రేపటి పౌరులు
గణతంత్ర దినాన్ని పునస్కరించుకొని మా పిల్లల కోరిక మేర నగరం లో జండా వందన అనంతరం ఓ పార్క కి విద్యార్ధులను తీసుకొని వెళ్ళాము.
పిల్లలు పార్కంతా కలయ దిరిగారు, ప్రతి పువ్వునూ పలకరించారు,తెల్లని యూనిఫాంలో పావురాళ్ళలా ఉన్నారు మేము టీచర్స్ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నా పిల్లలని ఓ కంట కనిపెట్టే ఉన్నాము .
ఆడుతున్న్నమా పిల్లలు ఉన్నట్లుండి ఓ చోట గుమిగూడారు, ఏమయి ఉంటుందో అని మేము పరుగున వెళ్ళాము
వారి మద్య ఓ ఆరేళ్ళ పిల్ల చింపిరి జుట్టూ,చిరిగిన బట్టల్లో భుజానికి ఓ గుడ్డ సంచీ,చేతికి వెదురుబుట్ట తగిలించుకొని వేపిన పల్లీలు(వేరుశనగ పప్పులు)అమ్ముతుంది.చిన్ని చిన్ని పేపరు ముక్కల్లో వాటిని అందంగా పేర్చి పొట్లం కట్టి ఇస్తుంది.మేము ఆ దృశ్యం చూస్తూనే పిల్లల్ని గట్టిగా కేకలేశాము, ఇదేనా మీకు స్కూల్లో నేర్పింది ఇలా బైటి చిరుతిండ్లు తినకూడదని చెప్పలేదా అని కేకలేశాం. పిల్లలు వెంటనే ఆ పొట్లాలు ఆ పిల్ల బుట్టలో పడేసి మా వెనక్కి వచ్చి నిల్చున్నారు, ఆ పాప వాళ్ళకు పైసలు తిరిగి ఇస్తూ.. అవి శుబ్రంగానే ఉన్నాయండీ అన్నది భయంగా, మా పావురాళ్ళు మాతో కదిలాయి, ఆ పాప కొంచం సేపు అక్కడే తచ్చాడి ఇక లాబం లేదని ఎటో వెళ్ళింది.
మద్యాహ్నానికి పిల్లలు ఆడి ,ఆడి అలసిపోయి మేము అరేంజ్ చేసిన ఫుడ్ తిని, ఓ చోట గుండంగా కూర్చుని ఇండోర్ గేమ్ ఆడుకుంటున్నారు.
ఇంతలో ఓ కుర్రాడు కొన్ని బెలూన్లు తీసుకొని అక్కడికి వచ్చాడు, వాడు ఎండలో తిరిగి చెమటలు కక్కుతున్నాడు, మేము మా పిల్లలకు అవి కొనొద్దని కళ్ళతోనే వారించాము.అశుబ్రమైన వారి దగ్గరికి వెళ్ళరాదని మేము చెప్పిన పాఠం వారు మరచిపోలేదు.
మరి కాసేపటికి ఓ ఎనిమిదేళ్ళ పిల్లాడు, ఓ చిన్ని ప్లాస్టిక్ సీసాలో సబ్బు నీళ్ళు నింపుకొని, చిన్ని స్ట్రా తో ఆ నీరు నోటిలోకి తీసుకొని బుడగల్లా ఊదుతున్నాడు . అది చూసి మా పిల్లలు సంబరపడ్డారు, వెంటనే ఓ టీచర్ ఆ నీళ్ళు నోటిలోకి వెల్తే ప్రమాదమని హెచ్చరించింది. వాడిని అక్కడినుండి వెళ్ళమని అదిలించింది.ఇంతలో ఓ మూడేళ్ళ చిన్ని కుర్రాడు రంగురంగుల కాగితపు పూలు కొనమని ఇంచుమించు కాళ్ళు పట్టుకున్నట్లు అడిగాడు, ఆ పూలకి వేసే రంగులు ప్రమాదకరమని మా డ్రాయింగ్ టీచర్ వద్దన్నారు. మొత్తం మీద ఆ పిల్లల్ని అక్కడి నుండి తరిమేసి, మా పావురాళ్ళని రక్షించుకున్నాం.
***
సాయంత్రమైంది ఇంటికి బయలుదేరాము పిల్లల్ని బస్ లో ఎక్కించి మేము గేట్ వరకూ మెల్లగా నడుస్తున్నాం, ఇందాకటి ఆ పిల్లలు పార్కులో ఓ మూల చేరి ,మా విద్యార్ధులు తిని పారేసిన ఎంగిలి ప్లేట్స్ లో మిగిలిన పదార్దాలు తింటూ కనిపించారు.
అంతలోనే ఓ ఆడ మనిషి, చేతిలో ఓ బెత్తం (మా బాషలో)తో వారిని కొట్టేందుకు ఎగబడింది.
"దొంగ నా.. ఇక్కడ మెక్కుతున్నారా? ఒసే .. పల్లీలు అమ్మకుంటా ఎంగిలి నాకుతున్నావా కుక్కా.." అంటూ ఆ పిల్లని జుట్టు పట్టుకుంది.
నేను అడ్డుకోబోయాను మా టీచర్స్ వద్దన్నారు, (నిజమే మా లాంటి నాగరికులు కలగజేసుకోకూడదు కదా..)
"అయ్యో వాళ్ళు వద్దన్నారక్కా.. అవి తినకూడదట", ఆ పిల్ల వణుకుతూ చెప్పింది,
"నీకేమైందిరా బద్మాష్.." సబ్బునీళ్ళ బుడ్డోడిని జుట్టు పట్టుకుందావిడ.
"ఆ నీళ్ళు నోట్లోకి పోగూడదంట." మొండిగా అన్నడు వాడు.
"నువ్వురా చెత్త నా.. "కాగితపు పూల బుడ్డోడిని నేల మీదేసి ఈడ్చింది.
ఆ ఇస్కూల్ పిల్లల్ని మాటల్లో పెట్టి కొనిపించలేకపొయ్యారు, మీకు కడుపు మాడిస్తే తిక్క కుదురుతుంది కేకలేస్తుందామె.
వాళ్ళు ఎదో మాట్లాడతున్నారక్కా. మాకు అర్దం కాలా ... చదూకున్నోళ్ళు కదా మా దగ్గరగా రాకూడదని దూరంగా వెళ్ళారు. ఏడుస్తూ ఏక కంఠం తో చెప్తున్నారు ఆ పిల్లలు , ఇక చూడలేక నేను బస్స్సెక్కాను ,
+(1).jpg)
గేటు దాటుతున్న మా బస్సుకు టాటా, చెప్తూ ఊపుతున్న ఆ పసి చేయి నా నీళ్ళు నిండిన కళ్ళకు మసగ్గా కనిపించింది. బాల్యం కూడా ఎన్ని రంగుల్లో ఉందో... (నేనింకా మూడురంగుల్లోనే వెతుకుతున్నాను.)