Pages

Friday 10 January 2014

చిరుగుతున్న విస్తర్లు



     చిరుగుతున్న విస్తర్లు  

     పెద్దోళ్ళ (పెద్దింటోళ్ళ) పెళ్లి  హడావిడి,
     ట్రాపిక్   మళ్ళింపుల  గారడీ..,

     ఆరు రోజుల నుండీ హాలు  అలంకరణా..,

     అక్కడే కాచుకున్న అనాథల ఆకటి నిరీక్షణా. 

     దారంతా  రంగు,రంగుల దీపాల  వెలుగులూ,

     చెవులు చిల్లులు పడేలా శబ్ద తరంగాలూ,

     పడవలాంటి కార్లూ, పలకరింపులూ ,

     కరచానాలూ,కౌగిలింతలూ,కవ్వింపులూ ,

     సినీతారల తళుక్కులూ ,మంత్రుల  ఉళక్కులూ,

     విందులూ,చిందులూ  ఎన్నో కనువిందులూ,

     పసందైన విందూ, ఖరీదైన మందూ,

     ఆకలిలేని ఆరగింపులూ, వ్యర్ధమైన  పదార్ధాలూ,

     అమ్మాయి ఆంపకాలూ అయిన వారి వేడ్కోళ్ళూ ,

     కదలిన వాహనాలూ,కలకలలూ, గలగలలూ,



                        
     అప్పటివరకూ  ఆగిన ఆకటి పేగులూ ..,
     ఒక్క సారిగా గేటు  తొసుకొన్న పరుగులూ,

     మూతబడ్డ  ఫంక్షన్ హాలు  గేటు తలుపులూ ,

     చెత్తలోకి విసరబడ్డ  ఆహారపదార్దాలూ..., 

     కలబడ్డ  మూగజీవాలూ ,భావి పౌరులూ ,

     ఏక వర్గ (ఆకటి)పోరాటాన  చిరిగిన  విస్తళ్ళూ... 
     నేలపాలైన  మెతుకులూ...  ఎప్పటికి  మారేనీ  బతుకులూ ..?





14 comments:

  1. భావాలన్నీ బాధలో కూరుకుపోయి , మాటలు మౌనాన్ని ఆశ్రయించి , చేతలు అచేతనమయ్యి , కళ్ళు కన్నీరును నింపుకున్నాయి మీరజ్ మీ కవిత చదివి . అవసరం లేనివి వద్దు అని చెప్పే సంస్కారం కూడా లేకుండా ఆహారాన్ని నేలపాలు చేయడం ఒక ఫాషనుగా మారడం మన దౌర్భాగ్యం.

    ReplyDelete
    Replies
    1. నాజూగ్గా తినటం ,పిల్లలకి వేరుగా ప్లేట్స్ అరేంజ్ చేయించి వారు నేల పాలు చేస్తున్నా నిర్లక్ష్యంగా ఉండటం , ఇలాంటి వాటి వల్లా ఓ ఆకలి కడుపుకు ద్రోహం చేస్తున్నారు.

      Delete
  2. అన్నీ మన కళ్ళముందే జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయులం, కనీసం మీరు చేస్తున్నది తప్పని కూడా చెప్పలేం, కారణం వారు కలిగినవారు.

    ReplyDelete
    Replies
    1. నిజమే సర్, కానీ మన ప్రయత్నం మానలేం కదా,
      మంచి కోసం కొంత తిప్పలు తప్పవు.

      Delete
  3. ఆకలి మారదు.
    ఆకలి లేనివాడి తీరు మారదు.
    చిరిగిన విస్తళ్ళకై చూసే కళ్ళకు ఆ భజంత్రీలే మేల్కొలుపులు.
    డబ్బు తినేవాడికి కూటితో పనిలేదు.
    వాడికి డబ్బు ఆకలేనాడు తీరేది కాదు.
    ఇద్దరిదీ ఒకటే పోరాటం
    ,ఒకటే ఆరాటం.
    బ్రతుకును చంపుతూ ఒకరు,చావును బ్రతికిస్తూ ఒకరు సమాంతరంగా పోరాడుతూనే ఉంటారు దీదీ.

    ReplyDelete
    Replies
    1. నిజమే, ఈ అంతరాలు ఎప్పటికీ తీరవు అందుకే ఆకలి కూఒడా వెంట నడుస్తుంది,
      తమ్ముడూ ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete

  4. దారుణం ... మహా దారుణం !
    నిజ జీవితంలో మనం చూస్తున్న నిజాలివి. కళ్ళకు కట్టినట్లుగా .. ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన మీ ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేక పోతున్నాను ఫాతిమా గారు.

    " పసందైన విందూ, ఖరీదైన మందూ,
    ఆకలిలేని ఆరగింపులూ, వ్యర్ధమైన పదార్ధాలూ,
    అమ్మాయి ఆంపకాలూ అయిన వారి వేడ్కోళ్ళూ ,
    కదలిన వాహనాలూ,కలకలలూ, గలగలలూ,"

    ఇదేనా ఓ సామాన్యుడు ఉహించుకున్న ఉన్నతి ? విగత జీవుల ఆకలి బాధలను విన్న వారెవరూ ... విని ఆదుకుని అక్కున చేర్చుకున్న వారెందరు ? సామాజిక స్పృహ గురించి పొడువైన ఉపన్యాసాలిచ్చినవారే - నిస్పృహను కూడా మిగిల్చారు.
    ఎక్కడ అ నైతిక విలువలు ? అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ...
    మనమూ ఓ పావురాల్లమేనా అని ..... ప్చ్ చదువుతున్నంత సేపూ తెలియని ఆవెధన. చివుక్కు మంది మనసు .

    -శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీ పాద గారూ, మనం పావురాళ్ళమే అందుకే సమాచారాన్ని చేరవేద్దాం, ఎక్కడైనా ఇలా ఆ హారం వృదా అవుతుంటే ్ అన్నార్తులకు చేరవేద్ద్దాం (నేను చాలా సార్లు చేశాను కూడా) సమస్య ఎక్కడ వస్తుందంటే... పెళ్ళి వాళ్ళు పాత్రలు లీజ్ కి తీసుకొంటారు కనుక మనల్ని తొందర పెడతారు, తీసుకెళ్తారా?, లేక పడేయాలా, అని, మనం చేర్చాలి అనుకున్న వాళ్ళు వెహికల్ దొరక్క ఆలస్యం చేసే సరికి వీళ్ళు పడేస్తారు.ఇలాంటి సమస్యల మూలంగా అక్కడే అందుబాటులో ఉన్న బీదలకి పంచమని రిక్వెస్ట్ చేస్తున్నాను.
      ఏది ఏమైనా తప్పదు మంచి చేయాలీ అనుకున్నప్పుడు.

      Delete
  5. పెద్దోళ్ళ (పెద్దింటోళ్ళ) పెళ్లి మరి, అందుకే వీధి వీధంతా రంగు, రంగుల దీపాల వెలుగులూ, పడవ ల్లాంటి కార్లూ, నాజూకు పలకరింపులూ, కరచానాలూ, కౌగిలింతలూ, కవ్వింపులూ, సినీతారల తళుక్కులూ, మంత్రుల ఉళక్కులూ, పసందైన విందూ, ఖరీదైన మందూ, ఆకలిలేని ఆరగింపులూ .... అమ్మాయి ఆంపకాలూ .... కదలిపోయే వాహనాల కలకలలూ, గలగలలూ తెరమీద జీవితం కథ అనుకుంటే
    తెరవెనుక మాత్రం అప్పటివరకూ ఆగిన ఆకటి పేగులూ .., ఒక్క సారిగా గేటు తొసుకొన్న పరుగులూ,
    మూతబడ్డ ఫంక్షన్ హాలు గేటు తలుపులూ, చెత్తలోకి విసరబడ్డ ఆహారపదార్దాలూ..., కలబడ్డ మూగజీవాలూ, భావి పౌరులూ, ఏక వర్గ (ఆకటి)పోరాటాన చిరిగిన విస్తళ్ళూ... నేలపాలైన మెతుకులూ...
    ఎప్పటికి మారేనో ఈ తెరవెనుక బతుకుల రాతలు ..?
    చాలా చాక్కగా దృశ్యకావ్యం లా వర్ణించారు.
    అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete
    Replies
    1. చాలా సార్లు ఈ దృశ్యాలు చూసే ఎక్కడైనా శుభ కార్యాలకు వెళ్ళాలంటే మనస్సులో ఏదో మూల నొప్పిగా ఉంటుంది.
      సర్ ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  6. మీరు చెప్పింది నిజమే అయినా....నేను ఇక్కడ ఇప్పటి పరిస్థితి వేరు అని చెప్పాలనుకుంటున్నాను మన్నించాలి ఫాతీమాగారు. గత సంవత్సరం నేను చూసిన ఏ ఘరానా పెళ్ళి ఫంక్షన్ లో కూడా ఆహారాన్ని వృధా చేయలేదండి. మిగిలింది బీదలకే పంచారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల అథిదులు వదిలేసిన ఆహారాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసి మరీ పంచడం నే కళ్ళారా చూసాను. బహుశా మీలాంటి వారి స్పూర్తిదాయక మాటల ప్రతిఫలం ఏమో అది.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది అక్షరాలా నిజమే, కొన్నిసంస్థలూ,కొందరు యువతా కలసి ఈ మంచి పని చేస్తున్నారు, వారి సెల్ నంబర్స్ కూడా ఇచ్చి ఇలా పదార్దాలు మిగిలితే వారిని పిలవమని అర్దించి, ఆ పదార్దాలను అనాథలకు చేరవేస్తున్నారు,కానీ వారికి సహకరించే వారు ఎంత మంది??
      మీ స్పందనకు ధన్యవాదాలు ప్రేరణ గారూ.

      Delete
  7. తిన్నది అరగ్గ కొందరు.. అసలు తిండే లేక మరికొందరు. ఇండియా ఇస్ రిచ్.. బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అంటే ఇదే.
    ఒకర్ని మించి మరొకరు వేడుకలు చేసుకోవాలన్న అత్యుత్సాహమే తప్ప... పరబ్రహ్మ స్వరూపం లాంటి అన్నాన్ని
    ఎంగిలి చేసి పారేస్తున్నాం అన్న విజ్ఞత లేని ప్రజలు కోట్ల సంఖ్యకు చేరుతున్నారు. ఆహార భద్రత సంగతి దేవుడెరుగు... ముందు ఆహార వృధా గురించి కఠిన చట్టాలు చేస్తే బాగుండు... ఈ సామాజిక ధృక్కోణం చాలా మందికి కనిపించకపోవచ్చు గానీ...
    అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఇదొకటి... మీరాజ్ గారు... చాలా మంచి అంశం.

    ReplyDelete
    Replies
    1. నిజమే, సతీష్ గారూ, ఆ హారసమస్య కంటే పెద్దది ఆహారం వృదా్ కాకుండా చూడటం.
      ధన్యవాదాలు .

      Delete