఎవరైనా వారసత్వంగా మీకు రాసి ఇచ్చేసారా!
    అందమైన అమ్మాయి చిత్తరువుతో,
    మా గుండెల్లో సుతిమెత్తని భావాలాను రేకెత్తించి,
    ఆమె కన్నీళ్ళు పెడితే చూడలేని అశక్తత మాలో పొంగేలా
    చేసే మీ కవితకు మరోసారి మోకరిల్లుతున్నాము.
    మీరూ మీ కవితలు కలకాలం వర్ధిల్లాలి!
    భాషతో మీరు చేసే విన్యాసాలకు ధీటైన
    పోటీ ఇచ్చిన బ్లాగు మిత్రులు జ్యోతిర్మయి గారికి
    ప్రత్యేకాభినందనలు!

    ReplyDelete
  11. నిరాశ ముంగిట... ఆశ ఆకాశమంత,, గా నిలిచి ఉంది. సారించి చూడు ..నేస్తం.. !

    ఇంత కన్నా ఏమి చెప్పగలను. !?

    ReplyDelete
  12. మెరాజ్ గారూ!
    కవితల్లో కనిపించే ఋణాత్మకత
    నిజ జీవితంలో తాకకుండా చూసుకోవాలి...
    అక్షర శరాలు వేదన, దుఖాన్ని మొనలకు పూసుకొని
    ప్రహారం చేయడానికి సిద్ధమన్నట్లు ఉంటాయి ...
    కొన్ని భావ వ్యక్తీకరణలు మీకే సొంతం...
    @శ్రీ

    ReplyDelete
  13. కష్టసుఖాలను నమానంగా ఎదుర్కోవడమే జీవితం.
    బాధలో నిరాసపడకు...
    చురునవ్వుతో పద ముందుకు!

    ReplyDelete
  14. ప్రియమైన మిత్రులకి,
    నమస్కారాలతో, నా కవితపై మీ స్పందనకు, నా మీద మీకున్న అభిమానానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
    నేను ఎన్నుకున్న విరహ,వేదనాపరమైన కవితలకు స్పందించే మీ మనస్సు చూస్తె ఇంకా లోకంలో మానవత మిగిలి ఉంది అనితెలుస్తుంది.
    ఓ హృదయం ముక్కలైతే, గుండె పగిలితే, మనస్సు మూలిగితే ఎంత వేదన అనుభవిస్తుందో నా భావనలో తెలుపగలనా అనుకున్నాను. ప్రతి ఒక్కరూ తమ అభిమానాన్ని నా నాయికకు అందించారు, ఇది కేవలం కవిత మాత్రమే, నా అక్షరావేదన మాత్రమె. మీ సున్నిత మనస్సును తాకిన నా అక్షరాలు ధన్యతనోన్డాయి. యోహాంత్, ప్రియ, జ్యోతిర్మయి, రమేష్, రాజీ,వర్మ,రవిశేఖర్,హర్షా,పద్మార్పిత,వనజ, శ్రీ, నాగేందర్ , శ్రీనివాస్ గార్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
    మీ మెరాజ్.

    ReplyDelete