Pages

Saturday 4 January 2014

అని (కని) పిస్తుందిలా

      







       అని (కని) పిస్తుందిలా...  

       పలకా బలపాలు పట్టే   చిట్టి చేతులు,
       పట్టెడన్నానికై  చేతులు  చాపినప్పుడు. 

       చిట్టి,పొట్టి కథలు  వినే ఆ చెవులకు,
       పొట్టదోచే కట్టుకథలు  అర్ధం కానప్పుడూ,

       ఇంకొంచం  అన్నమడిగి  బొచ్చె చాపితే,
       ఛీ...అనే చీత్కారాలు  వింటున్నప్పుడూ.. 

       భూటకపు తనిఖీ  నిజమనుకొని  పిర్యాదు చేసి,
       వార్డన్  చేత చావు దెబ్బలు తిన్నప్పుడూ,

       ఒకే గదిలో గబ్బు గలీబులో  గుడ్డపీలికల్లా,
       కుక్కబడి,జబ్బుపడీ  కన్నులోట్టపోతున్నప్పుడూ,

       గెస్ట్ హవుసులో  రెస్ట్ తీసుకొనే  బడా బాబులకు,
       లేత దేహాలు సేవలు  చేయాల్సి వస్తుంటే...... 

       నాకనిపిస్తుందీ...... 

       చీకటి,ఆకటి బాకుల దాటికి  తట్టుకొనే  ఆ బిడ్డలు, 
       బతుకు బండ కింద అంకురించని బీజాలేమో... 

       భూగోళం అంచుల్లోనో,చీకటి సంచుల్లోనో....,
       ఊపిరాడని వెలుగు కిరణాలేమో... 

       తమ బాధని అక్షరీకరించలేని  నా అసమర్ధతకు,
       ప్రత్యక్ష  సాక్షాలేమో..... ఏమో.... ఏమో...  







20 comments:

  1. తమ కడుపున పుట్టినందుకు ,తాము పెట్టలేకపోయినా ... ప్రభుత్వం పెడుతుందని భావించి, ఆశించి ... ఒడిలో పెట్టుకోవలసిన బిడ్డల్ని ఒదిలిపెడితే ...వార్డెన్లు వ్యవహరిస్తున్న తీరుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది .ప్రతి బిడ్డలోనూ తమ బిడ్డను చూడగలగాలి . మీరజ్ మీ కవిత ఎందరికో కనువిప్పు కలిగించాలని ఆశిస్తున్నాను .

    ReplyDelete
    Replies
    1. ప్రతి బిడ్డలోనూ తమ బిడ్డని చూడగలిగే సంస్కారం లేకపోయినా పర్వాలేదు,
      బిడ్డలని బిడ్డలగా చూస్తే చాలు గొడ్లను బాదినట్లు బాదుతున్న కిరాతకులెందరో..
      ఎక్కడ లోపం ఉందో తెలీటం లేదు ఒక్కటి మాత్రం నిజం నైతిక విలువలు లేవు.

      Delete
  2. గెస్ట్ హవుసులో రెస్ట్ తీసుకొనే బడా బాబులకు, లేత దేహాలు సేవలు చేయాల్సి వస్తుంటే......
    నాకనిపిస్తుందీ......
    చీకటి,ఆకటి బాకుల దాటికి తట్టుకొనే ఆ బిడ్డలు, బతుకు బండ కింద అంకురించని బీజాలేమో....
    భూగోళం అంచుల్లోనో, చీకటి సంచుల్లోనో ...., ఊపిరాడని మిణుగురులేమో ....

    ఎంత బాధను పదాల్లో వ్యక్తీకరించారో .... అసామాజిక అమానవీయ ప్రాపంచిక తత్వాన్ని అక్షరాల్లో చూస్తున్నాను.
    నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. నా బాదని వ్యక్తీకరించటానికి పదాలు సరిపొవటం లేదు సర్,
      మీరన్నట్లు ఆ పసికూనలు మినుగురు పురుగులే, వారి రెక్కలకింది ప్రకాశాన్ని తమ ముక్కులతో పొడిచేస్తున్న రాబందుల లోకం ఇది.

      Delete
  3. పసి మొగ్గల చిన్నారి చేతులు వాసి వాడి పిడికెడు మెతుకులకు ఆర్తిగా ఎదురు చూస్తుంటే ఆ కళ్ళల్లో ఆకళ్ళు ఆవిరై చిన్ని ప్రాణం చివురించక ముందే వాడి పోతుంటే చూస్తూ కుడా ఏమీ చేయలేని అసమర్ధతకు సిగ్గు పడాలని నాకూ అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. జానీ గారూ, ఏమిచేయగలం చెప్పండి , మార్పుకై ఎదురుచూద్దాం.

      Delete
  4. మీ భావాలు ఎంతో ఉన్నతమైనవండి.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ, మీ సంస్కారానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      Delete
  5. సామాజిక స్పృహతో మీరు రాసే కవితలు ప్రతీ మనసునీ కదిలిస్తాయి, ప్రతీ మనిషినీ ఆలోచించేలా చేస్తాయి. కవితా పంక్తుల్లో మీరు ఉపయోగించే పదాలు ఒక లయని సృష్టిస్తాయి. అభినందనలు మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. వర్మగారూ, నా సామాజిక స్పృహను గుర్తించి ,స్పందించిన మీకు నా ధన్యవాదాలు

      Delete
  6. చీకటి,ఆకటి బాకుల దాటికి తట్టుకొనే ఆ బిడ్డలు,
    బతుకు బండ కింద అంకురించని బీజాలేమో...
    భూగోళం అంచుల్లోనో,చీకటి సంచుల్లోనో....,
    ఊపిరాడని వెలుగు కిరణాలేమో...
    నాకనిపిస్తుంది....మీలో ఆ పసివాళ్ళపై ఉన్నదయ ఎంతదయో కదా అని, మీరే ఇలా స్పందించగలరు

    ReplyDelete
    Replies
    1. పద్మా, నిత్యం పసిబిడ్డల మద్య ఉంటాను నేను,
      నిస్సహాయులైన పసిబిడ్డలు ఎవరికి హానీ చేయరు కదా...
      నైతిక విలువలు లేని ఈ సమాజం లో వారి భవితను ఊహిస్తే భయంగా ఉంటుంది.
      నేను రాయటం కంటే స్పందించే మీ సున్నిత మనస్సు గొప్పది.

      Delete
  7. బాల్యం ఎల్లప్పుడూ... స్వేచ్ఛా రెక్కలు తొడిగి, ఆనందాల హరివిల్లుపై విహరించాలన్నది రవీంద్రుడు, శ్రీశ్రీ లాంటి కవుల ఆకాంక్ష. దురదృష్టం ఏమంటే, మొత్తం వ్యవస్థే వధ్యశిలపై ఉందా అన్నట్టున్న నేటి పరిస్థితుల్లో, మీరన్నట్టు ఎల్లెడలా ‘‘శైశవ విషాద గీతిక’’లే విని(కని)పిస్తున్నాయి. బాల్యానికి బంగరు భవితవ్యాన్ని భరోసా ఇచ్చే మంచి గడియలు ఎప్పుడు ఆగమిస్తాయో??

    ReplyDelete
    Replies
    1. కొన్ని లక్షల మంది పిల్లలు బాల్యం అంటే ఏమిటో తెలీకుండా బతికేస్తుంటే, ఇంకొందరు బాల్యం శాపంగా భావిస్తున్నారు.
      మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  8. కవిత బాగుంది.

    ReplyDelete
  9. సామాజిక అక్రమాలపై మీ స్పందన అద్భుతంగా ఉంటోంది. కవిత బొమ్మా రెండూ బాగున్నాయి. మీ కవిత చదువుతుంటే దాశరధి గారి ఆ చల్లని సముద్ర గర్భం... భావ గీతిక జ్ఞప్తికొస్తున్నది.

    ReplyDelete
    Replies
    1. సర్, మీ ప్రశంసకు ధన్యవాదాలు, నా కవితను గొప్ప కవితో పోల్చినందుకు సంతోషంగా ఉంది.
      ఇకపోతే కవితకు ఈ బొమ్మలు కొంత సపోర్ట్ ఇస్తాయి. అందుకే గూగుల్ నుండి ఎన్నుకుంటాను.

      Delete
  10. కనిపించని చాలా కథనాలు కళ్ళ ముందుంచారు. కరుణలేని మనుష్యుల మధ్య ఈ మూగజీవుల
    ఉనికి ఇలాగే కొనసాగనీయడమా?
    ఏమయ్యాయి మన సంస్కరణలు -
    ఎటు వెళ్లిపోయింది మన ప్రేమతత్వం?
    సమదృష్టికి ఇంకా పునాదులే వేయలేదా? చదువుతున్నంత సేపు పేగుల్ని పిండినట్లయింది ఫాతిమా గారు.
    -శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. సర్, సంస్కరనలూ,ప్రణాలికలూ అన్నీ ఉపన్యాసాల వరకే,,
      ఈ బడుగు పసికూనల, అనాదల ఆకలి తీర్చటానికి డబ్బు సంచులు కదలాలికదా.

      Delete